21, సెప్టెంబర్ 2023, గురువారం

తప్పులున్న మన్నింపుము


తప్పులున్న మన్నింపుము దశరథరామా నీవు

చెప్పినట్లు నడచుకొందు సీతారామా


సాకేతాధిపుడ నన్ను జానకిరామా ప్రోచు

దాక పాదములను విడువ దశరథరామా

పాకశాశనాదివినుత భండనభీమా నిన్ను

తాకి దుష్టులణగిరయ్య దశరథరామా


చండశాశనుడవు నీవు జానకిరామా నన్ను

దండించక దయజూడుము దశరథరామా

అండవునీ వొక్కడవే అయోధ్యరామా కై

దండనిచ్చి నన్నేలుము దశరథరామా


జననమాది నీభక్తుడ జానకిరామా నేను

ధనాశను విడచితినిక దశరథరామా

నినువినా యొఱులనెఱుగ నీరజశ్యామా కుదర

దనక నన్ను కావవయ్య దశరథరామా


1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.