7, మార్చి 2018, బుధవారం

పట్టుము హరిపాదము నెట్టుము యమపాశము


పట్టుము హరిపాదము నెట్టుము యమపాశము
పట్టుబట్టి మోక్షద్వార మిట్టే నీవు నెట్టుము

అడుగడుగున తోడుపడ హరియె రాముడై వచ్చె
పడిలేచుచు భవజలధిని పయనించెడు వాడ
వడివడిగ నీవు రామపాదములను చేరుము
జడతవిడచి నీవు కార్యసాధకుడవు కమ్ము

లేనిపోని శంకలకు లోనుగాక నీవిపుడు
ధ్యానించుము శ్రీరాముని ధర్మావతారుని
మానవులకు శ్రీరాముని మార్గమే శరణ్యము
జ్ఞానమోక్షములు రామచంద్రుడే యొసంగును

మరలమరల పుట్టనేల మరలమరల గిట్టనేల
మరలమరల దుష్పథముల మానక చరించనేల
నరుడా శ్రీరాముడే నారాయణుడని తెలిసి
పరుగుపరుగున రామ పాదసీమ చేరుము