29, మార్చి 2018, గురువారం

పడిన కష్ట మేదో నేను పడనే పడితి


పడిన కష్ట మేదో నేను పడనే పడితి ఈ
పడరాని యిడుము లింక పడనీయ కోయీ

అట లేని వేవైనా యిట నున్నవా యని
తటపటాయించక ధరకు దిగితిని
స్ఫుటమైన తెలివిడి మటుమాయ మాయె
కటువులాడక నన్ను కావవోయి

రాముడవై దీనుల రక్షించ నెంచి
నామమంత్రము నిచ్చి నావోయి
నా మొఱ విను చుండు నారాయణ నా
స్వామి నీ దయయే చాలునోయి

చెడిన జన్మము లేవొ చెడనే చెడెను
చెడిపోక నిలుచు దారి చెప్పవోయి
గడితేరి యికనైన ఘనుడ తొల్లింటికి
నడచి రానీవోయి నా స్వామీ



28, మార్చి 2018, బుధవారం

రాకాసులను గూడ రాము డాకర్షించె


రాకాసులను గూడ రాము డాకర్షించె
చేకొనుమని యార్తితో చేరి రతనిని

చుప్పనాక యన్నది చూడను చక్కనిదా
చెప్పరాని చెడుగుల చీడ రాకాసి
అప్పటికిని అది యెక ఆడుది కాకున్నదా
చప్పున శ్రీరాముని చాల మోహించినది

మారీచుడున్నాడు మరి వాడు రాక్షసుడు
శ్రీరామవిభు ధర్మశీల మెఱిగెను
ఆ రావణుడు వచ్చి యదిలించి నందున
శ్రీరామబాణాహతి కోరిచేరినాడు

దర్మేతరులమధ్య ధర్మి విభీషణుడు
నిర్మలుడై యన్నకు నీతిచెప్పెను
దుర్మతి రావణుడు త్రోలగా పురినుండి
ధర్మావతారుని దరిజేరి మురిసెను


వినువారి విననిమ్ము వీనులవిందుగా



(కల్యాణి)


వినువారి విననిమ్ము వీనులవిందుగా
నిను గొప్ప జేసెడి ఘనమైన పలుకులు

జననుత శ్రీరామచంద్రదేవ యని
మునిజననుత యని మోక్షదాయక యని
యనుదినమును నిన్ను మనసార భక్తులు
వినయమున పొగడ తనివి తీరెడు నట్లు

వేదరూపుడవని విజ్ఞానఖనివని
వేదాంతగోచర విమలసత్యమ వని
నీదైన తత్త్వము నిరతము యోగులు
లో దలచి  పొగడగ నాదమరచి యుండి

ఎల్లలోకములకు నీశుడ వీవని
తల్లివి తండ్రియు నెల్లర కీవని
చల్లగ పాడగ సాధుజనావళి
యుల్లము నుండి పెల్లుబుక నుత్సాహము


27, మార్చి 2018, మంగళవారం

దేవుడు రాముడు దేహాలయమున


దేవాలయ మీ దేహమందు విక దేవుడెవ్వరో చెప్పవయా
దేవుడు రాముడు దేహాలయమున జీవుడు రాముని పూజారి

జీవులందిరి దేహము లందున దేవుడెందుకు నిలచునయా
జీవుడు దేవుని చిత్కళ గావున దేవుడు జీవుని విడువడయా
దేవుడు తనలో కొలువై యుండగ జీవున కెందుకు తిప్పలయా
దేవుడు తనలో కొలువైనాడని జీవుడు మరచుట ఛేతనయా

దేహాలయమే రామాలయమను యూహ చక్కగా నున్నదయా
ఊహాపోహము లనరాదయ్యా ఉన్న సంగతిని తెలిపితిని
దేహములోపల నుండు దేవుని తెలియు విధంబును చెప్పవయా
దేహమె నేనను భ్రాంతిని విడచిన దేవుని తెలియగ నగునయ్యా

ఎంతో చక్కని సత్యము చెప్పితి విందుకు ఋజువును చూపవయా
సంతోషమయా భగవద్గీతాశాస్త్రము ఋజువులు చూపునయా
చింతలుడిగి ఆ హృదయేశ్వరుని చింతించిన ఫలమేమిటయా
సంతత మటుల చింతించినచో చక్కగ మోక్షము కలుగునయా


26, మార్చి 2018, సోమవారం

ఏది ముఖ్యమో నీ కెఱుకగుట ముఖ్యము


ఏది ముఖ్యమో నీ కెఱుకగుట ముఖ్యము
నీ దైన యొఱుకయే నీకు ముఖ్యము

కనుగొనరాని వాని కనులజూచుట కాదు
మనసులో చూచుటే ముఖ్యము
తనమనసున స్వామి దయచేసి యున్నచో
తనకు లోక మేమంత ముఖ్యము

విరివిగా పూలు తెచ్చి విసిరితే సరిపోదు
మరి రాముని వాడగుటే ముఖ్యము
పరమప్రీతితో నిన్ను పరమాత్ముడు మెచ్చ
నరులమెప్ప దేమంత ముఖ్యము

దినదినము స్వామిపై దివ్యమైన కీర్తనలు
మునుకొని చెప్పుటే ముఖ్యము
తనస్వామికి తనపాట మనసుకు నచ్చుచో
గొనుగు లోక మేమంత ముఖ్యము


25, మార్చి 2018, ఆదివారం

శ్రీరామపట్టాభిషేక సంకీర్తనలు సంపన్నం ఐనవి


శ్రీరామభక్తమహాశయులారా

 ఉగాది పర్వదినం ఐన 18వ తారీఖునుండి ప్రారంభమైన శ్రీరామనవరాత్రాల సందర్భంగా శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని వివరిస్తూ విరచించబడి ఈ పట్టాభిషేక సంకీర్తనం నేటితో సంపన్నం ఐనది.

అందరి సౌకర్యం కోసమూ ఈ సంకీర్తనలను ప్రత్యేకంగా ఒక టపాగా పొందుపరచి చూపుతున్నాను. క్రింది పట్టికను గమనించండి. ఇందులో ఇవ్వబడిన కీర్తన సంఖ్య అనేది ఈ సంవత్సరంలో వచ్చిన కీర్తనల వరుససంఖ్య అని గమనించ ప్రార్థన.




452018-03-18ఈరోజు నుండి మహిత శ్రీరామ నవరాత్ర మారంభము
462018-03-18కనుడి సింహాసనంబున
472018-03-19పరమాత్ముడు రాముని పట్టాభిషేకము
482018-03-20రాజదండము దాల్చె రామచంద్రుడు
492018-03-21కానుకలను చదివించు చున్నారు
502018-03-22వనజాతేక్షణు పట్టాభిషేకము
512018-03-23తానేల చూడరాడయ్యా
522018-03-24కనుగొంటిమి కనుగొంటిమి
532018-03-24ప్రభువు రామచంద్రుని పట్టాభిషేక వేళ
542018-03-25తరింపజేయగ తారకబ్రహ్మము ధరపై వెలసినది


శ్రీరామపరబ్రహ్మార్పణమస్తు.

తరింపజేయగ తారకబ్రహ్మము ధరపై వెలసినది


తరింపజేయగ తారకబ్రహ్మము ధరపై వెలసినది
సురుచిరసుందర శ్రీరామాకృతి నరులకు తోచినది

అకారవాచ్యుడు బ్రహ్మయె జాంబవదాకృతితో నొప్ప
ఉకారవాచ్యుడు ఆంజనేయుడై యొప్పెను రుద్రుండు
మకారవాచ్యుడు సుగ్రీవుండై మార్తాండుడు వచ్చె
వికారరహితులు దేవతలిట్లు వెలసిరి ధరపైన

నాదము శత్రుఘ్నాకృతి దాల్చిన నారాయణ శంఖం
మోదముతో శ్రీనారాయణకళ పొడమెను లక్ష్మణుడై
అదిబిందువగు శ్రీహరి చక్రం బైనది భరతునిగా
మేదినిపై హరి వివిధవిభూతులు వెలసిన వీగతిని

మూలప్రకృతి సీతామాతగ పుడమిని కలిగినది
నేలకువచ్చిన విశుధ్ధబ్రహ్మము నిజము రామమూర్తి
ఈ లీలగ పట్టాభిషేక శుభ వేళను సభలోన
మేలుగ ప్రణవమె మనుజాకృతులను మేదిని పై వెలసె


24, మార్చి 2018, శనివారం

ప్రభువు రామచంద్రుని పట్టాభిషేక వేళ


ప్రభువు రామచంద్రుని పట్టాభిషేక వేళ
సభలోన సకలకళలు సందడి చేసె

కవులు మంచిపద్యాల కాకుత్థ్శకులవిభు
వివిధసుగుణముల నెన్ని వినుతిచేసిరి
అవనీతనూజ గొప్ప నందరకు నెఱుకగా
స్తవము చేసి సభ నెంతో సంతోషపరచిరి

సీతారాముల గాథ చిత్తంబు లలరింప
ప్రీతిమై నటులచట వివిధఘట్టములు
చాతుర్యము మీఱ చూపి సభలోని వారికి
చేతోమోదమును గూర్చి చెలగి ధన్యులైరి

మించి నట్టువరాండ్రు మెఱుపుతీవలకు
మంచిగా రామగాథ లెంచి పాడుచును
మంచి మంచి భంగిమల నంచితముగ జూపి
పంచిరి సభలోనున్న ప్రజకు సంతోషము


కనుగొంటిమి కనుగొంటిమి


జనకుని రాముని జనని సీతమ్మను
తనివార గద్దెపై కనుగొంటిమి

మన భాగ్య మింతింతన వచ్చునే లోక
జననీజనకుల నిటు కనుగొంటిమి
వినుతింతు రెవ్వాని విశ్వాత్మకుండని
మునులట్టి విభు నిదె కనుగొంటిమి

సకలలోకములకు సౌభాగ్య మొసగెడి
జననిని గద్దెపై కనుగొంటిమి
వినుతకృపాశీల విశ్వజననియని
మునులాడు తల్లిని కనుగొంటిమి

ఘనుడైన లోకావనశీలుడైన
యినకులవిభు నిదె కనుగొంటిమి
ఘనశీల లోకసంకటనాశిని యైన
జనకాత్మజ  నిదె కనుగొంటిమి




23, మార్చి 2018, శుక్రవారం

తానేల చూడరాడయ్యా


తానేల చూడరాడయ్యా దాశరథి పట్టాభిషేకము
పోనడచి యిడుములన్ని బ్రోచినట్టి వాని యున్నతి

శ్రీశచీపురందర ఋషి చింతదీర్చిన శీఘ్రశరుడు
దాశరధికి జరుగు వేడుక తనదు వేయి కనుల జూడ
ఆశతో నరుదెంచ కుండునె యాత డీ మునిబృందమందు
ఆశాధిపతుల గూడి యమితగుప్తు డగు గాక

మ్రుచ్చిలి తన పట్టణమును మ్రుచ్చిలి తన వాహనమును
హెచ్చిన గరువమున జేసి హింసించిన రావణుండు
చచ్చె నెవని వలన నట్టి జానకీ పతి వైభవమును
వచ్చి చూడక యుండు టనగ వశము కాదు ధనదునకన

సుదతుల చెఱబట్టు తులువను చూర్ణము కావించి నట్టి
విదితవిక్రము డైన రాముడు వేడ్క మిగుల గద్దె కెక్కగ
ముదితుడై తిలకించుటనై ముచ్చట పడకుండ వశమే
మృదులహృదయుడు ధనదపుత్రుం డెఱుకపడక నుండె గాని


22, మార్చి 2018, గురువారం

వనజాతేక్షణు పట్టాభిషేకము


కనివిని యెఱుగని ఘనసంరంభము
వనజాతేక్షణు పట్టాభిషేకము

మునుపు కశ్యపుడు పురందరునకు
మునులు దేవతలు పొగడుచుండగ
ఘనముగ పట్టము గట్టినప్పుడును
మినుముట్టినదా మించి యింతగా

సురసేనానిగ సుబ్బారాయని
హరుడు నిల్పి పట్టాభిషేకమును
జరిపి నప్పటి సంరంభంబును
సరిపోలెడు నన జాలమె దీనిని

అవి జరిగినది త్రివిష్టపంబున
అవలోకించుట యతిభాగ్యమన
భువిలో నిదియే పొలుపు మీఱినది
దివిజుల గొప్పకు తీసిపోని దిది


21, మార్చి 2018, బుధవారం

కానుకలను చదివించు చున్నారు


ఇదె  చూడుడీ రాజు లెందరో కానుకలను
చదివించు చున్నారు సార్వభౌమునకు

రతనాలు ముత్యములు రాసులుగా కొందరును
అతిమనోహరములగు పతకములు కొందరును
కుతుకముతో బంగారము కొండలుగా కొందరును
ప్రతిలేని రఘునాథుని పట్టాభిషేక వేళ

కానుకలుగ రాజ్యములే కరుణించు ప్రభువుకు
కానుకలను తెచ్చిరిదే ఘనులైన రాజులని
దావవేశ్వరుని తోడ వానరేశ్వరు డనగ
దానికేమి యిది సంప్రదాయమను నాతండును

రాకాసుల నడగజేసి లోకేశు లందరకును
ప్రాకటముగ చిత్తశాంతి పరగ కానుక జేసె
ఆ కడిది వీరున కిదె యందింతురు వేడుకతో
చేకొనుమని శక్తికొలది సాకేతరామునకు


20, మార్చి 2018, మంగళవారం

రాజదండము దాల్చె రామచంద్రుడు


భూజనులు పొగడ రాజన్యులు పొగడ
రాజదండము దాల్చె రామచంద్రుడు

పారావారమును గట్టి పౌలస్త్యుని గొట్టి
వీరాధివీరుడన్న బిరుదుపొందిన వాడు
నారాయణుడని ఋషులు నమ్ముకొన్న వాడు
ధారుణీసుతను గూడి పేరిమికాడై యుండి

కోదండరాముడు కొలువుకూటములోన
వేదమంత్రముల మధ్య వేడుకల మధ్య
శ్రీదయితుడైన ఆ ఆదినారాయణు డన
మేదినీతనయతో మురియుచు కూర్చుండి

మువురమ్మలు తమను మురియుచు దీవింప
వివిధ వాద్యముల మధ్య వేడుకల మధ్య
భవుడు నారాయణుడని ప్రస్తుతించినవాడు
అవనీసుతతోడ వేడ్క  నాసీనుడై యుండి



19, మార్చి 2018, సోమవారం

పరమాత్ముడు రాముని పట్టాభిషేకము


అరయుడీ జనులు పట్టాభిషేకము
పరమాత్ముడు రాముని పట్టాభిషేకము

సకలనదీజలములు సకలవార్థిజలములు
అకళంకుడౌ తనకు నభిషేకము సేయ
వికచోత్పలనయనుడు వీరరాఘవమూర్తి
ప్రకటంబుగ  పట్టభద్రుడగుటను

వికటబుధ్ధి పౌలస్త్యు విరచినట్టి వీరుడు
సకలసురాసురజన సంపూజిత మూర్తి
సకలార్తినాశనుడౌ సర్వేశ్వరుండిదే
ప్రకటంబుగ  చక్రవర్తియగుటను


అంగజగురుని దివ్యావతారమైనట్టి
శృంగారరాముడు సింహాసనంబున
బంగారుతల్లి సీత ప్రక్కనే మెఱయగ
అంగీకరించిన పట్టాభిషేకమును

18, మార్చి 2018, ఆదివారం

కనుడి సింహాసనంబున


శ్రీరామచంద్రుడు చిన్మయు డీ నాడే
ఆరోహించె కనుడి సింహాసనంబును

ఉవిద సీతమ్మ తోడ నున్నాడు గద్దెపై
రవికులేశ్వరుడు సకలరాజపూజ్యుడై
సవినయనిజభ్రాతృ సమేతుడై కనుడిదె
పవమానసుతసేవ్యపాదుడై యున్నాడు

కనుడిదే మిత్రుడైన కపిరాజు సుగ్రీవుని
కనుడా యువరాజు నంగదుని వీరుని
కనుడు ఋక్షాగ్రగణ్యు జాంబవంతుని
ఇనకులేశ్వరుని సేవించుచును సభనిదే

ఇదే విభీషణుని లంకేశ్వరుని కనుగొనుడు
సదస్యులై రిదె కనుడు సకల ఋషులును
ముదితాత్ములు సాకేతపురవాసులను కనుడు
విదితయశుడు శ్రీరాముని పేరోలగమునందు


ఈరోజు నుండి మహిత


ఈరోజు నుండి మహిత శ్రీరామ నవరాత్ర
మారంభమాయె భక్తులార మీకు హెచ్చరిక

శ్రీరామ దివ్యకథా పారాయణము తోడ
శ్రీరామదివ్యనామ చింతన తోడ
మీరెల్ల రేబవళ్ళు మీఱిన సద్భక్తితోడ
కారే కడు యోగ్యులు శ్రీరాముని కృపకు

శ్రీరాముడే మీకు జీవితాదర్శమైన
శ్రీరామకటాక్ష సిధ్ధి సత్యము
శ్రీరాముడే తల్లి శ్రీరాముడే తండ్రి
శ్రీరామ భక్తులకొక చింత యున్నదే

ఎడదనే చేయుడీ యెంతో పెద్ద పందిరి
వడిగ శ్రీరామకుటుంబమును నిల్పుడి
గడుపుడీ నవరాత్రఘనవ్రతాచరణంబున
విడుచునే బంధములు విప్పక శ్రీరాముడు


17, మార్చి 2018, శనివారం

ఈ విలంబి శుభంబుల నిచ్చు గాక



ఉ. రాముని పైన పద్యములు వ్రాయుట కంటెను భాగ్యమున్నదే
యామని వేళ పద్యముల నల్లుట కంటెను భాగ్యమున్నదే
యేమని చెప్పవచ్చు హృదయేశ్వరు డైన మహాత్ముడా పరం
ధాముని పైన పద్యము లుదారత నామని జెప్పు భాగ్యమున్
తే.గీ. చైత్రశుధ్ధపాడ్యమి నాడు చిన్మయుండు
భూమిజాయుక్తు డైనట్టి రామచంద్ర
మూర్తి పట్టాభిషిక్తుడై పుడమి నేలె
పరమధర్మావతారుడా భద్రమూర్తి
సీ.  శ్రీరామపట్టాభిషేకమహోత్సవ
    పర్వదిన ముగాది పర్వదినము
ప్రభువాయె నుగాది భద్రదినంబున
    ధర్మాత్ముడైనట్టి ధర్మరాజు
విఖ్యాతికెక్కిన విక్రామాదిత్యుడు
    గద్దె కెక్కిన దుగాది ఘనదినంబె
పట్టాభిషిక్తుడై ప్రభువాయె నుగాది
    దినమున శాతవాహనుడు గూడ
తే.గీసర్వవిధముల సకలరాజన్యసేవ్య
మానమై నవ్యవాసంతమహితశోభ
నెల్లవారల హృదయమ్ము లుల్లసిల్ల
నరుగుదెంచె విలంబి యుగాది యిపుడు
తే. రామచంద్రుని సత్కృపాప్రాప్తి గలిగి
సకలసౌఖ్యములను గూర్చజాలు గాక
ఈ విలంబి యనెడు పేర నెసగు నట్టి
కొత్తసంవత్సరము మన చిత్తములకు
తే. రాము డేలెడి భూమిలో రాజకీయ
పక్షులాడెడి యాటలు పాడుగాను
ఆంధ్రజనులకు సంతోష మతిశయించ
ఈ విలంబి శుభంబుల నిచ్చు గాక

( చందానగర్ లో జరిగిన నేటి కవిసమ్మేళనంలో ఈపద్యాలను చదవటం జరిగింది.)

ఓ రామచంద్రుడా ఒక మాట వినవోయి


ఓ రామచంద్రుడా ఒక మాట వినవోయి
నీరేజనేత్రుడా నిన్నే అడిగే నోయి

ఎన్నెన్నో తోలుతిత్తు లెంచియెంచి దూరితి
ఎన్నెన్నో పాపంబుల నెఱుగక నే జేసితి
ఎన్నెన్నో పున్నెంబుల నెఱుకతో జేసితి
ఎన్నాళ్ళిటు తిరుగుదు నెప్పటికి నిలకడ

ముక్కోటి దేవతల మున్ను నే కొలిచితి
దక్కిన ఫలములను మిక్కిలిగ మెక్కితి
మెక్కిన కొలది యాక లెక్కువౌట జూచితి
యెక్కడో తప్పు జరిగె నే నేమి చేయుదు

ఇన్నిన్ని పుట్టువులు నిన్ని పాపపుణ్యములు
ఇన్నిన్ని దైవతములు  నిన్నిబిన్నపథములు
అన్నియు నా కవసరమా నిన్నొక్కడినే నమ్మి
ఉన్నానది చాలునుగా  అన్నదియే నా ప్రశ్న

14, మార్చి 2018, బుధవారం

తనకు తానె బంధంబులు తగిలించుకొని

తనకు తానె బంధంబులు తగిలించుకొని
తన నెవరో కట్టి రనుట తప్పు తప్పు తప్పు

చెడునడతల వారితో స్నేహము చేసి
చెడి దురదృష్ట మనుచు నడలుకొనుట  తప్పు
నడమంత్రపు సిరులపైన నమ్మక ముంచి
చెడి విధిని తప్పుపట్టి చింతించుట తప్పు

వడిగల యొక సుడిలోన జడియక దుమికి
సుడియే పగబట్టిన దని శోకించుట తప్పు
పుడమిపై నెన్నేమార్లు పుట్టి చచ్చి కూడ
చెడ కుండిన భవమోహము జీవునిదే తప్పు

విడరాని దైవమును విడిచి వెఱ్ఱి యగుచు
దుడుకువై చెడి దేవుని  దూఱాడుట తప్పు
ఒడయడై రామచంద్రు డుర్వి భక్తులకు మోక్ష
మిడుచున్నా డని తెలియదా యెవరిదయ్య తప్పు


12, మార్చి 2018, సోమవారం

ఏమయ్యా అన్యాయము లెంత కాలము



ఏమయ్యా అన్యాయము లెంత కాలము
స్వామీ నీవైన వచ్చి చక్కజేయుము

మాటికి జై శ్రీరా మనుచు మంచి మంచి నటనలు
మాటికి తా మితరుల దుర్మార్గ మెంచి పలుకుటలు
మాటికి మా కోదార్పుల మాట సిరుల మూటలు
కోటలోన దూరి మాట కొల్ల జేసి నవ్వు లిపుడు

ఈ దొంగలగుంపుతో ఆ దొంగలగుంపు కలిసి
ఏ దొంగల నాటకము లెంతరక్తి కట్టించిరొ
ఏ దొంగల తోడ చెలిమి కెంతగ యత్నించిరో
ఈ దేశము నందు బుధ్ధి  నెఱుగని వాడెవ్వడు

ఏమయ్యా యీ యాంధ్రుల నింక చావు మందువా
రామచంద్ర నీవు దక్క రక్షించెడు వా రెవరు
తామసుల బారి నుండి ధర్మాత్ముల బ్రోవుము
కామా సజ్జనులము కడతేర్చు మిక మమ్ము


ఆంధ్రులకు ప్రస్తుతపరిస్థితుల్లో జీవించేహక్కు లేదనీ చెప్పరాదా?



బోలెడు వాగ్దానాలు.

అబ్బో అబ్బో అనుకున్నా రంతా.

దగాపడ్డ ఆంద్రులపై ఇంతంతన రాని అభిమానం కురిపించారు.

గద్దెకెక్కారు.

ఓడ దాటాక బోడిమల్లయ్య అన్న సామెతను వినిపిస్తున్నారు.

ప్రత్యేకహోదా ఇస్తామన్నామా ?  ప్రస్తుతపరిస్థితుల్లో వీలుపడదు అన్నారు.

ఇంకా అదివీలుపడదు ఇది వీలు పడదు అంటూనే ఉన్నారు.

నిన్నో మొన్నో బీజేపీలో ఉన్న తెలుగు వాళ్ళు ఏమన్నారూ?  అన్నింటికీ కేంద్రం సానుకూలంగా ఉందీ అని కదూ!

ఛీఛీ.

24 గంటలు చచ్చి గడిచాయో లేదో ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖకు రైల్వేజోన్ ఇవ్వటం వీలు పడదూ అని తేల్చేసారు నవ్వుతూ!

మోసం చేసి చిప్పచేతిలో పెట్టాయి ఆ దిక్కుమాలిన కాంగ్రెసూ ఈ బుధ్ధిమాలిన బీజేపీనూ.

ఇంకా మోసకారి మాటలే. ఇంకా దగాకోరు చేతలే.

ఏంచేసినా ఎలాగూ ఆంద్ర్హ్లులు బీజేపీని గద్దెకెక్కించరు కదా, వీళ్ళకు ఇచ్చిన మాట నిలబెట్టికోకపోతే కొత్తగా పోయేదేమి ఉంటుందీ అనికదూ వెధవ కుళ్ళు బుధ్ధి ఈ బుధ్ధిమాలిన పార్టీకి?

అయ్యా, ఎందుకిలా రోజుకో ప్రాణాంతకమైన జోక్ పేలుస్తున్నారూ?

ఓ దుర్వారగర్వాంధ బీజేపీ  పార్టీ మహానుభావులారా!
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రులకు బ్రతికే హక్కులేదని ఒక తీర్మానం చేసెయ్యండి.

మా ప్రాప్తం ఇంతే అనుకుంటారు.

ఇష్టం ఐతే ఇలా నిత్యక్షోభను అనుభవిస్తూ ఈ అవమానకరభారతంలో పౌరులుగా బ్రతుకీడుస్తారు.

లేదా చస్తారు - పీడా పోతుంది.

లేదా,  తెగిస్తే ఈభారతావనిలో తమభాగం తాము పంచుకొని వేరేదేశం ఏర్పాటుచేసుకుంటారు.

అదీ అంత పిచ్చిపనేమీ కాదని ఆంధ్రులు అనుకొంటే అందుకు 'ప్రస్తుతపరిస్థితులే' కారణం అని అందరూ అనుకుంటారు లెండి.

బోలెడు వనరులు కల నేల - సముద్రం ఆంద్రుల సొత్తు.

ఆ వనరుల నన్నింటినీ నిర్ధాక్షిణ్యంగా ఈ ఉత్తరదేశపిచ్చి ఉన్నవాళ్ళు దోచుకుపోతూనే ఉన్నారు - పైసా వాటా కూడా ఇవ్వకుండా. నిజానికి అన్నింటిలోనూ ముందు అధమపక్షం 50% వాటా ఇచ్చి మరీ తీసుకొని వెళ్ళమనండి చాలు.

అంతర్యుధ్ధం వస్తుందా?

అయ్యబాబోయ్ అంతపని జరుగుతుందా? ఎంత ఘోరం ఎంతఘోరం!

బీద ఆంధ్ర ఓడిపోతుందా?

పెద్దమొత్తంలో ఆంధ్రులు చస్తారా?

చావనియ్యండయ్యా, ఈ బ్రతుక్కన్నా ఆ చావే గౌరవనీయమైనది కాదా?

చావుకు తెగించలేక ఇలాగే బ్రతుకీడ్చటం కుదరక ఎలాగూ బీదరికంలో మగ్గి చావక తప్పదు కదా? అలాంటప్ప్పుడు మీ హక్కులకోసం మీరు దెబ్బలాడండి.  అందుకు చావవలసి వస్తే అందరూ ఐనా సరే నిర్మొగమాటంగా చావండి. ఏమీ తప్పులేదు!

నిన్నో మొన్నో మన సుప్రీంకోర్టువారు ఒక తీర్పునిచ్చారు. చూసారా?

ఇంక జీవించే ఆశలేని వాడు గౌరవంగా మరణించాలని కోరుకోవటం సబబే నని.

గౌరవంగా అన్నిరాష్ట్రాలతో సమానంగా జీవించే హక్కు మీకు లేదని బీజేపీ వారు ఈరోజు చెబుతున్నారు. అన్నింటికీ సున్నపుబొట్లు పెట్టి వెక్కిరిస్తూనే మేం అంత మాట అనటం లేదూ అంటారు లెండి ఎలాగూ. కాని క్రియలో 100% వాళ్ళ చేతలకు అర్థం మీరు బ్రతికినా చచ్చినా మాకు ఒకటే అని చెప్పటమే.

అయ్యో అందరమూ చస్తె ఎలాగు, ఈ భూమి ఖాళీ ఐపోదా అని బెంగపడకండి. దానిలో జెండా పాతుకుందుకు వేరే వాళ్ళకు ఆసక్తి ఉండవచ్చును లెండి. అది మీకెందుకు?  మీ అనంతరం ఏం జరిగితే మీ కెందుకు?

అందుచేత బ్రతకాలో చావాలో ఇంకా నాన్చకుండా  తేల్చి చెప్పమనండి ముందు. ఎలాగూ మిమ్మల్ని చచ్చిన వాళ్ళ క్రిందో అంతకన్నా హీనంగానో చూస్తున్నారన్నది తెలుస్తూనే ఉన్నా, ఆ ముక్క బయటపడి చెబితే ఆ రువాత మీ ఆలోచన మీరు చేసుకుందుకు వీలుగా ఉంటుంది. ముసుగులో గ్రుద్దులాట లెందుకు అసహ్యంగా!

అయ్యా బీజేపీ వారూ, ఆముక్కేదో చెప్పేద్దురూ మీకు పుణ్యం ఉంటుంది!


11, మార్చి 2018, ఆదివారం

తవులుకొన్నది నిన్ను తలచుటలో రుచిని


తవులుకొన్నది నిన్ను తలచుటలో రుచిని
చవిలేని లోకవస్తుచయ మిదే  విడచినది

దివి నున్న వారలు భువి కేగు దెంఛుట
భువి నున్న వారలు దివి కేగు చుండుట
అవలోకనము సేసి యన్నిటికి మూలమై
భవపాశ మది యుంట భావించి రోసినది

కాలగతి ననుసరించి కలుగుచుండు సర్వము
కాలగతి చెందుటను కనులార జూచినది
కాలమున కనుకట్టే కాని సత్యము లేమి
మేలుగా గని మాయా జాలమును రోసినది

ఈ మహాసృష్టి నిట్లేర్పరచినది నీవే
రామచంద్ర దానికి రక్షకుడవు నీవే
ఈ మాయను దాటించే యీశ్వరుడవు నీవే
నా మన సిక నిన్నే నమ్ముకొని నిలచినది


10, మార్చి 2018, శనివారం

కోరి శ్రీరామచంద్రుని చేరి భజించరా


కోరి శ్రీరామచంద్రుని చేరి భజించరా
ఓరి వివేకహీనుడ చేరరా దితరుల

ఈరేడులోకాల  యిడుములు కడముట్ట
పారావారము గట్టి పౌలస్త్యు పడగొట్టి
వీరరాఘవుడన్న బిరుదుపొందిన వాని
నారదాదిమునినాథముఖ్య నుతుని

ఘోరభవాంబోధి గొబ్బున దాటించు
నేరుపు గలిగిన నిక్కపు మొనగాడు
ధారాళమైన కరుణ తనభక్తులందరను
తీరమును జేర్చు దేవుడైన వాని

వెంటరాని వారల వెంబడించి చెడక
నంటి రానట్టి సిరుల కలమటించి చెడక
తొంటి పదము జేరు త్రోవ జూపించు వాని
జంటబాయ కుండి నీ సర్వస్వ మతడని


9, మార్చి 2018, శుక్రవారం

విడిది సేయించరె


విడిది సేయించరె విశ్రాంతి గృహమున
తడయక జానకిని తరళాక్షులార

బడలినది మాతల్లి అడవు లన్నియు తిరిగి
వడలినది మాతల్లి పాడు రావణు చెర
కడగండ్లు మాతల్లి గడచి వచ్చినదమ్మ
పడరాని పాట్లన్ని పడిన సీతమ్మ

పదునాలు గేండ్లాయె పడతి యడవి కేగి
ఇదిగో యీనాటికి యెడబాటు తొలగెను
ముదితలార తల్లి ముందు మన ముంటిమి
సుదతి కిండోయమ్మ సుంత విశ్రాంతి

అడవుల.వింతల నడుగుట మానరె
విడువరె రావణు విషయ మింతటి తోడ
పడతికి విశ్రాంతి వలయును చెలులార
తడయక తల్లిని నడిపించరమ్మ

దొమ్మిసేసి రావణుని దుమ్ముసేసి వచ్చె నిదే


దొమ్మిసేసి రావణుని దుమ్ముసేసి వచ్చె నిదే
అమ్మలార రామునకు హారతు లీరే

నారాయణమూర్తి వీవె నరుడ వైనా వనుచు
పోరి రావణుని నీవు పొడిచేసి నా వనుచు
చేరి దేవతలు రేగి  జెజేలు కొట్టి రట
వారి దిష్టి తగిలినేమొ వనజాక్షునకు

మూడులోకముల నున్న ముదితలందరకును
పీడయై నట్టి తులువ పాడు రావణాసురుని
వాడిబాణాల జంపి నాడని మురిసి పొగడు
చేడియల దిష్టితగిలె నేడు విభునకు

నారలతో మునిరాజగు నాడు మునుల కనుల దిష్టి
చేరువనే యుండి యుధ్ధ మారసిన వారి  దిష్టి
ఊరేగి వచ్చు వేళ ఊరందరి జనుల దిష్టి
పేరుకొనెను దిష్టితీసి హారతు లీరే


8, మార్చి 2018, గురువారం

రాముని సేవించ రాదా ఓ నరుడా


రాముని సేవించ రాదా ఓ నరుడా
కాముని సేవించి కడతేరక

మోహనాంగుని నీవు మోహించి సేవింప
నూహింతువో రాము డుత్తము డందాన
మోహించి రాతని మునిపుంగవులు కూడ
పాహి యనుచు వాని భావింపరాదా

శ్రీమంతునే నీవు సేవించ దలచిన
రామచంద్రుని కన్న శ్రీమంతు డెవ్వడు
రాముని మోక్షసామ్రాజ్యలక్ష్మీపతిని
ప్రేమతో సేవించి పెంపొందరాదా

ఏడేడు జన్మల నెడబాయకుండెడు
వాడే కావలెనని వాదింతువో నీవు
కూడుకొన్న వారి వీడక రక్షించు
వాడన్న శ్రీరామభద్రుడొక్కడె కాదే


7, మార్చి 2018, బుధవారం

నుతించవే శ్రీరాముని నోటిగూటి చిలుకా


అతడిచ్చిన ఫలములే ఆరగించు చున్నావే
నుతించవే శ్రీరాముని నోటిగూటి చిలుకా

ప్రొద్దున లేచినది మొదలు నిధ్దురలో నొఱగుదాక
పెద్దలు పిన్నలును నిన్ను తద్దయు శ్లాఘించగ
ముద్దుముధ్దు మాటలతో మురిపాల పాటలతో
హద్దుపధ్దులేకుండ ఆడిపాడవే చిలుకా

అవల కివల కెగురుచుండు ఆటపాటల చిలుకా
యెవడు యునికి నిచ్చెనో యెవడు గూటి నిచ్చెనో
యెవడు పాట నిచ్చెనో యెవడు కూటి నిచ్చెనో
కవితలతో నా రాముని ఘనత పొగడవే చిలుకా

పాపాత్ముల తోడ నీవు పలుకాడకే చిలుకా
కోపాలసులుందురని గొంతు దాచకే చిలుకా
తాపత్రయశమనుడైన ధర్మావతారుడైన
నీ పాలిటి దేవునకై నీవు పాడవే చిలుకా


అతిమంచివాడవై యవతరించితివి


అతిమంచివాడవై యవతరించితివి
అతి చెడ్డవారల యంతు జూచితివి

అతిమంచి కొడుకువై యడగుటే తడవుగ
ప్రతివాక్యమాడక వనవాసమేగితివి
అతిమంచి యన్నవై యడగుటే తడవుగ
వెతలుదీర్చు పాదుక లిచ్చితివిగా భరతునకు

అతిగ ముల్లోకముల నారళ్ళు బెట్టువాని
నతికిరాతకుని రావణాసురుని తెగటార్చి
అతిశయించి వెలిగితివి ప్రతిలేని వీరుడవై
అతివ సీతమ్మదుఃఖ మంతరింప జేసితివి

అతిగొప్ప రాజువై యవని పాలించితివి
అతియుదారత భక్తు లందరను నీవు
చ్యుతిలేని పదమున కూర్చుండబెట్టెద వీవు
నుతియింతు నిన్ను నేను నోరార శ్రీరామ


పట్టుము హరిపాదము నెట్టుము యమపాశము


పట్టుము హరిపాదము నెట్టుము యమపాశము
పట్టుబట్టి మోక్షద్వార మిట్టే నీవు నెట్టుము

అడుగడుగున తోడుపడ హరియె రాముడై వచ్చె
పడిలేచుచు భవజలధిని పయనించెడు వాడ
వడివడిగ నీవు రామపాదములను చేరుము
జడతవిడచి నీవు కార్యసాధకుడవు కమ్ము

లేనిపోని శంకలకు లోనుగాక నీవిపుడు
ధ్యానించుము శ్రీరాముని ధర్మావతారుని
మానవులకు శ్రీరాముని మార్గమే శరణ్యము
జ్ఞానమోక్షములు రామచంద్రుడే యొసంగును

మరలమరల పుట్టనేల మరలమరల గిట్టనేల
మరలమరల దుష్పథముల మానక చరించనేల
నరుడా శ్రీరాముడే నారాయణుడని తెలిసి
పరుగుపరుగున రామ పాదసీమ చేరుము


6, మార్చి 2018, మంగళవారం

రామద్వేషుల వ్రాతలు చేతలు


రామద్వేషుల వ్రాతలు చేతలు
నామది కలచును కామారీ

హరి నెఱిగింపని యరకొర చదువులు
హరి బోనాడేడు నఱకొఱ బుధ్ధులు
నరులు కొందరు నానావిధముల
బరితెగించి దుర్భాషలాడెదరు

తిట్టుచు హరిని తిరిగెడు వారికి
పట్టుబట్టి శివ యెట్టులైన నిక
గట్టిగ బుధ్ధిని గరపవయా యీ
బెట్టిదులను తుదముట్టించవయా

హరిహరద్వేషుల కమంగళములును
హరిహరభక్తుల కన్ని శుభములును
పరమదయాపర పరమేశ్వర యీ
ధరపై వెలయగ దయచూపవయా


రావణుడే లేడా రాముడును లేడు


రావణుడే లేడా రాముడును లేడు
కావున రావణుని వలన కలిగెను మేలు

సీతాపతి తొల్లి నీకు చేరువ వాడై
యాతుధానుడై మిగుల నాతుర పడుచు
నీతి విడచె రావణుడు నిన్ను రప్పించగ
నాతని ధాటికి నెవ్వ రాగలేని దాయెను

వాడు నాడు రేగి వనితల చెఱబట్టు
వాడని బ్రహ్మాదిదేవతలు నిన్ను చేరి
వేడగ రావణుని పీడను తొలగింప
వేడుకగ రాముడవై వెలసితి వీవు

రామచరిత ముర్విపై రాజిల్లి మాబోటి
సామాన్యులకు నేర్పు సద్వర్తనమును
రామనామము పెద్ద రక్షగా నిలచి
సామాన్యులకు మోక్షసామ్రాజ్యమిచ్చు


5, మార్చి 2018, సోమవారం

శ్రీహరిచింతన లేనట్టి జీవితము


శ్రీహరిచింతన చేయని జీవిత
మూహింపనే వలను కాకుండును

నిరతము శ్రీరామ నిర్మల శుభనామ
స్మరణము గలిగిన సజ్జనులు
పరమభక్తులగు వారలబుధ్ధికి
హరిహరి స్వప్నము నందున నైనను

హరిపాదసేవన మందలి సుఖమును
తిరముగ తలచెడి ధీమంతులు
పరమాత్ముడే తమ పతియను వారలు
పరమభక్తులకు పరాకు నైనను

పదిపది జన్మలు వదలక రాముని
ముదమున గొల్చిన పుణ్మమున
సదమలురై హరి సాన్నిధ్యము గల
విదులకు నెంతటి విస్మృతి నైనను





బ్రహ్మాదులు తెలియు నట్టి వాడ వీవు


బ్రహ్మాదులు తెలియు నట్టి వాడ వీవు
బ్రహ్మపద మనుగ్రహించు వాడ వీవు

భ్రమ లుడిగిన విరాగులు భావించు వాడవు
తమలోన బ్రహ్మాదులు తలచు నట్టి వాడవు
అమరప్రముఖు లందరు నారాధించెడి వాడవు
విమలకమలాప్తకులప్రముఖుడ వగు రాముడ

తొలినుండి హృదయమందు తోచుచుండు వాడవు
వెలుగువై జీవుల  నడిపించు చుండు వాడవు
కలిబాధ నణచి  వైచి కాచుచుండు వాడవు
తులలేని పెన్నిధివై కలిగినట్టి రాముడ

శక్తిహీనులగు వారికి శక్తియైన వాడవు
రక్తిమీర గొలచు వారి రక్షించెడు వాడవు
భక్తవరుల నెపుడు పరిపాలించెడు వాడవు
యుక్తమైన వరములిచ్చి యూరడించు రాముడ


4, మార్చి 2018, ఆదివారం

కేసీఆర్ గారి అంతర్యం పై ఒక ఆలోచన.



ఆంధ్రావాళ్ళు తమకు జరిగిన అన్యాయం పైన గోలగోల చేస్తున్నారు.
ఒకవేళ వాళ్ళకు తగిన మద్దతు దొరికితే ఆంధ్రులకు న్యాయం జరిగే అవకాశమూ ఉంది.

సరిగ్గా ఇప్పుడే, ఉన్నట్లుండి, ఒక గొప్ప ప్రకటన!

దేశంలోని రాజకీయం అంతా భ్రష్టుపట్టి పోయిందని కేసీయార్ గారూ హఠాత్తుగా రంకెలు వేస్తున్నారు.
దీని వెనుక ఆయనకొక ఆలోచన ఉంది.

చిన్న పామైనా పెద్దకర్రతో కొట్టమన్నారు.
ఆంద్రులు తమకు న్యాయం సాధించుకొనే అవకాశం నూటికి ఏ పదిశాతమో ఉండవచ్చును.
కానీ అది మాత్రం ఎందుకు పడనివ్వాలీ అని మనస్సులో అనుకొనే వాళ్ళూ ఉంటారు.

అటువంటి వారిలో కేసీఆర్ గారు ఒకరు అని అనుకొంటున్నాను.
అటువంటి వారికో కేసీఆర్ గారు ఒకరు కారు అనుకొందుకు అవకాశం ఏమీ లేదు కాబట్టే అలా అనుకోక తప్పదు.

రాజకీయులు అలా అలోచించే అవకాశం ఉంది తప్పకుండా.

కేసిఆర్ గారు తెలివైన వారు. అంటే చతురులు. నిర్మొగమాటంగా చెప్పాలంటే గొప్ప జిత్తులమారి.
ఆయన మాటల్లోని ఆంతర్యం తెలుసుకోండి.

రాజకీయవాతావరణంలో  ప్రస్తుతం ఆంధ్రా అనేది కేంద్రబిందువుగా సాగుతున్న చర్చను దారి మళ్ళించటమే ఆయన ఉద్దేశం.

అబ్బెబ్బే కవితగారూ కేసీఆర్ గారూ కూడా ఏదో ఆంద్రులకి వత్తాసు ఇస్తూనే మాట్లాడారే నిన్నమొన్ననే అని అనుకోవచ్చును.

రాజకీయులు మనస్సులో ఉన్న మాటనే మాట్లాడుతారన్న నియమమూ నమ్మకమూ ఏమన్నా ఉందా?

నోటితో నవ్వి నొసటితో వెక్కిరించటం రాజకీయులు చేయరనో చేయలేరనో అనుకునే అమాయక చక్రవర్తులకి ఒక దండం.

ఉభయప్రాంతాలకూ సమంగా న్యాయం జరిగేలా విభజన చేస్తాం చేస్తే గీస్తే అన్న కాంగ్రెసు, ఆంద్రులకు బుజ్జగింపు మాటలు ఎన్ని చెప్పలేదు? చివరికి చేసిందేమిటీ?

ఒక సమయంలో ఒక పెద్ద రాజకీయ దుమారం రేగితే దానిమీద చర్చను పలుచనచేయటానికి మరికొన్ని అదేస్థాయి రాజకీయ దుమారాలు సృష్టించటం ఒక మంచి దారి, వీలైతే మరింత పెద్ద రాజకీయ దుమారం రేగితే మొదటి అంంశం  చర్చనుండి ప్రక్కకు పోతుంది.

అందుకే, అలా ఆంద్రాపై జాతీయ రాజకీయరంగలో కొద్దోగొప్పోగా ఏర్పడుతున్న ఫోకస్ ఉన్నదే, దాన్ని పలుచన చేయాలన్నదే కేసీఆర్ గారి ఎత్తుగడ కావచ్చును తప్పకుండా.

జాతీయరాజకీయాల్లోనికి రానూ, నాకు ఆసక్తి లేదూ అని విస్పష్టంగానే లోగడ వాక్రుచ్చిన శ్రీమాన్ కేసీఆర్ గారికి  ఉన్నట్లుండి, జాతీయ రాజకీయాల్లోనికి రావాలని అనిపించటమూ అసలు భారతజాతికే దిశా దశా నిర్దేశం చేసి తరింపజేయాలన్న పుణ్యసంకల్పం కలగటమూ కేవలం ఉన్నట్లుండి హఠాత్తుగా బీజేపీ కాంగ్రెసు పార్టీలు రెండూ దొందూ దొందే అన్న జ్ఞానోదయం కావటం అని నమ్మటం కుదరదు.  ఎంతమాత్రమూ కుదరదు!

అందుకనే దేశరాజకీయాల్లో మూడో ఫ్రంటూ అదీ తన నాయకత్వమూ అంటూ పాట మొదలు పెట్టి ఆ చర్చతో ఆంద్రాపై జాతీయస్థాయి రాజకీయాల్లో ఫోకస్ తప్పిపోయేలా చేయాలన్నదే ఆయన ఆంతర్యం అని నమ్మవలసి వస్తోంది.

పవన్ కల్యాణ్ వంటి అమాయక చక్రవర్తులు తమను తాము రాజకీయ మేథావులుగా భావించుకొంటూ సంబరపడిపోతే పోవచ్చు కాక. సగటు భారతీయుడు ఇంత చిన్న విషయం గ్రహించలేడని అనుకోను. పొనీ సగటు ఆంద్రుడు ఇంంత అమాయకంగా  నమ్మి జైజై అనేస్తాడని అనుకోను.

వీర కేసీఆర్ అభిమానులూ, తాము రెండు పెద్దపార్టీలకూ వ్యతిరేకం కాబట్టి కేసీఆర్ గారికి స్వాగతం చెప్పటం కోసం తొందరపడిపోవాలనుకొనే కొన్ని చిల్లరపార్టీల చిన్నాపెద్దా నాయకులూ నేను అర్థం చేసుకున్న కోణంలో ఆలోచించటానికి ఇష్టపడక పోవచ్చును.

కాని ఈ కోణం కూడా తప్పక ఆలోచించదగినదే.

ఒక పులీ ఒక సింహమూ రెండూ కూడా అడవిని భక్షిస్తున్నాయే కాని రక్షించటం లేదని మరొక క్రూరమృగాన్ని అడవికి రాజును చేసినా పరిస్థితిలో ఏమీ మార్పు ఉండదు. స్వతహాగా రాజకీయులంతా క్రూరమృగాల్లాగే ఉన్నారు నేటి రాజకీయాల్లో ఎవర్నీ నమ్మే పరిస్థితి లేదు. అందరూ స్వార్థపరులే - పోనీ నూటికి తొంభైతొమ్మొది శాతం మంది ఐనా అదే బాపతు.

ఆంద్రులు ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ కేసీఆర్ గారికి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఇస్తే ఆంద్రులకు బ్రతికే హక్కు కూడా లేదని బిల్లు పాస్ చేయగల సమర్థులు.  తెలంగాణా ఉద్యమం పేరుతో ఆంద్రులపై ఎన్నెన్నో అవాచ్యాలు మాట్లాడిన మహానుభావుడు తమపై నిజంగా సానుభూతి కలిగి ఉన్నాడనో, జాతీయరాజీకీయాలకు నిజాయితీనో నిస్వార్థతనో జోడిస్తాడనే అమాయకంగా నమ్మటం అంటే కొరివితో తలగోక్కోవటమే.  తస్మాత్ జాగ్రత జాగ్రత.

2, మార్చి 2018, శుక్రవారం

శ్రీరాముని నామమే జిహ్వపై నిలువనీ


శ్రీరాముని నామమే జహ్వపై నిలువనీ
శ్రీరాముని రూపమే చిత్తమున వెలుగనీ

శ్రీరాముడు చాలు నాకు చింతలన్ని తీర్చగా
శ్రీరాముడు చాలు నాకు జీవనమ్ము కూర్చగా
శ్రీరాముడు చాలు నాకు సేమము చేకూర్చగా
శ్రీరాముడు చాలు నాకు క్షిప్రవరప్రసాదిగా

 శ్రీరాముడు నాకు మోక్షశ్రీ ననుగ్రహించగా
 ‎శ్రీరాముడు నాకెప్పుడు చేదోడై యుండగా
 ‎శ్రీరాముడు నా యందే స్థిరముగా నిలువగా
 ‎శ్రీరాముడు నాకు జయము సిధ్ధింప జేయగా

శ్రీరాముని వాడనగుచు చెలగెద నీ భువిని
శ్రీరాముని వాడనగుచు చేరెద నా దివిని
శ్రీరాముని యభయవర సిధ్ధి గలవాడను
శ్రీరాముని భక్తుడను శ్రీరాముని బంటును

ఓ మహానుభావ రామ యూరకుందువా


ఓ మహానుభావ రామ యూరకుందువా
తామసుడని వీనిపైన దయచూప నందువా

నీతిపథము లెఱుగడే నియమనిష్ఠ లెఱుగడే
ప్రీతిగ పెద్దలను సేవించుటే యెఱుగడే
కోతిబుధ్ధి వానిపైన కొసరుటేల దయయని
సీతాపతి నాపైన శీతకన్ను వేసితివా

వేదవిదుల నెఱుగడే వేదార్ధ మెఱుగడే
వేదాంత మెఱుగడే వేదములే యెఱుగడే
వేదవేద్యుడ నేనను విషయమే యెఱుగడే
యీ దురాచారు నేల చేదుకొందు నందువా

భవరుజాలక్షణముల వలన నిట్లైతి తండ్రి
యవలక్షణములు నా యాత్మలోనివా తండ్రి
భవదీయ సుతుడ గా కెవడనయ్య నా తండ్రి
రవిచంద్రవిలోచన రక్షించవయ్య నన్ను


1, మార్చి 2018, గురువారం

హరి సేవనమే యానందము


హరి చింతనమే హరి కీర్తనమే
హరి సేవనమే యానందము

నరులకు సురలకు గరుడోరగులకు
సురవిరోధులను సుజనులకు
హరున కింద్రునకు నజునకు నిత్యము
హరియే కారణ మానందమునకు

విషయము లిచ్చు వివిధసుఖములు
విషతుల్యము లని వివరించు
విషయవిరాగులు వేదమూర్తి హరి
విషయవిహరణా విమలశీలురకు

భక్తసులభుడని పరమాత్ముడని
రక్తి మీఱ శ్రీరామునితో
ముక్తి బేరమున మురియుచు మనసుల
యుక్తములని ముందొడ్డెడి వారికి


ఒడ్డున పడవేయ వయ్య ఓ రామచంద్ర


ఒడ్డున పడవేయ వయ్య ఓ రామచంద్ర నీ
బిడ్డను భవసాగరమున వేదనపడుచుంటిని

జీవున కేమిటికి వచ్చు చెప్పరాని వేదనలు
దేవుడవగు నీవు కాక తెలిసిన దెవరు
ఈ విశాలమైన జగతి నిందరు జీవులకును
నీవే తల్లివి తండ్రివి నీవే పరమాప్తుడవు

పుట్టిగిట్టి పుట్టిగిట్టి పుడమిపై వేమార్లు
గట్టిమేలేమి నేను పొందితినయ్యా
తుట్టతుదకు నాగతివై తోచితి వీవే
యెట్టివాడ నైన రక్షణీయుడ గానే

దీవించి ప్రోచునట్టి దేవునకే దయలేదా
జీవు డెన్నటికి యొడ్డు చేరుకొనును దేవా
కావున నాపైన దయ గట్టిగా చూపవలయు
ఓ విశ్వజనక న న్నుధ్ధరించవయ్య