26, మార్చి 2018, సోమవారం

ఏది ముఖ్యమో నీ కెఱుకగుట ముఖ్యము


ఏది ముఖ్యమో నీ కెఱుకగుట ముఖ్యము
నీ దైన యొఱుకయే నీకు ముఖ్యము

కనుగొనరాని వాని కనులజూచుట కాదు
మనసులో చూచుటే ముఖ్యము
తనమనసున స్వామి దయచేసి యున్నచో
తనకు లోక మేమంత ముఖ్యము

విరివిగా పూలు తెచ్చి విసిరితే సరిపోదు
మరి రాముని వాడగుటే ముఖ్యము
పరమప్రీతితో నిన్ను పరమాత్ముడు మెచ్చ
నరులమెప్ప దేమంత ముఖ్యము

దినదినము స్వామిపై దివ్యమైన కీర్తనలు
మునుకొని చెప్పుటే ముఖ్యము
తనస్వామికి తనపాట మనసుకు నచ్చుచో
గొనుగు లోక మేమంత ముఖ్యము