23, మార్చి 2018, శుక్రవారం

తానేల చూడరాడయ్యా


తానేల చూడరాడయ్యా దాశరథి పట్టాభిషేకము
పోనడచి యిడుములన్ని బ్రోచినట్టి వాని యున్నతి

శ్రీశచీపురందర ఋషి చింతదీర్చిన శీఘ్రశరుడు
దాశరధికి జరుగు వేడుక తనదు వేయి కనుల జూడ
ఆశతో నరుదెంచ కుండునె యాత డీ మునిబృందమందు
ఆశాధిపతుల గూడి యమితగుప్తు డగు గాక

మ్రుచ్చిలి తన పట్టణమును మ్రుచ్చిలి తన వాహనమును
హెచ్చిన గరువమున జేసి హింసించిన రావణుండు
చచ్చె నెవని వలన నట్టి జానకీ పతి వైభవమును
వచ్చి చూడక యుండు టనగ వశము కాదు ధనదునకన

సుదతుల చెఱబట్టు తులువను చూర్ణము కావించి నట్టి
విదితవిక్రము డైన రాముడు వేడ్క మిగుల గద్దె కెక్కగ
ముదితుడై తిలకించుటనై ముచ్చట పడకుండ వశమే
మృదులహృదయుడు ధనదపుత్రుం డెఱుకపడక నుండె గాని