27, మార్చి 2018, మంగళవారం

దేవుడు రాముడు దేహాలయమున


దేవాలయ మీ దేహమందు విక దేవుడెవ్వరో చెప్పవయా
దేవుడు రాముడు దేహాలయమున జీవుడు రాముని పూజారి

జీవులందిరి దేహము లందున దేవుడెందుకు నిలచునయా
జీవుడు దేవుని చిత్కళ గావున దేవుడు జీవుని విడువడయా
దేవుడు తనలో కొలువై యుండగ జీవున కెందుకు తిప్పలయా
దేవుడు తనలో కొలువైనాడని జీవుడు మరచుట ఛేతనయా

దేహాలయమే రామాలయమను యూహ చక్కగా నున్నదయా
ఊహాపోహము లనరాదయ్యా ఉన్న సంగతిని తెలిపితిని
దేహములోపల నుండు దేవుని తెలియు విధంబును చెప్పవయా
దేహమె నేనను భ్రాంతిని విడచిన దేవుని తెలియగ నగునయ్యా

ఎంతో చక్కని సత్యము చెప్పితి విందుకు ఋజువును చూపవయా
సంతోషమయా భగవద్గీతాశాస్త్రము ఋజువులు చూపునయా
చింతలుడిగి ఆ హృదయేశ్వరుని చింతించిన ఫలమేమిటయా
సంతత మటుల చింతించినచో చక్కగ మోక్షము కలుగునయా