1, మార్చి 2018, గురువారం

హరి సేవనమే యానందము


హరి చింతనమే హరి కీర్తనమే
హరి సేవనమే యానందము

నరులకు సురలకు గరుడోరగులకు
సురవిరోధులను సుజనులకు
హరున కింద్రునకు నజునకు నిత్యము
హరియే కారణ మానందమునకు

విషయము లిచ్చు వివిధసుఖములు
విషతుల్యము లని వివరించు
విషయవిరాగులు వేదమూర్తి హరి
విషయవిహరణా విమలశీలురకు

భక్తసులభుడని పరమాత్ముడని
రక్తి మీఱ శ్రీరామునితో
ముక్తి బేరమున మురియుచు మనసుల
యుక్తములని ముందొడ్డెడి వారికి