16, జనవరి 2016, శనివారం

కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 5

నారాయణాపరస్వరూపమైన అర్జునుడి సంగతి తెలియక అత్యుత్సాహంతో‌ అతడిపై తలపడటానికి సాహసించి పరాభూతులై చట్రాతిపై కొట్టిన కుండ పెంకుల్లా తలొక దిక్కుకూ పరుగెడుతున్న ప్రమథగణాల్ని వారి నాయకుడైన దేవసేనాని కుమారస్వామి మందలిస్తున్నట్లుగా భారవి మహాకవి వ్రాస్తున్న అద్భుతమైన శ్లోకాల్ని చదువుతున్నాం.

కుమారస్వామి ఇలా అంటూన్నాడు. రాక్షసులతో ఒక ఆటలాగా యుధ్ధం చేసే మీ‌ శౌర్యం అంతా ఏమయ్యింది? మీ పరువు మీరే తీసుకుంటున్నారే! మీ‌రు అప్యాయంగా పదునుపెట్టుకున్న మీ కత్తుల తళతళలు మీ ముఖం మీదే పడుతూ‌ మిమ్మల్ని పరిహాసం చేస్తున్నాయే. ధనుర్భాణాలు ధరించి కూడా రక్షణ కోసం అడవిలో దారులు వెతుక్కుంటూ పరిగెడుతున్నారా

మీగురించి మీరు గొప్పగా భావించుకుంటారే. అదంతా చెడింది కదా? శివగణాలుగా మీకు లోకాల్లో వ్యాపించి ఉన్న కీర్తి అంతా మాయమైపోయి నట్లేనా? ఏ మంత గొప్ప ఆపద ముంచుకొచ్చిందని యుధ్ధం నుండి పారిపోతున్నారూ? ఇలా పారిపోవటం ఎంత పాప కార్యం. మీ వలన సదాశివుడికే చెడ్డపేరు వస్తోంది కదా?!

నాసురోఽయం‌ న వా నాగో
ధరసంస్థో న రాక్షసః
నా సుఖోఽయం నవాభోగో
ధరణిస్థోహి రాజసః


న+అసురః+అయం --> నాసురోఽయం అవుతుంది. ఇక్కడ, అయం అంటే ఇతడు అని అర్జునుడిని ఉద్దేశించి చెప్పటం. అసురః న అంటే దైత్యుడు కాడు. న + వా +‌నాగో -> నవానాగో అంటే నాగుడు కాదు. అంటే ఏ వాసుకియో ఆదిశేషుడో వంటి నాగేంద్రుడు కాదు అని. ధరసంస్థో అంటే ధర (భూమి) మీద ఉన్న, రాక్షసః న అంటే రాక్షసుడు కాదు. ధరసంస్థ అంటే భూమిమీద ఉండేది పర్వతం కదా అన్న అర్థంలో పర్వతం‌ లాంటి రాక్షసుకుడు కాదు అనటం  సుఖః + అయం -> సుఖోయం అంటే ఇతడు సుఖంగా (సులభంగా) గెలువ తగినవాడు. ఎందుకంటే ధరణిస్థః అనగా భూమిమీద బతికే వాడే కాని దివ్యుడు కాదు. న రాజసః -> రజోగుణం‌ పండిన వాడు కాదు (తపస్వికదా). నవ + అభోగః -> కొత్తగా తెలియనిది (యుధ్ధం) ప్రయత్నిస్తున్నవాడు.

భావం చూదాం. కుమారస్వామి ఏమని మందలిస్తున్నారంటే ప్రమథుల్ని, ఇతను దైత్యుడు కాదు,  పర్వతం లాంటి రాక్షసుడూ కాడు. ఏ మహానాగుడూ‌ కాదు. కేవలం‌ ఒక భూలోకవాసి ఐన మనిషి మాత్రమే. ఇతను తపస్సు చేసుకునే వాడే కాని యుధ్ధాల వంటి పౌరుషవిద్యల్లో ఆరితేరిన వాడు కాదు. కేవలం కొత్తకొత్తగా యుధ్దవిద్యను ప్రయత్నిస్తున్న వాడు మాత్రమే. ఇంత మాత్రానికే బెదిరి పరెగుత్తుతారా అని ప్రమథుల్ని గద్దించటం అన్నమాట.

ఈ శ్లోకంలో మొదట చెప్పుకోవలసిన విశేషం అసుర, రాక్షస అన్న రెండు మాటల్ని కవి వాడటం. సామాన్యంగా ఈ మాటల్ని సమానార్థప్రతిబోధకాలుగా వాడతాం కాబట్టి ఒకే అర్థం వచ్చే మాటల్ని రెండు వాడటం పునరుక్తి అనే దోషం కదా అన్న అనుమానం వస్తుంది అందరికీ. అది నివృత్తి చేసుకోవాలి.

సురలు అసురలు అని దేవయోనులు రెండురకాలు. సురలు అంటే దేవతలు అదితి సంతానం. వీళ్ళని ఆదిత్యులు అని అందుకే పిలుస్తారు. అసురలు అంటే దితి సంతానం. అందుకని వీళ్ళని దైత్యులు అని అంటారు. ఇకపోతే దనువు అనే వాడి సంతతిని దానవులు అని పిలుస్తారు. కశ్యపప్రజాపతికి సురస అనే ఆమె వలన జన్మించిన వారు, యక్షులు, రాక్షసులు అని రెండు జాతులు. సురస సంతానంలో ఆకలి బాధతో కొందరు యక్షామ అని మరికొందరు రక్షామ అని గోలచేసారు. వాళ్ళూ, వాళ్ళ సంతతి వాళ్ళూ యక్షులూ‌ రాక్షసులునూ అయ్యారు.కాని సామాన్యంగా అందరినీ కలేసి పిలుస్తూ ఉంటాం దానవులనీ రాక్షసులనీ, దైత్యులనీ.

ఇప్పుడు ఈ‌శ్లోకంలో చెప్పుకోవలసిన రెండవదీ ముఖ్యమైనదీ‌ అయిన విశేషం, బంధకవిత్వం. బంధకవిత్వం అనేది చిత్రకవిత్వ ప్రక్రియల్లో ఒకటి. ఒక పద్యాన్నో శ్లోకాన్నో ఒక పజిల్ వంటి అమరికలో పేర్చి చూపటం బంధకవిత్వం అవుతుంది.   ఇక్కడ ఈ‌ శ్లోకంలో‌ భారవి మహాకవి చూపిన బంధకవిత్వ విశేషం గోమూత్రికాబంధం.


నా
సు
రో
యం

వా
నా
గో


సం
స్థో

రా
క్ష
సః

X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
నా
సు
ఖో
యం

వా
భో
గో


ణి
స్థో
హి
రా

సః


ఈ గోమూత్రికా బంధం ఒక తేలికైన బంధం. మీరు మొదటి రెండు పాదాలను ఒక వరుసగానూ చివరి రెండు పాదాలనూ ఒక వరుసగానూ వ్రాయండి. పై వరుస మొదటి అక్షరం, తరువాత క్రిందివరుస రెండవ అక్షరం, మళ్ళా పై వరుస మూడవ అక్షరం అలా కలిపి చరివితే అది పై వరుస అవుతుంది. (పైన పటంలో నీలం రంగులొ చూపిన అక్షరక్రమంలో చదవండి) అలాగే క్రిందివరుసనుండి అలాగే క్రిందికీ పైకీ అక్షరం మార్చి అక్షరం చదువుతూ పోతే మళ్ళా అది క్రింది పాదమే అవుతుంది. (పైన పటంలో ఆకుపచ్చరంగు అక్షరాలను క్రమంలో చదవండి).

ఇలా గోమూత్రికా బంధం కురరాలంటే పైవరుసలో సరిస్థానాల్లోని(2,4,6...) అక్షరాలు క్రింది వరుసలోని సరిస్థానాల్లోని(2,4,6...) అక్షరాలతో సరిగ్గా సమానంగా ఉండాలి.

ఈ విధమైన బంధానికి గోమూత్రిక అని పేరెందుకు వచ్చిందీ అన్న సందేహం వస్తుంది కదా.  గోజాతి నడుస్తూ మూత్రవిసర్జన చేసినప్పుడు క్రింద తన్మూత్రం చేసే చిత్రాకృతి ఇంచుమించు ఇలా ఉంటుంది కాబట్టి ఈ బంధానికి గోమూత్రిక అన్న పేరు.

నిజానికి ఈ‌ గోమూత్రికా బంధాన్ని మరికొంచెం జటిలంగా కూడా వ్రాస్తారు. పైన ఇచ్చిన పటంలో మధ్యవరుసలో X అనే గుర్తు పెట్టి చూపటం గమనించారు కదా.  ఆ స్థానాల్లో X బదులుగా అక్షరాలు వచ్చేలా వ్రాస్తే అది కూడా గోమూత్రికా బంధమే కాని వ్రాయటంలో ప్రయాస హెచ్చుగా ఉంటుంది.

అలాంటి జటిలమైన గోమూత్రికా బంధానికి ఉదహరణ ఒకటి మన ముక్కు తిమ్మన్న గారి పారిజాతాపహరణంలో ఉంది.

కం. విదళితదైత్య రమాగృహ
పదసారస వినతదేవ పతగేశహయా
చిదమిత చైత్యశమావహ
మదసరణ విమలభావమతపాశజయా (5-94) 

వి
ళి
దై

గృ

సా


దే

గే









త్య
మా



వి




యా




చి
మి
దై



వా


భా

పా








ఈ రకమైన గోమూత్రికాబంధాన్ని చదివే విధానం ఏమిటంటే పైవరుసలోని ప్రతి అక్షరం తరువాత మధ్యవరుసలోని అక్షరం వస్తుంది. అలాగే క్రిందివరసలోని ప్రతి అక్షరం తరువాత మధ్యవరుసలోని అక్షరం వస్తుంది. అంటే మధ్యవరుసలోని అక్షరాలు పైవరుసకీ క్రిందివరుసకీ కూడా సమంగా వర్తిస్తాయన్నమాట.  పై కందపద్యం ఒక సారి పరిశీలనగా చూడండి. సరిస్థానాల్లో మొదటి రెండు పాదాల్లో ఏఏ అక్షరాలున్నాయో సరిగ్గా అవే స్థానాల్లో అవే అక్షరాలు క్రింది రెండు పాదాల్లోనూ‌ ఉన్నాయి కదా.

బారవి మనమీద దయతలచి గోమూత్రికాబంధాన్ని రెండుపేటల్లో అల్లితే ముక్కు తిమ్మనార్యుడు మరో రెండాకులు ఎక్కువ చదివి నట్లున్నాడు. ఏకంగా తిమ్మన్నగారు మూడుపేటల గోమూత్రికాబంధం వ్రాసారు.