18, సెప్టెంబర్ 2023, సోమవారం

నరులార సంసారనరకబాధితులారఈనాటి రామకీర్తన నిజానికి శుక్రవారం15వ తారీఖు నాటిది.

ఆనాడు ఆపరేషన్ జరిగింది నాకు. గుండెకు ఒక స్టెంట్ వేసారు. ఒక బెలూన్ కూడా పెట్టారు.

ఆపరేషన్ జరుగుతున్న సమయంలో వచ్చిన రామకీర్తన యిది. 

పైన ఉన్న ఫోటో శనివారం నాడు నన్ను గదికి మార్చిన తరువాత మాచెల్లెలు లక్ష్మి తీసినది. అందరికీ నేను కులాసాగానే ఉన్నానని సందేశం పంపటానికి తీసినది అన్నమాట.

నిన్ననే  ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చాను.

వీలు చూచుకొని ఈకీర్తనను ఇప్పుడు ప్రకటిస్తున్నాను.


నరులార సంసారనరకబాధితులార

శిరసువంచి వందనము చేయరే రామునకు


మరల మరల మాకు గర్భనరక మీయకుండు మని

మరల భూమిమీద పడి తిరుగకుండ జేయు మని

మరల దుర్మాన మొంది మొఱుగకుండ జేయు మని

పరమవినయపరు లగుచు ప్రార్ధింప దొడగరే


మరల దుష్టమతులజేరి మసలకుండ జేయు మని

మరల క్షణికసౌఖ్యములను మఱుగకుండ జేయు మని

మరల మోహపాశములను మమ్ము కట్టకుండు మని

పరమభక్తిపరవశులై  ప్రార్ధింప దొడగరే


హరేరామ యందుమని హరేకృష్ణ యందుమని

హరేజనార్దనాయని యందుము కరుణించుమని

పరమపురుష నీకు గాక పరులకెపుడు మ్రొక్కమని

పరమపదము నీయుమని ప్రార్ధింప దొడగరే10 కామెంట్‌లు:

 1. ఓం
  త్రయంబకం యజామహే
  సుగంధిం పుష్టివర్ధనం
  ఊర్వారుకమివబన్ధనాత్
  మృత్యో ముక్షీయమామృతాత్

  దీర్ఘాయుష్మాన్భవ
  శీఘ్రమే ఆరోగ్య ప్రాప్తిరస్తు
  సుఖినో భవంతు
  సమస్తసన్మన్గళాని భవంతు.
  నిత్య శ్రీ రస్తు
  నిత్య మంగళాని భవంతు

  రిప్లయితొలగించండి

 2. శ్యామలరావు గారు,
  స్టెంట్ వేసారా? చిన్న సమస్యే అయ్యుంటుంది లెండి. మీరు త్వరగా కోలుకుంటారు.

  మీకు నాకన్నా వయసులో కాస్త చిన్నవారే కాబట్టి పైన శర్మ గారిచ్చిన ఆశీర్వాదమే నాదిన్నూ ✋.

  రిప్లయితొలగించండి
 3. కలలోన నీ తలపే.. కలవరమందైన నీ తలపే .. అన్నట్లుగా రామ నామంతో మీ జీవితం ధన్యం అయింది...

  ఆరోగ్యం జాగ్రత్త ..శ్యామలరావు గారూ


  రిప్లయితొలగించండి
 4. శర్మ గారు, విన్నకోట వారు, శ్రీనివాస్ గారు
  మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు.
  ఓపిక చాలినంతగా ఉండటం లేదు. అందువలన ఆలస్యం ఐనది స్పందించటం.

  రిప్లయితొలగించండి
 5. ఫరవాలేదు, శ్యామలరావు గారు. జవాబు అంత ముఖ్యం కాదు. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. అది ముఖ్యం.

  రిప్లయితొలగించండి
 6. ఇంకో 14 సంవత్సరాలు మీకేం ఢోకా లేదు. తర్వాత ఇంకోటి వేసుకోవొచ్చు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిరు గారు, ధన్యవాదాలు.
   మరొక 14సం. వేసుకోవాలండీ.
   అప్పుడు సరిగ్గా శతమానం భవతి.

   తొలగించండి
 7. సర్, ఇప్పుడే ఈ పోస్ట్ చూసాను. త్వరగా కోలుకోవాలని రాముణ్ణి వేడుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగానే కోలుకుంటున్నానండీ.
   మెషీన్ పాతబడింది కదా. రిపేర్ వర్క్ అవసరం అయిందన్నమాట.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.