1, అక్టోబర్ 2016, శనివారం

అంతలోనె యీ నిరాశ



అంతలోనె యీ నిరాశ యింతింతన రానిది
ఇంతలోనె యుత్సాహం బిదిగో నీ విచ్చినది

భాగవతశిఖామణుల బాటను నే పోగలనా
సాగి నిన్ను మెప్పించెడు శక్తి నాకు కలదా
వేగిరపడి మీదెఱుగక వెంగళినై సాహసించి
చేగొన్న కార్యం బిది చేయ నెంతవాడ నని
అంతలోనె

అన్నిటికిని నీ వుంటి వని సాహసించెదనో
యెన్న నెంతవాడ నని యెంచి మిన్నకుందునో
యన్న మీమాంస వదల కున్నదయా నాకు
నన్నుజూచి యిది దురాశ యన్నావో పై నేమని
అంతలోనె

శ్రీరామ నీకునై చేసెడు నా విన్నపములు
కోరి లెక్కించుకొనెడు కుతూహలము కాదు
నీరేజదళనయన నీవు మెచ్చుకొందువో
ఔరా యీగోల యేమి యందువేమో యని
అంతలోనె


1 కామెంట్‌:

  1. అంతలోనె నిరాశనధిగమించి ఇంతలొనె ఉత్సాహంతో మీరు రాసిన ఈ గీతం ఎంతో బావుంది. శుభాభినందనలు!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.