5, సెప్టెంబర్ 2023, మంగళవారం

ఇంతమంచి రామనామము నెంతకాలము


ఇంతమంచి రామనామము నెంతకాలము మరచియుంటిని
ఇంతకాలము మరచియుండగ నేమికారణము
 
ఏమి కారణ మన్న వేరే యేమి కారణముండునయ్యా
భూమినుండెడి జీవులందరి బుధ్ధులన్నియు చెఱచుచుండే
పామరత్వమె కాక వేరే కారణం బేమి
పామరులకు నిలువదే గద రామనామము పైనచిత్తము

పామరత్వం‌ బనగ నేమది పామరత్వము చేత నౌరా
భూమి నుండెడి మనుజులందరి బుధ్ధులన్నియు చెడగనేలా
రామరామా దీని నణచగ నేమి చేయవలె
ఏమిసాధన మయ్యదానికి యేమిమార్గము చెప్పవయ్యా

యేమిమార్గం బన్న నొకటే యిలను దానికి మంచి మార్గము
రామకృపయే గలిగినప్పుడు పామరత్వము వదలిపోవును
ఆమహాత్ముడు సమయ మెఱిగి యాదరించేను
రామకృపచే మీకు కలుగును రామనామము పైన రక్తియు