25, మార్చి 2018, ఆదివారం

తరింపజేయగ తారకబ్రహ్మము ధరపై వెలసినది


తరింపజేయగ తారకబ్రహ్మము ధరపై వెలసినది
సురుచిరసుందర శ్రీరామాకృతి నరులకు తోచినది

అకారవాచ్యుడు బ్రహ్మయె జాంబవదాకృతితో నొప్ప
ఉకారవాచ్యుడు ఆంజనేయుడై యొప్పెను రుద్రుండు
మకారవాచ్యుడు సుగ్రీవుండై మార్తాండుడు వచ్చె
వికారరహితులు దేవతలిట్లు వెలసిరి ధరపైన

నాదము శత్రుఘ్నాకృతి దాల్చిన నారాయణ శంఖం
మోదముతో శ్రీనారాయణకళ పొడమెను లక్ష్మణుడై
అదిబిందువగు శ్రీహరి చక్రం బైనది భరతునిగా
మేదినిపై హరి వివిధవిభూతులు వెలసిన వీగతిని

మూలప్రకృతి సీతామాతగ పుడమిని కలిగినది
నేలకువచ్చిన విశుధ్ధబ్రహ్మము నిజము రామమూర్తి
ఈ లీలగ పట్టాభిషేక శుభ వేళను సభలోన
మేలుగ ప్రణవమె మనుజాకృతులను మేదిని పై వెలసె