21, మార్చి 2026, శనివారం

నందగోపసుతావంద్య


నందగోపసుతావంద్య బృందారకజనవంద్య

నందివాహనా త్రిపురసుందరీశ మునివంద్య


వందనమో శివశంకర ఫాలవిలోచన హర

వందారు భక్తసుజనమందార దురితహర

సుందరాకార ఉమాసుందరీ సహిత లోక

వందిత సంసారభయాపహర భవతాప హర


వందనమో సదారామవందితచరణారవింద

వందనమో రామనామపారాయణసదానంద

వందనమో మహాదేవ వరదాయక శుభదాయక

అందె నాకు భవతారక మద్భుతముగ నీదయచే


కళ్ళు రెండు చాలవే

కళ్ళు రెండు చాలవే వేయి
కళ్ళున్నను జాలవే

కాళ్ళకు గజ్జెలు కట్టి
ఆడే కృష్ణుని జూడ
కళ్ళు రెండు చాలవే
వ్రేళ్ళ కుంగ్రాలు మెరయ
క్రేళ్ళుబ్బు హరి జూడ
కళ్ళు రెండు చాలవే

పిల్లనగ్రోవి బట్టి
గొల్ల కన్నెల మధ్య
చల్లని నగవులతో
అల్లన నాడుచున్న
నల్లనయ్యను జూడ
కళ్ళు రెండు చాలవే

బుల్లి నెమలి యీక
కుళ్ళాయి మీద మెరయు
ఫుల్లాంబురుహ నయను
ఉల్లము రంజిల్లగను
కళ్ళార జూతు మన్న
కళ్ళు రెండు చాలవే

నా తొలిపద్యాల గురించి


అరవైయేళ్ళ క్రిందటి సంగతి. 


హైస్కూలు చదువురోజులు. కొత్తగా పద్యవిద్య మురిపెం ఒకటి తగులుకుంది.


మాగురువుగారు వేదుల వేంకటరావు గారు ఒక పద్యపాదం బోర్డు మీద వ్రాసి పూర్తిచేయండ్రా ఆన్నారు. నాపూరణ నచ్చింది వారికి. నేర్పటం మొదలు పెట్టారు. నాతోపాటు మరొక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు కాని వారు ఎక్కువదూరం రాలేదు.


కొత్తపేటలోని ధనమ్మమర్రి దగ్గర పిక్నిక్ ప్రోగ్రాంలో మాకన్నబాబు అడిగితే ఆశువుగా చెప్పిన రెండు పద్యాల్లో ఒకటి.


తొలిజాము కోడికూసెను

తెలవారగ నుండె ననుచు తెలుపుట కొరకై

కల నిష్టభోగతతులన్

కులుకుచు నున్నట్టి భిక్షుకుడు కోపించెన్


రెండవది గుర్తులేదు.


మాస్నేహితుడు పాండురంగారావు పెళ్ళిలో చెప్పిన కొంటె పద్యం ఒకటి


నాగేశ్వర ప్రియభక్తా


అని మొదలౌతుంది. ఆముక్క ఒకటే గుర్తుంది మొత్తం రెండు పద్యాలకూ.


విషయం ఏమిటంటే మాపాండురంగారావు అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని.


కాలేజీరోజుల్లో ఒక వ్యాసరచన పోటీలో నేను కొటేషన్లు పద్యాల రూపంలో వ్రాసాను. ఆశుకవిత్వం కాదు కానీ ఇంచుమించు అలాంటిదే. ఆదెబ్ఫకు మొదటి బహుమతి ఖాయంగా ఒళ్ళోపడుతుందని నమ్మాను. అన్నాను. వచ్చింది. 


ఆపద్యాలేవీ గుర్తులేవు.


ఒకపద్యం మాత్రం


బస్సుల్ తగులం బెట్టిరి


అని ప్రారంభం అవుతుంది. ఇంక ఏమీ గుర్తులేవు.


20, మార్చి 2026, శుక్రవారం

నీయందు మాబుధ్ధి


కాంభోజి


నీయందు మాబుధ్ధి నిలచి యుండు నటుల

జేయుమా సర్వేశ శ్రీరామచంద్ర


మాయచే కాయముల మతిమాలి ప్రేమించి

నీయందు బుధ్ధినే నిలుపగ లేము

మాయదారి మాయ నీయునికినే గప్పి

వేయగా నిన్నెరుగు విధమేది దేవుడా


మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి

మాయలోనే చచ్చు‌ మాబోంట్లకు

మాయ యొక టున్న దను మాట తెలియుట యెట్లు

తోయంబులకు వెలి తోచునా చేపలకు


ధ్యేయుండ వగు నిన్ను తెలియనీయదు మాయ

మాయింద్రియము లందు మసలుట చేత

నీయాన గొని యాడు నీమాయ తొలగితే

ఓయయ్య నిను విడచి యుండునా మాబుధ్ధి 


పద్యం వ్రాయటం గురించి - 4

పద్యవిద్య బాగా అబ్బాలీ అంటే సహజసిధ్ధమైన ప్రతిభ కొంత ఉండాలీ అన్న నామతాన్ని విపులంగా చెప్పటానికి ప్రయత్నించాను. ఇటువంటి జన్మసిధ్ధప్రతిభాపరత అన్నది ఏలలితకళ విషయంలోనైనా సరే వర్తిస్తుంది అన్నదీ వివరించాను.

ఇపుడు మరొక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను.

కవిత్వం చెప్పటానికి పాండిత్యం ఎంత అవసరం అన్న చర్చ ఒకటి ఉంది.

నిజానికి చాలా మంది పండితులకు పద్యవిద్య రాదు.

అలాగే చాలా మంది కవులు చెప్పుకోదగ్గ పండితులు కారు.

ఐతే కావ్యనిర్మాణం వంటివి చేయాలంటే తగుమాత్రం పాండిత్యం అవసరం. అలాగని మహాపండితులు కావాలా అంటే అది వేరే చర్చ. 

పూర్వం భట్రాజులని ఉండేవారు. రాజులను జమీందారులను పద్యవిద్యతో తెగ పొగిడి పొట్టపోసుకోవటం వారి వృత్తి. ఇప్పుడు రాజులూ జమీందారులూ లేరు. అందుచేత భట్రాజులూ కనబడటం లేదు.

భట్రాజులలో పద్యవిద్య ఒక కుటుంబవిద్యగా ఉండేది.

వాళ్ళు సాదారణంగా చిన్నా పెద్దా పద్యాలను ముక్తకాలుగా ఆశువుగా చెప్పగలరు కాని కావ్యనిర్మాణం చేసే స్థాయి విద్యా విద్వత్తూ వారికి ఉండేవి కావు.

ఇలాంటి భట్రాజు గారు ఒకాయన నాకు కొత్తపేటలోని లైబ్రరీలో కలిసారు. నలుగురికీ విద్యాప్రదర్శన చేస్తే కాసిని డబ్బులు వస్తాయి కదా అన్న ఆశతో ఆలైబ్రరీకి వచ్చాడాయన. చిన్నపాటి గోష్ఠి జరిగింది. నేను కొన్ని తెలిసిన సమస్యలను ఇస్తే ఆశువుగా వేగంగా పూరించి అబ్బురపరిచారు. ఆసమస్యలు మామావయ్య గారికి అష్టావధానాలలో ఇవ్వబడిన సమస్యలు. ఈభట్రాజు దగ్గర తగుపాండిత్యం కూడా ఉందన్నమాట. అందరూ కలిసి ఐదో పదో ఇచ్చిపంపారు. పెద్దపాండిత్యం లేకపోయినా పద్యం చెప్పగలిగారీ భట్రాజు గారు.

నేను చూసిన మరొక నికార్సైన ఆశుకవి మాగురువుగారు కీ.శే. వేదుల వేంకటరావు గారు. నా ఉపనయన సందర్భంలో సాటి ఉపాధ్యాయులు ఆయనను మాష్టారూ మీశిష్యుడిని ఆశీర్వదిస్తూ పద్యాలు చెప్పరా అంటే వెంటనే దడదడా ఒక పాతిక ముఫ్ఫైపద్యాలను ఆశువుగా చదివారు. ఆయన గొప్పపండితకవి. మా ఊళ్ళో భువనవిజయం చేసినపుడు వేదులవారు అల్లసాని పెద్దనగా ఉండేవారు. 

మాపాఠశాలలోనే వెంపరాల శివబ్రహ్మ శాస్త్రి గారు పండితులే కాని కవి కాదు. పాఠశాలవార్షికోత్సవం సందర్భంగా ఆయన పద్యాలు వ్రాసి ఒరే సరిచూసి యివ్వరా అన్నారు. ఏమిటి సరిచూసేది? అవన్నీ నేను తిరుగవ్రాసి యివ్వవలసి వచ్చింది. వేదులవారి చేత తిట్లు తినవలసి వచ్చింది ఘోష్ట్ రైటింగ్ చేసినందుకూ ఒక నరమానవుడి మీద స్తుతి పద్యాలు వ్రాసినందుకూ.

నేను ఆశుకవిత్వం చెప్పిన సందర్భాలు ఒకటి రెండే‌ అప్పుడైనా చెప్పినవి రెండేసి పద్యాలే. అవైనా కందాలే అని గుర్తు. అప్పట్లో కందం చెప్పినవాడే కవి ఒక అపోహ వ్యాప్తిలో ఉండేది లెండి. ఆశుకవిత మీద నాకు మోజు లేక నేను ఆదిశగా ఏమీ కృషి చేయలేదు. 

చెప్పవచ్చేది ఏమిటంటే పాండిత్యం కవికి మంచి ఉపకరణం కాగలదు కాని అది స్వయంగా కవిని చేయలేదు. అలాగే చెప్పుకోదగిన పాండిత్యం లేకపోయినా కవిత్వం చెప్పవచ్చును.

కవిత్వకళ సహజంగా ఉండినపక్షంలో పాండిత్యం దానికి మంచి అలంకారం అవుతుంది.

నిజానికి ఏఉపకరణం ఐనా కవికి సహాయం చేయగలదే కాని కవిని తయారుచేయలేదు. అలా సాధ్యంకాదు. అలాంటి అపోహ ఉంటే ఔత్సాహికకవులు దాని నుండి ఎంత తొందరగా బయటపడితే వారికి అంత మేలు కలుగుతుంది.


పద్యం వ్రాయటం గురించి - 3


ఏలలితకళకు ఐనా సహజసిద్దం ఐన ప్రతిభ కొంత ఉండితీరాలి అన్నాను. ఆముక్క మీద చర్చించుకోవలసినది మరికొంత ఉంది.

సహజసిధ్ధం అంటే  పుట్టుకతో వచ్చినది అని అర్ధం. దానినే దైవదత్తంగా వచ్చిందనీ అంటూ ఉంటాం.

ఇక్కడ దైవం అంటే భగవంతుడు అన్న అర్ధం కాదు. దైవం అంటే మనిషికి పురాకృతమే. ఏజన్మము ఐనా అది అంతము ముందు నడచిన జన్మపరంపరకు కొనసాగింపుగానే తెలుసుకోవాలి.

పూర్వజన్మ కర్మములయందు మన జీవునకు అంటిన వాసనాబలం ప్రస్తుతజన్మకు సహజమై వస్తుంది. ఒకడు యోగసాధకుడుగా ఉంటాడు. జన్మాంతం ఐనది. మరుజన్మకు తన సాధనాబలం తీసుకొని వస్తాడు. తగిన సమయసందర్భాలు ఏర్పడగానే మరల యోగసాధనను అవలంబిస్తాడు. ఈవిషయం భగవద్గీతాంతర్గతంగా ఉన్నదే కాని నేను చెప్పే మాట కాదు.

మంగళంపల్లి వారు  తన ఏడవయేటనే సంగీతకచేరీ చేసారు. సూర్యగాయత్రి గొంతులో లయను తల్లి మూడవయేటనే గుర్తించింది - ఆమె యిప్పుడు ప్రముఖగాయని - పదేళ్ళక్రిందటినుండే మంచి గాయనిగా గుర్తింపుపొందింది. కన్నడ ఛానెల్ వి మ్యూజిక్ టేల్స్ వీడియోల్లో కనిపించే ఆత్రేయ సిస్టర్స్ సంగతీ అటువంటిదే. చిన్నవయస్సులోనే అష్టావధానాలు చేస్తున్న వాళ్ళను చూస్తున్నాం. మావాళ్ళల్లో కొందరు చిన్నపిల్లలు అద్భుతంగా బొమ్మలు వేస్తున్నారు.

ఇటువంటి వారి వెనుక జన్మపరంపరాగతమైన వాసనాబలం ఉందని చెప్పకతప్పదు.

పుట్టుకతో  కవిత్వం వ్రాసే ప్రజ్ఞ రాకపోతే నేర్వకూడదా అంటే తప్పక నేర్వవచ్చును. అది కూడా సంభవమే. కవిత్వం అయేది మరొకటి అయేది పట్టుబట్టి నేర్చుకుంటే అలవడ కూడని విద్య యేమీ కాదు. కాని అందుకు ఎంతో దీక్ష అవసరం. మంచి శిక్షణ అవసరం. సులభమార్గాలూ ఉపాయాలూ అంటూ అడ్డదారుల ప్రలోభాలను జయించటం ముఖ్యం. మంచి గురువు ముఖ్యం. గొప్ప సాధన ముఖ్యం.

సహజంగా పుట్టువుతో ఒక కళ మీద ప్రజ్ఞ రాకపోయినా ఇలా కొందరు రాటుదేరతారు. పట్నం సుబ్రహ్మణ్యం అయ్యరు గారి కంఠం పాటకు అనువు కాదని గురువులు తిరస్కరిస్తే ఆయన వారిని మెప్పించటానికి కఠోరమైన సాధన చేసారు. ఎంత మంచి కంఠాన్ని సాధించి ఎంత గొప్ప గాయకులు అయ్యారో అందరికీ తెలుసు.

కొందరకు  ఎంత సాధన చేసినా కొన్ని కళలు పట్టుబడక పోవచ్చు. భగవంతుడు మరొక దారి చూపుతాడు.

ఏదైనా కళ మీద అభిమానం కల్గటం మంచిదే. అకళను అభ్యాసం చేయాలనుకోవటం మంచిదే. కాని ఎంత సాధనచేసినా పట్టుబడనప్పుడు వదిలిపెట్టటం కూడా మంచిదే.

సాధన అన్నది ఎంత చిత్తశుధ్ధిగా చేసాము అన్నది ముఖ్యం. ఎంత తీవ్రంగా చేసాము అన్నది ముఖ్యం.

సాధనాక్రమంలో ఏర్పడే దురదను నిగ్రహించుకోవటం మరీ ముఖ్యం.

కవిత్వం విషయం లోనికి వస్తే ఒక పద్యం వ్రాస్తే ఈ రోజుల్లో దాన్ని ప్రచురించి జనం మీదకు వదలటం మహాసులువు. అభ్యాసం కోసం వ్రాస్తున్న ప్రతి పద్యం ప్రచురణ చేస్తే ఎలా? 

విశ్వనాథ వారిని ఎవరో అడిగారు. మీరు ఇంతవరకూ ఎన్ని పద్యాలు వ్రాసి ఉంటారు అని. నేను వ్రాసి చించివేసిన పద్యాలే ఒక ముఫ్ఫైవేల కంటే ఎక్కువే ఉంటాయి అన్నారు. అంటే ఏమన్న మాట? అంత కఠోరసాధన చేసారు అని. తనదైన శైలి ఒకటి ఏర్పడే దాకా, తన ధారశుధ్ధి వగైరాలు సంతృప్తికరంగా అనిపించేదాకా ఆయన తన పద్యాలను జనం ముందుకు తేలేదు.

ఇప్పుడు? ఔత్సాహికులు పద్యం వ్రాయటం ఆలస్యం అది బాగా వచ్చిందా లేదా అన్న పట్టింపు లేకుండా జనం మీదకు విసురుతున్నారు.

ఒక పద్యం బాగా వచ్చిందా అని మొదట్లో మనకు ఎలా తెలుస్తుంది?

ఎవరైనా గురువులను ఆశ్రయించాలి.  

మొకానికల్ టూల్స్ గురువులు కాలేవు.

మీరు పద్యం వ్రాయటానికే ఒక టూల్ వాడుతూ, ఆ టూల్ కాస్తా పద్యం పూర్తయింది అనగానే మంచిపద్యం వచ్చేసింది అని భ్రమపడటం అక్షరాలా అజ్ఞానం.

ఒకరు కాకపోతే నలుగురు పెద్దలసాయంతో తప్పులు దిద్దుకుంటూ పరిశ్రమ చేస్తే క్రమంగా పద్యం వ్రాయటం పైన పట్టుసాధించవచ్చును. కొందరికి ఏడాది పట్టవచ్చు. కొందరికి ఏడేళ్ళు పట్టవచ్చు. కొందరికి వల్లకాకపోవచ్చును కూడా.

 

మురళి నూదరా కృష్ణా

మురళి నూదరా కృష్ణా
మురళి నూదరా
పరమ మనోహరము నీ
మురళి పాటరా

భువనమోహనము నీ మురళిపాట
శ్రవణసుభగమైన నీ చక్కనిపాట
కువలయాక్షు లందరు కోరెడుపాట
సవరించి నీ మురళిని సాగించు పాట

విన వచ్చె నదే మింటి పైన నా చంద్రుడు
వినగ నెమ్మదించిన యమున నటు చూడు
విన వచ్చి వేచిన గోపికలను చూడు
వినిపించి మురళిపాట వేడుక చూడు

పూపొదలు వేచియున్న  మురళిపాట
యీపొలతుల ప్రాణమైన యింపగుపాట
గోపాలక యమృతమై కురిసెడు పాట
ఓప లేమింక పాడ నుద్యమించరా


19, మార్చి 2026, గురువారం

పద్యం వ్రాయటం గురించి - 2


పద్యం వ్రాయటం గురించి మాట్లాడుకుంటున్నాం.

ఈ వ్యాసం రెండవది.

నా టీనేజ్ చివరి నుండి కొన్నేళ్ళు నేను రంపచోడవరం గ్రామంలో ఉన్నాను. మానాన్నగారు ఉపాధ్యాయులు. ఆఊరికి బదిలీమీద వెళ్ళారు ప్రధానోపాధ్యాయులుగా. కాబట్టి పదేళ్ళు చిల్లరగా కొత్తపేటలో ఉన్న మాకుటుంబం అంతా రంపచోడవరానికి నివాసం మార్చటం జరిగింది.

ఆఊళ్ళో సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులుగా శ్రీ రావాడ కృష్ణ గారు వచ్చారు. వచ్చారు అనటం ఎందుకంటే ఆ పాఠశాలలో మొత్తం స్టాఫ్ అందరినీ బదిలీలు చేసి ప్రధానోపాధ్యాయుల నుండి అందరినీ కొత్తవారిని వేసారు. అతికొద్ది మంది మాత్రమే పాతవారు. అలా వచ్చిన వారిలో కృష్ణ గారు ఒకరు. ఆయన మంచి చిత్రకారులు.

ఆయనతో నాకు మంచి స్నేహం ఏర్పడింది. కృష్ణ గారు తీరిక దొరికినప్పుడల్లా బొమ్మలు వేస్తూ ఉండేవారు. అవి చూసి ఒకసారి నేను మాష్టారూ బొమ్మలు బాగున్నాయి కదా పత్రికలకు పంపవచ్చు కదా అన్నాను. ఆయన నవ్వి నాబొమ్మలను పత్రికల వాళ్ళు పదేళ్ళకు పైగా పోషించారు. ఇంకా పంపటం బాగుండదులే కొత్త వాళ్ళు రావాలి కదా అన్నారు. 

అలా ఒకసారి ఆయన బొమ్మలు వేస్తుంటే అక్కడికి సి ఐ గారి అమ్మాయి వచ్చింది. ఆమె నాదగ్గర ట్యూషన్ చెప్పించుకుంటూ ఉండేది.

కృష్ణ గారిని నాబొమ్మ వేసివ్వరా అని బ్రతిమాలింది. ఆమె నోట్ బుక్ తీసుకొని ఒకటి రెండు నిముషాల్లో అట్టా అట్టా గీసి యిచ్చారు. ఆవేగాన్ని చూసి ఆశ్చర్యం. ఆబొమ్మను చూసి మహదాశ్చర్యం. అంత చక్కగా ఉంది. నాకూ చిత్రకళ మీద అసక్తి ఉందీ అని గ్రహించి నా విద్యకు మెరుగులు దిద్దుదాం అనుకున్నారు కాని కృష్ణ గారు త్వరగానే నాలో సహజంగా చిత్రకళావిలాసం పూజ్యం అని గ్రహించారు. 

ఏలలితకళకు ఐనా సహజసిద్దం ఐన ప్రతిభ కొంత ఉండితీరాలి. అపైన గురుకృప. ఆపైన అభ్యాసం 

లలితకళలనే కాదు చాలా విద్యల విషయంలో కూడా ఇది నిజమే.

ఒకాయనకు కొడుకుని డాక్టరును చేయాలని ఉంది. బోలెడు డబ్బు ఉంది కాబట్టి ఫీజు కట్టి చదివించగలడు. అది కోట్ల మీద ఉన్నా సరే. ఆ కొడుకు కూడా విద్య యొకడి బాబు సొత్తా యేమి, నేను డాక్టరును కావాల్సిందే అనుకున్నాడు.

లక్షలు ఖర్చు చేసి కోచింగ్ ఇప్పించాడు. కాని వాడికి ఆ దిక్కుమాలిన సెట్ పరీక్షల్లో తగినంత స్థాయి రాక పోయింది. ఏమన్న మాట? మనకు కోరిక ఉంటే సరిపోతుందా? తగిన ప్రతిభ ఉండాలి. చెప్పాను కదా, అది కొంత దైవికం.  ఆపైన మానవప్రయత్నం గురువుసాయమూ అభ్యాసమూ అని.

టూల్స్ ముందు వేసుకొని యూట్యూబ్ సాయంతో కుర్చీని తయారు చేయవచ్చును అభ్యంతరం లేదు. కాని సరైన కుర్చీని తయారు చేయగల వడ్రంగం నైపుణ్యం కొంతైనా సహజంగా ఉండి ఉంటేనే పనిజరుగుతుంది. లేని పక్షంలో వందల గంటల కష్టం చేసినా సంతృప్తికరమైన పనివాడితనం రాకపోవచ్చును.

ముందు దైవదత్తం ఐన గాత్రం ఉంటేనే సంగీతం నేర్చుకొని గాయకుడు అయ్యేది. 

ఏవిద్యనూ ' అంట ' వల దని ఎవరూ చెప్పరు. అది మనకు అంటుతుందో లేదో మీకు మీరు కొంత అవగాహన కలిగి ముందుకు వెళ్ళాలి. మన అవగాహన సరైనది అని గురువులు అనుకుంటే రాణించేందుకు దారులు పడతాయి. ఆపైన మన అభ్యాసదీక్ష మీద ఆధారపడి ఉంటుంది ఎంతగా విద్య అబ్బేదీ‌ అన్నది.

ఛందం అనేది ఒక సాఫ్ట్వేర్ టూల్ మాత్రమే దానికి ఉన్న ప్రయోజనం దానికి ఉంది. అది అనువుగా ఉందని చెప్పి దాని సహాయంతో అడ్డదారిన పద్యాలను తయారు చేయటం వలన ఆట్టే ప్రయోజనం ఉండదు. ప్రత్యేకించి ఈమాట చెప్పటం ఎందుకంటే అలా ప్రయత్నం చేస్తూ పద్యాలను పోలిన వికారాకృతులను కొందరు అమాయకంగా అచ్చులు పోసి తీసి జనం మీదికి వదులుతో ఉండటం దినదినమూ చూస్తునే ఉన్నాం కాబట్టి. ఈచర్చ అంతా పద్య విద్య గురించి కాబట్టి.

మరికొన్ని విషయాలు తరువాయి వ్యాసంలో ముచ్చటించుకుందాం. ఇప్పటికే పెద్దదైనట్లుంది.

 

18, మార్చి 2026, బుధవారం

హరికి ప్రియుడై యుండువాడు

అరయ నెవ్వడు పరమప్రియుడు
పరమపురుషు డైన హరికి

హరిని మనసున తలచువాడే
  హరిని మనసున నిలుపువాడే
హరిని మనసా కొలుచువాడే
  హరికి ప్రియుడై యుండువాడు

హరిని విడువని మనసువాడే
  హరిని జగమున గనెడువాడే
హరిని పరముగ నెరుగువాడే
  హరికి ప్రియుడై యుండువాడు

హరిని నీత్యము గనెడువాడే
  హరి కితరమును గననివాడే
హరియె బ్రతుకుగ నుండువాడే
  హరికి ప్రియుడై యుండువాడు

హరేరామా యనెడువాడే
  హరేకృష్ణా యనెడువాడే
హరే శరణం బనెడువాడే
  హరికి ప్రియుడై యుండువాడు

హరినామములే వరమంత్రంబులు

హరినామములే
  వరమంత్రంబులు
నరులారా యిహ
  పరసాధనములు

ఒకమంత్ర మిచ్చు సిరుల 
  నొకమంత్రమిచ్చు బలము
నొకమంత్ర మిచ్చు స్థిరత
  నొకమంత్ర మిచ్చు బలగ
మొకమంత్ర మిచ్చు ప్రభుత
  నొకమంత్ర మిచ్చు సుఖము
హరిమంత్ర మిచ్చు నండి
  యన్నియును మీకు నిజము

పరమంత్రములను మీరు
  బడయు సిరులు సుఖములును
ధరను విడచు సమయమున
  తరలిరావు వెనుదగిలి
హరిమంత్ర మాశ్రయించు
  నరు డెన్నటికిని చెడడు
హరేరామ యనువాడు
  హరినిచేరు సుఖముగను


పద్యం వ్రాయటం గురించి - 1


కొన్నేళ్ళ క్రిందట ఛందం అని ఒక వెబ్ సైట్ వచ్చింది.

అక్కడ మీరు ఒక పద్యాన్ని కాపీ & పేష్ట్ చేసి అది ఏ ఛందస్సులో ఉన్న పద్యమో అన్నది సులభంగా తెలుసుకోవచ్చును.

అలాగే మీరే స్వయంగా ఒక పద్యాన్ని టైపు చేయటానికి ప్రయత్నం చేయవచ్చును. మీరు వ్రాసినది ఏఛందస్సులో ఇముడుతున్నదీ మీకు సులభంగా తెలుస్తుంది. మీరు తప్పులు చేస్తుంటే, ఫలాని ఛందస్సులా ఉండేలా ఉంది కాని ఇక్కడ-ఇక్కడ ఈ-ఈ తప్పులున్నాయీ అని కూడా చెబుతుంది. 

ఇదిగో నండీ, ఇలాగ పద్యాన్ని ఛందం పేజీ సాయంతో నేరుగా టైపు చేసుకోవచ్చునూ అదిన్నూ తప్పులు దిద్దుకుంటూ అన్నది కొందరికి బాగా నచ్చింది..

కొందరు వీరపద్యబొమ్మన్ అవతారం ఎత్తి పద్యాలు కుట్టటం మొదలు పెట్టారు.

కానీ సరిగా పద్యం వ్రాయటం మరీ అంత తేలిక వ్యవహారం కాదు.

కేవలం ఉత్సాహం ఒకటే సరిపోతుంది కదా అనుకోవటం సరి కాదు.

నాకు బొమ్మలు వేయటం ఒక సరదా. చిన్నతనంలో కొన్ని వేసాను. వాటిలో కొన్ని బాగానే వచ్చాయి కూడా. మా యింట్లో నెహ్రూ గారి ఫోటో ఒకటి ఉండేది చక్కటి ఫ్రేం కట్టినది. దానికి బోలెడన్ని నకళ్ళు గీసాను. కొన్ని సార్లు సీవీ రామన్ బొమ్మలు వేసాను. కొన్ని ప్రకృతిచిత్రాలు వేసాను. బాగానే వేస్తున్నానని అనుకోలేదు ఎప్పుడూ. ఎందుకంటే సహవిద్యార్ధుల్లో మంచి చిత్రకారులే ఉండేవారు..

చిత్రకళ అయ్యేది కవిత్వం అయ్యేది మరొక లలితకళ అయ్యేది మొదట జన్మతః కొంతగా రావాలి. ఆపైన కొంత సాధన. తరువాత గురుముఖతః మెళకువలు నేర్చుకోని విద్యను సానబెట్టుకోవాలి. గురువులు చెప్పిన సాధనలు బాగా చేయాలి. అలా ప్రావీణ్యం వస్తుంది.

ఛందోబధ్ధమైన కవిత్వం కూడా అంతే. నేనైతే ఏడవ తరగతిలో ఉండగా కొన్ని పద్యాలు వ్రాసాను. మానాన్నగారి కంటబడ్డాయి. ప్రోత్సహించారు. నిజానికి నాకు అప్పడు ఛందస్సు గురించి ఏమీ తెలియదు. అవగాహన దేవు డెరుగు.

అదృష్టవశాత్తూ హైస్కూలు రోజుల్లో తెలుగుమాష్టారు ఆశుకవి వరేణ్యులు కీ.శే. వేదుల వేంకటరావు గారి ప్రోత్సాహం లభించింది. కొంతగా ఆయన సానబట్టారు నా శక్తిని.

ఇప్పుడు ఛందం పుణ్యమా అని కొందరు అక్షరాలను పేర్చటం లేదా వాటిని కావలసిన గణాల్లో కుక్కి సరిపెట్టటం చేసినంత మాత్రాన పద్యం ఐపోతుందన్న భ్రమలో ఉన్నారు.

ఈ భ్రమ యితరత్రా కూడా కనిపిస్తోంది.

ఈమద్య పద్యవిద్యను నేర్పేసే గురువులు లావయ్యారు,  బేచ్ తరువాత బేచ్ లెక్కన కవులను తయారు చేసి వదులుతున్నారు. అలా తయారవుతున్న వారిలో కొందరు ఏకంగా శతకాలు చెక్కి పారేస్తున్నారు.

కాని మంచి పద్యాలు మాత్రం ఆట్టే రావటంలేదు.

అసలు మంచి పద్యం వెనుక ఉండే  మంచి లక్షణాలు ఏమిటీ అన్న వివేచనే ఈ ఫాక్టరీ మేడ్ అండ్ ఛందం మేడ్ కవులకు ఉండటం లేదు. అసలు ఆదృష్టిలో ఆలోచనే వారికి ఉండటం లేదు.

మరొక రెండు మూడు  టపాల ద్వారా ఈ విషయాన్ని వివరించటానికి ప్రయత్నం చేస్తాను.

 

16, మార్చి 2026, సోమవారం

భక్తులము హరిభక్తులము

భక్తులము హరిభక్తులము హరి
భక్తివినా మా బ్రతుకే లేదు
 
హరిలీలలనే మననము చేయుచు
  పరవశ మందే వారము 
హరిసేవలతో ననవరతంబును
  మురియుచు తిరిగే వారము
 
హరిని తెలుపు నితిహాసము లందే
  యాదర ముంచే వారము
కరుణామయు డగు హరికే మనసా
  శరణాగతు లగు వారము 
 
కనులారా హరి చిద్రూపమునే 
  కనుగొని మురిసే వారము
మనసారా హరినామావళినే 
  పనవుచు మురిసే వారము
 
దినదినమును హరిసంకీర్తనమే 
  తీయగ పాడే వారము
క్షణక్షణమును హరిసన్నిధి లోనే 
  గడపుచు మురిసే వారము
 
హరేరామ యని ఆరాముని మే
  మన్నిట కనుగొను వారము
హరేకృష్ణ యని అహర్నిశలు భజ
  నానందము గొను వారము
 
పరాకు నైనను పరదైవతముల
  భావన చేయని వారము 
పురారి సన్నుతు డగు శ్రీహరినే
  ముక్తిని వేడెడు వారము 
  

రామనామరసమానసరాజహంసలకు గాక

కళ్యాణి.?
 
రామనామరసమానసరాజహంసలకు గాక
రామ తత్త్వమెఱుకగాదు రాము నెఱుగరాదు
 
కామవైరి వలన గాక రామనామలబ్ధి లేదు
రామనామభజన లేక రామభక్తి కుదురుకోదు
రామభక్తిపరులు గాక రామసేవ బడయలేరు  
రామసేవకులకు గాక కామాదుల గెలువగాదు
 
కామాదివికారరహితఘనత బడసి నిత్యము శ్రీ
రామయోగు లగుచు నిల విరాజిల్లెడు యోగివరులు
రామనామరససరసిని నీమంబుగ నీదుచు రఘు
రాముని లోనెఱిగి సదా రామునితో నుండు వారు
 

15, మార్చి 2026, ఆదివారం

కరుణించరా స్వామి కమలాయతేక్షణ

ఆహిరి.?

కరుణించరా స్వామి కమలాయతేక్షణ
తిరముగ మది నిన్నేమరక కొలుచు నను

సదమలచారిత్ర్యసంశోభితా రామ
విదళితామరవైరివీరగణా హర్ష
మొదవగ నా కామమోహాది రిపువర్గ
మదమును పెకలించి ముదము చేకూర్చర 

వేవేల నామాల వెన్నుడ నీమహిమ

భావించి మెప్పించు ప్రతిభ లేకున్నను

నీవాడనే కాని పైవాడనా యేమి

సేవించు నామొరలు చిత్తగించవు స్వామి


జగముల పుట్టించి చక్కగా పోషించి

తగ లోగొను దేవా దాసుడ నేగానా

నిగమాగమవిదిత నిత్య శుధ్ధబ్రహ్మ

మగు నీవే శరణమో యభవ భవమోచన


11, మార్చి 2026, బుధవారం

విముక్త ( వోల్గా) గురించి.

 విముక్త -వోల్గా అని ఒక టపా చదివి వ్రాయవలసి వచ్చింది ఈరోజున.

నేను చదివిన టపా ప్రకారం ఆ విముక్తలు ఎవరంటే శుర్పనఖ, అహల్య, రేణుక, ఊర్మిళ మరియు రామ అట.

ఈ  విముక్త -వోల్గా అంతా ఖండనీయమే.

ఇప్పటికే ఒక వ్యాఖ్య పంపాను. అది తొలగిస్తారో ఉంచుతారో తెలియదు. అది ఇలా ఉంది.

"వ్యాసవాల్మీకుల కన్నా మనం తెలివైనవారం అన్న అతితెలివితో చేసే వికారపుభావనలనుండి ఇలాంటి వెర్రిమొర్రి కల్పనలే వస్తాయి. ఇతిహాసాలు పెద్దగ్రంథాలు కాబట్టి అందరూ అధ్యయనం చేయరు. చేయలేరు. ఈమేతావుల దృష్టి అంతా వాటిని అవహేశన చేయటం మీదే నాయె. కల్పన పేరిట అనుచితంగా వ్రాయకూడదు కదా - మూలకథకు కాని పాత్రల స్వరూపస్వభావాలకు కాని విఘాతంగా కల్పన ఉండరాదు  కదా! ? కాని మన మేతావుల కల్పనాస్వాతంత్ర్యం వెనుక ఉన్న సనాతనధర్మధ్వేషం కారణంగా వారికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. మూలకథను ఇచ్ఛిన ఋషులూ లేరు కాపీరైట్ గోలా లేదని ఎంత హీనమైన కల్పనలూ చేస్తున్నారు. వీళ్ళని శిక్షించేందుకు ప్రస్తుతం చట్టాలు సరిపోకపోతే - వీళ్ళకు భగవంతుడి నుండి శిక్ష ఉండకపోదు"

అవశ్యఖండనీయమైన ఆటపాలోని కొన్ని ఆణిముత్యాలు చూదాం.

ఎందుకంటే సత్యం ఎపుడు ఒకేలా ఉండదు అది మారుతూ ఉంటుంది  అని ఒకటి.

ఇంతకంటే పిచ్చిమాట ఉంటుందా?  ఘడియ ఘడియకూ మనిషి మనిషికీ మారేది సత్యమే కాదు.

మరొక ఆణిముత్యం.  నీకు తప్పు లేదు అనిపిస్తే విచారణ కి లొంగకు అధికారానికి తల వంచకు

రోజూ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తున్నాం. ఎన్ని నేరాలో. ఆవలి వ్యక్తిపై కోపం వస్తే చంపేయటమే. ఆవేశంలోనూ అవివేకంతోనూ ప్రతివాడూ "చంపేస్తే తప్పులేదు" అని భావించి అఘాయిత్యానికి ఒడిగట్టిన వాడే. తనకు తప్పు లేదు అనిపించే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వెన్నుతట్టి చెప్తున్న మాట ఏమిటంటే "విచారణ కి లొంగకు అధికారానికి తల వంచకు." పోలీసులకూ కోర్టులకూ ఏమీ అధికారం లేదు - నీకు రైట్ అనిపించింది చేసాక అని! శబాసూ.

ఇది చూడండి "జ్ఞాన సంపాదనకు అనుభవాన్ని మించిన మార్గం లేదు." అట.

అనుభవం అనేది వ్యక్తిగతం. అనుభవం ద్వారా వచ్చే జ్ఞానం వ్యతిగత సంస్కారాన్ని అనుసరించి ఉంటుంది. అంధుచేత ఎవరి అనుభవమూ స్వతఃప్రమాణం కాలేదు. పరంపరానుగతంగా కాలానికి నిలబడిన పెద్దల వాక్యం ప్రమాణం. 

ఒక చెత్త పుస్తకం గురించి ఒక చెత్త ప్రశంశ! దేవుడా!!

వేదాద్రిశిఖరాన వెలసిన దీ సింహము

వేదాద్రిశిఖరాన వెలసిన దీ సింహము 
కోదండరామాఖ్య గొన్న సింహము 
 
మత్తదైత్యగజేంద్రమును 
  మట్టుబెట్టు నరసింహము
బత్తిజూపు వారికి వరదసింహము

ఎత్తున వేదాంతగుహల 
  నెసగు బ్రహ్మమగు సింహము
కొత్తదైవతములకు కొదమసింహము
 
వినయశీలురైన భక్త
  వీరుల హృద్వీధు లందు
దినదినము నూరేగు దివ్యసింహము

మునిమానసరాజహంస 
  యనెడు ప్రఖ్యాతి మిగుల
గొనిన ముక్తి నొసగెడు గొప్పసింహము
 

జోరుచేయండీ

జోరుచేయండీ భజన జోరుచేయండీ
శ్రీరాముల వారి భజన జోరుచేయండీ
 
ఊరువాడ కలిసిరాగ జోరుచేయండీ
ఊరంతయు హోరెత్తగ జోరుచేయండీ
నోరునొవ్వ పాడి యాడి జోరుచేయండీ
మారుతియే మెచ్చి చేర జోరుచేయండీ
 
వేరు ప్రసంగములు లేక జోరుచేయండీ
హోరెత్తగ హరికీర్తన జోరుచేయండీ
వీరపత్ని సీత పొంగ జోరుచేయండీ 
దారిపట్టి కలిపారగ జోరుచేయండీ  

ఊరందరి యఘము లణగ జోరుచేయండీ 
ఊరికి శుభవృష్టి కలుగ జోరుచేయండీ
చేరి దేవతలు పొగడ జోరుచేయండీ
నారాయణమూర్తి మెచ్చ జోరుచేయండీ
 

రామచంద్ర నన్ను నీవు రక్షించక తప్పదయ్య

రామచంద్ర నన్ను నీవు రక్షించక తప్పదయ్య
నామనసున నిన్ను నిలిపి నడచుచుంటి గాన
 
మన్నింపుము చేయి నొచ్చు మాటలొండు రెండు వ్రాయ
నిన్ను పొగడుకొనుట కైన నన్ను కూరుచుండ నీదు
నిన్నొక రొకమాట యన్న నన్ను బదులు వ్రాయనీదు
అన్నన్నా యింత చెడ్ద దాయె జూడ కాల మిపుడు
 
నడచుచున్న కాల మరయ నాకు చేటు చేయుచుండె
ఎడబాయెగ జేసె సతిని యిల్లువదలి తిరుగజేసె
పడద్రోసెను రెండు మార్లు  పగబట్టిన యటుల తుదకు
నడువలేని స్థితికి దెచ్చె నారాయణ చూడవయ్య
 
తాపములను తొలగించెడు దాశరథీ శరణు శరణు 
పాపములను తొలగించెడు పరంధామ శరణు శరణు
ఈపాట్లిక చాలు చాలు నీశ్వర బహుకృపామయా 
కోపగించుకొనక నీవు కొంచెము దయజూప వలయు
 

10, మార్చి 2026, మంగళవారం

ఏమందు వయ్య రామ

ఏమందు వయ్య రామ యీమాటకు
ఏమైనను కూడని దిపు డేమంటిని

కొండలంత వరముల గుప్పించ కున్నను
కొండంతటి యండగ నీవుండ వచ్చుగా
గుండిగలతొ కాసులను నిండించ కున్నను
గుండెలోన ధైర్యము నెలకొలుప వచ్చుగా

బహుశాస్త్రములను మంచి ప్రతిభ గాకున్నచో
నిహసౌఖ్యముల విరక్తి నీయవచ్చుగా
బహుసిధ్ధులు మహిమలీయ వలను కాదన్నచో
మహానందపూర్ణునిగా మలచ వచ్చుగా

రాముని మాత్రమె తలచెదను

రాముని మాత్రమె తలచెదను
రాముని మాత్రమె వలచెదను

రాముని మాత్రమె ప్రేమించెదను
  రాముడు నాకు ప్రియసఖుడు
రాముని మాత్రమె సేవించెదను
  రాముడు నాకు యజమాని
రాముని భక్తులతో చేరెదను
  రామునివారె నావారు
రాముని మాత్రమె పూజించెదను
  రాముడె నాకు దైవతము

రాముని మాటలె పాటించెదను
  రాముడు నాకు సద్గురువు
రాముని వద్దనె నివసించెదను
  రాముని గడప నాయునికి
రాముని కొరకే జీవించెదను
  రాముడె నాకు జీవితము
రాముని తత్త్వమె చింతించెదను
  రాముడె నాకు దైవతము

రామనామమే రామనామమే

రామనామమే రామనామమే
  రామనామమే పావనము
రామనామమే రామనామమే
  రామనామమే జీవనము

రామనామమే కద సర్వోపద్రవ
  నివారణ సాధనము
రామనామమే సర్వశుభం
  కరంబైన ఘనమంత్రము
రామనామమే యిహపరసౌఖ్య
  కరంబైన ఘనతంత్రము
రామనామమే ఆత్మజ్ఞాన
  ప్రదాయకమైన యోగము

రామనామమే జీవికి చుట్టము
  రామనామమే నెయ్యము
రామనామమే జీవికి సంపద
  రామనామమే భాగ్యము
రామనామమే జీవికి అన్నము
  రామనామమే పానము
రామనామమే జీవికి సర్వము
  రామనామమే ప్రాణము

9, మార్చి 2026, సోమవారం

నీదయ చాలని

నీదయ చాలని నేనున్నానని
  నీవెరిగినదేగా రామా
ఆదయ వానగ కురిపించగ నీ
  కడ్డేమున్పది ఓరామా

ఆకరిరాజును కాపాడిన నీ
  యద్భుతమగు దయనే కాదా
నేకోరుచు యుగయుగములుగా నిల
  నిలబడి యుంటిని రఘునాథా
ఆకోమలి శాపము తొలగించిన
  ఆదయనే కోరుదు గాదా
నీకెవ్వరు వలదని చెప్పేరని
  నాకా కరుణామృత మీవు

ఏకార్యమునకు నేదిగివచ్చితి
  నాకార్యము నెరవేరెనుగా
నీకార్యము నెరవేర్చిన నన్నిక
  నిలుపగ తొల్లిటి పదమునను
నీకిపు డడ్డేమున్నదయా
  శ్రీకర దయచూపించవయా
శోకమోహముల కాకరమగు ధర
  నేకారణమున నుంచేవో

గురుదేవుడు హరదేవుడు నీతో
  కరుణించుమని చెప్పడుగా
మరి తానిచ్చిన భవతారక మెద
  మరువని చేసిన ఫలమేమి
నరసింహా నరనాయక సీతా
  నాయక శ్రీరఘునాయక నీ
కరుణను వానగ కురిపించవయా
  తిరముగ స్వస్థితి నుంచవయా

8, మార్చి 2026, ఆదివారం

stats a while ago (updated)

 To whom so ever it may concern.

 Stats on March 6th afternoon:


Stats now (March 8th 11:45AM)



The pictures speak facts clearly enough.

Thanks. 

నామీద దయజూపరా

నామీద దయజూపరా శ్రీ
రామా కృపాసాగరా

నామీద దయజూపి నన్నేలు కోవయ్య
సామగానప్రియ సాధుజనపోష
శ్యామలాంగ హరి సర్వేశ సురతోష
రామయ్య నీవాడ రక్షించ వేమయ్య

నామీద దయజూపి నాకష్టముల దీర్చ
వేమయ్య రామయ్య వేయి దండాలయ్య
కామారినుతదివ్యనామా పయోధర
శ్యామా పరాకేల సకలాపదోధ్ధార

నామీద దయజూపి నాదీనతను బాపి
ప్రేమతో నన్నేల వేరెవ్వరున్నారు
నీమీదనే యాశ నిలిపితిరా పరం
ధామా శరణు శరణు శ్రీమన్నారాయణ




నావాడవు నీవు రాఘవా

నావాడవు నీవు రాఘవా నేను
  నీవాడ నయ్య రాఘవా
పైవాడను కాను రాఘవా నన్ను
  పాలించ వయ్య రాఘవా

ఎన్ని జన్మముల రాఘవా పూని
  ఎంత తపించి రాఘవా
నిన్ను బడసితి రాఘవా ఇంక 
  నిన్ను విడవను రాఘవా
నన్ను విడువకు రాఘవా  తప్పు 
  లున్న మన్నించి రాఘవా
అన్నియు నాకగుచు రాఘవా నీవు 
  నన్నేలు కొనుము రాఘవా 

మరల జన్మించ రాఘవా నాకు
  మనసేమి లేదు రాఘవా
కరుణాలవాల రాఘవా నామ
  స్మరణము విడువ రాఘవా
సరసిజనయన రాఘవా నన్ను
  మరల పుట్టించకు రాఘవా
కరుణతో నాకు రాఘవా నీవు
  కరుణించు ముక్తి రాఘవా

7, మార్చి 2026, శనివారం

రామభజన చేయండీ

రామభజన చేయండీ రామభజన చేయండీ
ప్రేమతో నిరంతరముగ రామభజన చేయండీ

రామభజన వలన సుగుణరాశి వృధ్ధి చెందు నండి
రామభజన వలన పాపరాశి దహనమగు నండి
రామభజన వలన పుణ్యరాశి వృధ్ధిచెందు నండి
రామభజన వలన జ్ఞానప్రాప్తి కలుగు నండి

రామభజన వలన నాయురారోగ్యము లబ్బు మనకు
రామభజన వలన సిరులు ప్రాప్తించుచు నుండు మనకు
రామభజన వలన జయము ప్రభుత కలుగు మనకు
రామభజన వలన నందిరాని సుఖము లేదు మనకు

రామభజన చేసినచో కామితము నెఱవేరు నండి
రామభజన చేసినచో కామాదులు శమించు నండి 
రామభజన చేసిన వైరాగ్యము సిధ్ధించు నండి
రామభజన వలన మోక్షరాజ్యము సిధ్ధించు నండి

6, మార్చి 2026, శుక్రవారం

రావయ్య శ్రీరామచంద్రుడా

రావయ్య శ్రీరామచంద్రుడా
భవాతీతప్రభావుడా
 
ముల్లోకముల నీవు చేసి
కల్లోల పడకుండ కాచి
యెల్లవేళల భక్తకోటి
చల్లగ రక్షించుచుందువు 
 
భూజను లందర కెపుడు 
పూజార్హుడవు నీవె దేవ
పూజింతుము శక్తికొలది
రాజిల్లు సద్భక్తి కలిగి
 
దేవాధిదేవ మ్రొక్కేమురా
నీవొక్కడవె మాకు దిక్కు
సేవించ మన్యుల నెపుడు
నీవెఱిగిన సత్యమేను 
 

4, మార్చి 2026, బుధవారం

రామ వందనం

రామ సకలమునిమనోభిరామ వందనం
రామ సురవిరోధిగణవిరామ వందనం

భూరికృపాపూర్ణహృదయ శౌరి హరి వందనం
వీరలోకసంపూజిత విభో వందనం
వారిజాక్షసకలలోకాధార శూర వందనం
దూరీకృతిపాపాంధకార వందనం

ఘోరసంసారతిమిరహారి హరి వందనం
నారకభయమోచనశుభకారి వందనం
నారదాదిమునిసన్నుత నారాయణ వందనం
నీరదఘనశ్యామరామ నిత్యవందనం


3, మార్చి 2026, మంగళవారం

ఏమందును

ఏమందు నయ్యా నే నేమందును

రామా జగదీశ్వర నే నేమందును


నీనామము వల్లించుచు నిష్ఠగ నేనుంటిని

నానిష్ఠను గమనించని వాని వలె నుంటివి


చిత్తంబున నిన్నెప్పుడు చింతించుచు నుంటిని

బొత్తిగ నది యెరుగనట్లు మోముపెట్టి యుంటివి


నిద్దురలో కూడ నేను నిన్ను పిలుచుచుంటిని

నిద్దురలో నున్నరీతి నీవు పలుకకుంటివి


మానసమున నీపూజలు మానక నేనుంటిని

దేనికయా నాభక్తిని తెలియని యటు లుంటివి


నీకీర్తిని చాటించుచు నేను తిరుగుచుంటిని

నాకష్టము పట్టనట్లు నన్ను చూడ కుంటివి


నీదయనే కోరుకొనుచు నేను వేచియుంటిని

నాదయ అతి దుర్లభమని నవ్వుచు నీవుంటివి



2, మార్చి 2026, సోమవారం

నీనామము పలుకుటయే

నీనామము పలుకుటయే రామచంద్రా నాకు
నీమముగా నున్నదయా రామచంద్రా

నీమహిమలు వర్ణింపగ రామచంద్రా నాడు
సామీరికి శివున కొప్పె రామచంద్రా
నీమహిమలు వర్ణింపగ రామచంద్రా నాడు
వామలూరుజునకు చెల్లె రామచంద్రా

నామీదను దయజూపుము రామచంద్రా యెఱుక
యేమాత్రము లేని వాడ రామచంద్రా
నీమీదే యచంచలము రామచంద్రా భక్తి
ఆమాత్రమె నాహర్హత రామచంద్రా

పామరుండ నైన నాకు రామచంద్రా నీదు
నామ మొకటె దిక్కు సుమా రామచంద్రా
కామితముల నిచ్చు నట్టి రామచంద్రా కోర
నేమున్నది ముక్తి దక్క రామచంద్రా


మ్రొక్కుచు నుందురు

మ్రొక్కుచు నుందురు రాముని కొందరు

    చక్కగ ననిశము సంతోషముగా

మిక్కిలి భక్తిని మ్రొక్కెడు వారికె

    దక్కును మోక్షము నిక్కముగా


సీతారామా రాజారామా

    శ్రీరామా రఘురామా యనుచును

పూతచరిత్రా భువనాధిప వి

    ఖ్యాతచరిత్రా రామా యనుచును


మునివరసన్నుత సురవరసన్నుత

    పురహరసన్నుత రామా యనుచును

వనజాసననుత దనుజకులాంతక

    వనజాతేక్షణ రామా యనుచును


శాపవిమోచనచణశుభచరణా

    సంకటమోచన రామా యనుచును

పాపవిమోచన తాపవిమోచన

    భవభయమోచన రామా యనుచును


1, మార్చి 2026, ఆదివారం

నందనందన వందనం

నందనందన వందనం
బృందారకజనవందిత

నీలమేఘశ్యామ కాళియమర్దన
కేళీ సమ్ముదితసురపాళీ గోపాళీ
బాలలీలాహతబహుసురవైరీ
బాలగోపాల యదుబాల సుశీల

లీలాకృతభువనజాల కృపాల
వాల గోపీజనలోల గోవింద
కాలయవనకాల కాలస్వరూప
పాలితాఖిలభక్తజాల సుశీల