6, ఆగస్టు 2013, మంగళవారం

కథ: ఒక కోడలి కథ

వాతావరణం అంతా చాలా హుషారుగా ఉంది.

మీకు సంగీతం వచ్చా అని కొంచెం మొగమాట పడుతూనే, పెళ్ళికొడుకు అడిగాడు.


ఓ, మా అక్కకు బోలెడు ప్రైజులు కూడా వచ్చాయండీ, అని పెళ్ళికూతురి తమ్ముడు డిక్లేర్ చేసేసాడు.

పెళ్ళికూతురు గొంతు విప్పలేదు. 

ఏదన్నా మంచి మంచి పాట పాడమ్మా అని ఎవరన్నారో కాని, పెళ్ళికూతురి చెల్లెలు కిసుక్కున నవ్వింది ఆ మాటలకి.  మా అక్క అన్నీ‌ మంచి పాటలే‌ పాడుతుందడీ, అని స్పష్టం చేసేసింది.

పెళ్ళికొడుకు తరపున మరొకరెవరో, ఫరవాలేదమ్మా, నీకు వచ్చిన పాటేదన్నా పాడు అన్నారు.

పాడమ్మా అని తండ్రి కూడా ప్రోత్సహిస్తున్నట్లో, ఆదేశిస్తున్నట్లో స్పష్టంగా తెలియని గొంతుతో అన్నాడు.

మొత్తానికి అమ్మాయి గళం విప్పి పాడింది ఏ శ్వాసలో చేరితే..  అంటూ.

పెళ్ళికొడుకు తరపు వాళ్ళకి, తమకు మధ్యవర్తులు ఇచ్చిన సమాచారం నిజమే,  అమ్మాయి చాలా బాగా పాడుతుందీ, అని నమ్మకం‌ కలిగింది.

పెళ్ళికొడుకు కొంచె ఇబ్బందిగా కదిలాడు. మెల్లగానే, బాగా పాడారు అని కితాబిచ్చాడు.

అమ్మాయి పాటవల్లే సంబంధం కుదిరిందని ఎవరూ అనటం లేదు కాని, ఇంకా ఎన్నెన్నో‌ కుదరబట్టి, అబ్బాయీ అమ్మాయీ ఒకింటి వారయ్యారు.

*      *      *      *

రిసెప్షన్‌లో పాడాలా? అని పెళ్ళికూతురు ఆశ్చర్యపోయింది.

బలే! వదినా, నువ్వు బాగా పాడతావనే మా అన్నయ్య చేసుకున్నాడు తెలుసా, అంది ఆరిందాలా, తొమ్మిదో తరగతి చదివే ఆడపడుచు. 

పాడవే తప్పే ముందీ? పైగా గురువుగారి ముందు పాడటం అంటే ఎంత అదృష్టం అంది మురిసిపోతూ అత్తగారు.

గురువుగా రేమిటో ఆయనముందు తాను పాడట మేమిటో, పెళ్ళికూతురుకు అర్థం కాలేదు. అడగాలంటే మొగమాటం.

ఇంతలో పెళ్ళికొడుకు పాంటు జేబులోంచి ఒక కాగితం బయటకు తీసాడు. చటుక్కున దాన్ని లాక్కుంది ఆడపడుచు.  కాగితంలోకి చూస్తూనే, ఈ‌ పాట నా కొచ్చు అంది సంబరంగా.

నిన్నెవరు పాడమన్నారే అన్నాడు పెళ్ళికొడుకు.

ఆడపడుచు మూతి బిగించుకుని అలిగింది.

పెళ్ళికొడుకు బ్రతిమాలి, చెల్లెలి అలక తీర్చాడు, అదికాదే వదినకు నువ్వే పాట నేర్పాలి మరి అన్నాడు.  ఆ అమ్మాయి ముఖం విప్పారింది.

ఇప్పటికిప్పుడు నేర్చుకుని పాడటం‌ ఎలా? పోనీ, కొండలపై నెలకొన్న కోనేటి రాయడు పాడనా? అని కొంచెం మెల్లగా అడిగింది పెళ్ళికూతురు.

అత్తగారు ముఖం చిట్లించింది.   అవన్నీ వద్దు, గురువుగారిమీద పాటే పాడు. అమ్మాయి చెబుతుందిలే.  అయినా ఒరే మనింట్లో ఈ పాట డిస్కు ఉందిగా అది వినైనా నేర్చుకోవచ్చు అంది అత్తగారు ఖరాఖండిగా.

పెళ్ళికూతురు కొంచెం హర్టయింది.  భయపడుతూనే, సమయం చాలదేమో‌ నండీ. అంది.

సుబ్బరంగా సరిపోతుంది వదినా, నాకీ‌ పాట గంటలో వచ్చేసింది తెలుసా అంది ఆడపడుచు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ.

మరేమీ మాట్లాడకుండా ఆ కాగితం అందుకుని పాట చదివింది.

శ్రీగురుదేవా జయగురుదేవా
అన్నిలోకాలకు అభయ గురుదేవా

నమ్ముకున్నాము మేము నిన్నే నిన్నే
ఇచ్చుకున్నాము మా మనసే మనసే

ఇలా నాలుగైదు చరణాలతో ఉంది పాట.

ఈ‌ గురుదేవులెవరో పెళ్ళికూతురికి ఏమీ‌ బోధపడలేదు. మెల్లగా తెలుసుకో వచ్చును, ఆ డిస్కేదో విని పాడేస్తే ఓ‌ పనై పోతుంది అనుకుంది. 

ముందు ఆడపడుచు తానే నేర్పుతానని ముచ్చట పడింది. కాని ఆ పిల్లకు స్వరజ్ఞానం ఏమీ లేదు. అయినా ఆడపడుచు కదా, ఆ మాట ముఖం మీద ఎలా అనేదీ. పైగా ఆ అమ్మాయికి ఇట్టె అలక వచ్చేస్తుంది కూడా. అందుచేత బాగా పాడావు అని మెచ్చేసుకుంది.  

డిస్కులో ఆ పాటే కాకుండా మరో అరడజను పాటలున్నాయి. అన్నీ‌ గురువుగారి మీద పాటలే. అవన్నీ వినగా పెళ్ళికూతురికి ఒక విషయం అర్థమైంది. ఈ‌ గురువుగారెవరో గొప్పవాడు కాబోలు. భక్తులు పాటలు కట్టి మరీ పాడుతున్నారు అని అనుకుంది.

*      *      *      *

రిసెప్షన్ జరిగిన తీరు పెళ్ళికూతురికి చాలా చిత్రంగా అనిపించింది. పెళ్ళి రిసెప్షన్ సందర్భంగా చిన్నపాటి బంగారు అట్టల సింహాసనం తెచ్చి, మల్లెపూల దండలు వేసి, ఎవరో అరవైయేళ్లాయన ఫోటో ఒకటి పెట్టారు. ఫంక్షన్ మొదలవటమే ఆయనకు హారతి ఇవ్వటంతో.  పెళ్ళికూతురికి ఈయన ఎవరండీ అని అడగాలంటే బెరుకుగా అనిపించింది.

ఇంతకీ గురువుగారు రానేలేదు.  వారు లోకానుగ్రహం చెయ్యటానికి ధ్యానంలో ఉండి పోయారట. వారు ఫోటొలోంచే ఆశీర్వదిస్తారని సెలవిచ్చారు చిన్నగురువులవారు ఫంక్షన్లో అందరి తప్పట్ల మధ్యా.

పరిచయ కార్యక్రమమూ, బహుమతుల హడావుడీ, ఫోటోల హంగామా అయ్యాక మైకు అందుకుని వరసగా కొందరు పాటలు పాడారు.  అందులో కొన్ని ఇంటి దగ్గర తాను విన్న డిస్కులో‌ ఉన్నాయి కాబట్టి గురువుగారి మీద పాటలని అర్థమైంది పెళ్ళికూతురికి.

చివరలో తానూ శ్రీగురుదేవా అంటూ‌ కొత్తగా నేర్చుకున్న పాట పాడింది.  అందరూ‌ చప్పట్లు కొట్టారు.

*      *      *      *

కొత్త పెళ్ళికూతురు కదా, అత్తవారిల్లు అంతా ఇంకా కలయ తిరగలేదు.  హెచ్చు సమయం‌ తన గదిలోనే ఉండేది.  కాని ఒక విషయం గమనించింది. ఎక్కడా దేవుడి ఫోటో‌లూ కాలెండర్లూ లాంటివి లేవు. కొందరు పూజగదిలో ఉంచుతారు కాని హాల్లోనూ వేరే గదుల్లోనూ దేవుడి బొమ్మలు పెట్టరు. తన స్నేహితురాళ్ళు ఒకరిద్దరి ఇళ్ళలో అలాగే చేస్తారు.

వారం గడిచే సరికి అమ్మాయికి బెరుకు వదిలింది. కొంతవరకూ ఆడపడుచు తన కూడా కూడా తిరుగుతూ వసపిట్టలా వాగుతూ ఉండటం ఒక కారణం.

మెల్లగా కొత్తకోడలు వంటగదిలోకి కాలు పెట్టింది. 

అత్తగారు నవ్వింది. చేద్దువుగాని లేమ్మా వంట, నువ్వు చేయక పోతావా మేం తినక పోతామా, కొన్నాళ్ళాగి చేద్దువుగానిలే‌ అంది.

కొత్తకోడలు కొంచెం సిగ్గుపడుతూనే అడిగింది అత్తయ్య గారూ, దేవుడి గది...  అర్థోక్తిలోనే ఆపేసింది.

అత్తయ్యగారు చిత్రంగా చూసింది. ఇంకా చూళ్ళేదా, చిన్నీ‌ అని ఒక్క కేక పెట్టింది.

ఆడపడుచు పరుగెత్తుకు వచ్చింది.  తల్లి పురమాయించటంతో వదిన గారికి పూజగది చూపించింది.

అందులో రిసెప్షన్‌లో స్టేజీమీద పెట్టిన గురువుగారి పటం ఉంది. కొంచెం పూజా సామాగ్రి కూడా ఉంది. ఇంకేమీ లేవు. చిత్రంగా అనిపించింది కొత్తకోడలికి.

నా దగ్గర వేంకటేశ్వరస్వామి ఫోటో ఉంది పెట్టాలి అంది ఆడపడుచుతో.
అమ్మ నడగాలి. అయినా అవన్నీ ఎందుకూ అంది ఆడపడుచు.
అత్తగారేమో అలాంటి ఫోటోలవీ‌ దండగ. అయినా మీ‌ ఆయన్నడుగు. వాడేం చెప్పలేదా అంది.

కొత్తకోడలికి మతిపోతున్నట్లయింది. వేంకటేశ్వరస్వామి ఫోటో‌ దండగా!?

*      *      *      *

చాలా మథనపడి మథనపడి చివరికి రాత్రి పడుకోబోయే ముందు భర్తతో
వేంకటేశ్వరస్వామి ఫోటో పూజగదిలో‌ పెట్టాలి అంది.

వద్దు అన్నాడు భర్త ముక్తసరిగా.

అదేమిటీ అని అడిగింది.  తప్పని సరి మరి.

భర్త అనునయంగా ఇలా చెప్పాడు.  మనం విగ్రహారాధన అవీ‌ చెయ్యకూడదు.  విగ్రహారాథన చేయటం మహాపాపం అని గురువుగారు చెప్పారు. 

పాపం‌ ఎందుకవుతుందీ? అందరూ చేయటం లేదా? అంది కొత్తకోడలు.

చేస్తున్నారు. నరకానికి పోతున్నారు, అన్నాడు భర్త.

అదేం మాట అంది కొత్తకోడలు.

భర్త నవ్వుతూ లేచి లైట్ ఆన్ చేసి, తన బీరువాలోంచి రెండు పుస్తకాలు తీసుకుని వచ్చాడు.  వాటిమీద కూడా గురువుగారి ఫోటోలున్నాయి.

ఇవి రెండూ భక్తిశ్రధ్ధలతో చదువు. అంతా నీకే తెలుస్తుంది.  అన్నట్లు ప్రతీ‌ బుధవారమూ మనం ఆశ్రమానికి భజనకు వెడతాం. గురుభజన ఒక్కటే ముక్తిమార్గం. గురుపూజ ఒక్కటే పూజావిధానం. మిగతా దేవుళ్ళ బొమ్మలూ‌ అవీ‌ పెట్టి పూజలూ‌ పునస్కారాలూ టైం వేష్ట్ ప్లస్ నరకం గ్యారంటీ అన్నాడు.

కొత్తకోడలికి అంతా అయోమయంగా అనిపించింది.  తనకేమో వేంకటేశ్వరస్వామి అంటే‌ చచ్చే‌ భక్తి.  ప్రతిశనివారం ఉదయం ఆయన గుడికి పోవలసిందే. మొగుడేమో అలా చేస్తే‌ నరకం అంటాడు. ఆమెకు చాలా కంగారుగా, భయంగా అనిపించింది.

శనివారం శ్రీనివాసుడి గుడికి వెళ్ళొద్దా అంది దిగులుగా.  ఏ మూలో‌ ఇంకా కొంచెం ఆశ పాపం.

నాన్సెన్స్ అన్నాడు భర్తగారు ఖరాఖండిగా


*      *      *      *

పుస్తకాలు చదివితే అంతా వింతగా అనిపించింది. వాటిలో కొన్ని సూక్తి ముక్తావళులు ఇలా ఉన్నాయి.

శివుడూ‌ విష్ణువూ‌ ఇద్దరూ చవకబారు దేవుళ్ళు.  ఇద్దరికీ‌ ఒకరంటే ఒకరికి పడదు.  ఎప్పూడు కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళని పూజిస్తే నరకం తప్ప మరేమీ రాదు.

విగ్రహారాధన చేసే వాళ్ళకు ఆ విగ్రహాలు తప్ప ఏమీ మిగలవు. చివరకు వాటినీ‌ వదిలి చస్తారు. నోరు లేని విగ్రహాలు వాళ్ళకు స్వర్గం ఏమిస్తాయి. ఇంకా మోక్షం గురించి మాట్లాడాలా?

నారదుడని ఒకాయన ఉన్నాడు.  వఠ్ఠి అజ్ఞాని. ఎప్పుడూ‌ నారాయణో నారాయణో‌ అని చెక్క భజన చేస్తూనే ఉంటాడు.  ఇన్ని వందల యుగాలు గడిచాయి కాని మోక్షం‌ వచ్చిందా అతనికి? ఒకవేళ మోక్షం వచ్చేస్తే ఇంకా నారదుడు ఎక్కడుంటాడు? అతనికి అజ్ఞానం నిత్యం. అందుకే యీ‌ నారాయణుడి భజన దండగ అని ఎప్పటికీ‌ గ్రహించ లేడు.

ఇంత మంది దేవుళ్ళేమిటీ? వాళ్ళకు పెళ్ళాలూ పిల్లలూ‌ ఏమిటి. పైగా యీ పెళ్ళాం దేవుళ్ళకీ పిల్లదేవుళ్లకీ బుధ్ధిలేకుండా పూజలేమిటి.  ఇలా చేస్తే నరకం‌ తప్ప మరేమైనా వస్తుందా! పైగా వీళ్ళంతా మోక్షం ఇస్తారట - మనం నమ్మాలట.

బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులని ముగ్గురట. వాళ్ళల్లో వాళ్ళు పోర్టుఫోలియోల్ని పంచేసుకున్నారట. మళ్ళీ ముగ్గురూ ఒకటేనట. అదీ కాక వాళ్ళ కన్న పైన మరొక దేవత ఉందట.  ఏమిటండి ఈ‌ పిచ్చిప్రలాపాలూ?

గురువు ఒక్కడే సత్యం  గురుమార్గం అవలంబించిన వాళ్ళకే మోక్షం. నిశ్చలంగా గురుధ్యానం చేయండి. గురుకీర్తనలు ఆలాపించండి.  మీకు ధ్యానసమాథి సిధ్దిస్తుంది, గురుకృప దొరుకుతుంది.

గురుకృప కలవాళ్ళకి మోక్షం ఒక్క జన్మలోనే దొరుకుతుంది.

ఇలాంటి ఆణిముత్యాల లాంటి విషయాలన్నీ‌ చదివే సరికి కొత్తకోడలికి మతి పోయింది.

భర్తతో చర్చించాలనుకుంది కాని.  ఎలా చర్చించాలో అర్థం కాలేదు.

*      *      *      *

రెండు మూడు సార్లు ఆశ్రమానికి భజనకు వెళ్ళింది.

అక్కడ తాను చదివిన పుస్తకాల్లాంటివి భజన అనంతరం చదవటం అందరూ ఆ పుస్తకాలను కళ్ళకు అద్దుకోవటం చూసి వింతగా ఫీలయింది.

ఒకసారి తన స్నేహితురాలూ,  వాళ్ళ బుర్రమీసాల నాన్నగారూ కనిపించి పలకరించారు. ఆయనే తమకు యీ సంబంధాన్ని సజెష్ట్ చేసిందీ, మధ్యవర్తిగా ఉన్నదీ.

గురువుగారి మీద కీర్తనలు తాను భజనల్లో పాడాలని ఇంట్లో వాళ్ళు ఒకటే పోరు.

*      *      *      *

ఎవరూ చూడకుండా, తన గదిలోంచి,  తల్లికి  ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. ఆవిడకు నోట మాట రాలేదు. కూతురికి ఏం సలహా ఇస్తుంది పాపం. గొప్ప షాక్ తగిలి ఆవిడ గొంతు మూగ బోయింది.

ఒక ఆప్తమిత్రురాలికి ఫోన్ చేసి చెప్పుకుంది.

ఆ మిత్రురాలు ఆవేశ పడిపోయింది.

ఇదంతా నీకు వాళ్ళు ముందే చెప్పవలసింది. అప్పుడు చేసుకునే దానివో‌ కాదో నీ యిష్టం మీద ఉండేది.  ఇలా చెప్పకుండా దాచిపెట్టి మోసం చెయ్యటం‌ అన్యాయం అంది.

ఆ అమ్మాయి విడాకులు తీసుకున్నా తప్పు లేదూ అని కేకలు వేస్తూ పోతుంటే భయం వేసి ఫోన్ కట్ చేసింది

*      *      *      *

ఆడపదుచు చిన్నపిల్ల. దానితో‌ చర్చించ వలసింది ఏమీ‌ ఉండదు కదా?

అత్తగారు ఖరాఖండీ మనిషి.   ఆవిడ దగ్గర కొంచెంగా ప్రసక్తి తేగానే, చూడమ్మా మా యింట్లో మా పధ్ధతిలో ఉండాలి. మీ‌ పుట్టింట్లో వాళ్ళు ఏ ఏబ్రాసిపూజలు చేసుకున్నా ఏ గంగలో ములిగినా మనకి అనవసరం.  మనం గురుమార్గంలో‌ ఉన్నాం. అనవసరమైన విషయాలు బుర్రలోంచి తీసెయ్యాలి నువ్వు అంది

భర్తతో తగువేసుకుంది ఏమైతే అదవుతుందని. శ్రీనివాసుడి కన్నా ఏదీ‌ ఎక్కువ కాదు తనకు.

భర్త ఏ కళన ఉన్నాడో తన గోడంతా తాపీగా విన్నాడు. కొంతలో కొంత సంతోషం.

అంతా విని అనునయించాడు. ఇంకా నీకు గురుమార్గం కొత్త.  కొత్తలో అందరికీ ఇలాగే అయోమయంగా ఉంటుంది. చాలా మంది మొండిగా మాట్లాడతారు నీలా. అటూ‌ ఇటూ ఊగుతూ గందరగోళంలో ఉంటారు కొంతకాలం. ఇదంతా సహజమే.  మా గురువుగారి పుస్తకాలు నువ్వు ఇంకా శ్రధ్ధగా చదవాలి. ఇదంతా ఆయన ఎప్పుడో చెప్పారు. పుస్తకంలో మనస్సు పెట్టి చదివితే నీకు ఇదంతా తెలిసి ఉండాలి ఈ‌ పాటికి.  ఇలా సాగింది అతడి అనునయం.

కొత్తకోడలికి సహనం చచ్చిపోయింది.  సీరియస్‌గా అంది. మీరు నన్ను మోసం చేసి పెళ్ళి చేసుకున్నారు. ఇంత అన్యాయమా, మీ రేదో మతం వాళ్ళమని ముందే ఎందుకు చెప్పలేదూ.  గొంతు పెద్దది చేసి నిలదీసింది.

భర్త ఆశ్చర్యంగా చూసాడు. ఆమాట అనవలసింది మేము అన్నాడు కోపంతో.

 మీరా! అని తెల్లబోయింది కొత్తకోడలు.

కాదా, ఆ బుర్రమీసాలాయనా మీవాళ్ళు కలిసి వస్తే మీరూ గురుమార్గంలో ఉన్నారనుకున్నాం.

తీరా ముహూర్తాలు పెట్టుకున్నాక కాదని తెలిసింది.  పెళ్ళి కేన్సిల్ చేయటానికి గురువుగారు ఒప్పుకోలేదు.  మెల్లగా తానూ‌ సన్మార్గం లోకి వస్తుంది. ఇంతోటి చిన్న విషయానికి అల్లరెందుకూ‌ అని ఆపారు. చేసేది లేక పెళ్ళి చేసుకున్నాను.

ఇప్పుడు చెప్పు,  మోసం చేసింది మీరా - మేమా? అని భర్తగారు కోపంతో ఊగిపోయాడు.

ఊహించని పరిణామానికి కొత్తకోడలికి మరొక గట్టి షాక్ తగిలింది.

ఏం చేయాలి తను?



*      *      *      *

తల్లిదండ్రులు చాలా చాలా విచారించారు.
ఎంతో ఆలోచించి, ఏం చేస్తాం‌ తల్లీ, నువ్వే సర్దుకు పోవాలీ అని సలహా యిచ్చారు.

అదీ‌ ప్రయత్నించింది.
సాధ్యపడటం లేదు.

అందరి ముందూ మౌనంగా ఉంటుంది.
ఎప్పుడైనా ఒంటరితనం‌ కాస్త చిక్కినప్పుడు ఏడుస్తుంది.
చెప్పినట్లు ఆడే బొమ్మలా గురుమార్గం ఆశ్రమానికి భజనలకు వెళుతుంది.
మరబొమ్మలా భజనలు చేస్తుంది.
పాటల పెట్టిలా గురుకీర్తనలూ‌ పాడుతుంది.

అత్తగారికి సంతోషంగా ఉంది, కోడలు తొందరగా గురుమార్గంలోకి వచ్చిందని.
భర్తకూ చాలా ఆనందంగా ఉంది భార్యకు త్వరగా జ్ఞానోదయం అయిందని.
భజనల్లో,  వదిన గారి పాటల్ని అందరూ‌ తెగ మెచ్చుకుంటుంటే ఆడపడుచు సంబరపడి పోతోంది.

*      *      *      *

కోడలు ప్రసాదం చేస్తుంటే అత్తగారు పక్కనే నిలబడి గురువుగారి మహిమలగురించి చెబుతున్నారు.

ఆవిడ అక్కడక్కడా మర్చిపోతున్న వివరాల్ని ఆరిందాలాగా ఆడపడుచు అందిస్తోంది.

కోడలు మౌనంగా వింటోంది.

వింటున్నావా? ఈ‌ రోజు గురువుగారి పుట్టినరోజు మనం గ్రాండ్‌గా సెలిబ్రేట్ చేస్తున్నాం‌ మనింట్లో‌ అంటే, గురువుగారి అనుగ్రహం నీ‌ మీద ఎంత ఉందో అని వాడు తెగ మురిసి పోతున్నాడు. ఈ‌ వేళ నీ‌ పాటలూ నీ‌ చేతి ప్రసాదం రెండూ భజనకే హైలైట్ కావాలి తెలిసిందా అని గొప్పగా అంది అత్తగారు.

కోడలు ఏమీ‌ మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఊరుకుంది.

భజన నిజంగానే‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. 

*      *      *      *

రాత్రి వేంకటేశ్వరస్వామివారు కలలోకి వచ్చారు, చాలా కాలం తరువాత.

ఏమిటి అమ్మాయీ, నన్ను మర్చిపోయినట్లున్నావూ! అని నిష్టూరం ఆడారు.

నాకు నీ‌ పూజ చేసుకునే‌ అదృష్టం లేదు. నీ‌ పాట పాడుకునే అదృష్టం లేదు. చివరికి నీ‌ నామం అయినా ధైర్యంగా పైకి అనే అదృష్టం కూడా లేదు. అన్నీ‌ మానుకుని భ్రష్టుపట్టి పోయాను.  అంతా నా ఖర్మ స్వామీ‌ అని విన్నవించుకుంది.

వెక్కివెక్కి ఏడ్చింది. నా తలరాత ఇలా ఉంది స్వామీ. ఏం చెయ్యనూ ఎక్కడకు పోనూ అంది.

అదేమిటి అలా అంటావూ, నేను లేనా? నా దగ్గరకు రావచ్చు కదా? అన్నారు ఆశ్చర్యంగా.

నేనా అంది మరింత ఆశ్చర్యంగా.

నువ్వే. నా దగ్గరకు వస్తావా మరి అన్నారు లాలనగా

ఎప్పుడు అంది ఆశగా.

ఇప్పుడే అన్నారు స్వామివారు.

ఆయన అడుగులో‌ అడుగు వేసుకుంటూ‌ వెళ్ళిపోయింది.

*      *      *      *