11, అక్టోబర్ 2016, మంగళవారం

నిడుదనామాలవాడ నీవారి కెదురేదినిడుదనామాలవాడ నీవారి కెదురేది
బెడదలు వదిలించు వీరుడ వీవుండ

హరిభక్తులను చెనక నతనుడు వెనుదీయు
హరికొడుకే‌ కద యతడనగ
హరికన్యులను బుద్ధి ననుసరించెడు వారి
మరి వదలక వాడు చిరచిర లాడించు
నిడుద

చేసెడు పనులెల్ల చేయెత్తి నీయందు
దాసభావన నుంచి ధన్యులరై
నీ సేవ నుండు వారి దోసమెంచగ లేక
వేసరి వెనుదీయు నా సమవర్తి
నిడుద

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుచును
నిరతచింతనులై నిర్మలులై
కోరి కొలిచెడివారి కొంగుబంగారమై
చేరి నీవుండ కలి చేష్టలుడిగి యుండు
నిడుద