31, మార్చి 2026, మంగళవారం

దినదినమును

దినదినమును శ్రీరామనామమును
 తీయగ పలుకుచు నున్నావా
దినదినమును శ్రీరామసేవలో
 దిగి పనిచేయుచు నున్నావా

అనుదినమును శ్రీరాముని కీర్తన
 లాలాపించుచు నున్నావా
అనుదినమును శ్రీరాముని సత్కథ
 వినుచు చదువుచు నున్నావా
అనుదినము శ్రీరాముని భక్తుల
 గని భాషించుచు నున్నావా
అనుదినమును శ్రీరాముని పూజల
 నానందించుచు నున్నావా

అనుదినమును శ్రీరాముని భావన
 యందే తనియుచు నున్నావా
అనుదినమును శ్రీరాముని యవియివి
 యడుగక కొలుచుచు నున్నావా
అనుదినమును శ్రీరాముని దయ కే
 మన్యము నడుగక యున్నావా
అనుదినమును శ్రీరాముని కైవ
 ల్యమునే వేడుచు నున్నావా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.