16, మార్చి 2026, సోమవారం

భక్తులము హరిభక్తులము

భక్తులము హరిభక్తులము హరి
భక్తివినా మా బ్రతుకే లేదు
 
హరిలీలలనే మననము చేయుచు
  పరవశ మందే వారము 
హరిసేవలతో ననవరతంబును
  మురియుచు తిరిగే వారము
 
హరిని తెలుపు నితిహాసము లందే
  యాదర ముంచే వారము
కరుణామయు డగు హరికే మనసా
  శరణాగతు లగు వారము 
 
కనులారా హరి చిద్రూపమునే 
  కనుగొని మురిసే వారము
మనసారా హరినామావళినే 
  పనవుచు మురిసే వారము
 
దినదినమును హరిసంకీర్తనమే 
  తీయగ పాడే వారము
క్షణక్షణమును హరిసన్నిధి లోనే 
  గడపుచు మురిసే వారము
 
హరేరామ యని ఆరాముని మే
  మన్నిట కనుగొను వారము
హరేకృష్ణ యని అహర్నిశలు భజ
  నానందము గొను వారము
 
పరాకు నైనను పరదైవతముల
  భావన చేయని వారము 
పురారి సన్నుతు డగు శ్రీహరినే
  ముక్తిని వేడెడు వారము 
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.