4, మార్చి 2018, ఆదివారం

కేసీఆర్ గారి అంతర్యం పై ఒక ఆలోచన.



ఆంధ్రావాళ్ళు తమకు జరిగిన అన్యాయం పైన గోలగోల చేస్తున్నారు.
ఒకవేళ వాళ్ళకు తగిన మద్దతు దొరికితే ఆంధ్రులకు న్యాయం జరిగే అవకాశమూ ఉంది.

సరిగ్గా ఇప్పుడే, ఉన్నట్లుండి, ఒక గొప్ప ప్రకటన!

దేశంలోని రాజకీయం అంతా భ్రష్టుపట్టి పోయిందని కేసీయార్ గారూ హఠాత్తుగా రంకెలు వేస్తున్నారు.
దీని వెనుక ఆయనకొక ఆలోచన ఉంది.

చిన్న పామైనా పెద్దకర్రతో కొట్టమన్నారు.
ఆంద్రులు తమకు న్యాయం సాధించుకొనే అవకాశం నూటికి ఏ పదిశాతమో ఉండవచ్చును.
కానీ అది మాత్రం ఎందుకు పడనివ్వాలీ అని మనస్సులో అనుకొనే వాళ్ళూ ఉంటారు.

అటువంటి వారిలో కేసీఆర్ గారు ఒకరు అని అనుకొంటున్నాను.
అటువంటి వారికో కేసీఆర్ గారు ఒకరు కారు అనుకొందుకు అవకాశం ఏమీ లేదు కాబట్టే అలా అనుకోక తప్పదు.

రాజకీయులు అలా అలోచించే అవకాశం ఉంది తప్పకుండా.

కేసిఆర్ గారు తెలివైన వారు. అంటే చతురులు. నిర్మొగమాటంగా చెప్పాలంటే గొప్ప జిత్తులమారి.
ఆయన మాటల్లోని ఆంతర్యం తెలుసుకోండి.

రాజకీయవాతావరణంలో  ప్రస్తుతం ఆంధ్రా అనేది కేంద్రబిందువుగా సాగుతున్న చర్చను దారి మళ్ళించటమే ఆయన ఉద్దేశం.

అబ్బెబ్బే కవితగారూ కేసీఆర్ గారూ కూడా ఏదో ఆంద్రులకి వత్తాసు ఇస్తూనే మాట్లాడారే నిన్నమొన్ననే అని అనుకోవచ్చును.

రాజకీయులు మనస్సులో ఉన్న మాటనే మాట్లాడుతారన్న నియమమూ నమ్మకమూ ఏమన్నా ఉందా?

నోటితో నవ్వి నొసటితో వెక్కిరించటం రాజకీయులు చేయరనో చేయలేరనో అనుకునే అమాయక చక్రవర్తులకి ఒక దండం.

ఉభయప్రాంతాలకూ సమంగా న్యాయం జరిగేలా విభజన చేస్తాం చేస్తే గీస్తే అన్న కాంగ్రెసు, ఆంద్రులకు బుజ్జగింపు మాటలు ఎన్ని చెప్పలేదు? చివరికి చేసిందేమిటీ?

ఒక సమయంలో ఒక పెద్ద రాజకీయ దుమారం రేగితే దానిమీద చర్చను పలుచనచేయటానికి మరికొన్ని అదేస్థాయి రాజకీయ దుమారాలు సృష్టించటం ఒక మంచి దారి, వీలైతే మరింత పెద్ద రాజకీయ దుమారం రేగితే మొదటి అంంశం  చర్చనుండి ప్రక్కకు పోతుంది.

అందుకే, అలా ఆంద్రాపై జాతీయ రాజకీయరంగలో కొద్దోగొప్పోగా ఏర్పడుతున్న ఫోకస్ ఉన్నదే, దాన్ని పలుచన చేయాలన్నదే కేసీఆర్ గారి ఎత్తుగడ కావచ్చును తప్పకుండా.

జాతీయరాజకీయాల్లోనికి రానూ, నాకు ఆసక్తి లేదూ అని విస్పష్టంగానే లోగడ వాక్రుచ్చిన శ్రీమాన్ కేసీఆర్ గారికి  ఉన్నట్లుండి, జాతీయ రాజకీయాల్లోనికి రావాలని అనిపించటమూ అసలు భారతజాతికే దిశా దశా నిర్దేశం చేసి తరింపజేయాలన్న పుణ్యసంకల్పం కలగటమూ కేవలం ఉన్నట్లుండి హఠాత్తుగా బీజేపీ కాంగ్రెసు పార్టీలు రెండూ దొందూ దొందే అన్న జ్ఞానోదయం కావటం అని నమ్మటం కుదరదు.  ఎంతమాత్రమూ కుదరదు!

అందుకనే దేశరాజకీయాల్లో మూడో ఫ్రంటూ అదీ తన నాయకత్వమూ అంటూ పాట మొదలు పెట్టి ఆ చర్చతో ఆంద్రాపై జాతీయస్థాయి రాజకీయాల్లో ఫోకస్ తప్పిపోయేలా చేయాలన్నదే ఆయన ఆంతర్యం అని నమ్మవలసి వస్తోంది.

పవన్ కల్యాణ్ వంటి అమాయక చక్రవర్తులు తమను తాము రాజకీయ మేథావులుగా భావించుకొంటూ సంబరపడిపోతే పోవచ్చు కాక. సగటు భారతీయుడు ఇంత చిన్న విషయం గ్రహించలేడని అనుకోను. పొనీ సగటు ఆంద్రుడు ఇంంత అమాయకంగా  నమ్మి జైజై అనేస్తాడని అనుకోను.

వీర కేసీఆర్ అభిమానులూ, తాము రెండు పెద్దపార్టీలకూ వ్యతిరేకం కాబట్టి కేసీఆర్ గారికి స్వాగతం చెప్పటం కోసం తొందరపడిపోవాలనుకొనే కొన్ని చిల్లరపార్టీల చిన్నాపెద్దా నాయకులూ నేను అర్థం చేసుకున్న కోణంలో ఆలోచించటానికి ఇష్టపడక పోవచ్చును.

కాని ఈ కోణం కూడా తప్పక ఆలోచించదగినదే.

ఒక పులీ ఒక సింహమూ రెండూ కూడా అడవిని భక్షిస్తున్నాయే కాని రక్షించటం లేదని మరొక క్రూరమృగాన్ని అడవికి రాజును చేసినా పరిస్థితిలో ఏమీ మార్పు ఉండదు. స్వతహాగా రాజకీయులంతా క్రూరమృగాల్లాగే ఉన్నారు నేటి రాజకీయాల్లో ఎవర్నీ నమ్మే పరిస్థితి లేదు. అందరూ స్వార్థపరులే - పోనీ నూటికి తొంభైతొమ్మొది శాతం మంది ఐనా అదే బాపతు.

ఆంద్రులు ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ కేసీఆర్ గారికి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఇస్తే ఆంద్రులకు బ్రతికే హక్కు కూడా లేదని బిల్లు పాస్ చేయగల సమర్థులు.  తెలంగాణా ఉద్యమం పేరుతో ఆంద్రులపై ఎన్నెన్నో అవాచ్యాలు మాట్లాడిన మహానుభావుడు తమపై నిజంగా సానుభూతి కలిగి ఉన్నాడనో, జాతీయరాజీకీయాలకు నిజాయితీనో నిస్వార్థతనో జోడిస్తాడనే అమాయకంగా నమ్మటం అంటే కొరివితో తలగోక్కోవటమే.  తస్మాత్ జాగ్రత జాగ్రత.

16 కామెంట్‌లు:

  1. ఆంధ్రుల విషయంలో కేసీఆర్ ఆంతర్యాన్ని చక్కగా వివరించారు. వారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటినుండీ ఆంధ్రులను పలు విషయాలలో ఎగతాళి చేస్తూ మాడిన మాటలు నాకు బాగా గుర్తు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలాంటి మాటలను ఆత్మాభిమానం ఇసుమంతైనా ఉన్న ఎవరూ మరువలేరు - మరువరాదు.

      తొలగించండి
  2. పుట్టగొడుగు పార్టీలతో ఏర్పడే కిచిడి ప్రభుత్వాలు దేశసమగ్రతకే ప్రమాదకరం. ఒకరితో ఒకరు కొట్టుకు చచ్చి దేశాన్ని బుచికోయమ్మ బుచికి చేస్తారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దపార్టీలు కూడా అవసరమైన చోట లాలూచీ రాజకీయాలు నడిపి దేశాన్ని బుచికోయమ్మ బుచికి చేస్తున్నారు కదా! పెద్దైనా చిన్నైనా సరేను, అన్నీ పళ్ళూడగొట్టే రాళ్ళేను.

      తొలగించండి
  3. స్థానిక సంస్థలను బలోపేతం చేయమని జయ ప్రకాష్ నారాయణ్ గారు ఎప్పటినుండో చెపుతున్నారు. పంచాయితీలో వచ్చే డబ్బు కరెంట్ ఖర్చులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికే సరిపోదు. రోడ్లు వేయాలంటే కేంద్రం మీద ఆధారపడవలసిందే ! మద్దతు ధర కేంద్రమే ఎందుకు పెంచాలి ? కూలి డబ్బులు కేంద్రమే ఎందుకివ్వాలి అని కే సీ ఆర్ గారు అడుగుతున్నారు.
    నా ఆడబుర్రకు తోచినదేమిటంటే భార్యా భర్తా ఇద్దరూ సంపాదించినా ఖర్చులు గురించి ఇద్దరూ కలిసి ఆలోచించుకోవాలి. ఎవరి డబ్బులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేసుకుంటే ఇల్లు కొనడం, పెళ్ళి చేయడం, హటాత్తుగా బందువులు రావడం, రోగాలబారిన పడడం లాంటి ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి ? భార్యలే సంపాదించి ఇల్లు గడపాలి అని ఎవరైనా అంటే నాకు సంతోషమే కానీ అందరు భార్యలూ కే సీ ఆర్ గారి కూతురిలాగా ఆస్థులు తీసుకుని అత్తింటికి రారు కదా ? అన్ని ప్రాంతాలూ తెలంగాణాలాగా ఆర్ధికంగా బలోపేతంగా ఉండవు కదా ? అందరినీ చూసుకోవలిసిన భాధ్యత కేంద్రానికే ఉండాలి. కేంద్రం సరిగా వ్యహరించలేదనే తెలంగాణా విడాకులు తీసుకున్నపుడు కే సీ ఆర్ ఉమ్మడి కుటుంబవ్యవస్థకి, పెత్తనానికి అంగీకరించరు కదా ? ఆయనకి కేంద్రం మీద కన్నుపడింది. దేశం నిరంకుశత్వం వైపు నడుస్తోంది. ఆపగలమా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'దేశం నిరంకుశత్వం వైపు నడుస్తోంది' అన్నది నిజమే. నిరంకుశత్వానికి శ్రీకారంచుట్టిందీ, ఆకారం ఇచ్చిందీ కూడా ఏ కొత్త ప్రభుత్వమో కాదు కదా, తొలినాళ్ళ నుండీ పెత్తనం వెలిగించిన కాంగ్రెసు వారే కదా? నిన్నటి సభాసదులను తన్ని చీకట్లో చేసిన విభజనకాండ కూడా నిరంకుశత్వమే కదా? దానిని అప్పుడు స్వాగతించిన పెద్దమనిషి ఇప్పుడు కేంద్రం పెత్తనం గురించి బుడిబుడి దీర్ఘాలు తీసినంతమాత్రాన నమ్మటానికి ఎవరు సిధ్ధంగా ఉంటారు? మరికొందరు అలాంటి అవకాశవాదులు తప్ప?
      ఏదో పవన్ వంటి అవ్యక్తులు తప్ప?

      కేంద్రంపై కేసీఆర్ కన్ను పడిందా? పడితే ఆయన కరుణాకటాక్షవీక్షణాలతో అంతా మారిపోతుందనీ దేశం కేసీఆర్ మార్కు మంచి దారిలోనికి వస్తుందనీ ఆశించాలా? శాంతమ్ పాపమ్!

      తొలగించండి
  4. భయపడుతున్న ప్రతిపక్షాలు.
    మూడు చిన్న రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు దేశంలోని ప్రతి పక్షాలనో కుదుపు కుదిపాయి. ఇప్పుడో సారి దేశ రాజకీయాలను చూద్దాం.

    కాంగ్రెస్,నిజానికి చాలా నిశ్చింతగా ఉన్నదీ పార్టీ, ౩౩ సార్లు వోడినవాడికి మరో సారి కర్ణాటకాలో ఓటిమి ఇబ్బంది పెట్టేదేం కాదు. మూడు రాష్ట్రాలలో మేఘాలయ లో ఎక్కువమందిని గెలిపించుకున్నా చిన్న పార్టీలు ఛీ కొట్టడంతో అధికారానికి దూరంగా నిలబడిపోవాల్సి వచ్చింది. ఇక దేశంలో అధికార యోగం లేదన్న స్థిర నిర్ణయానికే వచ్చేసింది. మిత్రులు వందిమాగధులు ఎంత మోసినా పని జరగడం లేదు, గుళ్ళూ గోపురాలూ రక్షించటంలేదు. సోషల్ మీడియా,ప్రింట్ మీడియా,విసుయల్ మీడియాలలో, ఏదో జరిగిపోతోంది దేశం లో అన్న ప్రచారమూ పని చేసినట్టు లేదు. మోడీ మోడీ ఒకటే, బేంక్ స్కాం మోడీ పాపమని ఎంత చెప్పినా ప్రజలు నమ్మేట్టులేరు, ప్రజలకి నిజమేంటో తెలిసినట్టే ఉంది.

    మొన్నటి ఎన్నికల ఫలితాలలో ముఖ్యమైనది, త్రిపురలో ఎర్రకోట కూలిపోవడం. పులుగడిగిన ముత్యం, మానిక్ సర్కార్, మన్మోహన్ సింగ్ లాటివాడన్నారు ప్రజలు. ఏమీ లేని చోట ఈ విజయం ఎలా సాధించిందన్నది ప్రతి పక్షాలకు మింగుడు పడటం లేదు. భాజపా విజయం, మా పరాజయం అనుకోనిది, ఊహించనిది అన్నది, మానిక్ మాట. భాజపా గత నాలుగేళ్ళుగా త్రిపురలో పని చేస్తోందన్నది నేడు తెలిసిన నిజం.

    ఇదిగో ఈ నిజం తెలిసి ఎర్రకోట బద్దలైపోవడంతో గుండె పట్టుకున్నవారు ముగ్గురు. విజయన్ మహాశయుడు చాలా కాలం కితం బుక్ చేయించుకున్న మెడికల్ చెక్ అప్ అర్జంటుగా మద్రాసులో చేయించుకోవలసి వచ్చింది. ఆ తరవాత దేశ రాజకీయాలు కుళ్ళిపోయాయి మూడో ఫ్రంట్ కావాలని ఒక్క సారి గావు కేకేసి ఢిల్లీ పరిగెట్టినవాడు చంద్ర శేఖరుడు. ఆ మాటందుకుని నేను నీవెంటే అన్నది దీదీ కబురు. మరికొన్ని పిల్ల సన్నాయిలూ వినపడ్డాయి.

    అసలు వీరు ముగ్గురికే ఇంత అర్జంటుగా ఈ బాధ ఎందుకొచ్చిందో! విజయన్ మహాశయుడు,చంద్రశేఖరుడు, దీదీ కి వెంఠనే వచ్చిన ఇక్కట్టు ఏం లేదు, కాని తరవాత గురి తామేనా అన్నదే అసలు భయం.

    నిజానికి ఆం.ప్ర వారు నోరెత్తి గోల చేస్తున్నారు, జరిగిన అన్యాయం గురించి, దీన్ని సరి చెయ్యకపోడం కేంద్రంలోని భాజపా తప్పిదం అవుతుంది. అసలు మూడో ఫ్రంట్ గురించి మాటాడనివారు తెలివైనవాడు చంద్రబాబునాయుడే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. .... పులుగడిగిన ముత్యం, మానిక్ సర్కార్, మన్మోహన్ సింగ్ లాటివాడన్నారు ప్రజలు.....

      మన్మోహన్ సింగ్ వంటి వాడంటే నోరులేని వాడనేగా. ఆయనొక్కడూ వ్యక్తిగతంగా ఎంత నిజాయితీపరుడైనా అయన నెత్తిన మోస్తున్న పార్టీలో కూడా ఆ నిజాయితీ తగినంత ప్రతిఫలించకపోతే ఎలా? అందుకే మన్మోహన్ లాగే కనుమరుగు కాక తప్పలేదు మరి!

      తొలగించండి
  5. ఆంధ్రకు ఎదో అన్యాయం జరిగి పోయిందని, లేదా ప్రస్తుతం జరుగుతుందని కొందరు ఆంధ్రులు అనుకుంటారు. ఇది వారిష్టం.

    సదరు "అన్యాయం" చేసింది మేమంటే మేము కాదని, మీరంటే మీరేనని జరిగే వాదోపవాదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చెప్పేవారి ఇష్టాయిష్టాలు & కాలమానపరిస్థితుల ప్రకారం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైకాపా, తెరాస వగైరాలు హీరో, విలన్ లేదా కమేడియన్ పాత్రలలో ఉంటారు.

    దేశ రాజకీయాలు తాను శాసించగలనని కెసిఆర్ భ్రమ పడుతున్నాడు. ఇదే భ్రమ ఇంకెందరికో ఎన్నోసార్లు గతంలోనూ వచ్చింది, ప్రస్తుతం కూడా ఎందరో కల కంటున్నారు. ఎవరి ఇష్టం వారిది, కలలపై నిషేధం లేదు!

    కెసిఆర్ అయినా ఇంకోరయినా ఒకేఒక్క వ్యక్తి తనంతతానే ఎదో సాదించగలడని అనుకోవడం ఎంత తప్పో దేన్నో నాశనం చేయగలడని కోవడం అంతే అర్ధరహితం.

    రిప్లయితొలగించండి
  6. జై గారూ,

    మీ ధోరణి చూస్తే ఆంధ్రులు తమకు అన్యాయం జరిగిందని కేవలం అనుకుంటూన్నా రంతే అన్నట్లుంది. క్షమించాలి, అదంత సబబుగా తోచదు నాకు.

    పిచ్చిమనిషి చేతిలోని రాయిలా అధికారం ఒక వ్తక్తి చేతిలో ఉంటే మీరు అసంభావ్యం అనుకుంటున్న బాపతు నాశనం తేగలగటం అసాధ్యం కాదని మొన్ననే ఒక వీరవనిత యొక్క పుత్రోత్సాహం నిరూపించింది కదా. ఒక వ్యక్తి యొక్క పుత్రోత్సాహం పంచదశశతాబ్దుల క్రిందట ఎంత పెద్ద మారణహోమానికి కారణమైనదో ఎవరికి తెలియదు! కాబట్టి అలాంటి పిచ్చి మాలోకాల చేతిలోనికి అధికారప్రాబల్యం పోకుండా ఎప్పటికప్పుడు దేశం జాగ్రత్త తీసుకోవలసిందేను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాస్టారూ, ఆంధ్రకు అన్యాయం, నష్టం లేదా అవమానం జరిగిందా లేదా అన్న విషయంపై నేనేమీ (ప్రస్తుత వ్యాఖ్యలో) అనలేదు. అది వేరే చర్చ.

      కెసిఆర్ అన్న వ్యక్తి ఆంధ్రకు ఏదో గొప్ప మేలు చేయగలడని కొందరు (ఉ. పవన్ కళ్యాణ్) అత్యాశ పడుతున్నట్టుంది. మీరు మరో extreme వెళ్లి ఏదో గొప్ప అరిష్టం చేయగలడని అనుకుంటున్నట్టు ఉన్నారు. ఇవన్నీ మానవమాత్రులకు కుదిరే విషయాలు కావని నా అభిప్రాయం. ప్రజలు పూనుకుంటే ఒకరు ఆపలేరు, వారి ప్రమేయం లేకపోతే ఎవరూ మాజిక్ చేయలేరు.

      PS: మీరు చెప్తున్న మారణహోమం ఏమిటో నాకు బోధపడలేదు.

      తొలగించండి
    2. మన్నించాలి. మీవ్యాఖ్రలో ఆంధ్రుల దుస్థితిపై అలాంటి అర్థం వచ్చిందండీ.

      పవన్ రాజకీయంలో జూనియర్. ఏదో పరిణతి ప్రదర్శించాలన్న ఉద్దేశంతో తొందరపడుతున్నాడు.

      నేను ప్రస్తావించినది ఐదువేల యేళ్ళ క్రిందట ధృతరాష్ట్రుడి పుత్రమోహం కలిగించిన మారణహోమం గురించి.

      తొలగించండి
    3. "ఏదో పరిణతి ప్రదర్శించాలన్న"

      పవన్ కళ్యాణ్ తీరు చూస్తే పాత ఉర్దూ మెతక సామెత గుర్తుకొస్తుంది:

      मै नहीं, मेरा भाई मर्द है (main nahi, mera bhai mard hai. నేను కాదు మా అన్న మగాడు)

      ప్రజలు ఎవరు సమర్ధులు అనుకుంటే వారికే ఓటేస్తారు, మధ్యలో ఈయన సిఫార్సు ఎందుకు? నాకు ఓటేయండి అనే వాళ్ళను చూసాం కానీ ఫలానా వారు గొప్ప కనుక వాళ్ళను నెత్తిని ఎక్కించుకోండని ఊరూరా దండోరా వేయడం ఈయనకే చెల్లింది!

      "ధృతరాష్ట్రుడి పుత్రమోహం"

      Ok sir, I understand the context now

      తొలగించండి
  7. మూడో ఫ్రంట్ ముచ్చట

    దేశ రాజకీయాలలో ముందు చెప్పుకోవలసింది,మంచైకైనా చెడ్డకైనా, మొదటిది కాంగ్రెస్. ఆ తరవాత జాతీయ పార్టీ భాజపా. వీటిని రెండు పక్షాలనుకుంటే మిగిలినదే మూడో ఫ్రంట్. ఈ మిగిలినవారెవన్నదే అసలు ప్రశ్న.

    మూడో ఫ్రంట్ అన్నది దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలేం కాదు. ఒక్కోరాష్ట్రంలో ఒక్కో పార్టీ ఒక్కో అజెండా...ఇలా ముక్కలుగా ఉన్నదే నూడో ఫ్రంటు.అసలంటూ పుడితే అదో అతుకులబొంత. పుట్టక ముందే ముక్కలవుతున్నదీనూ. మూడో ఫ్రంట్ ముచ్చట ఇదే మొదటిసారి కాదు, ఈ ముచ్చట చాలా సార్లయింది, ఇది మరో ప్రయత్నం. మూడో ఫ్రంట్ లో ఉండేవారెవరో!

    కమ్యూనిస్టులు: వీరు తమది అంతర్జాతీయ పార్టీ అంటారుగాని చివరికి నేడు చిన్న రాష్ట్రాల ప్రజలచే కూడా తిరస్కరింపబడుతున్నారు. మొన్న బెంగాల్ లో దీదీ చేత మట్టి కరిచారు, మళ్ళీ కోలుకోలేదు, లేరు కూడా! ఇప్పుడు బెంగాల్ లో కాంగ్రెస్ వారితోలో మూడు నాలుగు స్థానాలకు పోటీ పడుతున్నారు. నేడో రేపో కేరళాలో పరాభవం తప్పదని తెలిసిపోతూనే ఉంది. వీరికి కేరళాలో కాంగ్రెస్ తో పడదు, బెంగాల్లో దీదీతో కుదరదు, త్రిపురలో భాజపాతో సగమెరిక, మరి వీరెవరితో పొత్తు పెట్టుకుంటారో, మిగిలిన దేశంలో వీరి జాడలేదు. మూడో ఫ్రంట్లో దీదీ ఒక కత్తి ఎదురుగా, ఇద్దరికి రాష్ట్రంలో కుస్తీ,దేశంలో దోస్తీ కుదురుతుందా?ప్రజలు నమ్ముతారా?

    ఎన్.సి.పి. పవార్ మహాశయులకు మహారాష్ట్రలో, గుజరాత్ లో కొద్ది టికానా ఉన్న పార్టీ. సావకాశం కుదిరితే కాంగ్రెస్ లోకాని భాజపాలో గాని చేరి అధికారం పంచుకోడానికి సిద్ధమే! ఇక్కడే మరో శత్రువు అదే మహరాష్ట్రకే పరిమితమైన శివ సేన. వీరిద్దరికి పడదు, మరెలా?

    మాయావతి,ములాయం ఉత్తర ప్రదేశ్ లో వీరిద్దరికి చుక్కెదురు, మరి మూడో ఫ్రంట్లో వీరిద్దరు దోస్తీ కుదిరేనా? ములాయం స్వంత ఇంట్లోనే ఏకాభిప్రాయం లేదు,పార్టీలోనూ లేదు.

    బెంగాల్ లో మమతకే మరో పోరు లేనిది.

    బీహార్:నితీశ్, లాలూ ఇద్దరికి పొత్తు లేదు, దేశ రాజకీయంలో పొత్తు కుదురుతుందా?

    ఢిల్లీ: ఆప్ అనే కొత్త పార్టీ, వీరంటే ఎవరికి సదభిప్రాయమే లేదు. మరి వీరెవరితో కలుస్తారు?

    పంజాబ్ లో హర్యానా లో ఉన్న రెండు పార్టీలు కత్తులు దూసుకునేవే!

    ఈశాన్య రాష్ట్రాలలో కూడా ప్రతి రాష్ట్రంలో కత్తులు దూసుకునే పక్షాలే ఉన్నాయి.

    మధ్య ప్రదేశ్, రాజస్తాన్, లలో స్థానిక పార్టీలు లేవు.

    ఒడిశాలో బిజుదల్ దాని పని అది చేసుకుపోతోంది, అనువుగా ఉంటే మూడో ఫ్రంట్ లేదంటే... ఇది వీరి మాట.

    ఇక దక్షిణాది రాష్ట్రాలు లో ఎవరి తీరువారిదే.

    నేడో రేపో కర్ణాటక కూడా భాజపా కాతాలో కలిసిపోయేలాగే ఉంది, అక్కడి జె.డి.స్ కుదిరితే మూడో ఫ్రంట్ లేదూ మరో తలనొప్పిలేదు దానికి.

    ఆం.ప్ర లో రెండు పార్టీలు తె.దే, వై.ఎస్.ఆర్ సి.పి కత్తులు దూసుకుంటూనే ఉన్నాయి,ఇప్పటికే. మూడో ఫ్రంట్లో ఒకరుంటే మరొకరుండరన్నది ఖాయం.

    తమిల్నాడు: ఇదెప్పుడో ప్రతి పక్షాల కాతాలో పడిపోయింది. ఇప్పటికి డి.ఎమ్.కె, ఎ.డి.ఎమ్.కె మధ్యనే అధికార పంపకం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి వుండడం జరగని పని.

    తెలంగాణా: కొత్తగా పుట్టిన రాష్ట్రం, వనరులు ఉమ్మడిలో బాగా దొరికినది. టి.ఆర్.స్ పార్టీ పరిపాలిస్తున్నది. తన ముడ్డికిందకి ఎసరు తెస్తుందేమో భాజపా అని భయపడి మూడో ఫ్రంట్ అని గావుకేకలు పెడుతున్నవారే చంద్ర శేఖరుడు. మరో సంగతి కూడా! రాష్ట్రాన్ని కొడుక్కి అప్పజెప్పేసి దేశ రాజకీయాలో కి పోతే! ఈ ఆలోచన బాగున్నట్టుంది, అదే మూడో ఫ్రంట్ ముచ్చట. వీరు ఎవరెవరిని మూడో ఫ్రంట్లో చేరుస్తారో చూడవలసిందే.

    చంద్రశేఖరుడు: మూడో ఫ్రంట్ ,అబ్బే! ఇది మోడీకి వ్యతిరేకంకాదు, నేనూ మోడీ దోస్తులమoటున్నారు. రాజాకీయాల్లో అవసరార్ధ స్నేహాలు తప్పించి స్థిర మిత్రులుండరన్న సంగతి చంద్ర శేఖరుడికి తెలియని సంగతా?

    మూడో ఫ్రంట్ పుడుతుందా? పుడితే పేరు? పుట్టి బతుకుతుందా పేరెట్టేదాకానైనా?

    ప్రజాస్వామ్యంలో బలమైన రెండు పార్టీ లుండాలి, తప్పదు, కాంగ్రెస్ చచ్చిపోడానికి కుదరదు, బతికించాలి,కుటుంబపాలన నుంచి విడుదల చెయ్యాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. . . . . రాష్ట్రాన్ని కొడుక్కి అప్పజెప్పేసి దేశ రాజకీయాలో కి పోతే! ఈ ఆలోచన బాగున్నట్టుంది, అదే మూడో ఫ్రంట్ ముచ్చట. . . . .

      ఈ కోణమూ ఆలోచించదగ్గదే. ఏమీ స్వార్థం లేకుండానే దేశసేవ చేసేవాళ్ళున్నారా? అందులోనూ నేటికాలంలో!!

      తొలగించండి
  8. కాంగ్రెస్:- మా తాతముత్తాతలు సమస్తం ధారపోసి నిర్మించుకున్నకోట,అవకాశవాదుల చేతిలో చిక్కింది,విడిపించుకుంటాం....బతికించుకుంటాం

    బి.జె.పి:- మేము నిర్మించుకున్న రాతికోట......

    దేన్నీ వదలం

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.