8, మార్చి 2018, గురువారం

రాముని సేవించ రాదా ఓ నరుడా


రాముని సేవించ రాదా ఓ నరుడా
కాముని సేవించి కడతేరక

మోహనాంగుని నీవు మోహించి సేవింప
నూహింతువో రాము డుత్తము డందాన
మోహించి రాతని మునిపుంగవులు కూడ
పాహి యనుచు వాని భావింపరాదా

శ్రీమంతునే నీవు సేవించ దలచిన
రామచంద్రుని కన్న శ్రీమంతు డెవ్వడు
రాముని మోక్షసామ్రాజ్యలక్ష్మీపతిని
ప్రేమతో సేవించి పెంపొందరాదా

ఏడేడు జన్మల నెడబాయకుండెడు
వాడే కావలెనని వాదింతువో నీవు
కూడుకొన్న వారి వీడక రక్షించు
వాడన్న శ్రీరామభద్రుడొక్కడె కాదే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.