9, సెప్టెంబర్ 2023, శనివారం

కోరికలు లేని వారు కోదండరాముని


కోరికలు లేని వారు కోదండరాముని
కోరికోరి నేడిదే కొలుచుచున్నారు

నగుమోము కలవాడు నలువకు తండ్రి
జగదీశు డైనవాడు జానకీరాముడై
యగుపడగా సద్భక్తి నంజలి ఘటియించి
సొగసైన పలుకుల సొంపుగా నుతించి

పీతాంబరము గట్టి చిన్నిచిన్ని నగవుల
వీతరాగక్రోధుడు వేదాంతవేద్యుడు
సీతాపతి యగుపడగ చేరిసద్భక్తితో
ప్రీతిమీరగ పొగడి వేడుక చెలువార

భక్తపరిపాలనాపరాయణు డాతడు
ముక్తులను చేయగ ముచ్చటగ సుజనుల
శక్తికొలదిగ కొలిచి సంతసించుటే గాని
యుక్తమని వేరేమి యొసగమందు రిపుడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.