కలుషసాగరము సంసారములో
పరులు చెప్పు దుర్నీతులు వినిన
జగముల నేలే ఓ జానకీరాముడా
పగతుని సోదరుని తగునని ప్రోచిన
జగదభిరాముడవు నిగమసంవేద్యుడవు
తగు నీభక్తులను దయ నేల రారా
దైవరాయ నీనామము తరచుగ పలికేము
దైవరాయ నీపూజలె తరచుగ చేసేము
పావనశుభనాముడవు పతితజనోధ్ధరుడవు
మావలన దొసగులన్న మన్నించి రారా
రారా ప్రహ్లాదవరద రారా కరివరద
రారా సుగ్రీవవరద రారా భవనాశ
కారణకారణ హరి కమలాయతాక్ష రార
రారా మమ్మేలే రామచంద్ర వేగ
తక్కుంగల దేవతలును తమతమ శక్తికొలది
నిక్కువముగ పొగడుదురు నిన్నే శ్రీరామ
దిక్కులన్ని గను మిదే నిను పొగడు వారితో
పిక్కటిల్లి యున్నవయా విజయరాఘవ
పవలు రేలు దిశలు ప్రకృతి పంచభూతమ్ములును
భువనంబుల సృష్టిచేసీ పోషించు చుండి
చివర కన్నిటిని నీలో చేర్చుకొనెడు శ్రీహరివి
అవధరించి మమ్మేలుము కువలయేక్షణ
నళినాక్ష పరదైవముల నేను గొలువగ
నరజన్మములు కొన్ని కరిగిపోయెను రామ
నళినాక్ష నీపేరే నాకెఱుక గాకుండ
నరజన్మములు కొన్ని కరిగిపోయెను రామ
నళినాక్ష నీమహిమ నాకఱుక గాకుండ
నరజన్మములు కొన్ని కరిగిపోయెను రామ
నళినాక్ష నీయందు నాకు గురి కుదరక
నరజన్మములు కొన్ని కరిగిపోయెను రామ
నళినాక్ష నీపైన నాభక్తి నిలువక
నరజన్మములు కొన్ని కరిగిపోయెను రామ
నళినాక్ష నీకేమొ నాపైన దయరాక
నరజన్మములు కొన్ని కరిగిపోయెను రామ
నళినాక్ష నీదయ కలుగుటకై నేను
నరజన్మముల నెన్ని కరిగించ వలె రామ
నళినాక్ష యికనైన నాపైన దయజూపి
యిల నింక పుట్టించ వలదయ్య రామ
రాముడు బాలరాముడు రఘురాముడు మన శ్రీరాముడు
ముద్దరాలు కౌసల్యకు సర్వము ముద్దులకొడుకీ రాముడు
దిద్దరాని వయ్యారాల కైకకు ముద్దులకొడుకీ రాముడు
హద్దులేని ప్రేమరాశి సుమిత్ర ముద్దులకొడుకీ రాముడు
ముద్దుమాటల కువకువలాడే ముద్దులకొడుకీ రాముడు
పెద్దకన్నుల నిడుదచేతుల ముద్దులకొడుకీ రాముడు
సద్దుచేయక ఆడుచునుండే ముద్దులకొడుకీ రాముడు
సద్దుచేయని చల్లనినగవుల ముద్దులకొడుకీ రాముడు
నిద్దురనైనను చెదరనినగవుల ముద్దులకొడుకీ రాముడు
ముగ్గురమ్మలకు కన్నులవెలుగగు ముద్దులకొడుకీ రాముడు
పెద్దలందరకు నంతఃపురమున ముద్దులకొడుకీ రాముడు
విద్దెలు నేర్చుచు వర్ధిల్లుచున్న ముద్దులకొడుకీ రాముడు
భూమినాథుడు యగ్గగ్గలాడే ముద్దులకొడుకీ రాముడు
నుడువరేల రామా యని నోరారా జనులారా
నుడువ నుడువ శ్రీహరి కనబడును కాదా
నిదురలేచి కనులుతెఱచి నిండుమనసుతో మీరు
మృదుమధురముగను మొదటి మాట గాను
సదయుడైన హరిని రామచంద్రుని మదిలోన తలచి
ముదమారగ జిహ్వ మిగుల పునీతమై పోవగ
పగలు మీరు పొట్టకూటిపనుల మధ్య నుంటి మనుచు
జగదీశుని దివ్యనామస్మరణ మేల మాన నగును
తగ నోటికి ముద్దజేర్చు తరుణమందు హరినామము
ప్రగాఢానురక్తి తోడ రసనాగ్రము నందు జేర్చి
నిదురవేళ కెల్లపనులు నిశ్చయముగ జక్కపరచి
వదలక నైహికము లందు పరగు బుధ్ధి నడచి
ముదమారగ హరిపాదములను జేర్చి మీమనసుల
సదయుడైన విభునిపేరు జహ్వాగ్రములను జేర్చి
కాముడు నిన్ను వట్టి కాముకునిగ జేసి
భూమి జనులు తిట్ట నీపోడిమి నడచు
రాముడు నీలోపలి కాముకత్వ మణగించి
భూమి జనులచే నిన్ను పొగడించును
కాముని నమ్ముకొన్న ఘనపాపి వగుదువు
పామరుడవై కాలుని బారిని పడుదువు
రాముని నమ్ముకొన్న రాగంబుల విడుతువు
భూమినింక పుట్ట వారామునే చేరుదువు
మోహపాశముల విరిచివేయునది శ్రీహరినామస్మరణము
దేహతాపముల తీర్చివేయునది శ్రీహరినామస్మరణము
చింతలన్నిటిని తొలగించునది శ్రీహరినామస్మరణము
అంతకు రాకడ నడ్డగించునది శ్రీహరినామస్మరణము
సాహసించు కలి నడ్ఖగించునది శ్రీహరినామస్మరణము
దేహికి మోక్షము నిచ్చి ప్రోచునది శ్రీహరినామస్మరణము
నరులారా శ్రీహరినే నమ్ముకున్నారు మీరు
పరమపురుషు డతనిపై భక్తి గలవారు
సిరు లశాశ్వతము లని యెఱిగియున్నారు మీరు
తరచు హరిసేవ లందు మురియుచున్నారు
పురుషోత్తము డతడినే పొగడుచున్నారు మీరు
పరుల నెపుడు పొగడ మని పలుకుచున్నారు
హరితీర్ధము లెల్లప్పుడు తిరుగుచున్నారు మీరు
హరికథలను తడవి తడవి మురియుచున్నారు
హరిసన్నిధి మాకు నిత్య మనుచునున్నారు మీరు
హరినామము భవతారక మనుచునున్నారు
హరినామామృతమె చాలు ననుచునున్నారు మీరు
హరేరామ యనుచు నెపుడు మురియుచున్నారు