21, మార్చి 2018, బుధవారం

కానుకలను చదివించు చున్నారు


ఇదె  చూడుడీ రాజు లెందరో కానుకలను
చదివించు చున్నారు సార్వభౌమునకు

రతనాలు ముత్యములు రాసులుగా కొందరును
అతిమనోహరములగు పతకములు కొందరును
కుతుకముతో బంగారము కొండలుగా కొందరును
ప్రతిలేని రఘునాథుని పట్టాభిషేక వేళ

కానుకలుగ రాజ్యములే కరుణించు ప్రభువుకు
కానుకలను తెచ్చిరిదే ఘనులైన రాజులని
దావవేశ్వరుని తోడ వానరేశ్వరు డనగ
దానికేమి యిది సంప్రదాయమను నాతండును

రాకాసుల నడగజేసి లోకేశు లందరకును
ప్రాకటముగ చిత్తశాంతి పరగ కానుక జేసె
ఆ కడిది వీరున కిదె యందింతురు వేడుకతో
చేకొనుమని శక్తికొలది సాకేతరామునకు


4 కామెంట్‌లు:

  1. 'రాజ్యాలనే కానుకగా ఇచ్చే రాజునకు కానుకలు!' మనోహరమైన భావం. చాలా బాగుంది గేయం. అభినందనలు. చివర "శ్యామలాంగ రామునకు" అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీకు ఈ కీర్తన నచ్చినందుకు సంతోషం. శ్రీరామపట్టాభిషేకకీర్తనల్లో ఇది నాలుగవది.

      మీ రన్నట్లు ముద్రవేయటం అన్న భావన గురించి ఆలోచిస్తున్నాను.
      ఇంకా మొదలుపెట్టలేదు.

      యతి కుదరదు కదండీ శ్యామలాంగ రామునకు అంటే. అందువలన, కీర్తనలో యతిప్రాసలను పాటిస్తున్నాం కాబట్టి
      సాకేతరామునకు శ్యామలాంగునకు నేడు
      అని ముగించవచ్చును.

      ఏమంటారు.

      తొలగించండి
  2. నాకు కానుకలమీదా, కనక సింహాసనం మీదా తప్ప చిత్త శాంతి మీదా, సాకేతరాముడిమీద మనసు నిలవటం లేదండి. ఏమి దారి? ః-(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కనీసం ఆ విచారం ఉన్నది కదా. అది శుభేఛ్ఛను కలిగి ఉండటాని గుర్తు. కాలక్రమేణా మనసూ నిలుస్తుంది లెండి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.