17, మార్చి 2018, శనివారం

ఓ రామచంద్రుడా ఒక మాట వినవోయి


ఓ రామచంద్రుడా ఒక మాట వినవోయి
నీరేజనేత్రుడా నిన్నే అడిగే నోయి

ఎన్నెన్నో తోలుతిత్తు లెంచియెంచి దూరితి
ఎన్నెన్నో పాపంబుల నెఱుగక నే జేసితి
ఎన్నెన్నో పున్నెంబుల నెఱుకతో జేసితి
ఎన్నాళ్ళిటు తిరుగుదు నెప్పటికి నిలకడ

ముక్కోటి దేవతల మున్ను నే కొలిచితి
దక్కిన ఫలములను మిక్కిలిగ మెక్కితి
మెక్కిన కొలది యాక లెక్కువౌట జూచితి
యెక్కడో తప్పు జరిగె నే నేమి చేయుదు

ఇన్నిన్ని పుట్టువులు నిన్ని పాపపుణ్యములు
ఇన్నిన్ని దైవతములు  నిన్నిబిన్నపథములు
అన్నియు నా కవసరమా నిన్నొక్కడినే నమ్మి
ఉన్నానది చాలునుగా  అన్నదియే నా ప్రశ్న