28, ఫిబ్రవరి 2020, శుక్రవారం
ఎవరో వారెవరో నా చెవిలో నిటు లూదిరి
ఎవరో వారెవరో నా చెవిలో నిటు లూదిరి
అవు నతడే హరి యతని నాశ్రయించు మనిరి
అది కలయో మరి నిజమో యని తెలియని దాయెను
ఇదియది యని తెలియని స్థితి యుదితమాయె నంతట
ఎదుటనె గని శుభమూర్తిని యెఱిగితి భువనేశుని
మది నేలెడు రాముని తిరుమల వేంకటేశ్వరుని
సదయుని చిన్మూర్తిని గని చాల సంభ్రమించితిని
హృదయ ముప్పొంగ నతని పదములపై వ్రాలితిని
పదునాలుగు భువనములకు ప్రభువును చిరునగవుల
పెదవి విప్పి పలికె కొన్ని మధురమధుర వాక్యములు
అతివత్సలు డగు శేషుడు నంతట నా కగుపడగ
అతని తోడ తిరిగి కొన్ని యపురూపము లరసితిని
అతడు చెప్ప నెఱిగికొంటి నవి నాకు తొల్లిటివని
హితవు లతని వలన విని స్మృతి నెఱిగితి నపుడు
తెలిసికొనిన సంగతులను తలచుకొనిన సుఖమగు
పలుకుల నీ సంఘటనను తెలుపనగు నటు లయ్యు
తెలుప లేను విశదముగను తెలుపెద నొక మాటను
తెలిపెదను సుజనులార మలు పొకటి రానున్నది
27, ఫిబ్రవరి 2020, గురువారం
మానలేడు మానలేడు మంకుతనము చూడుడు
మానలేడు మానలేడు మంకుతనము చూడుడు
తాను చచ్చి పుట్టి చచ్చి పుట్టి మరల చచ్చును
ఒకడు లక్షజన్మ లెత్తు నొక్కింతయు తెలియ లే
డకట యిట్లు పుట్టి చచ్చు టనెడు క్రీడ యాగదని
ఒక నాటికి ప్రళయమగుటయును నది యాగుటయును
సకలేశ్వరు నాజ్ఞ వలన జరుగుదాక యది యంతే
ఒకడు లక్షజన్మ లెత్తి యురక పుట్టి చచ్చుటలో
సుకమే లేదని తెలిసియు నకట యుపాయ మెఱుగడు
ఒక నాటికి రామనామ ముధ్ధరించ వచ్చును
ప్రకటితమై యుపాయము వానికి భాసించు దాక
ఒకడు లక్షజన్మ లెత్తి యొక చక్కని జ్ఞానము
ప్రకటితమై యార్తితో ప్రభో శ్రీరామచంద్ర
యిక చాలును చాలునయ్యా యిట్లు పైకి క్రిందికి
వెకలి నగుచు తిరుగ లేను విడిపించు మను నన్యుడు
26, ఫిబ్రవరి 2020, బుధవారం
చక్కనివాడ వైన జానకీరామ
చక్కనివాడ వైన జానకీరామ నీకు
మ్రొక్కేము మునిజనమోహన రామ
సకలలోకరక్షక సాకేతపురవిహార
వికచకమలదళేక్షణ ప్రియభాషణ
వికటవిరాధాధినిధన వినిర్జితపౌలస్త్య
ముకుళిత హస్తములతో మ్రొక్కేమయ్యా
యోగీశ్వరేశ్వర యోగిహృత్పురవిహార
వాగీశప్రముఖవినుతభండన రామా
సాగరగర్వాపహార నాగేంద్రపర్యంక
సాగి మ్రొక్కేము నీకు సర్వేశ్వరా
లోకేశ నారాయణ వైకుంఠపురవిహార
పాకారిప్రముఖసంప్రార్థిత రామా
శ్రీకరకరుణాలవాల సీతామనోహర
మాకు ప్రసన్నుడవు కమ్ము మా దేవుడా
ఎందు చూచిన మోసమె జనులార
ఎందు చూచిన మోసమె జనులార అకట యెందు చూచిన దోసమె
అందరును కలివిషాక్తమైన యన్నమే భుజియించు చుండగ
అరయ నెనుబది నాల్గులక్షల పరమచిత్రము లైన జీవుల
హరికుమారుడు సృష్టి చేసెను నరుల మిన్నగ నిర్ణయించెను
నరుల కిచ్చెను స్వేఛ్చ తమకు నచ్చినట్లుగ బ్రతుకు గడుపగ
హరిహరీ యపుడేమి జరిగెను నరులు క్రమముగ దారితప్పిరి
ఏల దారిని తప్పిరంటే యేమి చెప్పగ వచ్చునయ్యా
కాలమా కలియుగము కలికి జాలి గీలీ యేమి గలదు
నేలపై గల నరుల బుధ్ధుల నీచమార్గము లందు నడపును
మేలు కీడుగ కీడు మేలుగ మెదలగా జనహృదయములలో
తప్పుచేసెడు తల్లిదండ్రులు తనయులను దండించుచుందురు
తప్పుదారిన బడిన కొడుకులు తల్లిదండ్రుల జంపుచుందురు
తప్పునొప్పును తెలియనేరక తరచు మిత్రుల మోసపుత్తురు
తప్పుడు భర్తలును భార్యలు దారుణంబులు సేయుచుందురు
అక్కడక్కడ విష్ణుభక్తులు నక్కజంబుగ మొలచుచుందురు
మొక్కవోని ధైర్యమూని చక్కగా హరి సేవనుందురు
నిక్కముగ శ్రీరామనామము నెక్కుడుగ ద్యానించుచుందురు
తక్కిన జను లెల్ల మాయదారి బ్రతుకుల నీడ్చుచుందురు
25, ఫిబ్రవరి 2020, మంగళవారం
రామచంద్రా అంటే ముక్తి రాకపోయేనా
రామచంద్రా అంటే ముక్తి రాకపోయేనా లేక
రామనామ మనగ మనసు రాకపోయేనా
ఇంత సులభోపాయము నేల విడచి జనులెల్ల
చింతలపా లగుచు నుండి చెడిపోవుచున్నారో
యెంత యోచించినను సుంతైనను బోధపడదు
పంతగించి కలి వీరిని పట్టి లాగు చున్నదా
సులభమైన నామమే సుందరమగు నామమే
పలికినంతనే యొడలు పులకరించు నామమే
పలుక లేరు నిముషమైన భగవంతుని నామము
కలి యంతగ వీరి నకట కట్టి వేయు చున్నదా
హాయిగ శ్రీ రామరామ యనలేని జనావళికి
మాయ తొలగు టెప్పటికో మరి యెవ్వరి కెఱుక
మాయామానుషవేష మహిమ చేయవేని యీ
మాయాదారి కలి యాటలు మాయమగు టున్నదా
24, ఫిబ్రవరి 2020, సోమవారం
రాముడవు నీవు రమ్యగుణధాముడవు
రాముడవు నీవు రమ్యగుణధాముడవు
కామక్రోధాధిక కలుషవిదూరుడవు
ఇనకుల దీపనుడవు నిందీవరాక్షుడవు
మనసిజ కోటికోటి మహితస్వరూపుడవు
జనపతుల కులములో చాల విఖ్యాతుడవు
వనజాక్షి జానకికి ప్రాణాధికుడవు
మంగళాకారుడవు మంగళ దాయకుడవు
సంగవిహీనుండవు జ్ఞానస్వరూపుడవు
సంగీతలోలుడవు సంప్రదాయజ్నుడవు
శృంగారవతి సీత సేవలందు వాడవు
వీరాధివీరుడవు వేదాంతవేద్యుడవు
కారుణ్యవార్నిధివి కమలాయతాక్షుడవు
నారాయణమూర్తివి ఘోరదనుజహంతవు
స్త్రీరత్నము మాతల్లి సీతమ్మ పెనిమిటివి
హరిని గూర్చి పలుకుదురా
హరిని గూర్చి పలుకుదురా హరి భజనలు చేయుదురా
హరిని నమ్మి యుందురా యంతే చాలు రండు
మావలె హరిభక్తు లైతే మాజాతి వారలే
సేవనారతులము శ్రీహరి కెపుడు
భావించి లోలో పరమభాగవతోత్తము లిపుడు
శ్రీవల్లభు గూర్చి పలుక చెవులొగ్గుదమా
హరి కన్నను మీకు మాకు నతిముఖ్యు లెవ్వరు
హరిభజనలు చేయుదమా అందర మిపుడు
హరి వినా మోక్షమిచ్చు నట్టి దైవము లేడు
హరి మనకై రాము డనగ ధరపై వెలసె
సీతారాములు సేవలో చేతులు కలుపుదమా
వాతాత్మజుడు మెచ్చ ప్రజలు మెచ్చగ
ఖ్యాతిగల విభుని మహిమ గట్టిగ చాటుదమా
ప్రీతుడగుచు రామచంద్ర విభుడు మెచ్చగ
ఏ రోగమైన గాని యిదే మందు
ఏ రోగమైన గాని యిదే మందు
మీరెల్లరు సేవించ మేలైన మందు
మూడు తాపములు మిమ్ము ముప్పిరిగొనిన
వాడుకగా పెద్దలిచ్చు భలే గొప్ప మందు
పాడు చేదురుచి లేని భలే మంచి మందు
వేడుకగా సేవించ వీలైన దీమందు
ఆరు జబ్బు లొకసారిగ నధికమైనను
పారిపోవు నట్లు చేయు భలే గొప్ప మందు
క్షీరాన్నము కన్న మామంచి తీపి మందు
ఈరేడు లోకంబుల పేరుగల దీమందు
రండి రండి దీని పేరు రామనామము
పండితులకు పామరులకు పసందైన మందు
మొండి భవరోగమునకు ముఖ్యమైన మందు
పండించి జీవితములు బాగుచేయు మందు
పొందరే శ్రీరామభజ నానందము మీరందరు
పొందరే శ్రీరామభజ నానందము మీరందరు
అందుకొనరే హాయిగా శ్రీహరికటాక్షము నందరు
ఎన్ని నేతిమిఠాయిలు భుజియించినా యీ జిహ్వకు
కొన్ని నిముషములే హాయి యన్న మాట మరువక
ఎన్నుకొని శ్రీరామచంద్రుని హెచ్చుగా స్తుతిజేయుచు
మిన్ను ముట్టగ నాడి పాడుచు మీరు హాయిని పొందరే
ఎన్ని సంపద లున్నను మరి యెన్ని పదవు లున్నను
ఎన్నడును నేవెవొ చింతలు నేవేవొ కోర్కుల మధ్యన
నున్న వారలె మీరు బాధల నున్న వారలె గావున
తిన్నగా మీ చిత్తశాంతికి దేవదేవుని వేడరే
ఎన్ని పూజలు చేసి పుణ్య మెన్ని మూటలు కట్టినా
ఎన్నడును శ్రీరామ యనక నెవరి కున్నది మోక్షము
పన్నుగ శ్రీరామచంద్రుని పాదములు సేవించుచు
ఎన్న నలవి కాని సుఖము నెల్ల వేళల బొందరే
హాయిగా శ్రీరామ రామ యనుచు
హాయిగా శ్రీరామ రామ యనుచు నామ భజనము
చేయుటలో సుఖమింతని చెప్పగ నా వశమా
చెప్పగ నా వశమా ఆ శ్రీరామనామ మహిమ
యెప్పటికిని బ్రహ్మయును చెప్పగ లేడే
చెప్ప నేల వేరుగా ఆ చిన్మయు శుభ నామమే
గొప్పదనుచు ముల్లోకము లెప్పుడో యెఱిగినదే
చెప్పగ నా వశమా అది శ్రీహరి నామములలో
గొప్పదనుచు శంకరుడే గొప్పగ చెప్పెను
విప్పరాని మాయముడులు విప్పి జీవు లందరకును
తప్పకుండ మోక్షమిచ్చు గొప్ప నామ మిది కదా
చెప్పగ నా వశమా అది శ్రీహరి సత్కృప దొఱుకగ
నిప్పటికీ జన్మమునకు సిధ్ధించినది
చెప్పరాని యిడుముల బడి చేసిన నా తపమునకు
యెప్పటికిక పుట్ట ననుచు గొప్ప వర మిచ్చు నిదే
హాయిగా భక్తజను లందరు కలసి
హాయిగా భక్తజను లందరు కలసి
చేయరే రామభజన తీయతీయగ
ఎంతవారి కైన నుండు చింతలన్నవి
చింతలు లేనట్టివారు సృష్టిని గలరే
చింతలన్ని తీర్చునట్టి శ్రీరాముడు
చెంతనుండగా భీతిచెంద నేటికి
పరమకృపా మూర్తియైన హరిదయవలన
అరుదైనది నరజన్మ మది దొరకినది
పరమభాగవతుల కిది వరమైనది
హరిని సేవించి మోక్ష మందవలయును
అంతకుడు వచ్చుదాక నాలసించక
సంతసముగ హరిభజనలు సలుపుడయ్య
సంతత శ్రీరామనామ స్మరణ మిచ్చు
నెంత పాపి కైన గాని యిట్టే మోక్షము
23, ఫిబ్రవరి 2020, ఆదివారం
బ్లాగుల్లో తెలుగుపద్యాలూ అచ్చుతప్పులూ...
కొద్ది రోజుల క్రిందట సాహితీనందనం బ్లాగులో నుతజలపూరితంబులగు నూతులు .. అన్న టపాలో చివరన ఇచ్చిన శతకూపాధిక దీర్ఘిక అన్నపద్యంలో చివరి పాదంలోని గణభంగం గురించి నేను ప్రస్తావించటం పైన కొంత రగడ జరిగింది. చాలా వరకు అది అనవసమైన రగడ.
ఆ టపాలో ఇచ్చిన కందంలో చివరి పాదం శతంబున కెక్కు డొక్క సత్యోక్తి నృపా! అని ఉంది. అలా ఉండి ఉండకూడదు. బహుశః శతకంబున కెక్కుడొక్క అని ఉండి ఉండవచ్చును. కందపద్యాల నడక తెలిసిన వారి కెవరికైనా ఇది ఇట్టే మనస్సుకు తోస్తుంది. పాఠశాలా విద్యార్ధులకైనా గణవిభజన చేస్తే ఇందులో ఉన్న దోషం సులువుగానే బోధ పడుతుంది.
నేను తెలుగుసాహిత్య అకాడమీ వారి (1969సం) భోజరాజీయం పుస్తకాన్ని archive.org నుండి download చేసి చూసాను. ఆపుస్తకం వివరం 2015.386140.bhoojaraajiiyamu. ఈ పద్య భాగం తిలకించండి అక్కడెలా గున్నదీ
అందుచేత సాహితీనందనం వారు ఈపద్యాన్ని తమబ్లాగులోనికి ఎక్కించేటప్పుడు చిన్న పొరపాటు దొరలింది అనటంలో సందేహం లేదు. ఐతే ఈపద్య సంఖ్య ఈప్రతిలో 6-92 కాక 6-84. అంటే బ్లాగు వారు చూచిన అచ్చు ప్రతి వేరే అని తేలుతున్నది. అందులో కాని అచ్చుతప్పు ఉంటే ఉండి ఉండవచ్చును. గణభంగాన్ని సాహితీనందనం వారు గమనించి ఉండకపోవచ్చును.
ఐతే అక్కడ ఒక వ్యాఖ్యాత గారు నా మాటలను ఖండిస్తూ అన్న మాటలు చూడండి.
శతంబునకంటె అని ..మహాకవి పద్యంలో వున్నది.. శ్యామలీయం వారు శతకంబని..సవరణ చేయటం సముచితంకాదు.
చిత్రం. మహాకవి పద్యంలో ఎలా ఉన్నదో ఆ వ్యాఖ్యత చూసారా? మహాకవి స్వయంగా గణభంగం చేసారని వారి ఉద్దేశమా?
ఆ తరువాత రగడ మొదలయ్యింది. ఎవరెవరో అనామకులు నోటికి వచ్చింది మాట్లాడారు! ఆ తరువాత మొదటి వ్యాఖ్యాత మరింత సూటిగా మరొక వ్యాఖ్య చేస్తూ నావి "కోడిగ్రుడ్డుపై ఈకలు పీకటం లాంటి వ్యాఖ్యలు" అన్నారు. ఇలాంటి అజాగళస్తనసగోత్రులను ప్రక్కన పెడదాం.
కాని ఇంకా ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి. తమ బ్లాగులో అచ్చు తప్పు పడటం గురించి తమ యెఱుక లోనికి వచ్చిన తరువాత కూడా సాహితీ నందనం వారు ఆ పద్యంలోని అచ్చుతప్పును సవరించుకొన లేదు.
అంటే ఏమన్న మాట? సమాధానాన్ని చదువరులే ఆలోచించుకోవలసి ఉంది.
అదే బ్లాగరు గారి చిత్రకవితా ప్రపంచం బ్లాగులో శివస్తుతి అన్న మొన్న 21వ తారీఖు నాటి టపాలో కూచిమంచి తిమ్మకవి వ్రాసిన రసికజనమనోభిరామం లోనుండి ఒక పద్యాన్నిచ్చారు. అందులో కూడా కొన్ని అచ్చుతప్పులున్నాయి. తప్పులు పట్టటం నా ఉద్యోగం కాదు. నా అభిరుచీ కాదు. కాని అవి కనిపిస్తే ఇబ్బందిగా అనిపించటం నా దౌర్భాగ్యం అనుకోండి. దానికి నేనేమీ చేయలేను. పదేపదే అవే తప్పులు చేసే చోట్లకు పోవటం మానటం తప్ప!
అందుచేత చిత్రకవితా ప్రపంచం వారికి ఈరోజు ఒక వ్యాఖ్యను ఉంచాను. అచ్చుతప్పుల గురించి జాగ్రత వహించమని విన్నవించటానికి ఒక లేఖ అది వ్యాససమగ్రత కోసం ఆ లేఖను ఇక్కడ ఉంచుతున్నాను.
మిత్రులు రమణ రాజు గారు,
దయచేసి పద్యాలను ఛందోదోషాలు లేకుండా ప్రచురించండి. మరీ తరచుగా తప్పుపాఠాలు వస్తున్నాయి.
మీకు లభించిన పద్యపాఠాల్లోనే అచ్చుతప్పులు ఉండవచ్చును. లేదా మీరు బ్లాగులో వాటిని వ్రాస్తున్నప్పుడు తప్పులు పడవచ్చును - వాటిని మీరు సరిచూచుకొని ప్రచురించటం చాలా చాలా అవసరం. పద్యం తప్పులతో కనిపిస్తుంటే మనస్సు విలవిల లాడుతుంది.
పొరపాటును మీదృష్టికి తేవటం అందుకే. కాని అలా చేసినందుకు కొందరు నిరసించటమూ, వెక్కిరించటమూ దూషించటమూ చేస్తున్నారు. బ్లాగులోకంలో అవకాశం చూసుకొని ఇతరులను మాటలనే వారికి కొదవలేదని అందరికీ తెలిసిందే.
మీరు కవిత్వం అనీ సాహిత్యం అనీ బ్లాగులకు పేర్లు పెట్టుకున్నారని, ఏదన్నా విషయం ఉంటుందనీ, నాబోంట్లు మీ బ్లాగులకు రావటం. మంచి చెప్పి మాటలు పడటానికి కాదు. మీరు శ్రద్ధతో సరిగా నిర్వహించని పక్షంలో మీబ్లాగులను విసర్జించక తప్పదు.
ప్రస్తుత పద్యాన్ని మీరు ప్రకటించిన పాఠం చూదాం. ఇది సీసపద్యం. మొదటి పాదంలో ప్రధమార్ధం "రవిశశినేత్ర భువనరక్షణమాత్ర" అని ముద్రించారు. రవి-భువ ప్రాసయతి బాగుంది. రవిశశినేత్ర అన్నప్పుడు అది రెండు ఇంద్రగణాలకు సరిపోవటం లేదు కదా! ఉదాహరణకు రవిశశిశుభనేత్ర అన్నారనుకోండి అప్పుడు సరిపోతున్నది. కాని మూలప్రతిలో ఎలాగున్నదో మరి. అలాగే ""విజితశాత్రవగోత్త" అని పడింది ముద్రారాక్షసం "విజితశాత్రవగోత్ర"కు బదులుగా.
మీరు ఎంచుకొన్న సందర్భాలూ ఉదహరిస్తున్న పద్యాలు బాగుంటున్నాయి. కాని పద్యాలను కొంచెం పరిశీలగా చూచి బ్లాగులో వ్రాయండి. ఒక్కొక్క సారి ముద్రిత ప్రతుల్లోనూ తప్పులుంటాయి. తెలుగు పుస్తకాలు కదా! అందరూ వావిళ్ళ వారిలాగూ పండితపరిష్కరణలూ పండితపరిశీలనలనూ చేసి అచ్చువేయరు. అందుచేత జాగ్రత అవసరం. అలాగే బ్లాగులోనికి ఎక్కించేటప్పుడు రకరకాల కారణాలవలన తప్పులు వస్తాయి. కొంచెం ఓపికగా సరిచేసుకొనకపోతే పాఠకులకు ఇబ్బంది. ముఖ్యంగా సాహిత్యాభిమానులకూ, సాహిత్యవిద్యార్ధులకూ ఆ ఇబ్బంది ఎక్కువ.
ఏదో పద్యం కోసం గాలించటమూ అది ఏదో ఒక బ్లాగులోనో మరొకచోటనో దర్శనం ఇవ్వటమూ నాకే చాలా సార్లు అనుభవం ఐనది. ఐతే ఇంచుమించు ప్రతిసందర్భంలోనూ ఆ పద్యాన్ని అనేకులు తప్పుపాఠంతో ప్రచురించటమూ గమనికకు వచ్చింది. ఉత్సాహానికి వారలను అభినందించవలసిందే ఐనా, నిర్లక్ష్యానికి తప్పుపట్టకుండా ఉండటం సాధ్యం కాదు. ముఖ్యంగా అనేకులు ఇలా వెబ్‍లో కనిపించిని ఏదన్నా సరైన పాఠమే అనుకుంటూ ఉన్నారని తెలిసిన తరువాత. అందుచేత మీకు మరొకసారి విన్నపం చేస్తున్నాను. పద్యాల పట్ల కొంచెం ఎక్కువ శ్రధ్ధ తీసుకొని ప్రకటించండి. అందరికీ ఆనందంగా ఉంటుంది.
మీరు ఈ నా సూచనను పట్టించుకొనకపోతే నేను చేయగలిగినది ఏమీ లేదు. మీ బ్లాగు(ల)కు ఒక నమస్కారం పెట్టి ప్రక్కకు పోవటం తప్ప.
చివరిగా ఒకమాట. ఇలా నేను చెప్పటం అసమంజసం అనో పొగరు అనో వ్యాఖ్యానించే వారికి ఒక నమస్కారం. వారితో వాదనకు దిగేందుకు నాకు ఓపికా తీరికా రెండూ లేవు. (దీన్నే పారిపోవటం అంటారని ఎవరన్నా వ్యాఖ్యానించినా నాకు ఇబ్బంది లేదు. నేను చెప్పవలసింది బాధ్యతగా చెప్పాను. అంతవరకే నా పాత్ర)
ధన్యవాదాలు.
అసలు ఆ పద్యం రసికజనమనోభిరామంలో ఎలా ఉన్నదీ అన్నది చూదాం. ఈ పుస్తకం కూడా నాకు archive.org లో లభించింది. ఆ పుస్తకం వివరం 2015.386499.Rasikajanamamobhiramamu. అ పుస్తకంలో ఉన్న పద్యం ఇలా ఉంది.
ఈ పై పద్యప్రతి వావిళ్ళ వారి 1910వ సంవత్సరంలో ముద్రించిన రసికజనమనోభిరామము లోనిది. 6వ ఆశ్వాసంలోని 177వ పద్యం. వావిళ్ళవారి పుస్తకాల్లో అచ్చుతప్పులు మహా అరుదు. వారి ప్రచురణలను సాహితీలోకం ప్రామాణికంగా పరిగణిస్తుంది. పైన ఉన్న వావిళ్ళ వారి ముద్రణలో పద్యం రవిశశిశిఖినేత్ర అని మొదలైనది. వావిళ్ళ వారి గురించి తెలియని వారు అక్షేపించితే వారికి వావిళ్ళ వారి గురించి బోదించే తీరిక లేదు నాదు.
ఈ వివరం ఇవ్వకపోతే అత్యుత్సాహం కల వ్యాఖ్యాత గారు మళ్ళా మరొక మహాకవికే నేను వంకలు పెడుతున్నానని అక్షేపించ గలరు. ఇచ్చినా మరేమని ఆక్షేపిస్తారో తెలియదు - అది వేరే సంగతి.
నేను ఈరోజున వ్యాఖ్యలో చెప్పినట్లు తెలుగుపద్యాలను చాలా మంది అచ్చు తప్పులతో తమతమ సైట్లలో ఉంచుతున్నారు. దీని వలన చాలా అనర్ధం జరుగుతున్నది. ఆ వ్యాఖ్యాత వంటి వారు అవే కవుల అసలు పద్యాలని అనుకొంటున్నారు. ఇది దారుణం.
ఒక పద్యం విషయంలో కష్టేఫలి బ్లాగరు శర్మ గారు కూడా ఇలాగే ఇబ్బంది పడ్దారు. వారి మాటల్లోనే చెప్పాలంటే కొంచెం బధ్ధకించి ఒక భారత పద్యాన్నిఇలాగే నెట్‍లో చూచి తీసుకున్నారు. తీరా చూస్తే అందులో గణదోషాలతో ఉంది సాహిత్యం. వారికి మనవి చేస్తే చూసి అప్పుడు భారతం తిరుగవేసి అసలు పాఠాన్ని తమ టపాలో ఉంచారు.
ఆ పద్యం నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె.. అన్న నన్నపార్యుని పద్యమే. అది నాకు వేరొక చోట అంటేసాహితీనందనం బ్లాగులో కనిపించింది కాని అక్కడా కొన్ని తప్పులతోనే ఉంది. గరికపాటివారి సైట్‍లో కూడా కొంచెం తప్పుగానే ఉంది. తెలుగువికీ పేజీలో కూడా ఒకతప్పుతో ఉంది. ఇలా చాలా చోట్ల చిన్నాచితకా తప్పులతోనే ఉన్నది. ఈ విషయం మనవి చేయటమూ శర్మ గారు నేరుగా భారతాన్ని సంప్రదించటమూ చేసారు. ఈ సంఘటన గన సంవత్సరం డిసెంబరులో జరిగింది.
అదుచేత అందరు బ్లాగర్లకూ నా సవినయమైన విన్నపం యేమిటంటే దయచేసి ఇతరులను ఉటంకించేటప్పుడు, ముఖ్యంగా కవుల పద్యాలను తమ టపాల్లో ఉంచేటప్పుడు తగిన జాగ్రతలు తీసుకొన వలసింది. అలా చేయటం వలన పాఠకులకూ ఆకవులకూ కూడా న్యాయం చేసిన వారు అవుతారు.
21, ఫిబ్రవరి 2020, శుక్రవారం
అకారాద్యక్షరమాలా శివస్తోత్రమ్
అత్యంతసుఖసంతోషప్రదాయ పరమాత్మనే నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఆత్మరూపాయ వృధ్ధాయ అనుగ్రహపరాయతే నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఇనచంద్రాగ్నినేత్రాయ ఈశ్వరాయ నమోస్తుతే నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఈశానాయచ విఘ్నేశగురవే గురురూపిణే నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఉమానాథాయ శర్వాయ లోకనాథాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఊర్ధ్వలింగాయ పూజ్యాయ దివ్యలింగాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఋగాదివేద వేద్యాయ వేదగమ్యాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఏకానేకస్వరూపాయ శోకాదివర్జితే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఐశ్వర్యదాయ విశ్వాయ విశ్వసంపూజితే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఓంకార వాచ్యరూపాయ మహాదేవాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఔక్థికప్రీతచిత్తాయ మహారూపాయ తేనమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. కాలాయ కాలకాలాయ కాలకంఠాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఖగరాడ్వాహసంపూజ్యమానదివ్యాంఘ్రియుగ్మతే నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. గజచర్మాంబరాఛ్ఛాధ్యసుశ్వేతవపుషే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఘోరశ్మశానవాసాయ గతాగతాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. జ్ఞానరూపాయ శాంతాయ ధ్యానగమ్యాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. చంద్రచూడాయ నిత్యాయ లోకప్రియాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఛందోనువాకసంస్త్యుత్య నిజప్రభావతే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. జన్మమృత్యుజరాబాధానివారకాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఝుంకారభ్రామరీయుక్త శ్రీశైలాధిప తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. జ్ఞానగమ్యాయ యజ్ఞాయ వ్యాళరూపాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. టంకటీకాయ త్వష్టాయ త్రికంటకాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఠంకారమేరుకోదండయుక్తహస్తాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. డమరుకసృష్టవాక్ఛాస్త్రమూలసూత్రాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఢంకాతూర్యాదికస్సర్వవాద్యప్రియాయ తేనమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. నిస్తులాయ ప్రసన్నాయ గిరిధన్వాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. తత్త్వమసీతివాక్యార్థ లక్ష్యరూపాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. స్థాణవే సర్వసేవ్యాయ జంగమాధిప తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. దుఃఖనాశాయ సూక్ష్మాయ మహాకేశాయ తేనమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ధ్రువాయాభివాద్యాయ హరిణాక్షాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. నృత్యప్రియాయ హైమాయ హరికేశాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. పంచవక్త్రాయ భర్గాయ పరమేశాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. ఫాలనేత్రాయముఖ్యాయ సర్వవాసాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. బలాయ శిపివిష్ఠాయ జటాధరాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. భవాయ భవనాశాయ భూతనాథాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. మహాతపాయ సోమాయ వామదేవాయ తేనమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. యమగర్వాపహర్తాయ నిరవద్యాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. రుద్రాయ లోహితాక్షాయ బహురశ్మిశ్చ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. లింగాద్యక్షాయ సర్వాయ మహాకర్మాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. విరూపాక్షాయ దక్షాయ వ్యోమకేశాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. శత్రుఘ్నాయ భవఘ్నాయ ధర్మఘ్నఘ్నాయ తేనమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. షడధ్వాతీతరూపాయ షడాశ్రయాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. సర్వవేదాంత సారాయ సద్యఃప్రసాదినే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. హరాయ లోకథాతాయ హరిప్రియాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. లలాటాక్షాయ వైద్యాయ పరబ్రహ్మాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. క్షేమంకరాయ యోగీంద్రహృన్నివాసాయ తే నమః నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః. |
20, ఫిబ్రవరి 2020, గురువారం
పండుగ వచ్చిన గాని భగవంతుడు
పండుగ వచ్చిన గాని భగవంతుడు గుర్తుకు రాని
దండుగమారి భక్తజనుల దండే హెచ్చు
దినదినము డబ్బు దయ్యము వెనుకనే తిరుగుచు
పనిగొని పండుగ నాడే భగవంతుని వద్దకు
ధనవృద్ధి కోసమని తరచితరచి మ్రొక్కగ
చనుదెంచెడు దొంగ భక్తజనులతో గుడులు నిండు
అది లేదని యిది లేదని యనుదినము నేడ్చుచు
అదనుచూచి పండుగ యని ఆత్రముతో వత్తురు
పదేపదే తమకోర్కుల పాఠము వల్లింతురు
హృదయముల కలికమునకు నేని భక్తి యుండదు
నీమముతో నిజభక్తుల నిరంతరము బ్రోచెడు
శ్యామలాంగుడే తమకు సర్వస్వమని యెంచి
ప్రేమతో తమ గుండెలె విడుదులుగా చేసెడు
రామభక్తు లందరకును ప్రతిదినమును పండువే
18, ఫిబ్రవరి 2020, మంగళవారం
ఎంతమాట ఎంతమాట యీశ్వరుడ నీవు
ఎంతమాట ఎంతమాట యీశ్వరుడ నీవు
చింతలకు నెలవైన జీవుడ నేను
పరగ నీకు చెల్లు నహం బ్రహ్మాస్మి యనుటకు
నరుడ నజ్ఞాని నయ్యది నాకు చెల్లదు
పరమబ్రహ్మమవు నీవు పతితజీవుడ నేను
ఉరక మెట్టవేదాంత ముపకరించదు
ఆరయ నేనుందు సంసారార్ణవ మీదుచు
క్షీరార్ణవ మధ్యమున చీకుచింతల
పోరు లేక నీవుందువు పురుషోత్తమ రామ
నారాయణ నీతోడ నాకు పోలికా
పాముపా మంటే నేను పరుగో పరుగు పెద్ద
పాము మీదనే ప్రక్క పరచితి వీవు
ఏమో యేదో యెవరో యెందుకన్నారో
రామా నను నీతో పోల్చరాదు కాక రాదు
ఇన్నా యన్నా యెత్తిన జన్మము లెన్నని చెప్పేది
ఇన్నా యన్నా యెత్తిన జన్మము లెన్నని చెప్పేది
యెన్నెన్నెత్తుదు నికమీదట నని యెట్లా చెప్పేది
దాగుట శక్యమె ప్రారబ్ధంబది తరుమగ జీవునకు
మూగక మానవు కష్టము లన్నవి పుట్టిన పిమ్మటను
నే గడచితి నటువంటి పుట్టువులు నిశ్చయముగ కోట్లు
రాగల జన్మల వివరము లన్నీ రామునకే యెఱుక
భోగలాలసను కరిగిపోయినవి పుట్టువు లెన్నెన్నో
రోగము రొష్టుల ననుభవించుచు సాగిన వెన్నెన్నో
యోగాభ్యాసము మొదలై నప్పటి నుండి యిదెన్నవదో
యే గురుతులు నాకున్న విప్పుడని యేమని చెప్పేది
ఏ సత్కర్మఫలానుభవంబది యిప్పుడు కల్గినదో
భాసమానమై రామనామము పండినదీ బ్రతుకు
చేసెద నిష్ఠగ రామనామమును చిత్తశుధ్ధి తోడ
దాసుడ రాముని కృపగల్గినచో తరియింతును నేను
తగవు లాడెదవా నాతో దశరథతనయా
తగవు లాడెదవా నాతో దశరథతనయా చిరు
నగవు లొక రెండు విసిరి నను మురిపింతువు
ఎపుడయ్యా మోక్ష మంటే నేనేమో చెప్పేవు నా
తపన నీ వెరుగనిదా దాటవేసేవు
కుపధములే పట్టితినా కుమతుల దరిజేరితినా
విపరీతము నీతీరని వ్రేలెత్తి చూపితినా
శపథములే చేసితినా చపలత్వము చూపుచు నీ
కపచారము చేసితినా అదరించవు
అపవర్గము నడిగితినా యన్యంబు లడిగితినా
కృపమాలి తగవులకిటు కేరించుచు వచ్చేవు
నృపశేఖర నీయానను నేను కాదంటినా నీ
కపకారము చేయు వాని నగ్గించితినా
యెపుడు నీమాట చొప్పు నేయుందును కాని న
న్నపహసించి తగవులాడి అనందము పొందేవు
వేదపండితులకు ఫించను - కంచి కామకోటి మఠం నుండి.
వేదపండితుల ఫించను - ఈ సదుపాయాన్ని అర్హులైన పండితులకు వివరించండి.
కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు, వృద్ధులైన (60 ఏళ్ళు దాటిన) వేద పండితులకు, పింఛను మరియు ఆరోగ్య బీమా పథకాన్ని ఆవిష్కరించారు.
ఈ సదుపాయాన్ని, ఏ ప్రాంతంవారైనా, ఏ శాఖకు చెందిన వేద పండితులైనా ఉపయోగించుకోవచ్చును. మీరు పంపవలసిన వివరాలు -
పేరు:
పుట్టిన తేది:
వయసు:
గోత్రము:
తండ్రి పేరు:
తల్లి పేరు:
చిరునామా:
ఫొటో:
సెల్ నం:
ఇల్లు: (సొంత ఇల్లు) లేదా (అద్దె)
చదివిన వేదం:
పాఠశాల పేరు:
పాఠశాల చిరునామా:
అధ్యాపకుల పేరు:
ఆధార్ కార్డు వివరాలు (కాపీ జతపరచాలి)
వేదం కోర్సు సర్టిఫికేట్ (కాపీ జతపరచాలి)
వివరాలు (ఆంగ్లంలో మాత్రమే పంపాలి) పంపవలసిన చిరునామా:
Shri Ramana Dikshithar,
136.C Solayappan Street, 4th Padithurai, Kumbakonam-612001 ramanadeekshadhar@gmail.com
సెల్ నం: 9443188245.
I, raghurama murthy confirm that i talked with sri ramana deekshadhar garu and the above information is correct
గమనిక: ఇది నాకు వాట్సాప్‍లో కొద్దిసేపటీ క్రిందట వచ్చిన సందేశం. నిజానిజాల నిర్ధారణ కొరకు ప్రయత్నం చేసాను 9443188245 నంబరుకు కాల్ చేసి. ఈ వార్త నిజమే అని తెలిసింది. ఇంకొంచెం స్పష్టత వచ్చింది. ఈ వివరాలను పైన కూడా జోడించాను.
కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు, వృద్ధులైన (60 ఏళ్ళు దాటిన) వేద పండితులకు, పింఛను మరియు ఆరోగ్య బీమా పథకాన్ని ఆవిష్కరించారు.
ఈ సదుపాయాన్ని, ఏ ప్రాంతంవారైనా, ఏ శాఖకు చెందిన వేద పండితులైనా ఉపయోగించుకోవచ్చును. మీరు పంపవలసిన వివరాలు -
పేరు:
పుట్టిన తేది:
వయసు:
గోత్రము:
తండ్రి పేరు:
తల్లి పేరు:
చిరునామా:
ఫొటో:
సెల్ నం:
ఇల్లు: (సొంత ఇల్లు) లేదా (అద్దె)
చదివిన వేదం:
పాఠశాల పేరు:
పాఠశాల చిరునామా:
అధ్యాపకుల పేరు:
ఆధార్ కార్డు వివరాలు (కాపీ జతపరచాలి)
వేదం కోర్సు సర్టిఫికేట్ (కాపీ జతపరచాలి)
వివరాలు (ఆంగ్లంలో మాత్రమే పంపాలి) పంపవలసిన చిరునామా:
Shri Ramana Dikshithar,
136.C Solayappan Street, 4th Padithurai, Kumbakonam-612001 ramanadeekshadhar@gmail.com
సెల్ నం: 9443188245.
I, raghurama murthy confirm that i talked with sri ramana deekshadhar garu and the above information is correct
గమనిక: ఇది నాకు వాట్సాప్‍లో కొద్దిసేపటీ క్రిందట వచ్చిన సందేశం. నిజానిజాల నిర్ధారణ కొరకు ప్రయత్నం చేసాను 9443188245 నంబరుకు కాల్ చేసి. ఈ వార్త నిజమే అని తెలిసింది. ఇంకొంచెం స్పష్టత వచ్చింది. ఈ వివరాలను పైన కూడా జోడించాను.
- వృధ్ధులు అంటే 60 దాటిన వేదపండితులకు మాత్రమే
- ఆధార్ కార్డు కాపీ జతపరచి పంపాలి.
- వేదం కోర్సు పాసయి ఉండాలి. దాని సర్టిఫికేట్ యొక్క కాపీ కూడా జతపరచాలి.
- ముఖ్యంగా అప్లికేషన్ ఆంగ్లంలో మాత్రమే పంపాలి. తెలుగులో పంపరాదు.
ఏమి చేయ వలయునో మేమేమి చేయవలయునో
ఏమి చేయ వలయునో మేమేమి చేయవలయునో
యేమి చేసి రామచంద్రుని ప్రేమ బడయవచ్చునో
మొట్టమొదట రామచంద్రుని గట్టిగా నెద నమ్మవలెను
పట్టువదలని కోరికలను గట్టిగా విదిలించవలను
పట్టివదలని సకల దుష్టవాసననలు వదిలించవలెను
పట్టుబట్టి మనసు రాముని పాదములపై నిలుపవలెను
ఎట్టులైనను రాముడే గతి యింక నాకని నమ్మవలెను
చుట్టమతడని దేవుడతడని సుస్థిరముగా నమ్మవలెను
పుట్టిన సద్భుధ్ధి రాముని పుణ్యమేనని నమ్మవలెను
ఎట్టి సందేహములు లేక యెపుడు రాముని నమ్మవలెను
పట్టుదలతో రామసేవా భాగ్యములు సాధించవలెను
గట్టి సంతోషమున రాముని ఘనముగా సేవించవలెను
పట్టువిడువక రామసేవా పథములోనే నడువవలెను
పుట్టువులు చాలింక రామ మోక్షమిమ్మని యడుగవలెను
మందండి మంచి మందు చాల మంచి మందు
మందండి మంచి మందు చాల మంచి మందు
సందేహము మీకు వలదు చాల చౌక మందు
వేలకోట్ల మంది సతము గ్రోలజాలు మందు
మేలుతప్ప కీడులేని మిగులగొప్ప మందు
కాలదోష మసలు లేని మేలురకపు మందు
కాలు నిట్టె తరిమికొట్ట జాలి నట్టి మందు
కందువ నమృతము కన్న ఘనతగల మందు
ఎందరో పెద్దలు సేవించి నట్టి మందు
ఎందరికో మంచి గుణము నిచ్చినట్టి ముందు
బందుగులకు మిత్రులకు పంచదగిన మందు
తామసించు భవరుజను తరిమికొట్టు మందు
నీమ మిదను పానమిదని నియమించని మందు
ప్రేమతోడ నెల్లరు సేవించదగిన మందు
రామనామ మనే ముందు రమ్యమైన మందు
17, ఫిబ్రవరి 2020, సోమవారం
కోరిచేరితి మిదే కోదండరామ
కోరి చేరితి మిదే కోదండరామ
కారుణ్యధామ మమ్ము కటాక్షించవే
మేలగు కుటుంబమును మేలగు ప్రాభవమును
మేలగు శీలంబును మేలైన చేతలును
మేలెంచు బంధువుల మేలుచేయు మిత్రులను
వాలాయగముగ మాకు ప్రసాదించవే
జయము మంచిపేరును చక్కని సంపదలును
క్రియాకుశలబుద్ధియు దయగల చిత్తంబును
భయములేని బ్రతుకును బహుసుఖజీవనమును
దయచేయుమా మాకు దశరథాత్మజ
పలుకున నీనామము కులుకెడు నాలుకయును
కులుకుచు నీరూపము తలచెడు చిత్తంబును
తలపుల నీతత్త్వము తళుకొత్తు భాగ్యమును
వలయును తండ్రి మాకు వలదన కీవే
16, ఫిబ్రవరి 2020, ఆదివారం
రామచంద్రం భజే రమ్యసద్గుణార్ణవం
రామచంద్రం భజే రమ్యసద్గుణార్ణవం
కామితార్ధదాయకం కళ్యాణకారకం
కువలయాక్ష మచ్యుతం కువలయేశనందనం
భువనత్రయ పాలకం పుణ్యఫలవివర్ధకం
సవనసంరక్షకం అవనిజామనోహరం
దివిజవర్గరక్షకం దివిజవైరినాశకం
సకలసుజనపూజితం సకలసంపత్ప్రదం
సకలభక్తపాలకం సకలభువనరంజకం
సకలవిద్యానిధిం సకలమునిజనాశ్రయం
సకలధర్మాశ్రయం సకలసురగణార్చితం
పరమదివ్యవిగ్రహం పరమధర్మవిగ్రహం
పరమశాంతవిగ్రహం పరమవీరవిగ్రహం
పరమదయావారిధిం పరమేశ్వర మనాదిం
పరమసుఖద మవ్యయం పరమపదప్రదాయకం
ఇనకులతిలక నమో నమో
ఇనకులతిలక నమో నమో ఈశ్వరసన్నుత నమో నమో
మునిజనపూజిత నమో నమో మోక్షవితరణ నమో నమో
శ్రీరఘునాయక నమో నమో సీతారామా నమో నమో
కారుణ్యాలయ నమో నమో కామితవరద నమో నమో
వారిధిబంధన నమో నమో వారిజలోచన నమో నమో
మారజనక హరి నమో నమో మంగళదాయక నమో నమో
ప్రజ్ఞానఘన నమో నమో పాపవినాశన నమో నమో
విజ్ఞానప్రద నమో నమో వీరాగ్రేసర నమో నమో
అజ్ఞానాంతక నమో నమో యజ్ఞస్వరూప నమో నమో
యజ్ఞవివర్ధన నమో నమో యజ్ఞఫలప్రద నమో నమో
భూవలయేశ్వర నమో నమో పుణ్యవివర్ధన నమో నమో
రావణసంహర నమో నమో రమ్యగుణాకర నమో నమో
దేవగణార్చిత నమో నమో దివ్యప్రభావ నమో నమో
పావననామ నమో నమో పాలితకింకర నమోనమో
15, ఫిబ్రవరి 2020, శనివారం
పరబ్రహ్మమే రామభద్రుడై రాగా
పరబ్రహ్మమే రామభద్రుడై రాగా
పరమభక్తు లిదె వచ్చిరి బ్రహ్మాదులు
పరమేష్ఠి మున్నె జాంబవంతుండై యుండెను
హరిసేవకు డగుచు నిలువ ధరాతలమున
పరమశివుడు తాను గాలిపట్టియై జనియించె
పరమరామభక్తు డగుచు పరవశింపగ
దేవశిల్పివిశ్వకర్మ తేజరిల్లె నలుడై
దేవవైద్యులైరి మైందద్వివిద వీరులు
దేవగురుడు తారు డగుచు దిగివచ్చెను ధరణికి
వేవెలుంగు సుగ్రీవ కపీంద్రుడాయెను
ధనేశుడును గంధమాదనుడుగా నరుదెంచె
జనియించెను సుషేణుడై ఘనుడు వరుణుడు
జననమందె పర్జన్యుడు శరభుడను వీరుడై
అనవద్యులు వీరందరు హరికి తోడైరి
లేబుళ్లు:
రామకీర్తనలు,
రామాయణకీర్తనలు
హరిసంకీర్తన చేయుట కంటె
హరిసంకీర్తన చేయుట కంటె ఆనందము మరి లేదు కదా
హరిపై కీర్తన లల్లుట కంటే ఆనందము మరి లేదు కదా
హరిని తలచుచు గడుపుట కంటె ఆనందము మరి లేదు కదా
హరి పరిసేవన కమరుట కంటె ఆనందము మరి లేదు కదా
హరేరామ యని మురియుట కంటె ఆనందము మరి లేదు కదా
హరేకృష్ణ యని సోలుట కంటె ఆనందము మరి లేదు కదా
హరి శాస్త్రంబుల నరయుట కంటె ఆనందము మరి లేదు కదా
హరితీర్థంబుల తిరుగుట కంటె ఆనందము మరి లేదు కదా
హరిభక్తులతో కలియుట కంటె ఆనందము మరి లేదు కదా
హరిని యెడదలో కాంచుట కంటె ఆనందము మరి లేదు కదా
హరినామంబులు పలుకుట కంటె ఆనందము మరి లేదు కదా
హరిగుణగానము చేయుట కంటె ఆనందము మరి లేదు కదా
హరిచరితంబులు చదువుట కంటె ఆనందము మరి లేదు కదా
హరివారై ధరనుండుట కంటే ఆనందము మరి లేదు కదా
ఆజానుబాహుని ఆనందమూర్తిని
ఆజానుబాహుని ఆనందమూర్తిని
శ్రీజానకీవిభుని శ్రీరాముని
కపటదనుజారిని అపవర్గదాతను
నృపవర్గనేతను నీరజాక్షుని
తపనకులనేతను తారకరాముని
సుమతులార మీరు సొంపుగా పొగడరే
అకళంకమూర్తిని సుకుమారగాత్రుని
సకలసురసేవ్యుని సత్యనిరతుని
సకలభువనేశుని సాకేతరాముని
సకలార్తిశమనుని చక్కగా పొగడరే
సుగుణసంపూర్ణుని జగదభిరాముని
నిగమాంతవేద్యుని నిరుపమానుని
జగదేకవీరుని జలధరశ్యాముని
ఖగరాజవాహనుని పొగడరే పొగడరే
14, ఫిబ్రవరి 2020, శుక్రవారం
హాయిగా శ్రీరామ భజన చేయరే సదా
హాయిగా శ్రీరామ భజన చేయరే సదా
మాయదారి గొడవలన్ని మాని చక్కగా
హృదయమునకు రామభజన మెంత చేసినా
ముద మతిశయించు గాక మొగము మొత్తునా
వదలక విషయముల వెంట పరువు లెత్తిన
తుద కవి మిము ముంచకుండ వదిలిపెట్టునా
హరి దయతో దొరకె గదా నరుని వేషము
సిరులు సంపదలను గూర్చి చింత దేనికి
అరచేతను కాసులేక నరుగుదెంచినా
హరిభక్తుల వరియించవె సిరులు స్వయముగ
రామభక్తి ధనము కన్న భూమి నెంచగ
నేమి ధనము కలదు గాన నెల్లవేళల
రామ రామ సీతారామ రఘుకులేశ్వర
స్వామి మాంపాహి యనుచు భజన చేయరే
13, ఫిబ్రవరి 2020, గురువారం
అంతంత మాత్రపు టింతంత మాత్రపు
అంతంత మాత్రపు టింతంత మాత్రపు టానందము లవి యెందుకయా
అంతులేని యానందము నిచ్చే హరిభజనము మా కున్నదయా
మనోహరుని మా రామచంద్రుని మనసును తలచుట ఆనందం
అనాథనాథుని యనుపమదయనే యనిశము తలచుట ఆనందం
జననాయకుని జానకిరాముని చక్కగ పొగడుట ఆనందం
పనిగొని రాముని భక్తుల గూడుక భజనలు చేయుట ఆనందం
నారాయణ హరి వామన శ్రీధర నారామా యను టానందం
నారసింహ హరి కేశవ మాధవ నా స్వామీ యను టానందం
శ్రీరామా హరి చింతితార్ధప్రద సీతాపతి యను టానందం
మారజనక హరి మంగళదాయక మా రాఘవ యను టానందం
నారాయణస్తవ మానందం హరి నామభజన పరమానందం
శ్రీరామార్చన మానందం హరి చింతనమే పరమానందం
ఔరౌరా యిటు లానందము హరి యచ్యుతు దయచే నబ్బగను
వేరుగ చెప్పగ నేమిటి కయ్యా విషయానందము లెందుకని
శ్రీరామ భజనమే చేయుచున్నాము
శ్రీరామ భజనమే చేయుచున్నాము మేము
దారుణభవవార్నిధిని దాటుచున్నాము
కలుషాంతకుని హరిని తలచుచున్నాము మేము
కలనైనను వేరొకరిని తలపకున్నాము
తలచినంత వరములిచ్చు దాశరథినే మేము
తలపక వేరొక్కరిని తలప నేమిటికి
మిక్కిలిగ శ్రీహరికే మ్రొక్కుచున్నాము మేము
నిక్కువముగ నన్యులకు మ్రొక్కకున్నాము
మ్రొక్కినంత వరములిచ్చు మోక్షదాయికి మేము
మ్రొక్కక వేరొక్కనికి మ్రొక్క నేమిటికి
అన్నివేళలను హరి యండనున్నాము మేము
దున్నపోతు మీది దొరకు దొరుకకున్నాము
చెన్నుమీఱ భయముదీర్చు శ్రీహరిని మేము
తిన్నగ చేరి వాని నెన్న నేమిటికి
శ్రీరామనామ భజన చేయుచుందుము
శ్రీరామనామ భజన చేయుచుందుము
శ్రీరామచంద్రునే సేవింతుము
శ్రీరామ నామము ఘోరవిపద్వారకము
శ్రీరామ నామము భూరిశుభదాయకము
శ్రీరామ నామము చింతితార్ధదాయకము
శ్రీరామ నామము చింతావినివారకము
శ్రీరామ నామము చిత్తశాంతికారకము
శ్రీరామ నామము నారకభయ వారకము
శ్రీరామ నామము దారుణభవ నాశకము
శ్రీరామ నామము క్షిప్రఫలదాయకము
శ్రీరామ నామము శీఘ్రమోక్షదాయకము
శ్రీరామ నామము శితికంఠోపాసితము
శ్రీరామ నామము సీతాప్రియమంత్రము
శ్రీరామ నామము నారాయణ మంత్రము
12, ఫిబ్రవరి 2020, బుధవారం
పాడరే శ్రీరామభద్రుని కీర్తి
పాడరే శ్రీరామభద్రుని కీర్తి ఆడి
పాడరే సీతమ్మ పరవశింపగ
వంతలు సరిచూచుకొని గొంతులు సరిజేసుకొని
అంతకంత కుత్సాహ మతిశయింపగ
చింతితంబు లిచ్చునని చింతలు తొలగించునని
పంతగించి పౌలస్త్యుని పనిబట్టినాడని
దీనజనావనుండని దివ్యప్రభావుండని
జానకీనాథుడండని జ్ఞానస్వరూపుండని
అనందరూపుండని ఆత్మస్వరూపుండని
మౌనిరాజేంద్రహృదయ ధ్యానగమ్యాకృతియని
తాళములు వేయువారు తప్పట్లు కొట్టువారు
మేలుమే లనుచు చాల మెచ్చి పలికెడువారు
ఆలపించ దొరకొనుచు హడావుడి చేయువారు
మీలో చెలరేగగా మిగుల సంతోషముతో
11, ఫిబ్రవరి 2020, మంగళవారం
శ్రీరామ సీతారామ శ్రీరఘురామ
శ్రీరామ సీతారామ శ్రీరఘురామ
నారాయణ వినుమన్న నా యీమాట
సేవింపగ సేవింపగ స్థిరముగ నిన్ను
శ్రీవల్లభ బుధ్ధియె దుశ్చింతలు మానె
ఈవంకకు నావంకకు పోవుట లుడిగి
నీవంకకు తిరిగి తాను నిలచిపోయెను
చింతింపగ చింతింపగ శ్రీహరి నిన్ను
చింతలన్ని పారిపోయె చిత్తము నుండి
ఇంతింతై యంతంతై ఈహరి భజన
అంతులేక సాగుచుండె అహర్నిశలును
చేయగా చేయగా హాయిగ భజన
మాయ నన్ను వదలి తానె మరలిపోయె
నీ యపార మైన కృపకు నేను నోచితి
ఆ యపవర్గంబు నిచ్చి యాదరించవె
రారే జనులార రాముని భజనకు
రారే జనులార రాముని భజనకు
మీ రెల్ల రుత్సాహ పూరితులై
ఉదితం బైన శ్రధ్ధయె లోన నుత్సాహ ముప్పొంగ జేయగను
నిదురను మాని ప్రతినను బూని నీరజాక్షుని దివ్యభజనకు
సదయుని పైన మధురము లైన చక్కని కీర్తనలను పాడ
కదలి రారే కదిలి రారే కల్యాణరాముని భజనకు
కామము నణచి క్రోధము నణచి కాపాడు రాముని భజనకు
సామాన్యులైన శ్రీమంతు లైన శ్యామసుందరుని భజనకు
మోమాట పడక గర్వించి చెడక ముదమార భజన చేయగను
పామరు లారా పండితు లారా పరుగున రారేల భజనకు
ఇనకులపతియై కువలయపతియై యెసగెడు రాముని భజనకు
తనయుల గూడి తండ్రుల గూడి దయచేయుడీ రామభజనకు
మనసార పాడి రాముని వేడి మైమరచి యాడ భజనకు
జనులార రారే సరగున రారే జానకీ రాముని భజనకు
10, ఫిబ్రవరి 2020, సోమవారం
పాహి శ్రీరామ హరి పతితపావన
పాహి శ్రీరామ హరి పతితపావన
పాహి నారాయణ బంధమోచన
పాహి జగన్నాథ పాపవనదవానల
పాహి దుష్ట సురవిరోధివంశనాశన
పాహి సకలలోకపరిపాలక ప్రభో
పాహి సీతారామచంద్ర భండనభీమ
పాహి సురాసురగణ వందితచరణ
పాహి భక్తసంసేవిత పావనచరణ
పాహి నిజసేవక తాపత్రయశమన
పాహి మోహనాశన పరమదయాళో
పాహి కామారిబ్రహ్మప్రముఖసన్నుత
పాహి జన్మజరాదుఃఖభంజన నిపుణ
పాహి జానకీరమణ పావననామ
పాహి పాహి మాం పాహి పట్టాభిరామ
అన్నివేళలను ఆరాముడు మనకు
అన్నివేళలను ఆరాముడు మన కండగ నున్నాడు భయమేలా
తిన్నగ శ్రీరామ శ్రీరామ అంటే తీరును చిక్కులు భయమేలా
భయమేలా శ్రీరామ నామమే పాపాటవులను కాల్చుగదా
భయమేలా శ్రీరామ నామమున భవబంధములు వదలు గదా
భయమేలా శ్రీరామ నామమే పాడు యముని భయపెట్టు గదా
భయమేలా శ్రీరామ చింతనాపరులకు నిత్యము సుఖము కదా
భయమేలా హరి రామ రామ యని పాడుచు నుండెడు భక్తులకు
భయమేలా హరి కరుణామృతము పానము చేసెడు భక్తులకు
భయమేలా హరి నిజహృత్పద్మనివాసిగ నుండగ భక్తులకు
భయమేల హరి సనాతనుని తమ వానిగ నెఱిగిన భక్తులకు
భయమేలా జగమెల్ల తిరుగుచు పాడెదము హరి ప్రాభవము
భయమేలా హరిభక్తులము హరిభజనలు చేయుచు తిరిగెదము
భయమేలా శ్రీరామనామమును ప్రజల నోట పలికించెదము
భయమేలా మన నెవరేమన్నను పట్టాభిరాముని పొగడెదము
కోదండధర రామ కువలయేశ్వర
కోదండధర రామ కువలయేశ్వర
మాదేవుడా హరి మధుసూదన
హరి పుండరీకాక్ష అచ్యుత గోవింద
నరసింహ సురలోక నాయక ముకుంద
వరదాయక సుజన వాంఛితఫలద
పురుషోత్తమ జగన్మోహన శుభరూప
జగన్మోహన రామ జానకీమనోహర
నిగమసన్నుతదివ్య నిరుపమనిజతత్త్వ
జగముల సృజియించి చక్కగ పోషించి
తగురీతి నీభక్తతతి నేలుచుందువు
భక్తతతి నిన్నెపుడు భావించి సేవింప
ముక్తుల జేయుదువు ముదమున నటులే
శక్తిహీనుడ నను సద్భక్తుడు కాడనక
ముక్తి నిడి ప్రోవవే మ్రొక్కేము రాముడా
9, ఫిబ్రవరి 2020, ఆదివారం
మంత్రమన్న శ్రీరామ మంత్రమే మంత్రము
మంత్రమన్న శ్రీరామ మంత్రమే మంత్రము
మంత్రకోటి లోన ముఖ్యమైన మంత్రము
మునిజననుత మంత్రము ముక్తిమార్గమంత్రము
త్రినేత్రుడు ధ్యానించు దివ్యమంత్రము
రణవిజయమంత్రము రాజ్యదాయక మంత్రము
ప్రణవనిలయ మంత్రము పరమమంత్రము
పవనజ నుత మంత్రము పాపహరణ మంత్రము
రవికులపతిమంత్రము రమ్యమంత్రము
అవనిజాప్రాణమంత్ర మమితశుభద మంత్రము
భవరోగము పనిపట్టు పరమమంత్రము
ఏడుకోట్ల మంత్రముల నెన్నికైన మంత్రము
మూడుకోట్ల దేవతలకు ముఖ్యమంత్రము
వేడినంత ముక్తినిచ్చు విలువైన మంత్రము
పాడు యముని పారద్రోలు పరమమంత్రము
8, ఫిబ్రవరి 2020, శనివారం
ఊరకే రామభక్తి యుబికి వచ్చేనా
ఊరకే రామభక్తి యుబికి వచ్చేనా మంచి
దారిచూప రాముడే తలచిన గాక
వినినంతనె చదివినంతనె వేదాంతము నీ
మనసు కెక్కేనా తరింప మనసు పుట్టేనా
మనసును మరి రాముడే మంచిదారిలోన
జనునట్లు చేయదలచుకొనినప్పుడు కాక
పదుగురితో కలిసి రామభజన చేయగానే
మదిలోని పాపచింతన మాయమయ్యేనా
పదేపదే భజనచేయు వలపు నీ బుధ్ధిలో
నుదితమగు నట్లు రాము డొప్ప జేయక
రాముడే దయచూపక రామభక్తియన్నది
ఏ మాత్రము కలుగదని యెఱుగ వలయును
రామరామ రామ యనుచు నేమరక పలికితే
ఏమో యేనాటికైన రాముని దయరాదా
మా దైవమా రామ భూపాలుడా
మా దైవమా రామ భూపాలుడా నీవు
మామాట లాలించి మమ్మేలరా
అదుకొమ్మని వేరు దైవముల మే
మడుగమురా హరి మమ్మేలరా
నీయానతిని గొని నిలిచెదము మేము
నీపూజ మానక చేసెదము
నీయందు చిత్తము నిలిపెదము మేము
నీనామ స్మరణమె చేసెదము
నీయందచందము లెన్నెదము మేము
నీపాదయుగళమె పట్టెదము
నీయున్నతిని గూర్చి పాడెదము
మేము నీభక్త కోటిని చేరెదము
భువనేశుడ వని నమ్మెదము మేముక
నీపైన కవితల నల్లెదము
పవలురేలును నిన్ను తలచెదము మేము
బాగొప్ప నినుజేర తలచెదము
అవిరళము నీకృప నడిగెదము మేము
అపవర్గ మొకటే యడిగెదము
భవబంధములు బాప వేడెదము మేము
పతితపావన నిన్ను వేడెదము
నిను మెచ్చు వారిని పొగడెదము మేము
నిను తిట్టు వారిని తెగడెదము
అనయము నిన్నే కొలిచెదము మేము
వినయము కలిగి నిలచెదము
అణువణువున నిను చూచెదము మేము
అందరిలో నిను చూచెదము
వనజాక్ష నీవే చాలందుము మేము
వినతాసుతవాహ నీవారము
7, ఫిబ్రవరి 2020, శుక్రవారం
విండోస్ 7 నుండి విండోస్ 10కి సులభంగా అప్‍గ్రేడ్ చేసుకోండి
మీరు వాడుతున్న విండోస్ 7 కనుక సరియైన వెర్షన్ ఐన పక్షంలో విండోస్ 7 నుండి విండోస్ 10కి సులభంగా అప్‍గ్రేడ్ చేసుకోండి.
మీ విండోస్ 7కు మైక్రోసాఫ్ట్ నుండి గత నెలలో నిలచిపోయే వరకూ కనుక అప్‍డేట్‍లు వస్తూ ఉన్న పక్షంలో మీరు మీ విండోస్ 7 నుండి విండోస్ 10కి సులభంగా అప్‍గ్రేడ్ చేసుకోగలరు. కాని పక్షంలో మాత్రం వీలు కాదనే అనుకుంటాను.
మీరు మొట్టమొదట మీ కంప్యూటర్ ఈ అప్‍గ్రేడ్ చేయటానికి తగినదేనా అని నిర్దారించుకోవాలి! అంతా ఓకే అనుకుంటే ముందుకు సాగండి.
మీరు మైక్రోసాఫ్ డౌన్‍లోడ్ విండోస్ 10 సైట్ నుండి Create Windows 10 installation media అనే టూల్ డౌన్‍లోడ్ చేసుకొని రన్ చేయాలి. అదీ పధ్ధతి.
కానీ Create Windows 10 installation media ద్వారా వచ్చిన ఈ టూల్ నాకు సరిగా పని చేయలేదు. ఐతే కొద్ది రోజుల క్రింద అక్కడ ఉండిన వెర్షన్, మా మావయ్య గారి దగ్గర ఉంది. అది మాత్రం చక్కగా పని చేసింది.
మిత్రుల సౌకర్యార్ధం ఆ పనిచేసే వెర్షన్ గూగుల్ డ్రైవ్ లోనికి అప్‍లోడ్ చేసి అందరికీ అందుబాటులో ఉంచుతున్నాను. ఈ సౌకర్యం కొన్నాళ్ళే ఇవ్వగలను. పెద్ద ఫైల్ కాబట్టి ఒకటి రెండు నెలల తరువాత తీసివేస్తాను.
Windows10.iso
ఇది పెద్ద ISO ఫైల్. 4gb సైజులో ఉంది. Winrar వాడి మీరు unpack చేయవలసి ఉంటుంది. డెస్క్-టాప్ మీదే మీరు unpack చేయవచ్చును.
మీరు ఈ Windows10.iso ఫైల్‍ను ఏదనా పెన్‍డ్రైవ్ మీద కాపీ చేసుకోవచ్చును. అది మీ మిత్రులకు ఉపయోగిస్తుంది. మళ్ళా ఎక్కడినుండో డౌన్‍లోడ్ చేయనక్కర లేకుండా. ఐతే అలా కాపీ చేసే ముందు మీ పెన్‍డ్రైవ్‍ను తప్పనిసరిగా exfat ఫైల్ సిస్టం ఉండేటట్లుగా ఫార్మాట్ చేయాలి.
మీరు మొదట మీ విండోస్ 7 సిస్టమ్ లో ఉన్న ముఖమైన ఫైళ్ళూ ఫోల్డర్లూ backup చేసుకోండి. నిజానికి అలా చేయటం అవసరం లేదు. మీ ఫైళ్ళూ ఫోల్డర్లూ ఏమీ చెక్కు చెదరవు.
అప్‍గ్రేడ్ చేయటానికి ముఖ్యంగా మీకు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి.
మీరు unpack చేయటం ద్వారా తయారు చేసిన Windows 10 ఫోల్డర్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న
setup
అనే executable file ను రన్ చేయండి.
అప్‍గ్రేడ్ సమయంలో మీరు చేయవలసినది ఆట్టే ఏమీ లేదు.
విండోస్ కీ కూడా అది మిమ్మల్ని అడగదు. ఆ కీ ఏదో అది మీ సిస్టం నుండే గ్రహిస్తుంది కాబట్టి. (కాని కొత్త టూల్ కాని తెచ్చుకుంటే అది మీదగ్గర కీ ఉంటే ఇవ్వండి అని అడుగుతోంది)
మీ విండోస్ 7 ఎటువంటి మోడల్ అన్నదానిపై ఆధారపడి మీ విండోస్ 10 మోడల్ వస్తుంది. ఉదాహరణకు మీ వద్ద ఉన్నది విండోస్ అల్టిమేట్ అయితే మీకు విండోస్ 10 ప్రో వస్తుంది.
అప్‍గ్రేడ్ కోసం కొద్ది గంటలు పడుతుంది. మీ నెట్ స్పీడ్ ఎంత బాగుంటే అంత త్వరగా పని జరుగుతుంది. నా దగ్గర 100MBPS కనెక్షన్ ఉంది. మొత్తం మీద 2గం. చిల్లర కాలంలో పని జరిగింది.
అన్నట్లు అప్‍గ్రేడ్ సమయంలో మీ కంప్యూటర్ పదేపదే రీబూట్ కావచ్చును.
ఒకవేళ మీ కంప్యూటర్ మీద విండోస్‍తో పాటుగా ఉబంటూ ఉన్నా ఇబ్బంది లేదు. నా దగ్గర అలా ఉంది కాని ఇబ్బంది రాలేదు. విండోస్ అప్‍గ్రేడ్ అయ్యింది. ఉబంటూ సుబ్బరంగా ఉంది ఆతరువాత కూడా.
6, ఫిబ్రవరి 2020, గురువారం
చక్కనయ్యకు శ్రీరామచంద్రునకు మ్రొక్కరే
చక్కనయ్యకు శ్రీరామచంద్రునకు మ్రొక్కరే
మ్రొక్కరే జగములకు దిక్కైన స్వామికి
ధీవిశాలునకు దేవదేవునకు మ్రొక్కరే
భావనాతీతదివ్యప్రభావునకు మ్రొక్కరే
పావనునకు భక్తపరిపాలకునకు మ్రొక్కరే
శ్రీవత్సచిహ్నునకు సీతాపతికి మ్రొక్కరే
సర్వవిబుధపూజితశ్రీచరణునకు మ్రొక్కరే
గర్వితామరారిగణఖండనునకు మ్రొక్కరే
సర్వధర్మస్వరూపునకు శాంతునకు మ్రొక్కరే
నిర్వాణదాయకునకు నిరుపమునకు మ్రొక్కరే
ఇతని కన్న వేరు దైవ మెవడు కలడు మ్రొక్కరే
ఇతడే శ్రీహరి యనుచు నెఱుక గలిగి మ్రొక్కరే
ఇతడే భవమోచనుడని యెఱుక గలిగి మ్రొక్కరే
సతత మితడి పాదములకు సవినయముగ మ్రొక్కరే
3, ఫిబ్రవరి 2020, సోమవారం
చాలు చాలు రామనామము చాలు నది యొక్కటే
చాలు చాలు రామనామము చాలు నది యొక్కటే
చాలు చాలు నితరము లందు సంచరించి చెడుట
ఏమీ చదువ నక్కర లేదు ఏమీ తెలియ నక్కర లేదు
ఏమీ చేయ నక్కర లేదు ఏమీ చూడ నక్కర లేదు
ఏమీ తలచ నక్కర లేదు ఏమీ పలుక నక్కర లేదు
ఏమీ వ్రాయ నక్కర లేదు రామనామ మొక్కటి చాలు
ఏమి యందము లక్కర లేదు ఏమి బంధము లక్కర లేదు
ఏమి సంపద లక్కర లేదు ఏమి సౌఖ్యము లక్కర లేదు
ఏమి భోగము లక్కర లేదు ఏమి భాగ్యము లక్కర లేదు
ఏమి బలగము లక్కర లేదు రామనామ మొక్కటి చాలు
ఏమీ త్రుంచ నక్కర లేదు ఏమీ పెంచ నక్కర లేదు
ఏమీ వంచ నక్కర లేదు ఏమీ యెంచ నక్కర లేదు
ఏమి యంత్ర మక్కర లేదు ఏమి తంత్ర మక్కర లేదు
ఏమి మంత్ర మక్కర లేదు రామనామ మొక్కటి చాలు
1, ఫిబ్రవరి 2020, శనివారం
బ్లాగుపరిచయం: నందనవనం పారిజాతాలు
ఈరోజున నందనవనం పారిజాతాలు అన్న ఒక బ్లాగును చూసాను. బాగుంది. అసక్తి కలవారు దర్శించండి.
ఆ బ్లాగులో బ్రహ్మశ్రీ నందనవనము వెంకట సుబ్బరామయ్య శర్మ గారు 1974లో రచించిన శ్రీవేంకటేశ్వర శతకము చదివి సంతోషించాను.
అలాగే తూము లక్ష్మీనరసింహ దాసు గారి కీర్తనలు కూడా అక్కడ చూసి చదివి సంతోషించాను.
ఆ బ్లాగును వారు మాలికలో చేర్చినట్లు లేదు. కాబట్టి ఎక్కువమంది మిత్రులకు తెలియబరచాలని భావించి ఈటపా వ్రాస్తున్నాను.
అసక్తి కలవారు తప్పక దర్శించండి.
నీరేజదళనయన నిన్నే నమ్మితి
నీరేజదళనయన నిన్నే నమ్మితి
నా రాముడా నిన్నే నమ్మితి నమ్మితి
నమ్మితి నిను కౌసల్యానందన మృదుభాషణ
నమ్మితి నిను సురవైరినాశన నారాయణ
నమ్మితి నిను సురలోకనాయక వరదాయక
నమ్మితి నిను నన్నేలు నాథుడ వని యచ్యుత
నమ్మితి కరుణామయ నానమ్మకము నిలుపుమా
ఉమ్మలికములను ద్రోచి యుచితరీతి బ్రోవుమా
నెమ్మనమున నిలచి నీవు నిరతమును నడుపుమా
వమ్ముచేసి కలిమాయను భక్తుడ నన్నేలుమా
పరమపురుష నిను నమ్మితి భక్తవరద నమ్మితి
సరసుడ నిను నమ్మితి నా స్వామి వనుచు నమ్మితి
దరిజేర్చెద వని నమ్మితి ధరమీద నికపైన
మరల పుట్ట నని నమ్మితి తిరముగ నిను నమ్మితి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)