22, అక్టోబర్ 2016, శనివారం

ఇది శుభమని



ఇది శుభమని నిర్ణయించున దెవరు
ఇది యశుభంబని యెఱుగున దెవరు

పట్టభంగ మశుభంబని పౌరులు
పట్టరాని దుఃఖభావము నొంద
చెట్టరావణుని చీడవదలినది
యిట్టిది హరిలీల యెఱుగ రితరులు
ఇది

కొడుకు రాజగునని కోరిన వరములు
పడి చెఱచగ తన పసుపుకుంకుమల
నడిగిన శుభమున నశుభము కలెగె
నడచును హరిలీల లన నీ పగిదిని
ఇది

శుభమశుభంబని చూడగ నేటికి
విభుని లీలలని వేడుక నెంచక
అభయదాయకుడు హరి రాముండై
యుభయంబుల తోడుండగ మనకు
ఇది


2 కామెంట్‌లు:

  1. ఏది జరిగినా అంతా మన మంచికే అని అందుకే అంటారేమోనండీ :) మీ శుభాశుభ కీర్తన రామావతారానికి అన్వయించిన తీరు బహు బాగు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు లలిత గారూ. ఇదిమేలు ఇదికీడు అనుకోవటంలో మన అహమిక వలనే. జగన్నాటకంలో ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుందంతే.

      తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.