2, మార్చి 2018, శుక్రవారం

ఓ మహానుభావ రామ యూరకుందువా


ఓ మహానుభావ రామ యూరకుందువా
తామసుడని వీనిపైన దయచూప నందువా

నీతిపథము లెఱుగడే నియమనిష్ఠ లెఱుగడే
ప్రీతిగ పెద్దలను సేవించుటే యెఱుగడే
కోతిబుధ్ధి వానిపైన కొసరుటేల దయయని
సీతాపతి నాపైన శీతకన్ను వేసితివా

వేదవిదుల నెఱుగడే వేదార్ధ మెఱుగడే
వేదాంత మెఱుగడే వేదములే యెఱుగడే
వేదవేద్యుడ నేనను విషయమే యెఱుగడే
యీ దురాచారు నేల చేదుకొందు నందువా

భవరుజాలక్షణముల వలన నిట్లైతి తండ్రి
యవలక్షణములు నా యాత్మలోనివా తండ్రి
భవదీయ సుతుడ గా కెవడనయ్య నా తండ్రి
రవిచంద్రవిలోచన రక్షించవయ్య నన్ను