19, మార్చి 2018, సోమవారం

పరమాత్ముడు రాముని పట్టాభిషేకము


అరయుడీ జనులు పట్టాభిషేకము
పరమాత్ముడు రాముని పట్టాభిషేకము

సకలనదీజలములు సకలవార్థిజలములు
అకళంకుడౌ తనకు నభిషేకము సేయ
వికచోత్పలనయనుడు వీరరాఘవమూర్తి
ప్రకటంబుగ  పట్టభద్రుడగుటను

వికటబుధ్ధి పౌలస్త్యు విరచినట్టి వీరుడు
సకలసురాసురజన సంపూజిత మూర్తి
సకలార్తినాశనుడౌ సర్వేశ్వరుండిదే
ప్రకటంబుగ  చక్రవర్తియగుటను


అంగజగురుని దివ్యావతారమైనట్టి
శృంగారరాముడు సింహాసనంబున
బంగారుతల్లి సీత ప్రక్కనే మెఱయగ
అంగీకరించిన పట్టాభిషేకమును