15, మార్చి 2026, ఆదివారం

కరుణించరా స్వామి కమలాయతేక్షణ

ఆహిరి.

కరుణించరా స్వామి కమలాయతేక్షణ
తిరముగ మది నిన్నేమరక కొలుచు నను

సదమలచారిత్ర్యసంశోభితా రామ
విదళితామరవైరివీరగణా హర్ష
మొదవగ నా కామమోహాది రిపువర్గ
మదమును పెకలించి ముదము చేకూర్చర 

వేవేల నామాల వెన్నుడ నీమహిమ

భావించి మెప్పించు ప్రతిభ లేకున్నను

నీవాడనే కాని పైవాడనా యేమి

సేవించు నామొరలు చిత్తగించవు స్వామి


జగముల పుట్టించి చక్కగా పోషించి

తగ లోగొను దేవా దాసుడ నేగానా

నిగమాగమవిదిత నిత్య శుధ్ధబ్రహ్మ

మగు నీవే శరణమో యభవ భవమోచన


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.