12, అక్టోబర్ 2016, బుధవారం

హరిభక్తి యున్న చాలు నన్యము లేలహరిభక్తి యున్న చాలు నన్యము లేల ఆ
పరుసవేది యున్న పెఱవస్తువు లేల

భూమినేలువాని స్నేహ మొప్పుగ నున్న
గ్రామాధికారి నంటకాగుట యేల
రామచంద్రు నాశ్రయించ లబ్ధి యుండగ
సామాన్యుల వలన గల్గు సంపద లేల
హరిభక్తి

పూతగౌతమీ పాయ పొంతనుండగ
నూతినీటి స్నానముల న్యూనత లేల
చేతోమోదముగ రామసేవ దొరుకగ
ప్రీతిమీఱ నొరుల సేవింప నేల
హరిభక్తి

శ్ర్రీరాముని కృప నీకు చేరి యున్న
ఆరాటపడ నేల నన్యుల దయకు
తారాధ్వం బెల్ల గతి తప్పును కాక
నీ రాముడు నీవాడే నిశ్చయముగను
హరిభక్తి