27, సెప్టెంబర్ 2023, బుధవారం

హరిని పొగడరే మీరు తరుణులారా

 

హరిని పొగడరే మీరు తరుణులారా మరి యెవరిని పొగడెదరో తరుణులారా

దశరథరాముడని తరుణులారా మీరు తనివారగ పొగడరే తరుణులారా
దశకంఠమర్దనుడని తరుణులారా మీరు తరచుగాను పొగడరే తరుణులారా
యశోవిశాలుండని తరుణులారా మీరు దిశలు మ్రోగ పొగడరే తరుణులారా
ప్రశమితేంద్రియుడని తరుణులారా మీరు పదేపదే పొగడరే తరుణులారా

ధరణిజాపతియని తరుణులారా మీరు పరమాత్ముని పొగడరే తరుణులారా
నరనాథవరుడని తరుణులారా మీరు నతవత్సలు పొగడరే తరుణులారా
కరుణాసముద్రుడని తరుణులారా మీరు కడువేడ్కను పొగడరే తరుణులారా
సరిలేని వీరుడని తరుణులారా మీరు చక్కగాను పొగడరే తరుణులారా

వనజాయతాక్షుడని తరుణులారా మీరు భక్తిమీఱ పొగడరే తరుణులారా
ఘనశ్యాము డితడని తరుణులారా మీరు ఘనముగాను పొగడరే తరుణులారా
ఇనవంశతిలకుడని తరుణులారా మీరు ఇంపుగాను పొగడరే తరుణులారా
మన తండ్రి రాముడని తరుణులారా మీరు మనదేవుని పొగడరే తరుణులారా


3 కామెంట్‌లు:

 1. ఈ కీర్తనతో రామకీర్తనలు 2100 సంపన్నం ఐనవి.

  రిప్లయితొలగించండి
 2. అభినందనలు, శ్యామలరావు గారు.
  మీరు ధన్యజీవులు.

  రిప్లయితొలగించండి
 3. మీరూ శర్మగారూ వంటి పెద్దల ఆశీర్వాదాల బలంతోనే ఈబండి నడుస్తోందండీ. మీకు నా ధన్యవాదాలు.

  స్టెంట్ వేసిన తరువాత రేపు రివ్యూ ఉంది డాక్టరు గారితో. కావలసిన టెస్టులన్నీ చేయించుకొని రిపోర్టులన్నీ తీసుకొని సిధ్ధంగా ఉన్నాను. రిపోర్టులను చూస్తే ఔషధాలలో కొధ్ధిమార్పులు ఉంటాయని అనిపిస్తోంది. చూడాలి డాక్టరు గారు ఏమి చెబుతారో మరి.

  రామకీర్తనల సంఖ్య మరొక మైలు రాయిని దాటింది. వ్రాయిస్తున్నవాడు రాముడే అన్న స్పృహ ఉన్న పిదప ఈమైలురాళ్ళూ వీటిని దాటటం వంటివి కేవలం లౌకిక భావనలు మాత్రమే. అసలు సంతోషం ఈకార్యక్రమం కొనసాగుతూ ఉండటంలోనే ఉందన్న గమనికలో ముఖ్యమండీ.

  ఇవి రాముడూ ఆయన భక్తులు కొందరూ ఆదరిస్తున్నారు - అది చాలు నాకు. సామాన్యజనం అంతా ఆదరించాలన్న దురాశ లేదు నాకు.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.