1, డిసెంబర్ 2015, మంగళవారం

రాముడు మీకు నచ్చకపోతే ఈ బ్లాగుకు రాకండి దయచేసి

ప్రపంచం చాలా చిత్రమైనది.

భగవంతుడి సృష్టి కదా. అలాగే ఉంటుంది.  వైవిద్యంలేకుంటే సృష్టి ఎలాగు మరి?  తెల్లరంగు కాగితం మీద అదేతెలుపు రంగుకల సిరాతో బొమ్మవేయలేం కదా. రెండవ రంగు లేనిదే బొమ్మలేదు. అలాగే సృష్టిలో అన్ని విషయాల్లోనూ అటు మొగ్గు చూపే వారూ‌ ఉంటారు, ఇటు తిరిగే వాళ్ళూ‌ ఉంటారు. అది సహజం.

మీరు ఏ వస్తువును తీసుకోండి. దానిని యిష్టపడే వాళ్ళుంటారు. అది బొత్తిగా ఇష్టం‌ ఉండని వారుంటారు.  ఏ విషయం తీసుకోండి మీతో విబేధించే వాళ్ళు తప్పకుండా ఉంటారు.

మీరు ఇష్టపడే భావనలను అసహ్యించుకొనే వారుంటారు. మీ భావనకు అందిన దానిని మరింతగా భావన చేయగలిగిన వారుంటారు. పదిమంది ఏదో ఒక సందర్భంగా వచ్చి సంతోషంగా భోజనం చేసి వేడితే అది ఎంతో శుభం అనీ తమకు జయం‌ అనీ‌ తృప్తి పడే వారుంటారు. ఇలాంటి వన్నీ‌ దండగమారి ఖర్చులని చీదరించుకొనే వాళ్ళుంటారు.

మీరు ఇష్టపడే కూరను అసహ్యించుకొనే వారుంటారు.  ఒకసారి మా యింటికి ఒక దగ్గరచుట్టం‌ అబ్బాయి భోజనానికి వచ్చాడు. మేం ఎంతో ఆదరంగా పిలిస్తేనే లెండి. మా ఆవిడ ఎంతో ఆప్యాయంగా గుత్తివంకాయకూర చేసింది. అదొక్కటే అని అనుకోకండి, మిగతావాటితో‌పాటు ముఖ్యంగా అదీ ఉందన్నమాట.  ఆ అబ్బాయి మిగతా అన్ని ఆధరవులనీ కానిచ్చాడు కాని గుత్తివంకాయ కూరను తాకనన్నా తాకలేదు. అయ్యో‌ అనుకున్నాం. అది వేరే సంగతి.  ఆ తరువాత కొన్నాళ్ళకి తెలిసింది ఏమిటంటే ఆ అబ్బాయికి వంకాయ ఇష్టంలేదు. ఖచ్చితంగా చెప్పాలంటే వంకాయంటే పరమ అసహ్యంట!

మీకు నచ్చిన దైవం‌ కొందరి దృష్టిలో‌ దయ్యం. తమాషా ఏమిటంటే దయ్యం‌ అన్నమాట గురించి చాలా మందికి తెలియదు. దేవుడు ప్రకృతి దయ్యము వికృతి. హైస్కూల్లో ప్రకృతి వికృతుల గురించి చదివే ఉంటారు కదా, అందులో ఇదొకటి చిన్నయసూరిగారు పంచతంత్రంలో ఒక చోట దయ్యంబునకు దయాలేశంబునుం గలుగదు అని అంటారు. ఈ వాక్యంలో దయ్యం అంటే దేవుడే మరి. నా చిన్ననాటి స్నేహితులు కొందరు వీరశైవులు. కాని పేర్లు అన్నీ‌పెట్టుకుంటారు లెండి. ఒకతని పేరు వీరవేంకట సత్యనారాయణ, మరొకతని పేరు పాండురంగారావు. అప్పటికే వీరత్వాల గందరగోళాలు శైవంలో నుండి తప్పుకున్నాయి. కనీసం నా ఉద్దేశం అలా ఉండేదా? ఒకనాడు వేరే వాళ్ళు కొందరు మిత్రులు మాట్లాడుకుంటున్నారు. నేను విన్నాను - ఆశ్చర్యంతో తలమునక లయ్యాను. ఇంకానా? అనిపించింది వాళ్ళ ధోరణి. ఒకబ్బాయి మరొకడితో అన్నాడు, 'ఏదో విష్ణుమూర్తి అంతవాడు ఇంతవాడు అంటారు కాని శివుడి ముందు బలాదూర్. అందుకని శివుణ్ణే పూజించాలి కాని విష్ణుపూజ దందగ' అని. సరి సరి, గతించిన కాలంలో శైవులూ వైష్ణవులూ చచ్చేట్లు కొట్టుకున్నారనుకోండి. ఇంతకూ చెప్పొచ్చేది ఏమిటీ? కాలం ఏదైనా నా దృష్టిలో దేవుడు మీకు పూచికపుల్ల కావచ్చును. ఒకే కుంటుంబంలో జనం మొదట, జై హరనాథ బాబా, జై కుసుమకుమారి అని భజనలు చేయటం చూసాను, ఆతరువాత షిర్దీసాయిబాబా భజనలు చేయటం చూసాను, అలాగే పుట్టపర్తి సాయిబాబా భజనలు చేయటమూ చూసాను. మధ్యలో కొందరు ఆ బాబా గొప్ప ఈ‌ బాబా గొప్ప అని దొమ్ములాడుకోవటమూ చూసాను. నిష్ఠ అంటే నిష్ఠగాదు పరమనిష్ఠగా ఘడియఘడియకూ దేవుడికి దందాలు పెట్టుకొనే వ్యక్తి హఠాత్తుగా ఏదో మిషన్ వారు వద్దన్నారని శ్రీరామపంచాయతన విగ్రహాలని హుస్సేన్ సాగర్‌లో‌ పారేయటమూ చూసాను. రాముడి ఫోటో‌ ఇంట్లో‌ ఉంటే అది విగ్రహారాధన క్రిందికి వస్తుందని పీకి విసిరేసిన వాళ్ళే, బాత్ రూముల తో సహా ఇంటినిండా వారి గురువుగారి ఫోటోలు అతికించుకున్నారు. అది విగ్రహారాధన కాదా అంటే కాదట. కేవలం రాముడు కృష్ణుడు శివుడు వగైరాల బొమ్మలే పనికిరావుట.

నేను ఉద్యోగప్రయత్నాల్లో ఉన్న రోజుల్లో ఒక పెద్దమనిషిని కలిసాను. దూరపు బంధువే లెండి. మంచి స్థాయిలో ఉన్నాడు. సి.ఏ పరీక్షలకు పేపర్లు గట్రా తయారు చేస్తాడట ఆయన. ఏం చదివావ్ అన్నాడు. బి.యస్సీ అన్నాను. ఆయన చిరాకు పడ్డాడు. ఇలాంటి చెత్త సబ్జెక్టులు ఎందుకు చదువుతున్నారు కుఱ్ఱాళ్ళు. నువ్వు బి.కాం ఎందుకు చేయలేదు - అదైతే బాగుండేది ఫ్యూచర్ అని విసుక్కున్నాడు.  అయన లైన్ కానిదంతా ఆయనకు చెత్త.

ఒక సారి నా కారులో జాస్మిన్ సెంట్ కావాలన్నాను కార్‌వాష్ అబ్బాయితో. అదే వచ్చింది. మర్నాడు మరొకతనికి రైడ్ ఇచ్చాను ఆఫీసునుండి, దారిలో అతను అన్నాడు కదా. 'ఈ‌ డర్టీ జాస్మిన్ సెంట్ కొట్టేస్తారు వాళ్ళు నువ్వు లవెండర్ అడక్క పోయావా' అని. ఏం‌ మాట్లాడాలి? నాకూ‌ మా ఆవిడకూ‌ కూడా జాస్మిన్ (మల్లె) వాసన బాగుంటుంది. రేపెవడో సంతలో చింతకాయకు నచ్చాలని రూలుందా? నచ్చకపోతే మానాలని రూలుందా? ఆతరువాత కూడా నేను జాస్మిన్ సెంట్ కొట్టించుకున్నాను చాలాసార్లు.

తెలుగు బ్లాగుల్లో‌ రకరకా లున్నాయి.  కొందరు సినిమాకబుర్లు వ్రాస్తారు. కొందరు రాజకీయాలు వ్రాస్తారు. కొందరు జ్యోష్యం‌ లాంటివి రాస్తారు. కొందరు లోకాభిరామాయణం వ్రాస్తారు. కొందరు గాలికబుర్లు వ్రాస్తారు. కొందరు అక్కడా అక్కదా పోగేసుకొచ్చిన సమాచారం ఏదో నలుగురికీ నచ్చుతుందనో‌ ఉపయుక్తంగా ఉంటుందనో వ్రాస్తారు.  కొందరు ఆధ్మాత్మిక విషయాలు వ్రాస్తారు. కోందరు ఆధ్యాత్మిక విషయాలు వ్రాయటానికి ప్రయత్నం చేస్తారు.  కొందరు తమ తమ సర్వఙ్ఞత్వాన్ని ప్రదర్సించుకుందుకు వ్రాస్తారు. కొందరు హాస్యపుజల్లులు కురిపించటానికి వ్రాస్తారు. కొందరు హోరాహోరీ చర్చలను రేకెత్తించటానికి వ్రాస్తారు. కొందరు కామెంట్లపంట కోసం వ్రాస్తారు. కొందరు కాలక్షేపం కోస వ్రాస్తారు.  కొందరు ఆలోచనలను రేకెత్తించటానికి వ్రాస్తారు. కొందరు విఙ్ఞానం పంచుతారు. కొందరు తలనొప్పిని పంచుతారు. కొందరు జీవితానుభవామృతాన్ని పదిమందికీ పంచటానికి నిష్కామంగా వ్రాస్తారు. కొందరు తమకు తెలిసినదానికి మించి  జీవితానుభవం అంటూ ఉండదన్న భ్రమలో పడి ఏదేదో వ్రాస్తారు. కొందరు కవిత్వం వ్రాస్తారు, కొందరు కవిత్వంలాంటిది వ్రాస్తారు.కొందరు తాము వ్రాసేది కవిత్వం అనుకుంటారు.

ఐతే అందరూ అన్నిబ్లాగుల్నీ చదువుతున్నారా? లేదు కదా. అసలు అలా చదవాల్సిన అవసరం ఉందా? లేదు కదా.  ఏదన్నా ఒక బ్లాగు మనకి నచ్చాలన్న రూలే మన్నా ఉందా? లేదు కదా. మనకి బాగా నచ్చే బ్లాగులో నన్నా ప్రతిటపా మనకి గాఢంగా నచ్చాలన్న రూలేమన్నా ఉందా?‌ లేదు కదా.

అందుచేత చదువరులు తమకి నచ్చిన బ్లాగులు చదువు కోవచ్చును.  నచ్చని వాటికి దూరంగా ఉండవచ్చును. నచ్చిన టపాను మెచ్చవచ్చును.  నచ్చని దానిని విస్మరించవచ్చును.

ఒక బ్లాగుపధ్ధతి హితవు ఐతే అది చదవట‌ం సహజం. ఒక బ్లాగు పధ్ధతి ఎవరి కైనా హితవు కాకపోతే దానికి దూరంగా ఉండటం కూడా సహజమే. కాని ఫలాని బ్లాగు ధోరణి ఫలాని రకంగా ఉందనీ ఉంటుందననీ‌ తెలిసి, ఇది నచ్చలేదూ‌ అది నచ్చలేదూ, నువ్వలా వ్రాయకూడదూ‌, ఇలా వ్రాయకూడదూ‌ అని అనటం ఉచితం కాదు. ఇంగ్లీషు వాడిదో‌ సామెత ఉంది. You go to your church,  I go to mine అని. మీకు మీరే, మాకు మేమే ఎందుకీ‌ రుసరుస నసనస అన్నట్లన్నమాట.

ఈ శ్యామలీయం బ్లాగు ప్రథానంగా ఆద్మాత్మిక వ్యాసంగంతో‌ నడిచే‌ బ్లాగు.  ఈ విషయంలో రహస్యం ఏమీ‌ లేదు. ఈ శ్యామలీయం బ్లాగు బేనర్ ఇలా చెబుతున్నది.

  దేహబుధ్యా తు దాసోఽహం
  జీవబుధ్యా త్వదంశకః
  ఆత్మబుధ్యా త్వమేవాహమ్‌
  ఇతిమే నిశ్చితా మతిః


నాకూ‌ రాముడికీ విడదీయరాని అనుబంధం ఉంది. అనేక విషయాలను సభాముఖంగా మాట్లాడటం సబబు కాదు. కాబట్టి అలాంటివి ప్రస్తావించను. ఒక్కటి మాత్రం చెబుతాను. నాకు ఊహ తెలిసినప్పటి నుండీ నా రాముడు నాతోనే ఉన్నాడు. ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా నేను ఆ విషయంలో చెప్పేది ఏమీ‌ లేదు. నా ఙ్ఞాపకశక్తి తీక్షత నాకు బాగానే తెలుసును. నాకు మూడు సంవత్సరాల చిల్లర ప్రాయంలో మా పితామహులు కాలం చేసారు. కాలం చేయక ముందు కొన్ని నెలలు మంచం పట్టారు. అంతకు ముందు ఆయన నన్ను చంకన వేసుకొని ఊళ్ళో తిరగటం నాకు గుర్తుంది బాగానే. ఆయన ముఖమూ, వేషమూ చేతికర్రా కూడా ఇప్పటికీ‌ చాలా బాగా గుర్తున్నాయి. అప్పుడప్పుడు ఆయన నన్ను మా వూళ్ళో ఉన్న కుర్ర షావుకారు కనకయ్య పచారీ కొట్టుకు తీసుకొని వెళ్ళటమూ, అక్కడ పంచదార బిళ్ళలు ఇప్పించటమూ‌ బాగా గుర్తున్నాయి. ఆఖరికి ఆయనకు ప్రాణోత్ర్కమణం జరిగిన నాటిరాత్రి నేనొక అర్థణా బిళ్ళ మింగేసిప్పుడు రేగిన గడబిడ కూడా నాకు గుర్తుంది. ఇవన్నీ‌గుర్తున్నట్లే నాకు రాముడు ఊహ తెలిసినప్పటినుండీ వెనుగాచి యున్నదీ‌ బాగా గుర్తుంది.

నేను నా రాముడి అనుగ్రహం కోసం వ్రాసుకుంటున్నాను. అలా వ్రాసుకోవటంలో నాకు తృప్తి ఉన్నది. అందుచేత వ్రాస్తున్నాను.  అందరికీ‌ నచ్చాలని వ్రాయటం లేదు. ఎవరికీ నచ్చకపోయినా మానటమూ‌ లేదు. ఇకముందు మానటమూ‌ జరగదు కూడా ఇది నా  తృప్తికి సంబంధించిన విషయం కాని జనాకర్షణకు సంబంధించిన విషయం‌ కాదు.

నేను నా బ్లాగులో ఏమి వ్రాయాలో వ్రాయకూడదో ఎవ్వరూ నిర్ణయించలేరు. ఎవరైనా అలా అనుకుంటే అది కేవలం వారి అఙ్ఞానం మాత్రమే.

నేను రాముణ్ణి పొగడటం అనే వ్యవహారం ఎవరికో నచ్చకపోతే దానికి నా పూచీ ఏమీ‌ లేదు.  రామో‌విగ్రహవాన్ ధర్మః అని రాముడికి కితాబు ఇచ్చిన వాడు రాక్షసుడైన మారీచుడు. ఏ విశ్వామిత్రుడో బ్రహ్మాగారో ఇంద్రుడో అన్నమాట కాదిది.

రాముడి గురించి పద్యాలూ కీర్తనలూ వ్రాయటం నాతో‌ మొదలు కాలేదు. నా కంటే ముందు ఎందరో‌ మహానుభావులైన భక్తులు ఆ పని చక్కగా చేసారు.  శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శ్రీరామకర్ణామృతం వ్రాసారు.  పెళ్ళి శుభలేఖలమీద తరచుగా (అప్పుతచ్చులతో) కనిపించే‌ జానక్యాః కమలామలాంజలి పుటే... అన్న శ్లోకం అందులోనిదే.

ఏదో నా శక్తి మేరకు నా తృప్తి కొరకు నేనూ వ్రాసుకుంటున్నాను. నా ధోరణి తెలిసి, అది నచ్చిన వాళ్ళు ఆ కీర్తనలనీ పద్యాలనీ‌ చదువుకొన వచ్చును. నచ్చని వాళ్ళు మహారాజుల్లాగా మహారాణుల్లాగా తమకు నచ్చిన బ్లాగులు హాయిగా చదువుకోవచ్చును.

అంతే కాని నా రచనలు పట్టుకొని వాటిలో తమకు నచ్చని విషయాలేవో ఉన్నాయని, ఎవరైనా కయ్యాలకు దిగటం సరైన పధ్ధతి కాదు.  అటువంటి అభ్యంతరాలకు జవాబులు చెప్పటం వలన ప్రయోజనం‌ ఉండదని నా అభిప్రాయం. అందుచేత ఆ పని చేయటం వీలుపడదు.

అందుచేత సోదర బ్లాగరు బ్లాగరిణీ‌ మహాశయులకు విఙ్ఞప్తి ఏమిటంటే రాముడు మీకు నచ్చకపోతే ఈ బ్లాగుకు రాకండి దయచేసి.

ఇంతకంటే చెప్ప వలసింది ఏమీ‌లేదు.