12, అక్టోబర్ 2016, బుధవారం

చెలులాల కోరిటు చేరి నుతించఁగ (అన్నమయ్య)



చెలులాల కోరిటు చేరి నుతించఁగ
అలమేల్మంగకు నమరినవి

పూవుబాణములు పొదిసేసె మరుఁడు
కావవి నవ్వులు కాంతవి
భావించ మందపవనుఁడు మలసెను
తావి వూరు పిది తరుణిది
చెలులాల

మొదల నారదుఁడు మోయించె వీణెను
అది గాదు మాఁట లంగనవి
చదల నదివో యరసంజె వొడమె నిటు
మదరాగము లవి మానినివి
చెలులాల

మెఱుఁగులు మెరిచీ మింటను మేఘము
యెఱఁగలేరు కళ లింతివి
అఱిముఱితీగె మా కంటెను కా దింతి
యెఱుకల శ్రీవేంకటేశును గూడె
చెలులాల



వ్యాఖ్య:

ఇది ఒక చమత్కారపూరితమైన సంకీర్తనం.

ఈ సంకీర్తనకు ఒక నేపథ్యం చూదాం.

శ్రీవారు అంతఃపురానికి విజయం చేస్తున్న సందర్భంగా చెలికత్తియ లందరూ అమ్మవారు అలమేలు మంగమ్మను చక్కగా ముస్తాబు చేస్తున్నారు.

అసలే అమ్మవారు జగత్తులో అన్నివిషయాల్లోనూ‌ తనకంటే అధుకులే లేనిది. అసలు తనతో పోటీ వచ్చే సమానులే లేరు. అందుకే ఆవిడ సమానాధికవర్జిత.

అందుచేత అసలే త్రిలోకసుందరాకార ఐన ఆమె ఆ ముస్తాబుతో‌ మరింతగా శోభిస్తూ ఉంటే చెలికత్తెలకే మతిపోయి ఆమెను అద్భుతంగా ప్రస్తుతిస్తున్నారు.

అప్పుడొకామె చమత్కారంగా ఇలా మిగిలిన వారితో‌ అంటున్నట్లు ఈ సంకీర్తన ఇలా చెబుతున్నది.

మీరంతా అమ్మ సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నారు . బాగుంది. చాలా బాగుంది.

మీరేదో అనేక యితరవిషయాలనూ ముచ్చటించి వాతావరణం  మరింత శృంగారోద్దీపకంగా ఉందంటున్నారు. కాని మీరు చెప్పే వన్నీ మన అలమేలు మంగమ్మకే అతుకుతున్నాయి సుమా.

ఏమిటీ మన్మథుడు వచ్చి పూల బాణాలు గుత్తులు గుత్తులుగా విసురుతున్నాడా. అబ్బెబ్బె అది కాదు. అవి పువ్వులు కావు అమ్మ నవ్వులు. (అమ్మ నవ్వులే పూబాణాలకన్నా కూడా శృంగారోద్దీపనకరాలు!)

మెల్లమెల్లగా ఆ పూల సువాసనలను పరిచయం చేస్తూ చిరుగాలి వ్యాపిస్తోందంటున్నారా. కాదు కాదు. అలమేల్మంగమ్మ ఊపిరిపీల్చి వదలుతున్న గాలి యొక్క సువాసన ఇలా వ్యాపిస్తోంది కాని మరేమీ‌ కాదు. వాడి ముఖం. అమ్మ నిట్టూర్పుల సువాసనలకన్న ఆ మన్మథుడు ఎవడో వాడు విసిరే పూవుల తావి గొప్పదా, మతిలేక పోతే సరి!

మెల్లమెల్లగా ఎంతో మధురంగా మీకు వీణానాదం వినిపిస్తోందా. నారదమహర్షి వచ్చి అమ్మవారి దర్శనం కోసం బయట వేచి ఉండి వీణ వాయిస్తున్నాడని అనుకుంటున్నారా. అయ్యో మీ పిచ్చి కాని ఈ సమయంలో ఇక్కడికి నారదమహర్షి ఎందుకు వస్తాడమ్మా? అది వీణానాద‌ం‌ కాదు. అమ్మ మెల్లగా మాట్లాడుతుంటే ఆమాటల తీయందనమే మీకు వీణానాదంలాగా శ్రవణమాధుర్యం కలిగిస్తున్నది. తెలిసిందా?

సాయంకాలం‌ అయ్యింది. అదిగో ఆకాశం ఎరుపెక్కినది అనుకుంటున్నారా?  ఇంకా పొద్దుపోలేదు కానీ ఆ సంధ్యారాగం కాదు మీరు చూస్తున్నది. శ్రీవారు విచ్చేసే సమయం అవుతున్న కొద్దీ, అమ్మముఖంలో అయ్యవారి తలంపులతో అలముకున్న అరుణిమ అది.

ఆకాశంలో ఏమనా మెఱుపులు వస్తున్నాయా అని ఆశ్చర్యపోతున్నారా? వస్తే రానీయండి. శ్రీవారి దివ్యరథం రావటానికి ఏమన్నా వానాగీనా అడ్డేనా ఏమిటి. కానీ ఆకాశంలో మెరుపులేమీ‌ రావటం‌లేదు చూడండి. మీకు కనిపిస్తున్నవి అమ్మ చక్కదనాల కళలే కాని మరేమీ కాదు. ఆవిడ కదలికలే మీకు కళ్ళకు మిరుమిట్లు కొల్పుతున్నాయి కాని తదన్యం ఏమీ‌ కాదు. (స్త్రీపురుషుల శరీరాలలో పదహారేసి కళాస్థానాలుంటాయి. అవి స్త్రీలకు పురుషులకు వేరువేరు. చంద్రుడి కళను అనుసరించి అవి దినదినమూ ఒక్కొక్క స్థానం ప్రముఖంగా శృంగారోద్దీపనకరంగా ఉంటాయి. ఈచరణంలో వాటి ప్రసక్తి కాదు, శరీరలావణ్యపు మెరుపులను గురించి మాత్రమే ప్రస్తావన)

ఇలా చెలికత్తియలు తమలో తాము తర్కించు చుండగానే శ్రీవారు దయచేయటమూ అమ్మవారు వారిని అభ్యంతరమందిరం లోనికి తోడ్కొని పోవటమూ జరిగింది.

తమ తమ చర్చావినోదంలో ఎవరూ గమనించనే లేదు. అంటే అంత నిశ్శబ్దంగా వారు తప్పుకున్నారన్నమాట.

అప్పుడా గడుగ్గాయి మిగిలిన వారితో‌ ఇలా అంటున్నది. ఏమిటీ మనమేమన్నా మరులుతీగ తొక్కామా అంతా ఇంద్రజాలంలాగా ఉందీ. ఇప్పటి దాకా ఇక్కడే ఉన్న అలమేలు మంగమ్మ ఏదీ అని అనుకుంటున్నారా.  భలే. మీరేమీ మైమమరపుకు గురికాలేదు ఏదో త్రొక్కి.  అదంతా అమ్మవారూ అయ్యవారూ చేసిన చోద్యం.  ఇప్పుడు అమ్మవారు అయ్యవారి సాన్నిధ్యంలో ఉన్నారు సుమా. ఇంక పదండి మనతో ఎవరికీ‌ పనిలే దిక్కడ.


అంతరార్థం:

ప్రపంచం అనేది ఒక వ్యావహారికసత్యం. అంటే నిజానికి అది లేకపోయినా ఉన్నట్లు కనిపిస్తుందన్నమాట. విశ్వం దర్పణదృశ్యమాన నగరీ తుల్యం అని ఉక్తి. కాని జీవుడికి సంబంధించినంత వరకూ ఈ ప్రపంచం నిజంగానే ఉంది. జీవుల సంఖ్య ఇంతని చెప్పనలవి కాదు కాబట్టి అందరు జీవులకూ నిజంగా ఉన్న ప్రపంచ వ్యవహారం‌కోసం ఉన్నట్లే చెప్పుకోక తప్పదు. జూవులకు ప్రపంచంలోని ఇతరమైన అన్నింటి లాగా ఇతర జీవులూ వాటి వ్యవహారాలూ కూడా సత్యమేను.

ఈ‌ప్రపంచంలోని జీవులకు నేను - నాది, నీవు - నీది వంటి మాటలు లేకుండా వ్యవహారాలు లేవు. ప్రపంచం నిజాంతర్గతం అని ఉక్తి. కాని తెలియలేము. కాబట్టి అన్ని వ్యవహారాలూ కూడా బయటి వస్తువులూ చర్యలు గానే ఉంటాయి.

జీవుడి సకలవ్యవహారాలూ అతడి లోనుండే వస్తున్నాయి. అతడు చూసే వ్యవహరించే ప్రపంచమూ అతనిదే. అది అనుభవంలోనికి రావటమే స్వస్వరూపజ్ఞానసిద్ధి.

అంతకు ఒకింత క్రింది స్థాయిలో ఉన్న జీవులు అటువంటి ముక్తజీవులను గమనించి మీరు ప్రపంచవ్యవహారం అనుకుంటున్నది నిజానికి ముక్తజీవుడి విషయంలో అంతా స్వగతమేను అని గ్రహించ గలరు. ఈ సంకీర్తనంలో విషయం వివరిస్తున్న చెలి అటువంటి ముక్తజీవికి సమీపవర్తిని ఐన ఉన్నత జీవి అన్నమాట.

స్వస్వరూపజ్ఞానావస్థ కలిగిన ఆ జీవియే ఇక్కడి నాయిక అన్న సంగతి మరలా వివరించనవసరం లేదు కదా.

పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందటం‌ జరగటం అంటే స్వాత్మానందస్థితిలో ఉండటం.

ఆ స్థితిలో ప్రపంచవ్యవహారం లేదు.

అందుచేత వారు బహిఃప్రపంచాన్ని విసర్జించటాన్నే ఇక్కడ ప్రస్తావించారు. బహిఃప్రపంచం వారికి దూరమై సంభ్రమాన్ని పొందటం అని చెప్పి.

తత్పూర్వరంగంగా ప్రపంచంలోని వ్యవహరం అంతా ఆ జీవుడిదే అని శృంగారపరమైన భావనలద్వారా సూచించారన్నమాట.

ప్రపపంచవ్యవహారోపశమనం జరిగితే ప్రపంచం‌ సంభ్రమంలో మునుగుతుంది - అదింకా స్వస్వరూపజ్ఞానావస్థకు చేరని వారితో నిండినది కాబట్టి.



2 కామెంట్‌లు:

  1. ఒక్క ఊపులో చదవలేకపోయా! అర్ధమూ కాలేదు, మళ్ళీ చదవాలి

    వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా
    వక్త్ర లక్ష్మీ పరీభావ చలన్మీనాభలోచనా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరొకసారి సావధానంగా పరిశీలించండి. మరీ అంత జటిలం కాదని అనుకుంటున్నాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.