8, ఫిబ్రవరి 2024, గురువారం

అన్నలార


అన్నలార చాల యెఱుక యున్నవా రనిపించును

చిన్నచిన్న సందేహము లున్నవి మాకు


కన్నారా శ్రీహరిని కనులారా యెటనైనా

కన్నాము హరి యయోధ్య నున్నాడు రాముడై


కన్నారా శ్రీలక్ష్మిని కనులారా యెటనైనా

కన్నాము జగన్మాత కలదచట సీతయై


కన్నారా శివదేవుని కనులారా యెటనైనా

కన్నాము శివు డచట నున్నాడు హనుమయై


కన్నారా మీరు హ‌రిని కన్నారా మీరు శివుని

కన్నారా శ్రీలక్ష్మిని కడు ధన్యులు మీరు


కన్న దెపుడు శ్రీహరిని కనులార యయోధ్యను

కన్నాము మారాముడు గద్దెకెక్కిన వేళ


ఎన్నటిదో ఆముచ్చట ఏనాటివారు మీరు

ఇన్నాళ్ళుగ నున్నారా ఎంత వింతగు మాట 


వెన్నుని ఆనాటి సభను వీక్షించిన ఆనందము

ఎన్ని జన్నలెత్తి యైన ఎన్నటికిని మరువము


నిన్నమొన్నటి ముచ్చటగా నున్నదా భాగ్యము మే

మెన్నటికి తలచుకొనగ నీధర ప్రభవింతుము


ఎన్ని జన్మ లెత్తితిరో ఈనాటి వరకు మీరు

ఎన్నజన్మ  లైన నేమి ఈశ్వర స్పృహ యున్న

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.