7, సెప్టెంబర్ 2023, గురువారం

శివుడు మెచ్చిన నామము


శివుడు మెచ్చిన నామము మాధవుడు దాల్చిన నామము
దివిజులు పొగడెడు నామము ఇది దేవదేవుని నామము

రామరామ యను నామము ఇది రక్షించే శుభనామము
కామితార్ధప్రద నామము ఇది కరుణామయు శుభనామము
క్షేమము గూర్చే నామము ఇది శ్రీపతి హరి శుభనామము
పామరు లెఱుగని నామము ఇది భవతారక శుభనామము

నారదసన్నుత నామము ఇది నారాయణు శుభనామము
శ్రీరఘురాముని నామము ఇది శ్రీకరమగు శుభనామము
ధీరులుగొలిచే నామము ఇది దివ్యమైన శుభనామము
మారజనకుని నామము ఇది మమ్మేలే శుభనామము

వనజాసననుత నామము ఇది పావనమగు శుభనామము
మునులకు హితవగు నామము ఇది మోక్షమిచ్చు శుభనామము
జనులకు ప్రియమగు నామము ఇది  జ్ఞానమిచ్చు శుభనామము
మనకు దొరికెనీ నామము ఇక మానము శ్రీరామనామము కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.