5, సెప్టెంబర్ 2023, మంగళవారం

అనుకోవయ్య మనసారా


అనుకోవయ్య మనసారా శ్రీహరిని గురించి తనివారా

హరికీర్తనమే సుఖమనుకో శ్రీహరినామము నమృతమనుకో
హరిపూజనమే వ్రతమనుకో శ్రీహరిసేవకె నాబ్రతుకనుకో
హరిభక్తులె నావారనుకో శ్రీహరినిలయమె నాయిల్లనుకో
ధరపై నాకివి చాలనుకో యందరితో పోలిక వలదనుకో

హరియే బంధువు నాకనుకో శ్రీహరియే మిత్రుడు నాకనుకో
హరియే నాథుడు నాకనుకో శ్రీహరియే లోకము నాకనుకో
హరియే దైవము నాకనుకో శ్రీహరియే సర్వము నాకనుకో
ధర నింకెవ్వరు లేరనుకో పామరులను చేరుట వలదనుకో

హరేరామ యని మది ననుకో శ్రీహరి విని నను మెచ్చే ననుకో
హరేకృష్ణ యని మది ననుకో శ్రీహరి విని నను మెచ్చే ననుకో
హరి దయ తప్పక నాదనుకో శ్రీహరి నా వాడేలే యనుకో
మరి సంసారము లేదనుకో శ్రీహరిసాన్నిధ్యము నాదనుకో


1 కామెంట్‌:

 1. ఈకీర్తన మధ్యాహ్నం రెండుగంటలకు వచ్చింది. వెంటనే దీనిని గ్రంథస్థం చేయటం జరిగింది. ఐతే రేపు ఉదయం ప్రకటించాలని అనుకున్నాను కొన్ని కారణాలవలన.

  కాని అలా ప్రకటనను వాయిదావేసినది మొదలుగా అపరాథభావన మొదలై పెరుగసాగింది. ఈకీర్తనకు నేనా కర్తను?

  ఆయన దివ్యసంకల్పం మేరకు వచ్చిన కీర్తనను నా యిఛ్చానుసారం వాయిదావేసి తీరిగ్గా ప్రకటించే హక్కు నాకెక్కడిది?

  అలాంటి హక్కు ఉందని అనుకోవటం అంటే ఆయన సంకల్పం మీద నాపెత్తనాన్ని జోడించటమే కదా?

  ఇంతవరకూ ఏకీర్తన వచ్చినా అది ఏ అర్ధరాత్రి లేదా అపరాత్రి వచ్చినా వెంటనే గ్రంథస్థం చేసి ప్రకటిస్తూ ఉన్నాను. ఆవిషయం దయచేసి చదువరులు నమ్మ కోర్తున్నాను. ఇప్పుడు నియతి మీరి, నాకీర్తన - నాయిష్టం, రేపు తీరిగ్గా ప్రకటిస్తానూ నాకారణాలు నాకున్నాయీ అనటం రాముడికి ధిక్కారస్వరం వినిపించటమే అవుతుంది కదా?

  అందుచేత ఈకీర్తనను ప్రకటిస్తున్నాను. ఇప్పటికే కొంచెం ఆలస్యం ఐనది. క్షంతవ్యుడను.

  నాహం కర్తాః హరిః కర్తా
  తత్పూజా కర్మ చాఖిలం
  తదాపి మత్కృతా పూజా
  తత్ప్రసాదేన నా అన్యథా

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.