9, అక్టోబర్ 2016, ఆదివారం

హరిని నమ్మితే అంతా శుభమే



హరిని నమ్మితే అంతా శుభమే
నరుని నమ్మితే నాశనమే

ధనమే సుఖమను ధనమే బలమను
ధనమే హితమని మనుజుడను । ఆ
ధనలక్ష్మికి మగడగు శ్రీహరినే
మనసున నెన్నుట మంచిదియా
హరిని

కామితార్ధములు కలుగువిధములను
భూమిని పెక్కురు బోధింతురు । ని
ష్కాములు ధన్యులు కావున హరిపై
ప్రేముడి నుండుట క్షేమమయా
హరిని

తప్పుడు గురువులు తరణోపాయము
చెప్పుచు మోసము చేయుదురు ।రా
మప్పయె గురుడని యాత్మను నమ్మిన
నిప్పుడె నీవు తరింతువయా
హరిని


3 కామెంట్‌లు:

  1. ధనమే సుఖమను ధైర్యము బలమను
    ధనమే హితమను మనుజుడను....
    అంటే మరీ బాగుంటుందేమోననుకుంటున్నా, అలా అనచ్చా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పరిశీలిద్దామండీ. నిజానికి ఈ‌ చరణం ఇలా "ధనమే సుఖమును ధైర్యమును బలమును" అని ప్రారంభం కావాలి. కాని అలాగైతే నడక కుదరదు. ఈ చరణాలకు ఎన్నుకున్న తూగు 8+8 = 16 మాత్రలు చతురస్రగతి, సమద్విఖండనంగా యతిమైత్రిస్థానం 9వ అక్షరం‌ పైన. అందుచేత నడకకోసం‌ కొద్దిగా సవరించుకొని "ధనమే సుఖమును ధైర్యము బలమును" అని వచ్చింది.
      అదొక సంగతి.

      ఇక మీరు చెప్పిన సవరణను చూదాం. "ధనమే సుఖమను ధైర్యము బలమను। ధనమే హితమను" వరకూ‌ బాగుంది కాని ఆ పదగుంఫనం పిమ్మట "మనుజుడను" అని వేయటం సాంకేతికంగా కుదరదు. ఎందుకంటే‌ ""ధనమే సుఖమను ధైర్యము బలమను। ధనమే హితమని మనుజుడను" అని అనటం‌ సమంజసం. ఇలా సవరించటంలో ఇబ్బంది ఏమీ‌లేదు.

      ఇప్పుడు, ఇంకా బాగా సవరించుకొని "ధనమే సుఖమను ధనమే బలమను" అని అంటే బాగుంటుంది. ఎందుకంటే ఇదే ధోరణికి సమర్థనగా "ధనమే హితమని" అని వస్తున్నది కదా.

      సవరిస్తున్నాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.