15, జూన్ 2026, సోమవారం

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనువాడు


శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనువాడు 
  చెడిపోడు చెడిపోడు చెడిపోడు
శ్రీరామ యనిగూడ చెడిపోతి ననువాడు
  సృష్టిలో నిందాకనే లేడు

శ్రీరామ శ్రీరామ యనుచున్న నాసాధ్వి
   శ్రీరాముని గాంచి సిధ్ధిపొందె
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని పక్షి
  చెందెనే మోక్షమును సూటిగాను
శ్రీరామ నామమును చెవుల వినిన పక్షి
  చెందెనే స్వస్థతను తక్షణమ్ము
శ్రీరామ చింతనమె శ్రీరామ దర్శనమె
  శ్రీరామ శ్రవణమె చాలు కనుక

శ్రీరామ శరణమని వేడిన వాయసము
  చెందెనే శీఘ్రముగ ప్రాణభిక్ష
శ్రీరామ శరణమని వేడిన కపిరాజు
  చెందెనే రాజ్యమును శీఘ్రముగను
శ్రీరామ శరణమని చేరి రావణభ్రాత
  చెందె నభయము రాజ్యసిధ్ధి గూడ
శ్రీరాముని శరణుజొచ్చు వా రందరకు
  సిరు లభయములను కీర్తి తిరము కనుక

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని భజన
  చేయుటకు మించినది సుఖము లేదు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని సతము
  చింతించు జీవి కిక చింత లేదు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యను వాని
  చెందకుండెడు నట్టి సిధ్ధి లేదు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని పల్కు
  జీవికిక గర్భనరకంబు లేదు

3 కామెంట్‌లు:

  1. శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని పక్షి
    చెందనే మోక్షమును సూటిగాను
    Feel typo in secon line.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈటైపో పుణ్యమా అని మౌనపాఠకవరేణ్యులు ఒకముక్క అన్నారు. సంతోషమండీ.

      తొలగించండి
  2. మౌనపాఠకవరేణ్యులు, మంచి బిరుదిచ్చారు కదుసార్!
    ధన్యవాదాలు.

    రమ్యముగా రామనామము జపించు పుణ్యాత్ములున్న పట్టణాల చినుకు నర్తనమాడె
    మాలాటి రామనామ మహిమ కనరాని మొరకులున్న పల్లె చుక్క చిందలేదు
    నలభై పైమాట వేడి, చుర్రునకాలే ఎండ నిత్యం. వడగాలి అనునిత్యం బోనసు.
    రాత్రి పన్నెండుకు కూడా చల్లబడదాయె ఇదే ఖర్మమో రామచంద్రా!

    అన్నీ బూతులే ఉంటాయి, మన్నించెయ్యాలి. వేడికి మతి తప్పి,సుతీ తప్పుతోంది.
    మేమురాసేవన్నీ ఇలా ఉంటుంటాయి. అబద్ధం వా సుబద్ధంవా కుంతీ పుత్రా వినాయకాః ఇదికదా మా పాండిత్యం. అందుచేత,అందువలన మా బ్లాగులకి రద్దీ ఉంటుంది. "తోచీతోచనమ్మ తోటికోడలు పుట్టింటి కెళ్ళినట్టు" నాలుగు ముక్కలు రాసి పారేస్తాం,దాన్ని తెగడేవాళ్ళు,పొగిదేవాళ్ళు రకరకాలుంటారు.
    మరి మీబ్లాగులో రాసినదాని గురించి నోరు విప్పేసాహసం చేస్తే మా పండిత్యం చెప్పుకున్నట్టే అవుతుంది. అందుకు మౌనముత్తమ భాషణం అని నోరు మూసుకుంటాం,ఏం చెప్పలేక.

    ''Feel typo in secon line.''
    పైన రాసిన కామెంట్ చూడండి,చెప్పినది టైపో అవునో కాదో కూడా సందేహమే కదా! ఇదీ మా పాండిత్యం.
    నమోవాకాలు

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.