20, మార్చి 2026, శుక్రవారం

పద్యం వ్రాయటం గురించి - 4

పద్యవిద్య బాగా అబ్బాలీ అంటే సహజసిధ్ధమైన ప్రతిభ కొంత ఉండాలీ అన్న నామతాన్ని విపులంగా చెప్పటానికి ప్రయత్నించాను. ఇటువంటి జన్మసిధ్ధప్రతిభాపరత అన్నది ఏలలితకళ విషయంలోనైనా సరే వర్తిస్తుంది అన్నదీ వివరించాను.

ఇపుడు మరొక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను.

కవిత్వం చెప్పటానికి పాండిత్యం ఎంత అవసరం అన్న చర్చ ఒకటి ఉంది.

నిజానికి చాలా మంది పండితులకు పద్యవిద్య రాదు.

అలాగే చాలా మంది కవులు చెప్పుకోదగ్గ పండితులు కారు.

ఐతే కావ్యనిర్మాణం వంటివి చేయాలంటే తగుమాత్రం పాండిత్యం అవసరం. అలాగని మహాపండితులు కావాలా అంటే అది వేరే చర్చ. 

పూర్వం భట్రాజులని ఉండేవారు. రాజులను జమీందారులను పద్యవిద్యతో తెగ పొగిడి పొట్టపోసుకోవటం వారి వృత్తి. ఇప్పుడు రాజులూ జమీందారులూ లేరు. అందుచేత భట్రాజులూ కనబడటం లేదు.

భట్రాజులలో పద్యవిద్య ఒక కుటుంబవిద్యగా ఉండేది.

వాళ్ళు సాదారణంగా చిన్నా పెద్దా పద్యాలను ముక్తకాలుగా ఆశువుగా చెప్పగలరు కాని కావ్యనిర్మాణం చేసే స్థాయి విద్యా విద్వత్తూ వారికి ఉండేవి కావు.

ఇలాంటి భట్రాజు గారు ఒకాయన నాకు కొత్తపేటలోని లైబ్రరీలో కలిసారు. నలుగురికీ విద్యాప్రదర్శన చేస్తే కాసిని డబ్బులు వస్తాయి కదా అన్న ఆశతో ఆలైబ్రరీకి వచ్చాడాయన. చిన్నపాటి గోష్ఠి జరిగింది. నేను కొన్ని తెలిసిన సమస్యలను ఇస్తే ఆశువుగా వేగంగా పూరించి అబ్బురపరిచారు. ఆసమస్యలు మామావయ్య గారికి అష్టావధానాలలో ఇవ్వబడిన సమస్యలు. ఈభట్రాజు దగ్గర తగుపాండిత్యం కూడా ఉందన్నమాట. అందరూ కలిసి ఐదో పదో ఇచ్చిపంపారు. పెద్దపాండిత్యం లేకపోయినా పద్యం చెప్పగలిగారీ భట్రాజు గారు.

నేను చూసిన మరొక నికార్సైన ఆశుకవి మాగురువుగారు కీ.శే. వేదుల వేంకటరావు గారు. నా ఉపనయన సందర్భంలో సాటి ఉపాధ్యాయులు ఆయనను మాష్టారూ మీశిష్యుడిని ఆశీర్వదిస్తూ పద్యాలు చెప్పరా అంటే వెంటనే దడదడా ఒక పాతిక ముఫ్ఫైపద్యాలను ఆశువుగా చదివారు. ఆయన గొప్పపండితకవి. మా ఊళ్ళో భువనవిజయం చేసినపుడు వేదులవారు అల్లసాని పెద్దనగా ఉండేవారు. 

మాపాఠశాలలోనే వెంపరాల శివబ్రహ్మ శాస్త్రి గారు పండితులే కాని కవి కాదు. పాఠశాలవార్షికోత్సవం సందర్భంగా ఆయన పద్యాలు వ్రాసి ఒరే సరిచూసి యివ్వరా అన్నారు. ఏమిటి సరిచూసేది? అవన్నీ నేను తిరుగవ్రాసి యివ్వవలసి వచ్చింది. వేదులవారి చేత తిట్లు తినవలసి వచ్చింది ఘోష్ట్ రైటింగ్ చేసినందుకూ ఒక నరమానవుడి మీద స్తుతి పద్యాలు వ్రాసినందుకూ.

నేను ఆశుకవిత్వం చెప్పిన సందర్భాలు ఒకటి రెండే‌ అప్పుడైనా చెప్పినవి రెండేసి పద్యాలే. అవైనా కందాలే అని గుర్తు. అప్పట్లో కందం చెప్పినవాడే కవి ఒక అపోహ వ్యాప్తిలో ఉండేది లెండి. ఆశుకవిత మీద నాకు మోజు లేక నేను ఆదిశగా ఏమీ కృషి చేయలేదు. 

చెప్పవచ్చేది ఏమిటంటే పాండిత్యం కవికి మంచి ఉపకరణం కాగలదు కాని అది స్వయంగా కవిని చేయలేదు. అలాగే చెప్పుకోదగిన పాండిత్యం లేకపోయినా కవిత్వం చెప్పవచ్చును.

కవిత్వకళ సహజంగా ఉండినపక్షంలో పాండిత్యం దానికి మంచి అలంకారం అవుతుంది.

నిజానికి ఏఉపకరణం ఐనా కవికి సహాయం చేయగలదే కాని కవిని తయారుచేయలేదు. అలా సాధ్యంకాదు. అలాంటి అపోహ ఉంటే ఔత్సాహికకవులు దాని నుండి ఎంత తొందరగా బయటపడితే వారికి అంత మేలు కలుగుతుంది.


1 కామెంట్‌:

  1. ఈవిషయమై రెండు మూడు టపాలు వ్రాయాలని అనుకున్నాను. కాని విషయం చాలానే టపాలుగా వచ్చేలా ఉంది.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.