30, సెప్టెంబర్ 2023, శనివారం

ఏదినము రామునిదై


ఏదినము రామునిదై యెంతయు శోభించునో
   ఆదినమే సుదినమని యక్కజముగ నెఱుగునది

శ్రీరాముల శుభనామము నేరోజున తలపడో 
    ఆరోజును దుర్దినమని యక్కజముగ నెఱుగునది
శ్రీరాముల శుభచరితము నేరోజున చదువడో 
    ఆరోజును దుర్దినమని యక్కజముగ నెఱుగునది
శ్రీరాముల గుణగానము నేదినమున చేయడో 
    ఆరోజును దుర్దినమని యక్కజముగ నెఱుగునది
శ్రీరాముల పూజించుట నేరోజున మరచెనో 
    ఆరోజును దుర్దినమని యక్కజముగ నెఱుగునది

శ్రీరాముల సంకీర్తన మెన్నడు చెవిబెట్టడో 
    ఆరోజును దుర్దినమని యక్కజముగ నెఱుగునది
శ్రీరాముల సేవించుట నేదినమున మానెనో
    ఆరోజును దుర్దినమని యక్కజముగ నెఱుగునది
శ్రీరాముల సందర్శన మేదినమున కలుగదో 
    ఆరోజును దుర్దినమని యక్కజముగ నెఱుగునది
శ్రీరాముల సద్భక్తుల నెన్నడు గమనించడో 
    ఆరోజును దుర్దినమని యక్కజముగ నెఱుగునది

శ్రీరాముల పరిహసించు వారెన్నడు కలిసిరో 
    ఆరోజును దుర్దినమని యక్కజముగ నెఱుగునది
శ్రీరాముల బంట్రోతుగ నేదినమున నుండడో 
    ఆరోజును దుర్దినమని యక్కజముగ నెఱుగునది
శ్రీరాముల హృదయంబున నేదినమున చూడడో 
    ఆరోజును దుర్దినమని యక్కజముగ నెఱుగునది
శ్రీరాముల కటాక్షమున కేదినమున నోచడో 
    ఆరోజును దుర్దినమని యక్కజముగ నెఱుగునది


28, సెప్టెంబర్ 2023, గురువారం

తానే దిగివచ్చె నమ్మా దైవము రాముడై

 
తానే దిగివచ్చె నమ్మా దైవము రాముడై
మానవులార పూజించండి మంచి మనసుతో

బుధ్ధిజీవులమని పొంగిపోతె చాలునా
బుధ్ధిమంతులైయుండ బోలును మంచి
బుధ్ధులన్ని నేర్పించగ మహిపైన రాముడై
శుధ్ధబ్రహ్మమే వెలసెను చూడరే మీరు

భూవలయము పంటపండి పురుషోత్తముడు
దేవదేవుడే రాగా దివినుండి భువికి
సేవచేసి తరించిన జీవులే ధన్యులని
భావంబునందెఱిగిన వారే సుకృతులు

రామరామ యనువారిని రాముడు రక్షించగ
రామరామ యనక చెడ రాదుగా మనకు
రామహరే కృష్ణహరే ప్రాణప్రియాయని
ప్రేమతో కొలువరయ్య శ్రీహరి నిపుడు



రామభజన చేయరే


రామభజన చేయరే రామభజన మనకు
రాముని కనుపింపజేయు రామభజన

రాగద్వేషముల నణచు రామభజన మనకు
భోగభాగ్యముల నిచ్చు పుణ్యభజన
రాగతాళయుక్తమైన రామభజన నాద
యోగమై ధరణి మీద నొప్పు భజన

సుజనకోటిహృదయంబుల జొచ్చు భజన రేగి
కుజనకోటి గుండెలలో గ్రుచ్చు భజన
భజనపరులకెల్ల సుఖము పంచు భజన ధర్మ
విజయశంఖారావమైన వీరభజన

హనుమంతుడు చేయుచుండు నట్టి భజన విభీ
షణుడు సర్వవేళలను సలుపు భజన
మనోహరంబైయుండెడు మంచి భజన శివుడు
మనసులోన చేయుచుండు మహితభజన

27, సెప్టెంబర్ 2023, బుధవారం

హరిని పొగడరే మీరు తరుణులారా

 

హరిని పొగడరే మీరు తరుణులారా మరి యెవరిని పొగడెదరో తరుణులారా

దశరథరాముడని తరుణులారా మీరు తనివారగ పొగడరే తరుణులారా
దశకంఠమర్దనుడని తరుణులారా మీరు తరచుగాను పొగడరే తరుణులారా
యశోవిశాలుండని తరుణులారా మీరు దిశలు మ్రోగ పొగడరే తరుణులారా
ప్రశమితేంద్రియుడని తరుణులారా మీరు పదేపదే పొగడరే తరుణులారా

ధరణిజాపతియని తరుణులారా మీరు పరమాత్ముని పొగడరే తరుణులారా
నరనాథవరుడని తరుణులారా మీరు నతవత్సలు పొగడరే తరుణులారా
కరుణాసముద్రుడని తరుణులారా మీరు కడువేడ్కను పొగడరే తరుణులారా
సరిలేని వీరుడని తరుణులారా మీరు చక్కగాను పొగడరే తరుణులారా

వనజాయతాక్షుడని తరుణులారా మీరు భక్తిమీఱ పొగడరే తరుణులారా
ఘనశ్యాము డితడని తరుణులారా మీరు ఘనముగాను పొగడరే తరుణులారా
ఇనవంశతిలకుడని తరుణులారా మీరు ఇంపుగాను పొగడరే తరుణులారా
మన తండ్రి రాముడని తరుణులారా మీరు మనదేవుని పొగడరే తరుణులారా


నన్ను కాపాడవయ్య పన్నగశాయీ

 

నన్ను కాపాడవయ్య పన్నగశాయీ నేను
నిన్నెన్నడు మరువనుగా పన్నగశాయీ 

బ్రహ్మాండములను నీవు పన్నగశాయీ పర
బ్రహ్మమువగు నీవు చేసి పన్నగశాయీ
బ్రహ్మాదుల నేర్పరించ పన్నగశాయీ ఆ
బ్రహ్మ నన్ను భూమి నుంచె పన్నగశాయీ

పరగ సౌఖ్యమనగ సున్న పన్నగశాయీ దు
ర్భరమౌ నీధరణి మీద పన్నగశాయీ
వరుసపెట్టి కష్టములే పన్నగశాయీ నీ
పరమకృపకు నోచనైతి పన్నగశాయీ

ఎన్నడింక మోక్షమయ్య పన్నగశాయీ న
న్నెన్నడు కరుణింతువయ్య పన్నగశాయీ
పన్నుగ శ్రీరాముడవై పన్నగశాయీ ఆ
పన్నుల రక్షించినట్టి పన్నగశాయీ


24, సెప్టెంబర్ 2023, ఆదివారం

శ్రీరామ రామ యన్నా డీజీవుడు


శ్రీరామ రామ యన్నా  డీజీవుడు నేడు
శ్రీరామ శరణ మన్నా డీజీవుడు నేడు

ఎన్నడు నిను విడువకుందు నన్నా డీజీవుడు
నిన్ను వినా దేవు నెఱుగ నన్నా డీజీవుడు
ఎన్నాళ్ళని వేచియుందు నన్నా డీజీవుడు
నన్ను వేగ కటాక్షించు  మన్నా డీజీవుడు 

ఈజీవుడు నిన్నెపుడు పూజించు చున్నాడు
ఈజీవుడు వేరెవ్వరి పూజించ నన్నాడు
ఈజీవుడు నీవాడై యిల మీద నున్నాడు
ఈజీవుడు నీకొఱకై యిల మీద నున్నాడు

పరమపామరుం డనుచు  భావించ కోరామ
శరణుజొచ్చి పావనుడై వరలును గద రామ
శరణమన్న జీవునిక కరుణించరా రామ
మరల పుట్టువే లేని  వరమీయరా రామ


రాములోరి గుడిచిలుక యున్నది

 
రాములోరి గుడిచిలుక యున్నది రామరామ యనుచున్నది
రాములోరి గుడితోట లోని యొక రావిచెట్టుపై నున్నది

వచ్చేపోయే భక్తుల తీరును బాగుగ గమనిస్తున్నది
పిచ్చిపిచ్చి కోరికల వారల వెఱ్ఱిని గమనిస్తున్నది
ముచ్చట పడుచు కొందరు హరికై వచ్చుట గమనిస్తున్నది
హెచ్చగు నార్తిని కొందరు వచ్చుట నిదిగో గమనిస్తున్నది

రామదర్శనము కొఱకు జ్ఞానుల రాకను గమనిస్తున్నది
రాములవారికి జరిగేసేవల ప్రేమగ గమనిస్తున్నది
రాముని పొగడే రామభక్తుల రాకను గమనిస్తున్నది
రాముని తిట్టే రాలుగాయిల రాకను గమనిస్తున్నది

వాడవాడలను శ్రీరఘురాముని భజనలు గమనిస్తున్నది
ఆడుచు రమణులు రామకీర్తనలు పాడుట గమనిస్తున్నది
పాడేపాటల రాముని లీలావాహిని గమనిస్తున్నది
వేడుకగా జగమంతట రాముని విభవము గమనిస్తున్నది



శ్రీరామభక్తుడ శ్రీరాముడే నీజీవితమా


శ్రీరామభక్తుడ శ్రీరామభక్తుడ శ్రీరాముడే నీజీవితమా
ఆరామడే నీయోగక్షేమము లరయును నిక్కము నిక్కమురా

శ్రీరామనామము జిహ్వాగ్రంబున చిందులుత్రొక్కుచు నున్నదా
శ్రీరామతత్త్వము చింతనచేయుచు చిత్తము పొంగుచు నున్నదా
శ్రీరామచరితము చదువుచు కన్నులు చెమ్మగిల్లుచు నున్నవా
శ్రీరామక్పపచే మోక్షము నీకిక సిధ్ధించునురా తప్పక

శ్రీరామభక్తాగ్రణ్యుల తోడను నిత్యము చేరిక కలుగుచు నున్నదా
శ్రీరామసేవాకార్యము లందున చెలగుచు చరణము లున్నవా
శ్రీరామదేవుని భజనలు నిత్యము చేతులు చేయుచు నున్నవా
శ్రీరామక్పపచే మోక్షము నీకిక సిధ్ధించునురా తప్పక

శ్రీరామకీర్తిని చాటుచు నిత్యము ధారుణి తిరుగుచు నుంటివా
శ్రీరామకీర్తన మానక నిత్యము ప్రీతిగ చేయుచు నుంటివా
శ్రీరామరక్షయె చాలును నాకని చిత్తశుధ్ధిగ నమ్మితివా
శ్రీరామక్పపచే మోక్షము నీకిక సిధ్ధించునురా తప్పక
 

23, సెప్టెంబర్ 2023, శనివారం

ఎవరి కెఱుక రామనామ మెంతమధురమో


ఎవరి కెఱుక రామనామ మెంతమధురమో

ఎవరి కెఱుక రామనామ.మెంతసులభమో


రామనామ మధురిమ మది భూమిజాత కెఱుక

భూమిజాత కెఱుక  యది సామీరికి యెఱుక

సామీరికి యెఱుక  యది కామారికి యెఱుక

కామారికి యెఱుక అది పామరుల కేమెఱుక


ఆనామపు మధురిమ మది అహల్యకే యెఱుక

ఆనామపు మధురిమ మది ఆశబరికి యెఱుక

ఆనామపు మధురిమ మది ఆదికవికి యెఱుక

ఆనామపు మధురిమ మది అల్పులకే మెఱుక


రామదాసులకే యెఱుక రామనామ మధురిమ

రామభక్తులకే యెఱుక రామనామ మధురిమ

ఆమహాత్ములకే యెఱుక రామనామ మధురిమ

కామదాసుల కేమెఱుక రామనామ మధురిమ


పరవశించి శ్రీరామనామమును


పరవశించి శ్రీరామనామమును పాడుకొనెడువేళ 


పరమమూర్ఖులు దురుసులాడితే బాధపడగనేల

పరమశుంఠలు తప్పులుపడితే భయముపొందనేల


కుమతు లితరులను గొప్పచేయుచు గొణిగిన సిగ్గేల

విమతులు కొందరు బెదిరించినచో భీతిచెందనేల


కొందరిచెవులకు కటువుగదోచిన నందుకు వగపేల

కొందరిమనసుల కింపుగదోచును సందేహము వలదు 


21, సెప్టెంబర్ 2023, గురువారం

మరలమరల పుట్టుట


మరలమరల పుట్టుటయను మాట యున్నదా వాడు
మరలమరల చచ్చుటయను మాట యున్నదా

హరినామామృతము కన్న నన్య మెఱుగకుండునేని
హరిలీలామృతము కన్న నన్యమెపుడు గ్రోలడేని
హరికీర్తన తనివారగ నహర్నిశలు చేయునేని
హరిభక్తుల సాంగత్యము మరగి తిరుగుచుండునేని

హరేరామ హరేకృష్ణ యనుచు భజన చేయునేని
హరిభజనలు జరుగుచోట హాయిగ వసియించునేని
హరికీర్తిని చాటించుచు యవనిపైన తిరుగునేని
హరిని చేరు టెట్టులనుచు నహర్నిశము తలచునేని

హరిసేవాపరాయణుం డగుచు ధరను బ్రతుకునేని
హరి మనోహరాకృతిని యనిశము స్మరియించునేని
హరి తనవాడనుచు బుద్దియందు నమ్మియుండునేని
హరిని మోక్షమొకటి దక్క యడుగకుండ బ్రతుకునేని


తప్పులున్న మన్నింపుము


తప్పులున్న మన్నింపుము దశరథరామా నీవు

చెప్పినట్లు నడచుకొందు సీతారామా


సాకేతాధిపుడ నన్ను జానకిరామా ప్రోచు

దాక పాదములను విడువ దశరథరామా

పాకశాశనాదివినుత భండనభీమా నిన్ను

తాకి దుష్టులణగిరయ్య దశరథరామా


చండశాశనుడవు నీవు జానకిరామా నన్ను

దండించక దయజూడుము దశరథరామా

అండవునీ వొక్కడవే అయోధ్యరామా కై

దండనిచ్చి నన్నేలుము దశరథరామా


జననమాది నీభక్తుడ జానకిరామా నేను

ధనాశను విడచితినిక దశరథరామా

నినువినా యొఱులనెఱుగ నీరజశ్యామా కుదర

దనక నన్ను కావవయ్య దశరథరామా


20, సెప్టెంబర్ 2023, బుధవారం

రామభజన చేయరే


రామభజన చేయరే సీతా

రామభజన చేయరే


రామ జగదభిరామ యనుచు ప్రేమతో మీరంద రిపుడు

శ్యామలాంగ రామచంద్ర జానకీమనోజ యనుచు

కోమలాంగ కృపాపాంగ కువలయాధినాథ యనుచు

కామితార్ధవరద యనుచు కారుణ్యనిలయ యనుచు


భూమిజనుల కందరకును క్షేమమును చేకూర్చుమనుచు

స్వామి నిన్ను నమ్మినాము ప్రేమతో మమ్మేలు మనుచు

పామరులము మమ్ము దయతో పాలించగదయ్య యనుచు

రామచంద్ర త్రిభువనైకరక్షకుడవు తండ్రి యనుచు


18, సెప్టెంబర్ 2023, సోమవారం

నరులార సంసారనరకబాధితులార



ఈనాటి రామకీర్తన నిజానికి శుక్రవారం15వ తారీఖు నాటిది.

ఆనాడు ఆపరేషన్ జరిగింది నాకు. గుండెకు ఒక స్టెంట్ వేసారు. ఒక బెలూన్ కూడా పెట్టారు.

ఆపరేషన్ జరుగుతున్న సమయంలో వచ్చిన రామకీర్తన యిది. 

పైన ఉన్న ఫోటో శనివారం నాడు నన్ను గదికి మార్చిన తరువాత మాచెల్లెలు లక్ష్మి తీసినది. అందరికీ నేను కులాసాగానే ఉన్నానని సందేశం పంపటానికి తీసినది అన్నమాట.

నిన్ననే  ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చాను.

వీలు చూచుకొని ఈకీర్తనను ఇప్పుడు ప్రకటిస్తున్నాను.


నరులార సంసారనరకబాధితులార

శిరసువంచి వందనము చేయరే రామునకు


మరల మరల మాకు గర్భనరక మీయకుండు మని

మరల భూమిమీద పడి తిరుగకుండ జేయు మని

మరల దుర్మాన మొంది మొఱుగకుండ జేయు మని

పరమవినయపరు లగుచు ప్రార్ధింప దొడగరే


మరల దుష్టమతులజేరి మసలకుండ జేయు మని

మరల క్షణికసౌఖ్యములను మఱుగకుండ జేయు మని

మరల మోహపాశములను మమ్ము కట్టకుండు మని

పరమభక్తిపరవశులై  ప్రార్ధింప దొడగరే


హరేరామ యందుమని హరేకృష్ణ యందుమని

హరేజనార్దనాయని యందుము కరుణించుమని

పరమపురుష నీకు గాక పరులకెపుడు మ్రొక్కమని

పరమపదము నీయుమని ప్రార్ధింప దొడగరే



15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

లేడా శ్రీరాము డున్నాడు (updated)


లేడా శ్రీరాము డున్నాడు తోడు

నీడై  మన రాము డున్నాడు


ఏడేడు జగముల కేలికై యున్నాడు

వేడుక సాకేతవిభుడై యున్నాడు

వేడితే రక్షించు వీరుడై యున్నాడు

వాడెల్ల వేళల బాసటై యున్నాడు


చూడచక్కని సొగసుకాడై యున్నాడు

వాడైన బాణాలవాడై యున్నాడు

కూడి సీతమ్మను కొలువై యున్నాడు

వాడెల్లప్పుడు మనవాడై యున్నాడు


సుజనుల కిదె దారి చూపుచున్నాడు

నిజభక్తులకు సుఖము నిచ్చుచున్నాడు

భజనచేయువారి భావించుచున్నాడు

విజయరాముడు జనప్రియుడై యున్నాడు


(ఈకీర్తనను హాస్పిటల్ ఆవరణలో వ్రాయటం జరిగింది. అప్పుడు ఆపరేషన్ కోసం నిరీక్షిస్తూ ఉన్నాను)

నిన్ను నమ్ముకొంటి రాఘవా

నిన్ను నమ్ముకొంటి రాఘవా
నన్నేమి చేసెదవో

నిన్నునమ్మి దాల్చితి నీ నిలకడ లేని తనువును
నిన్నునమ్మి పుడమిపై నిబ్బరమ్ముగా నుంటిని
నిన్నునమ్మి కుజనులాడు నిందలకు వెరువకుండ
చిన్నగా నవ్వుకొనుచు చేయుచుంటి నీనామము

నిన్నునమ్మి యున్నవారి నెయ్యంబున నే నుంటిని
నిన్నునమ్మి కొలుచువారి వెన్నుదట్టుచు నుంటిని
నిన్నునమ్మి నీకీర్తిని నిత్యంబును పరవశించి
సన్నుతించి పాడుచు నీ జనులమధ్య నే నుంటిని

నిన్ను నమ్ము సజ్జనుల కెన్నండును భీతిలేదు
నిన్నునమ్ము కొన్నవారి కెన్న పుట్టువులే లేవు
నిన్నునమ్ము కొనుటకన్న అన్నన్నా వేరేది
క్కన్నదే లేదు లేదని నిన్ను శరణుజొచ్చితిని



13, సెప్టెంబర్ 2023, బుధవారం

ఈశ్వరా నీవే సత్యము


ఈశ్వరా నీవే సత్యము జగ
దీశ్వరా యిదే సత్యము

 లేదొక చాపల్యము లేదులే ధనపిపాశ
లేదొక దురాశయు లేదులే దీశ్వరా
లేదొక వ్యామోహము లేదే వ్యాపారమును
నీదారిని నడచుటే నాదైన జీవితము

నీదే యీజీవితము నీవెట్లైనా నడుపుకో
నాదేమీ పెత్థనము లేదులే దీశ్వరా
నీదే యీదేహము నీవేమైనా చేసుకో
నాదనెడు భ్రాంతి లేదు నమ్ము మీశ్వరా

శ్రీరాముడ నేనన్నను శ్రీకృష్ణుణ నేనన్నను
ఏరూపం బైనగాని నీరూప మీశ్వరా
కారణకారణుడ నిన్ను కాంచెద నెల్లెడలను
రారా నన్నేలుకోర వేరేమీ వలదు 


10, సెప్టెంబర్ 2023, ఆదివారం

హరేరామ యనండీ హరేకృష్ణ యనండీ


హరేరామ యనండీ హరేకృష్ణ యనండీ
మరే యితరనామము మనకు వద్దండీ

మరే యితరమంత్రమును మనకేలండీ
మరే యితరదైవమును మనకు వద్దండీ
సరాసరి మోక్షమిచ్చు హరినామమే
దొరికినది అదేచాలు త్వరపడ రండీ

కలియుగమున కొల్లలే కదా దైవంబులు
తెలియలేరు కల్లనిజము తెలివిలేక
తెలివిగలిగి హరినామ దీక్షను గొని
నిలువకున్న మోక్షము కలుగ బోదండీ

భూతప్రేతముల గొలిచి బుధ్ధిహీనులై
భూతలనరకముల నలిగి పోవనేల
ప్రీతితో హరినామము విడువకున్న
ఈతిప్పల నుండి మోక్షమే కలుగునండీ


9, సెప్టెంబర్ 2023, శనివారం

చెప్పుకోండి చూదాం - 2


ఐదుగురు మిత్రులు కలిసి పార్టీ చేసుకున్నారు. ఎందుకు అని అడక్కండి. మిత్రులు కలుసుకొని పార్టీ చేసుకోవటానికి కారణం అంటూ ఏదైనా ఉండాలి అనే నియమం ఏమీ లేదు కదా!

ఆ పార్టీలో ఒకరికొకరు  షేక్ హేండ్లు ఇచ్చుకున్నారు.

పార్టీలో పాల్గొన్న ప్రతీవాడూ తాను ముగ్గిరికే షేక్ హేండ్ ఇచ్చానని అంటున్నాడు.

కాని అలా జరగటం అసంభవం. వాళ్ళల్లో కనీసం ఒకరన్నా పొరపాటు పడటమో అబధ్ధం ఆడటమో జరిగింది.

ఐదుగురిలో ప్రతివాడూ సరిగ్గా ముగ్గురికే షేక్ హేండ్ ఇవ్వటం అనేది ఎందుకు అసంభవమో చెప్పగలరా?

(సమాధానం సోమవారం ఉదయం వస్తుంది. ఈలోపల మీమీ వివరణలు పంపండి. మీదే ఆలస్యం.)


కోరికలు లేని వారు కోదండరాముని


కోరికలు లేని వారు కోదండరాముని
కోరికోరి నేడిదే కొలుచుచున్నారు

నగుమోము కలవాడు నలువకు తండ్రి
జగదీశు డైనవాడు జానకీరాముడై
యగుపడగా సద్భక్తి నంజలి ఘటియించి
సొగసైన పలుకుల సొంపుగా నుతించి

పీతాంబరము గట్టి చిన్నిచిన్ని నగవుల
వీతరాగక్రోధుడు వేదాంతవేద్యుడు
సీతాపతి యగుపడగ చేరిసద్భక్తితో
ప్రీతిమీరగ పొగడి వేడుక చెలువార

భక్తపరిపాలనాపరాయణు డాతడు
ముక్తులను చేయగ ముచ్చటగ సుజనుల
శక్తికొలదిగ కొలిచి సంతసించుటే గాని
యుక్తమని వేరేమి యొసగమందు రిపుడు

మాతండ్రి రామయ్యకు మంగళం


మాతండ్రి రామయ్యకు మంగళం మంగళం
మాతల్లి సీతమ్మకు మంగళం మంగళం

వైరివీరమర్దనునకు వైనతేయవాహనునకు
ఘోరపాపశమనునకు భూరిమంగళం 
సీరధ్వజసుపుత్రికి చింతితార్ధప్రదాత్రికి
వీరపత్ని భూజాతకు భూరిమంగళం

పరమదివ్యచరితునకు పంక్తిరథసుపుత్రునకు 
నిరుపమానజయశాలికి నిత్యమంగళం
పరమపతివ్రతామణికి పంక్తికంఠవినాశనికి
నిరుపమానగుణశాలికి నిత్యమంగళం

అకళంకకీర్తినిధికి అఖిలభక్తవరదునకు
సకలలోకపూజ్యునకు సర్వమంగళం
అకళంకసౌశీల్యకు అఖిలభక్తవరదాత్రికి
సకలలోకసంపూజ్యకు సర్వమంగళం


ఏమందువు రామా

ఏమందువు రామా యెంతకాలమని నేను
భూమిమీద నవుకుదేహమును మోయవలయును

బంగారు దేహమనుచు భ్రమపడుచును దీనిని
సింగారించుచు నేను చేసితి సేవలు దీని
సంగతి యించుకయు తెలియ జాలని వెఱ్ఱినై
మింగి ముప్పూటల యిది మిక్కిలి ముదుకాయె

భయము లేక తనయంత వారులే రనుచు తిరిగె
వయసు మీదపడు వరకు పలుకలేదు నీనామము
నయము నేటి కైనను నీ నామమును పలుకదొడగె
స్వయముగా నీతనువునకు వచ్చినదా బుధ్ధి

పగవారట తనవారట బంధువులట మిత్రులట
జగమంతయు తనకొరకే జనియించి యున్నదట
జగదీశ్వర యీతనువున చాల గర్వ ముండినది
దిగిపోవుచు నుండిన దిక దిగినది చాలునా


8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

రామనామ మున్న దింకేమి వలయును


రామనామ మున్న దింకేమి వలయును నా
కేమి వలయును వేరేమి వలయును

ఈనామ మొకటి చాలు నెల్లచిక్కులను గడువ
నీనామ మొకటి చాలు నెల్లసంపదలు బడయ
నీనామ మొకటి చాలు నెల్లతావులను గెలువ
నీనామ మొకటి చాలు నేమి వలయును

ఈనామపు మహిమ వలన నింతికి శాపము తీరె
నీనామము పలికి బోయ ఋషిపుంగవుడై నిలచె
నీనామము నుడివి కోతి యెక్కె బ్రహ్మపదమునకు
నీనామము చాలు గదా యేమి వలయును

ఈనామము నోట నున్న నెట్టి భయంబులును లేవు 
ఈనామము నుడువువాని దింతభాగ్య మనగరాదు 
ఈనామము నుడువువాని కింక పుట్టు పనిలేదు 
ఈనామము చాలు చాలు నేమి వలయును



కల్లగురువుల నమ్మితే


కల్లగురువుల నమ్మితే యిల్లు ఒళ్ళూ గుల్లరా
చల్లగా నిను రాముడొకడే యెల్లకాలము కాచురా

నల్లని వన్నియిను నీళ్లా తెల్లని వన్నియును పాలా
చిల్లర మహిమలను చూపే యెల్లరును గురుమూర్తులా
కల్లయు కపటమును తెలియక గడ్డము వేషమును జూచి
వల్లమాలిన భక్తిజూపిన బాగుపడునది సర్వకల్ల

దార కొరకో సంతుకొరకో ధనము కొరకో ఆశపుట్టగ
వారు వీరును ప్రోత్సహించగ వట్టి గ్రుడ్డి నమ్మకముతో
గౌరవింతువు గురువులనుచు చేరి కొలుతువు సిగ్గువదలి
వారి యుపదేశములు వింటే బాగుపడునది సర్వకల్ల

కొత్త గురువు లెందుకయ్యా కోరి శివుని చేరరాదో
కొత్త దేవుళ్ళెందు కయ్యా కోరి రాముని వేడరాదో
కొత్త గురుచరితంబు లేల ముత్తి నిచ్చును రామచరితము
కొత్త వేషా లింక చాలును కొలువవయ్యా రామచంద్రుని


7, సెప్టెంబర్ 2023, గురువారం

నరుడా రాముని నామము మరచి

నరుడా రాముని నామము మరచి చరియించిన మోక్షము లేదు 
హరేరామ యని యనిశము బలికిన మరల నీకు పుట్టువు లేదు  

భూమిని ధనముల నరయుచు తిరుగుచు పొందలేవు శాంతిని నీవు 
రామనామమే ధనమని తెలిసిన యేమి యశాంతియు నిక లేదు  

భూమిని సంపదలుండిన నాళుల బోలెడు మందియె బంధువులు
రాముడొక్కడే నిర్ధనునకును భూమిని బంధువు రక్షకుడు

గురూపదేశము లేని మంత్రమున కొంచమైన ఫలితము లేదు
తరింపజేయును రామమంత్రము గురూపదేశము పనిలేదు



శివుడు మెచ్చిన నామము


శివుడు మెచ్చిన నామము మాధవుడు దాల్చిన నామము
దివిజులు పొగడెడు నామము ఇది దేవదేవుని నామము

రామరామ యను నామము ఇది రక్షించే శుభనామము
కామితార్ధప్రద నామము ఇది కరుణామయు శుభనామము
క్షేమము గూర్చే నామము ఇది శ్రీపతి హరి శుభనామము
పామరు లెఱుగని నామము ఇది భవతారక శుభనామము

నారదసన్నుత నామము ఇది నారాయణు శుభనామము
శ్రీరఘురాముని నామము ఇది శ్రీకరమగు శుభనామము
ధీరులుగొలిచే నామము ఇది దివ్యమైన శుభనామము
మారజనకుని నామము ఇది మమ్మేలే శుభనామము

వనజాసననుత నామము ఇది పావనమగు శుభనామము
మునులకు హితవగు నామము ఇది మోక్షమిచ్చు శుభనామము
జనులకు ప్రియమగు నామము ఇది  జ్ఞానమిచ్చు శుభనామము
మనకు దొరికెనీ నామము ఇక మానము శ్రీరామనామము 



కరుణగలుగు రాముడవే కావటయ్యా


కరుణగలుగు రాముడవే కావటయ్యా నీ
కరుణజూప సమయ మిదే కాదటయ్యా

కలిబాధలు మిక్కుటమై చెలరేగగా యీ
యిలమీదను మాబోంట్లము నిలువలేమయా
దలకుమించు భారమా దశరథాత్మజా బా
ధలను మాకు తొలగించగ దయను జూపుట

హరేరామ యనుటకన్న ననవరతమును నీ
కరుణదొరకు దారి వేరు యిలను లేదని
పరమాత్మా నమ్మితిమి పతితపావనా శ్రీ
కర నీ వికనైనమమ్ము కటాక్షించరా

ఎత్తలేము జన్మములిక నినకులేశ్వరా ఇక
నెత్తవద్దు జన్మములని యేలపలుకవు
చిత్తగించవయ్య మనవి సీతారాముడా నీ
చిత్తము మాభాగ్యమయ్య శ్రీరాముడా 


5, సెప్టెంబర్ 2023, మంగళవారం

ఇక్కడే రాము డున్నాడు


ఇక్కడే రాము డున్నాడు - ఈశ్వరుడు వాడు 
మక్కువతో కొలిచితే మనవాడే వాడు  

చిక్కులు చీకాకులన్ని చక్కగ తొలగించు వాడు 
అక్కరలను తీర్చువాడు ఆదరించు వాడు  
రక్కసులను చీల్చువాడు చక్కని మనసున్నవాడు 
మ్రొక్కిన వరమిచ్చువాడు మోక్షమ్ము నిచ్చువాడు

సకలదేవగణములచే సన్నుతించబడువాడు
సకలలోకములకు తానె జనకుడైన వాడు
సకలకార్యములకు తానె జయమును చేకూర్చువాడు
సకలజీవులకును తానె సద్గతుల నొసంగువాడు

భూమిని సద్భక్తులకు ప్రాణనాథుడైన వాడు
సామాన్యుల పూజలతో సంతసించువాడు
ప్రేమగల గుండెలలో విడిదిచేయుచుండువాడు
రామా యని పిలచితే రానా యని పలుకువాడు



ఇంతమంచి రామనామము నెంతకాలము


ఇంతమంచి రామనామము నెంతకాలము మరచియుంటిని
ఇంతకాలము మరచియుండగ నేమికారణము
 
ఏమి కారణ మన్న వేరే యేమి కారణముండునయ్యా
భూమినుండెడి జీవులందరి బుధ్ధులన్నియు చెఱచుచుండే
పామరత్వమె కాక వేరే కారణం బేమి
పామరులకు నిలువదే గద రామనామము పైనచిత్తము

పామరత్వం‌ బనగ నేమది పామరత్వము చేత నౌరా
భూమి నుండెడి మనుజులందరి బుధ్ధులన్నియు చెడగనేలా
రామరామా దీని నణచగ నేమి చేయవలె
ఏమిసాధన మయ్యదానికి యేమిమార్గము చెప్పవయ్యా

యేమిమార్గం బన్న నొకటే యిలను దానికి మంచి మార్గము
రామకృపయే గలిగినప్పుడు పామరత్వము వదలిపోవును
ఆమహాత్ముడు సమయ మెఱిగి యాదరించేను
రామకృపచే మీకు కలుగును రామనామము పైన రక్తియు


అనుకోవయ్య మనసారా


అనుకోవయ్య మనసారా శ్రీహరిని గురించి తనివారా

హరికీర్తనమే సుఖమనుకో శ్రీహరినామము నమృతమనుకో
హరిపూజనమే వ్రతమనుకో శ్రీహరిసేవకె నాబ్రతుకనుకో
హరిభక్తులె నావారనుకో శ్రీహరినిలయమె నాయిల్లనుకో
ధరపై నాకివి చాలనుకో యందరితో పోలిక వలదనుకో

హరియే బంధువు నాకనుకో శ్రీహరియే మిత్రుడు నాకనుకో
హరియే నాథుడు నాకనుకో శ్రీహరియే లోకము నాకనుకో
హరియే దైవము నాకనుకో శ్రీహరియే సర్వము నాకనుకో
ధర నింకెవ్వరు లేరనుకో పామరులను చేరుట వలదనుకో

హరేరామ యని మది ననుకో శ్రీహరి విని నను మెచ్చే ననుకో
హరేకృష్ణ యని మది ననుకో శ్రీహరి విని నను మెచ్చే ననుకో
హరి దయ తప్పక నాదనుకో శ్రీహరి నా వాడేలే యనుకో
మరి సంసారము లేదనుకో శ్రీహరిసాన్నిధ్యము నాదనుకో


చెప్పుకోండి చూదాం - 1 (సమాధానం)

ఇచ్చిన పజిల్


  1.   3  V 1.5   =  4.5
  2.   5  V 1.25  =  6.25
  3.   6  V 1.2   =  7.2
  4.  9 V 1.125 = 10.125
  5.  11  V 1.1   = ?


దీనికి సమాధానం చూదాం ఇప్పుడు.


శర్మ గారు జిలేబీ గారు ప్రయత్నం చేసారు. ఒకరు కూడిక అన్నారు మరొకరు గుణకారం అన్నారు. ఈసందర్భంలో గుణకారం చేసినా కూడినా సరే సమాధానం మొదటి నాలుగు సమీకరణాల్లోనూ సరిపోతోంది.

సమాధానం చివరి సమీకరణానికి 12.1 అన్నది సరిపోతుంది. మీరు కూడినా గుణించినా సరే ఎడమవైపున సంఖ్యలను సమాధానం మాత్రం అదే.

ఐతే ఈవిశేషాన్ని ఎవరూ సరిగా గమనించనే లేదు త్వరగా. ఇంక దాని గురించి ఎవరూ వివరించే ప్రయత్నం మాత్రం ఎవరూ ఎందుకు చేయలేదన్న ప్రశ్న వేసుకోవటం అనవసరం.

ఐతే ఇలా ఎందుకు జరుగుతున్నదీ అన్నదానికి ఒక వివరణ ఉన్నది. n విలువ 1 కాని పక్షంలో

 



ఈ తమాషా సమీకరణమే పైన ఇచ్చిన పజిల్ తాలూకు విలువలకు మూలం.  మీకు చూపిన ఉదాహరణల్లో V  గుర్తును ఉపయోగించి వ్రాసినప్పుడు ఆగుర్తుకు ఎడమ కుడి వైపుల ఉన్న సంఖ్యలు పైన ఇచ్చిన సమీకరణం ఆధారంగా ఏర్పడ్డవి అన్నమాట.



మనం  n = 3 అనితీసుకుంటే ఎడమవైపున  ఉన్న సంఖ్య 3, V కి కుడివైపున ఉన్నది 3/(3-1) = 1.5. ఈ రెండు విలువలను మనం కూడినా గుణించినా విలువ ఒక్కటే  అది 9/2 = 4.5

చూపిన సమీకరణాల కన్న చిన్నది ఒకటుంది. n = 2 అనే విలువతో ఏర్పడేది.  n = 2, V కి కుడివైపున ఉన్నది 2/(2-1)= 2. 2 V 2 = 4 అంతే కదా, రెండును రెండుతో గుణించినా కూడినా మనకు నాలుగే కదా వచ్చేది!

ఒక చిన్న విషయం. మనం ధనాత్మకసంఖ్యలతోనే కాక ఋణాత్మకసంఖ్యలతోనూ ఇలా చేయవచ్చును. n = -3 అని తీసుకుంటే V కి కుడివైపున ఉన్నది -3/(-3-1) = -3/-4 = 3/4 = 0.75. మనం -౩ కు   0.75 ను కలిపినా గుణించినా వచ్చేది -2.25 అన్న సమాధానమే.

n = 0 అన్నది మాత్రం గణితపరంగా అసంభావ్యం. ఎందుకంటే1/0 అనేది అనంతం. దీన్ని  అనే గుర్తుతో సూచిస్తారు. అనంతం అనే భావనను అంకగణితం చేయటం కోసం వినియోగించరాదు. అది గణితపరంగా నిర్వచించటానికి వీలుకాని వ్యవహారం కాబట్టి.

ఇప్పుడు అంతా అందరికీ అవగతం ఐనదని భావిస్తాను.

4, సెప్టెంబర్ 2023, సోమవారం

వద్దనరాదురా బాలగోపాల


వద్దనరాదురా బాలగోపాల ముద్దు
ముద్దుగ నే చిన్నిముద్దు లిచ్చుచు నుండ

సుద్దులెన్ని చెప్పిన సుంత వినని వేళ
గద్దించితే నీవు కాటుకన్నులు
రుద్దుచు నిలువ విలోకించి యక్షుల
నద్దగ వచ్చితే అటునిటు తిరుగుచు 

ఆటలాడిన నీవు అలసివచ్చిన వేళ
పాటపాడుచు నేను బంగరుకొండ
మీటుగాగను నీకు మెఱుగుముద్దల వెన్న
పాటించి తినిపించ వచ్చినవేళ

చద్దిమూటను నీవు చంకను బెట్టుక 
బుద్దిగజన సురభుల వెంట ప్రేమతో
వద్దకు పిలచి నాబాహుపంజరమున
ముద్ధుగ బంధించ భువనమోహన రూప







మారే దెట్లాగండి

మారే దెట్లాగండి వీరు కలి మాయని తెలిసే దెట్లాగు
మారకపోతే వీరి బ్రతుకులు మారేది మరియింకెట్లాగు

చేరరాని వారిని చేరుచు చెడిపోతూనే ఉంటారే
కోరరానివి కోరుచు వారిని కొరివితొ తలగోక్కుంటారే

గారడిమాయలు చేసేవారిని కలిలో దేవుళ్ళంటారే
శ్రీరఘురాముని మరచి వారికే సేవలుచేస్తూ ఉంటారే

నారాయణుని మరచి తిరిగితే నరులకు మోక్షము దొరుకదుగా
శ్రీరామనామం చేదైపోతే చేరే స్థానము నరకమెగా


3, సెప్టెంబర్ 2023, ఆదివారం

చెప్పుకోండి చూదాం - 1


ఈమధ్య కష్టేఫలీ శర్మగారు మంచి పజిల్స్ ఇస్తున్నారు.

చాలా బాగుంది.


నేనూ ఒక చిన్న పజిల్ ఇస్తాను.  (మంచి రెస్పాన్స్ వస్తే మరిన్ని మంచి పజిల్స్ ఇస్తాను. ఇక పాఠకుల ఇష్టం మరి)


  1.   3  V 1.5   =  4.5
  2.   5  V 1.25  =  6.25
  3.   6  V 1.2   =  7.2
  4.   9  V 1.125 = 10.125
  5.  11  V 1.1   = ?


ఇప్పుడు  సమాధానం చెప్పండి మూడు విషయాలకు.  


  1. చివర ? అని ఇచ్చిన చోట ఉండవలసిన సంఖ్య ఏమిటి?
  2. అసలు ఇక్కడ  ఎడమవైపున ఉన్న సంఖ్యల మధ్య జరుగుతున్నది ఈ V ఏమిటి?
  3. ఇక్కడొక తమాషా ఏదన్నా గమనించారా?


ఇక మీదే ఆలస్యం.


కలిమాయ గాకున్న


కలిమాయ కలిమాయ కలిమాయ గాక
నిల నింద రీరీతి నేల చెడేరో

హరిమందిరములలో హరమందిరములలో
అరచి క్రొత్తదేవుళ్ళ కారతిచ్చేరు
పరాకున  నైన హరిహరులను దర్శింపక
నరజన్మమును వృధాపరచేరు

చిత్తమునందున్న శ్రీరామునిద్రోసి
కొత్తదేవుళ్ళను కొలువుతీర్చేరు
చిత్తుగా సేవించి చిత్తుచిత్తయ్యేరు
బత్తి దుర్వినియోగపరచేరు

మత్తుదిగు లోపల మరణము చెందేరో
మత్తుదిగిన పిదప మరి వగచేరో
ఉత్తుత్తిదేవుళ్ళ కూడిగములు చేసి
ఉత్తిత్తి ఫలముల నొందేరు



మిక్కిలి శ్రద్ధగ హరికీర్తనము

మిక్కిలి శ్రద్ధగ హరికీర్తనము చక్కగ చేయరె జనులారా
చక్కగ రామా రామా యంటే దక్కును మోక్షము జనులారా

యుగములుగా జన్మము లెత్తుచు నుండు యమాయక జనులారా
అగచాట్లుపడి అనేకజన్మము లనుభవించిన జనులారా
నిగమము లన్నియు నొకటై పొగడే జగదీశ్వరుని జనులారా
తగునని కొలువక భవచక్రంబును దాటగ లేరు జనులారా

ధరాతలంబున కలిప్రభావము దారుణమైనది జనులారా
పరాత్పరుని శుభనామ మొక్కటే పరమును జూపును జనులారా
మరేమార్గమున మంచి కొంచెమును మనకగుపడదు జనులారా
హరేరామయని హరేకృష్ణయని యనిశము పాడరె జనులారా

వాతాత్మజుని రామబ్రహ్మము బ్రహ్మనుజేసెను జనులారా
సీతాలక్మణసమేతుడైన శ్రీరఘురాముని జనులారా
ప్రీతిగ గొలిచిన మోక్షపురంబున వేడుక నుందురు జనులారా
భూతలమున నిక పుట్టరు పుట్టరు పుట్టరు నమ్ముడు జనులారా 



2, సెప్టెంబర్ 2023, శనివారం

చేరి కొలువవమ్మ నీవు చిత్తమలరగ


చేరి కొలువవమ్మ నీవు చిత్తమలరగ
ధారాధరశ్యాము డిదే దయచేసెను

నల్లపిల్లివలెను తా నిల్లిల్లు తిరుగునని
ఎల్లిదముగ పలికి నీ విల్లు వెడలించ
చల్లనైన మనసున్న స్వామి కనుక నేడు
మెల్లగాను నీ గడపను మెట్టినాడమ్మా

కల్లలాడుచున్నా డని కసరికొట్టి నీవు
నల్లనయ్య మనసునొవ్వ పెల్లునదిట్టి
ఎల్లి రాకు మీ వనుచు నెంతమాటన్నను
పల్లవోష్ఠ వా డిదిగో వచ్చినాడమ్మా

అటు కటువులాడి పంపి యిటు కనుల నీరిడి
కటకట పడుచుంటి వీవు కమలలోచన
యిటులౌదు వని యెఱిగి యెంతో దయ చూపి
కుటిలాలక వచ్చెను నీ గోవిందుడమ్మా


1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

కోటలు వేడను పేటలు వేడను


కోటలు వేడను పేటలు వేడను
మాటే కద యిమ్మంటినిరా

తనివితీరగను నిను సేవించిన 
తనువును మనసును మనుజులకిచ్చి
మనజాలను గావున నీపదముల
నను వ్రాలగ నిమ్మని యడిగితిని

వరాలమూటలు పంచే వాడా
మరేల నాకొక మాటీయవురా
హరి నే వేడితి  ధరపై పుట్టువు
మరింక లేదను మాటేకదా

నరుల కష్టముల నెఱిగిన వాడా
నరుడై వెలసిన నారాయణుడా
కరుణామయుడా కాదనకీరా
హరి శ్రీకృష్ణా యడిగిన మాట 


నీలిమేఘ మొకటి నిలువునామముబెట్టి

 

నీలిమేఘ మొకటి నిలువునామముబెట్టి 
నేలకు దిగివచ్చె నెమలిఫించము గట్టి

వాలెనె నాముందు బాలా నిన్నటి రాత్రి
ఏలాగు వివరింప జాలుదునే యపుడు
చాలసేపటి వరకు కాలమే తెలియని
మేలైన స్థితి కలిగె నీలాలక వినుము

దానాలు ధర్మాలు దండిగ జేసిన
వేనవేలేండ్లుగ మౌనియై యుండిన
తాను రాడట మనసు తనకంకితము జేసి
ధ్యానించినందుకే యవతరించేనట

తనువునాదను భ్రాంతి మనసున లేదాయె
మనసు నాదను భ్రాంతి మటుమాయమైపోయె
విను మేను వాడగుచు విహరించినది నిజము
తనదాయె నాయాత్మ ధన్యనైతిని చెలియ