1, మార్చి 2018, గురువారం

ఒడ్డున పడవేయ వయ్య ఓ రామచంద్ర


ఒడ్డున పడవేయ వయ్య ఓ రామచంద్ర నీ
బిడ్డను భవసాగరమున వేదనపడుచుంటిని

జీవున కేమిటికి వచ్చు చెప్పరాని వేదనలు
దేవుడవగు నీవు కాక తెలిసిన దెవరు
ఈ విశాలమైన జగతి నిందరు జీవులకును
నీవే తల్లివి తండ్రివి నీవే పరమాప్తుడవు

పుట్టిగిట్టి పుట్టిగిట్టి పుడమిపై వేమార్లు
గట్టిమేలేమి నేను పొందితినయ్యా
తుట్టతుదకు నాగతివై తోచితి వీవే
యెట్టివాడ నైన రక్షణీయుడ గానే

దీవించి ప్రోచునట్టి దేవునకే దయలేదా
జీవు డెన్నటికి యొడ్డు చేరుకొనును దేవా
కావున నాపైన దయ గట్టిగా చూపవలయు
ఓ విశ్వజనక న న్నుధ్ధరించవయ్య


2 కామెంట్‌లు:

  1. మీ రామకీర్తనలు తూము నరసింహదాసు గారిని గుర్తుకు తెస్తున్నాయండి 👌.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నరసింహదాసు గారు మహానుభావులు. వారితో పోల్చదగినంత వాడను కానండి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.