31, మార్చి 2026, మంగళవారం

రండి రండి దేవుళ్ళు వచ్చిరండి

రండి రండి దేవుళ్ళు వచ్చిరండి వచ్చి మ్రొక్కండి
పండుగ లప్పు డైన భక్తి మీరు చాటండి

వెన్నెలవంటి చిరునగవుల వీరే రామచంద్రులు
కన్నుల కరుణకురియుచున్న కలికి మన సీతమ్మ
ఎన్నగ వీరె తల్లిదండ్రు లెల్లవారి కిది నిజము మన
పున్నెము పండి వచ్చినారు తిన్నగ మీరు మ్రొక్కండి

మూడులోకములకు వీరు మూలమైన దేవుళ్ళు
ఏడుగడలు వీరు మనకు నెల్లవేళ లందును
వేడుకగా వీరి కిపుడు వివిధోపచారములు కా
పాడు దైవములకు మ్రొక్కి పధ్ధతిగా చేయండి

వేయండీ దండ లిపుడు వివిధవర్ణశోభితములు
పూయండీ గంధములను పుణ్యమూర్తులకు నిపుడు
చేయండీ పూజలిపుడు చేతులార దేవుళ్ళకు
మీయంతటి ధన్యులింక మేదినిలో నుండరండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.