10, సెప్టెంబర్ 2023, ఆదివారం

హరేరామ యనండీ హరేకృష్ణ యనండీ


హరేరామ యనండీ హరేకృష్ణ యనండీ
మరే యితరనామము మనకు వద్దండీ

మరే యితరమంత్రమును మనకేలండీ
మరే యితరదైవమును మనకు వద్దండీ
సరాసరి మోక్షమిచ్చు హరినామమే
దొరికినది అదేచాలు త్వరపడ రండీ

కలియుగమున కొల్లలే కదా దైవంబులు
తెలియలేరు కల్లనిజము తెలివిలేక
తెలివిగలిగి హరినామ దీక్షను గొని
నిలువకున్న మోక్షము కలుగ బోదండీ

భూతప్రేతముల గొలిచి బుధ్ధిహీనులై
భూతలనరకముల నలిగి పోవనేల
ప్రీతితో హరినామము విడువకున్న
ఈతిప్పల నుండి మోక్షమే కలుగునండీ