అరవైయేళ్ళ క్రిందటి సంగతి.
హైస్కూలు చదువురోజులు. కొత్తగా పద్యవిద్య మురిపెం ఒకటి తగులుకుంది.
మాగురువుగారు వేదుల వేంకటరావు గారు ఒక పద్యపాదం బోర్డు మీద వ్రాసి పూర్తిచేయండ్రా ఆన్నారు. నాపూరణ నచ్చింది వారికి. నేర్పటం మొదలు పెట్టారు. నాతోపాటు మరొక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు కాని వారు ఎక్కువదూరం రాలేదు.
కొత్తపేటలోని ధనమ్మమర్రి దగ్గర పిక్నిక్ ప్రోగ్రాంలో మాకన్నబాబు అడిగితే ఆశువుగా చెప్పిన రెండు పద్యాల్లో ఒకటి.
తొలిజాము కోడికూసెను
తెలవారగ నుండె ననుచు తెలుపుట కొరకై
కల నిష్టభోగతతులన్
కులుకుచు నున్నట్టి భిక్షుకుడు కోపించెన్
రెండవది గుర్తులేదు.
మాస్నేహితుడు పాండురంగారావు పెళ్ళిలో చెప్పిన కొంటె పద్యం ఒకటి
నాగేశ్వర ప్రియభక్తా
అని మొదలౌతుంది. ఆముక్క ఒకటే గుర్తుంది మొత్తం రెండు పద్యాలకూ.
విషయం ఏమిటంటే మాపాండురంగారావు అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని.
కాలేజీరోజుల్లో ఒక వ్యాసరచన పోటీలో నేను కొటేషన్లు పద్యాల రూపంలో వ్రాసాను. ఆశుకవిత్వం కాదు కానీ ఇంచుమించు అలాంటిదే. ఆదెబ్ఫకు మొదటి బహుమతి ఖాయంగా ఒళ్ళోపడుతుందని నమ్మాను. అన్నాను. వచ్చింది.
ఆపద్యాలేవీ గుర్తులేవు.
ఒకపద్యం మాత్రం
బస్సుల్ తగులం బెట్టిరి
అని ప్రారంభం అవుతుంది. ఇంక ఏమీ గుర్తులేవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.