9, అక్టోబర్ 2016, ఆదివారం

హరిమీద గిరి యుండెహరిమీద గిరియుండె గిరిమీద హరియుండె
హరిగిరు లిటు లుండ గిరి గిరగిర తిరిగె

సురలసురులు నా వాసుకి కవ్వపు త్రాడుగ
గిరిమంధరము క్షీరశరధిని కవ్వముగ
తరచువేళ గిరి మునిగెడి దైన బొబ్బలిడగ
నిరుపమానమైన మహిమ నిండారగ నిటుల
హరి

కడు కఠినమైన చిప్ప కల కూర్మం‌ బగుచు
నడగడిగో‌ కొండ క్రింద నవతరించినాడు
వడి తిరిగెడు గిరియొరుగక పట్టి నిలుపు చుండ
నిడిగిడిగో కొండమీద నిదే నిలచినాడు
హరి

నాడు శ్రీకూర్మ మగుచు నడిపి నాటకమును
వాడే శ్రీరాము డగుచు వసుధ నేలి నాడు
వాడే భవవార్నిధిని వేడుకతో జొచ్చి
వాడుక నందరను కాచు పైన క్రింద నుండి
హరి


3 కామెంట్‌లు:

 1. కూర్మావతారం గురించిన ఈ రచన చాలా బావుంది. ఇదే వరసలో దశావతారాలలో మిగిలిన తొమ్మిదీ రచించగలిగితే ఒక మంచి ఆధ్యాత్మిక-రచనా శ్రేణి అవగలదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లలితగారూ, తప్పకదశావతారవర్ణనాకీర్తనశ్రేణి వస్తున్నదండీ. రేపే నృసింహావతారకీర్తన వెలువడుతున్నది. రాముడిచ్చిన శక్తిమేరకు ఈ‌రామకీర్తనలను వెలువరించటానికి యత్నిస్తున్నానండి. ఇంకా ఎంత సమయం నా వద్ద ఉన్నదో తెలియదు కాని వీలైనంతగా ఇవి వెలువడాలని నా ఆరాటం. ఆపైన రామేఛ్ఛ.

   తొలగించండి
 2. సురలు శరణుయని సొంపుతొ వేడగ
  కరుణతొ మందర గిరి పృష్టమునను
  గురుతుగ నిడుకొని పరదేవతలను
  నిరుపమానముగ నీవు బ్రోచితివి
  కూర్మావతారా! జయ కూర్మావతారా!

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.