27, మార్చి 2026, శుక్రవారం

ఇచ్చట రాముని పాటల ముచ్చటలే

కల్యాణి


ఇచ్చట రాముని పాటల ముచ్చటలే దొరకు నండి

వచ్చి స్వయముగా నరసి మెచ్చి మీరు పాడుకోండి


నిండు మనసుతో రాముని నిత్యము సేవింతురా

పండుగయే రామునిపై పాటలనే పాడుకొనుట

రండి సుజనులార మీరు రామునిపై కీర్తనలు

దండిగా లభించు నిచట తప్పక విచ్చేయండి


పదేపదే రామాయని పలుకుచును మురియుచును

సదా హృదయముల రామసన్నిధియే కలవారికి

ముదావహముగా నిచట నే ప్రొద్దనకను భక్తి మీర

సదారామభజన జరుగు సంతోషముగ రండి


హరినామ స్మరణమందె నిరంతరము గడుపువారు

తరింతురు మరల వారు ధరకు వచ్చు పనే లేదు

హరినామము మారు మ్రోగు నట్టి మంచిచోటి దండి

పరుగున శ్రీరామభక్తవరు లారా రండి రండి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.