22, ఆగస్టు 2013, గురువారం

విదుషీమణి శ్రీమతి మాలతీచందూర్‌గారి అస్తమయం!

(వికీ పీడియా నుండి)


చాలా దశాబ్దాలుగా తెలుగుపాఠకులకు ఆప్తురాలైన విదుషీమణి శ్రీమతి మాలతీచందూర్‌గారు. 

ప్రస్తుతతరం తెలుగుపాఠకలోకానికి ఆవిడ గురించి ఎంత తెలుసో నాకు తెలియదు.

ఆవిడ 47 సంవత్సరాలపాటు ప్రమదావనం అనే శీర్షికను ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో నడిపించారు.  ఇదొక రికార్డు అనుకుంటాను.  ఆ శీర్షికలో ఆవిడ పాఠకుల ప్రశ్నలకు జవాబులు చెప్పేవారు.

ఆవిడ చెప్పే‌ జవాబులు చాలా ఆసక్తికరంగా ఉండేవి.  ఒక రకంగా చూస్తే ఆవిడ తరచుగా పాఠకుడు లేదా పాఠకురాలు అడిగిన ప్రశ్నను ఒక సాకుగా తీసుకుని తమ వైదుష్యాన్ని ప్రదర్శించేవారని పిస్తుంది.  ప్రశ్నకు సమాధానంగా ఆవిడ మరీ తరచుగా జాతీయ అంతర్జాతీయ విషయాలను ప్రస్తావించేవారు. 

ఆవిడ జవాబుల్లో చదివించే గుణం అనేది చాలా గొప్పగా ఉండేది.  లేకపోతే ఆవిడ వైదుష్యాన్ని భరిస్తూ తెలుగుపాఠకలోకం ఆవిడ ప్రమదావనం పేజీలో "జవాబులు" శీర్షికని దాదాపు అర్థశతాబ్దం పాటు చదివారంటే, ఎలాంటి రచన కైనా మొట్టమొదట ఉండవలసిన మహాగుణం చదివించ గలగటం అని అందరూ, ముఖ్యంగా రచనలు చేసే వాళ్ళు గ్రహించాలి.

నా మటుకు నేను అప్పట్లో,  ప్రతివారం ఆంధ్రప్రభ వారపత్రిక రాగానే మొట్టమొదట ప్రమదావనం శీర్షికే చదివే‌వాడిని.  ఆవిడ జవాబులశైలీ, విజ్ఞానం రెండూ చాలా అబ్బురపాటు కలిగించేవి.

ఆవిడ చెప్పున జవాబుల్లో కొన్ని నాకు ఇప్పటికీ గుర్తే.

ఒక అమ్మాయి వేసిన ప్రశ్న.  "ఇంటర్ పాసయ్యాను.  ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ అనిపిస్తోంది.  ఏం చెయ్యాలో తోచటం లేదు"

దీనికి ఆవిడ చెప్పిన చమత్కారం నిండిన జవాబు, "ఏమిటీ, ఇంటర్ చదివి కూడా నువ్వు ఖాళీగా కూర్చున్నావా? ఈ‌ రోజుల్లో అక్షరాలు వచ్చిన ప్రతీ ఆడపిల్లా వరసపెట్టి నవలలు రాస్తోందని తెలీదా?" అని.

మరొక పాఠకుడు అడిగిన ప్రశ్నకు (ప్రశ్న గుర్తులేదు క్షమించాలి), ఆవిడ ఇచ్చిన జవాబు "ఇప్పడు కుర్రాళ్ళందరికీ‌ టెర్రీకాటనూ పెర్రీమేసనూ" అని.

ఇలా చమత్కారం మిళాయించి రాయటంతో ఆవిడ జవాబులు ఎంత సీరియస్‌గా ఉండేవో తరచుగా, అంత చమత్కారంతోనూ ఉండేవి.

ఒక పాఠకురాలు, "ఈ‌మధ్య కొందరు స్త్రీలు తమపేర్ల చివర భర్తల పేర్లు, ఇంటి పేర్లు చేరుస్తునారు కదా, అది సరైనదేనా" అని  అడిగితే ఆవిడ "ఒరవడి పెట్టిన వాళ్ళల్లో నేనూ‌ ఉన్నాను కదా? నన్ను అడుగుతారేం!" అన్నారు చమత్కారంగా.

కొన్నికొన్ని జవాబులు పౌరాణిక విషయాలపై కూడా చెప్పారు ఆవిడ.  ఒక ప్రశ్నకు జవాబుగా "శ్రీకృష్ణుడు పదహారువేలమంది రాజకన్యలనీ విడిపించింది నరకాసురుడి బారి నుండి కాదు, జరాసంధుడి వద్ద నుండి" అన్నారు.

అలాగే మరొకసారి, "శ్రీకృష్ణుడు ఒక వ్యూహం‌ ప్రకారమే కౌరవపాండవ పక్షాల్లో ఉభయపక్షాలకీ చెందిన వాళ్ళందర్నీ పైకి పంపాడు.  ఆయన తన చెల్లెలి మనవడు పరీక్షిత్తుకు రాజ్యం‌ కట్ట బెట్టాలనే ఇలా చేసాడు" అన్నారు.

చారిత్రకమైన విషయాల మీదా ఆవిడ కామెంట్లు చేసారు.  "శ్రీకృష్ణదేవరాయలు యుధ్ధాల్లో బంధించిన వేలాది మంది సైనికుల చేత వెట్టి చాకిరీ చేయించి ఆనకట్టలు కట్టించాడు కావేరికి.  ఇలా ఆయనలో క్రూరత్వం అనే కోణం కూడా ఉంది." అన్నారు. 

"భారత సర్కారుకు, అప్పట్లో చైనాలో భారత రాయబారిగా ఉన్న సర్దార్ పణిక్కర్ అనేక హెచ్చరికలు పంపాడు - చైనా మన మీదకు దాడి చేయటానికి ప్రయత్నాలు చేస్తోంది అని.  కాని చౌ-ఎన్-లై మీద ఉన్న విశ్వాసంతో నెహ్రూగారు పట్టించుకోలేదు ఆ హెచ్చరికల్ని" అని కూడా ఒక ప్రశ్నకు ఆవిడ సమాధానంలో చెప్పారు.

కొన్ని కొన్ని జవాబులు మనకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చును.  కాని ఆవిడ చెప్పేతీరు, విషయం చెప్పాలీ జనానికి అన్న తపన, ఆవిడ విజ్ఞానం అబ్బురపరుస్తాయి.

ఆవిడ తన తొలి రేడియో ప్రసంగం అనుభవం గురించి వ్రాసిన వ్యాసం ఇంకా గుర్తుంది. టాల్ స్టాయ్ 'అనా కెరినినా' గురించి మొట్టమొదటి ప్రసంగం చేసారట.  కొత్త కావటంతో గడబిడ పడిపోయి మైక్ డెడ్ ఎండ్‌లో మాట్లాడటం మొదలు పెట్టి రేడియో‌ స్టాఫ్ ఇంజనీర్లని కూడా కంగారు పెట్టానని ఆవిడ చెప్పారు దాంట్లో.  ఆ ప్రసంగం కోసం ఎలా కష్టపడి తయారయిందీ చదివితే ఆశ్చర్యం వేస్తుంది

శ్రీమతి మాలతీచందూర్‌ను నేను మద్రాస్‌లో ఒకసారి కలిసాను. అది 1980ల్లో.  ఆఫీసు పని మీద వెళ్ళి నప్పుడు టెలిఫోన్ డైరెక్టరీలో ఆవిడ నెంబరూ, అడ్రసు వెదకి ఫోన్ చేసి వెళ్ళాను.

అప్పట్లో ఆవిడ కొత్తగా పాతకెరటాలు అనే పేరుతో పుస్తకపరిచయం శీర్షిక మొదలు పెట్టారు.   Moon stone అనే పుస్తకం అలభ్యంగా ఉందని ఆవిడ వ్రాయటం నేను చదివాను అప్పటికే.  అది నా వద్ద ఉంది.  గొప్ప నవల.  అది నా దగ్గర ఇప్పుడూ భద్రంగా ఉంది.  ఆ నవల ఆవిడకి ఇవ్వటం కోసం‌ తెచ్చానని ఫోన్ చేస్తే ఆవిడ సంతోషపడి రమ్మన్నారు.

వెళ్ళి ఆ పుస్తకం ఇస్తే చాలా సంబరపడ్డారు.  అవిడ నన్ను శ్రీచందూర్‌గారికి పరిచయం చేసారు. ముగ్గురం కూర్చొని కాస్సేపు మాట్లాడుకున్నాం.  తనకు పాఠకుల ఆదరణే ఊపిరి అని ఆవిడ నాతో అన్నారు. నా వ్యక్తిగత విషయాలలో కూడా కొన్నింటి మీద ఆవిడ సలహా అడిగి తీసుకున్నాను. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని బాగా చదివించాలి అని ఆమె మరొక మాట అన్నారు.

ఆవిడకు పుస్తకం ఇచ్చి వచ్చాను.  తరువాత కొన్నాళ్ళకి ఆవిడ నాకు ఆఫీస్ నంబరుకు ఫోన్ చేసి నా పుస్తకం‌ తిరిగి తీసుకు పోవచ్చని చెప్పారు.  నేను మళ్ళా మద్రాసు వచ్చినప్పుడు తీసుకుంటానని చెప్పాను.  కాని వెళ్ళటం వీలుపడక మద్రాసులో ఉన్న ఒక మిత్రుడు విశ్వనాథన్‌కి వివరాలు చెప్పి అ పుస్తకం తీసుకోమనీ, హైదరాబాదు ఆఫీసు పని మీద వచ్చినప్పుడు నాకు ఇమ్మనీ చెప్పాను.

కాని మాలతీచందూర్‌గారు ఆ పుస్తకాన్ని మా మిత్రుడు విశ్వనాథన్ చేతికి ఇవ్వటానికి నిరాకరించారు.  అతడు నాకు ఫోన్ చేసి చెప్పాడు.  "అది చాలా అరుదైన పుస్తకం బాబూ, నోటి మాట మీద నీ చేతికి  ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వ లేను" అని తెగేసి చెప్పారట. నేను మా మిత్రుడికి ఉత్తరం వ్రాసి ఇస్తే అప్పుడు ఇచ్చారు.

శ్రీమతి మాలతీ చందూరుగారు తెలుగు సాహిత్యానికి ఆణిముత్యాలవంటి నవలలూ అందించారు.  మసాలా సామాగ్రి దట్టించిన పుస్తకాలు కాకపోబట్టి చాలా మందికి అవి తెలియక పోవచ్చు.  ఉదాహరణకి ఆవిడ సద్యోగం గొప్ప నవల. దొరికితే తప్పక చదవండి. 

శ్రీరామారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పురస్కారం కోసం ఆవిణ్ణి మద్రాసు నుండి పిలిపించారు.  అప్పుడు హైదరాబాదు వచ్చిన ఆవిణ్ణి దొంగలు హోటల్ గదిలో బంధించి పోయారు!

ఇంత గొప్ప తెలుగు విదుషీమణికి మన తెలుగుప్రభుత్వాలు ఏమంతగా అవార్డులూ రివార్డులూ‌ ఇచ్చినట్లు కనబడదు.  మన ప్రభుత్వాలు రజని (శ్రీబాలాంత్రపు రజనీకాంతారావు) గారికే కనీసం పద్మశ్రీ కూడా ఇప్పించ లేద నుకుంటాను.  ఆయన క్రికెట్ ఆడి ఓ రెండు మూడు సెంచరీలు చేసినా,  బాడ్మిండన్ ఆడి ఓ రెండు టోర్నీలు  గెలిచినా, ఓ డజను సినిమాలు చేసినా ఆ పద్మా అవార్డులు గట్రా వచ్చే వేమో!  శ్రీమతి మాలతీ చందూరు గారిని మన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని వాపోయి ప్రయోజనం లేదు.

అనన్యసామాన్యమైన సాహిత్య కృషితో పాఠకలోకం అభిమానం సంపాదించుకున్న శ్రీమతి మాలతీ చందూర్ అస్తమించటం ఒక తీరని లోటు.

అన్నట్లు సరిగమలు  బ్లాగువారు మాలతీ చందూర్-ఓ విజ్ఞాన సర్వసం అని ఒక మంచి వ్యాసం ప్రచురించారు.  అందులో మాలతీ చందూర్‌గారితో ఇంటర్వ్యూకి సంబంధించిన లింక్ ఇచ్చారు తప్పకుండా వినండి: http://telugu.tharangamedia.com/specail-show-with-malathi-chandur/


అలాగే ఇష్టపది బ్లాగులో ప్రజాశక్తి పత్రికలో వచ్చిన వ్యాసం ప్రచురించారు.  ఎన్నో విశేషాలతో ఈ వ్యాసమూ చాలా బాగుంది. తప్పకుండా చదవండి.

తెలుగు అమ్మాయిలకు వంట నేర్పిన మంచి తల్లిగా మాలతమ్మ గారి పాత్ర గురించిన మంచి వ్యాసం మనసులో మాట బ్లాగులో వచ్చిన మిస్ యూ మాలతీ :(  ఒకటి. అది కూడా చాలా బాగుంది.

జంపాలచౌదరిగారు కూడా స్ఫూర్తిదాయని, జ్ఞానదాయని, సలహాదాయని, సన్నిహిత సఖి – మాలతీచందూర్ అని మంచి వ్యాసం ప్రకటించారు. తప్పక చదవండి.

అలాగే వేదిక బ్లాగులో కూడా మాలతీ చందూర్ – మద్రాసు – ఒక స్మృతి  అనే మంచి వ్యాసం వచ్చింది చదవండి.