పద్యం వ్రాయటం గురించి మాట్లాడుకుంటున్నాం.
ఈ వ్యాసం రెండవది.
నా టీనేజ్ చివరి నుండి కొన్నేళ్ళు నేను రంపచోడవరం గ్రామంలో ఉన్నాను. మానాన్నగారు ఉపాధ్యాయులు. ఆఊరికి బదిలీమీద వెళ్ళారు ప్రధానోపాధ్యాయులుగా. కాబట్టి పదేళ్ళు చిల్లరగా కొత్తపేటలో ఉన్న మాకుటుంబం అంతా రంపచోడవరానికి నివాసం మార్చటం జరిగింది.
ఆఊళ్ళో సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులుగా శ్రీ రావాడ కృష్ణ గారు వచ్చారు. వచ్చారు అనటం ఎందుకంటే ఆ పాఠశాలలో మొత్తం స్టాఫ్ అందరినీ బదిలీలు చేసి ప్రధానోపాధ్యాయుల నుండి అందరినీ కొత్తవారిని వేసారు. అతికొద్ది మంది మాత్రమే పాతవారు. అలా వచ్చిన వారిలో కృష్ణ గారు ఒకరు. ఆయన మంచి చిత్రకారులు.
ఆయనతో నాకు మంచి స్నేహం ఏర్పడింది. కృష్ణ గారు తీరిక దొరికినప్పుడల్లా బొమ్మలు వేస్తూ ఉండేవారు. అవి చూసి ఒకసారి నేను మాష్టారూ బొమ్మలు బాగున్నాయి కదా పత్రికలకు పంపవచ్చు కదా అన్నాను. ఆయన నవ్వి నాబొమ్మలను పత్రికల వాళ్ళు పదేళ్ళకు పైగా పోషించారు. ఇంకా పంపటం బాగుండదులే కొత్త వాళ్ళు రావాలి కదా అన్నారు.
అలా ఒకసారి ఆయన బొమ్మలు వేస్తుంటే అక్కడికి సి ఐ గారి అమ్మాయి వచ్చింది. ఆమె నాదగ్గర ట్యూషన్ చెప్పించుకుంటూ ఉండేది.
కృష్ణ గారిని నాబొమ్మ వేసివ్వరా అని బ్రతిమాలింది. ఆమె నోట్ బుక్ తీసుకొని ఒకటి రెండు నిముషాల్లో అట్టా అట్టా గీసి యిచ్చారు. ఆవేగాన్ని చూసి ఆశ్చర్యం. ఆబొమ్మను చూసి మహదాశ్చర్యం. అంత చక్కగా ఉంది. నాకూ చిత్రకళ మీద అసక్తి ఉందీ అని గ్రహించి నా విద్యకు మెరుగులు దిద్దుదాం అనుకున్నారు కాని కృష్ణ గారు త్వరగానే నాలో సహజంగా చిత్రకళావిలాసం పూజ్యం అని గ్రహించారు.
ఏలలితకళకు ఐనా సహజసిద్దం ఐన ప్రతిభ కొంత ఉండితీరాలి. అపైన గురుకృప. ఆపైన అభ్యాసం
లలితకళలనే కాదు చాలా విద్యల విషయంలో కూడా ఇది నిజమే.
ఒకాయనకు కొడుకుని డాక్టరును చేయాలని ఉంది. బోలెడు డబ్బు ఉంది కాబట్టి ఫీజు కట్టి చదివించగలడు. అది కోట్ల మీద ఉన్నా సరే. ఆ కొడుకు కూడా విద్య యొకడి బాబు సొత్తా యేమి, నేను డాక్టరును కావాల్సిందే అనుకున్నాడు.
లక్షలు ఖర్చు చేసి కోచింగ్ ఇప్పించాడు. కాని వాడికి ఆ దిక్కుమాలిన సెట్ పరీక్షల్లో తగినంత స్థాయి రాక పోయింది. ఏమన్న మాట? మనకు కోరిక ఉంటే సరిపోతుందా? తగిన ప్రతిభ ఉండాలి. చెప్పాను కదా, అది కొంత దైవికం. ఆపైన మానవప్రయత్నం గురువుసాయమూ అభ్యాసమూ అని.
టూల్స్ ముందు వేసుకొని యూట్యూబ్ సాయంతో కుర్చీని తయారు చేయవచ్చును అభ్యంతరం లేదు. కాని సరైన కుర్చీని తయారు చేయగల వడ్రంగం నైపుణ్యం కొంతైనా సహజంగా ఉండి ఉంటేనే పనిజరుగుతుంది. లేని పక్షంలో వందల గంటల కష్టం చేసినా సంతృప్తికరమైన పనివాడితనం రాకపోవచ్చును.
ముందు దైవదత్తం ఐన గాత్రం ఉంటేనే సంగీతం నేర్చుకొని గాయకుడు అయ్యేది.
ఏవిద్యనూ ' అంట ' వల దని ఎవరూ చెప్పరు. అది మనకు అంటుతుందో లేదో మీకు మీరు కొంత అవగాహన కలిగి ముందుకు వెళ్ళాలి. మన అవగాహన సరైనది అని గురువులు అనుకుంటే రాణించేందుకు దారులు పడతాయి. ఆపైన మన అభ్యాసదీక్ష మీద ఆధారపడి ఉంటుంది ఎంతగా విద్య అబ్బేదీ అన్నది.
ఛందం అనేది ఒక సాఫ్ట్వేర్ టూల్ మాత్రమే దానికి ఉన్న ప్రయోజనం దానికి ఉంది. అది అనువుగా ఉందని చెప్పి దాని సహాయంతో అడ్డదారిన పద్యాలను తయారు చేయటం వలన ఆట్టే ప్రయోజనం ఉండదు. ప్రత్యేకించి ఈమాట చెప్పటం ఎందుకంటే అలా ప్రయత్నం చేస్తూ పద్యాలను పోలిన వికారాకృతులను కొందరు అమాయకంగా అచ్చులు పోసి తీసి జనం మీదికి వదులుతో ఉండటం దినదినమూ చూస్తునే ఉన్నాం కాబట్టి. ఈచర్చ అంతా పద్య విద్య గురించి కాబట్టి.
మరికొన్ని విషయాలు తరువాయి వ్యాసంలో ముచ్చటించుకుందాం. ఇప్పటికే పెద్దదైనట్లుంది.
ఇందులో ఒక సూక్ష్మం ఉంది. పద్యాలు వ్రాయాలని ఆసక్తి ఉన్నవారు సహజ ప్రతిభ లేకపోయినా పట్టుబట్టి నేర్చుకుని వ్రాస్తున్నారు. ఒకరకంగా ఇది మంచిదే. అయితే జిలేబీ లాగా వెకిలి గిద్యాలు వ్రాసి వికృత ఆనందం పొందేవారితోనే సమస్య.
రిప్లయితొలగించండిమీరు చెప్పినట్లు సహజ ప్రతిభ ఉన్నవారు విశేషంగా రాణిస్తారు. అయితే సాధారణ ప్రతిభ ఉన్నవారు తమ స్థాయికి తగ్గట్లు ఒక హాబీగా కళలు అభ్యసించడం, రచనలు చేయడం మంచిదే అనిపిస్తుంది.
విశేష ప్రతిభ + సాధన + లక్ష్యం + గౌరవం ఉన్నవారు ఉత్తమ స్థాయికి చేరుకుంటారు. ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది.
ప్రతి విషయాన్ని వెటకారం గా చూసేవారు జిలేబిగా అవుతారు.