28, సెప్టెంబర్ 2023, గురువారం

రామభజన చేయరే


రామభజన చేయరే రామభజన మనకు
రాముని కనుపింపజేయు రామభజన

రాగద్వేషముల నణచు రామభజన మనకు
భోగభాగ్యముల నిచ్చు పుణ్యభజన
రాగతాళయుక్తమైన రామభజన నాద
యోగమై ధరణి మీద నొప్పు భజన

సుజనకోటిహృదయంబుల జొచ్చు భజన రేగి
కుజనకోటి గుండెలలో గ్రుచ్చు భజన
భజనపరులకెల్ల సుఖము పంచు భజన ధర్మ
విజయశంఖారావమైన వీరభజన

హనుమంతుడు చేయుచుండు నట్టి భజన విభీ
షణుడు సర్వవేళలను సలుపు భజన
మనోహరంబైయుండెడు మంచి భజన శివుడు
మనసులోన చేయుచుండు మహితభజన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.