29, ఫిబ్రవరి 2024, గురువారం

రామనామ మిట్టిదనగ

 

రామనామ మిట్టిదనగ రాదు సుమ్మండి సర్వ

కామనలను మనకు తీర్చగలదు సుమ్మండి


అఖిల సంపదల నొసంగు నండి రామనామము

అఖిల భాగ్యముల నొసంగు నండి రామనామము

అఖిల భోగముల నొసంగు నండి రామనామము

అఖిల సౌఖ్యముల నొసంగు నండి రామనామము


అందరకును భయముబాపు నండి రామనామము

అందరకును శాంతినొసగు నండి రామనామము

అందరకును జ్ఞానమొసగు నండి రామనామము

అందరకును మోక్షమొసగు నండి రామనామము


నామనోవినోదము

 

నామనోవినోదమును నామతమును తెలిపెద

ధీమంతుల కిదే తేటతెల్లముగాను


రామునకై పాడుటే నామనోవినోదము

రామునకై యాడుటయే నామతము


రాముని పూజించుటే నామనోవినోదము

రాముని సేవించుటయె నామతము


రాముని ప్రేమించుటయే నామనోవినోదము

రామడు పరదైవతమని నామతము


రామతత్త్వచింతనమే నామనోవినోదము

రామనామప్రచారమే నామతము




ఏమి కావలెను హరినామ ముండగ


ఏమి కావలెను హరినామ ముండగ

నామముండగ రామనామ ముండగ


లోకముల నేలునట్టి శ్రీకరమగు నామము

శోకముల నణగించెడు సురుచిరమగు నామము

భీకరమగు కష్టముల వెడలించెడు నామము

శ్రీకాంతుని నామము నీజిహ్వపై నుండగ


అనిశము గిరిజేశుని భావనను నిలుచు నామము

మునివరులు నిరంతరము పొగడునట్టి నామము

వనజాసన శక్రాదులు కొనియాడెడు నామము

మనసున మార్మోగుచు నిను నడిపించు చుండగ


పాపగిరులపాలి వజ్రపాతమైన నామము

తాపత్రయ మణచెడు శుభదాయకమగు నామము

రూపర భవచక్రమును త్రుంచునట్టి నామము

శ్రీపతి ఘననామము నిను కాపాడు చుండగ




శ్రీరామ నీనామమే చాలు

 

శ్రీరామ నీనామమే చాలు మాకు

తీరేనురా భవబంధాలు


కోపిష్టి యమునితో వాద

మేపగిది గెలిచేము మేము

తేపకును శ్రీరామ యన్న

ఆపాడు యముడేమి చేయు


మాటిమాటికి పుట్టుబాధ

మాటిమాటికి చచ్చుబాధ

ఏటికి పొంద ముమ్మాటికి

నోటనే నీనామ ముండ


నామప్రభావంబు వలన

మేమన్య మేమడుగ బోము

రామ యిక నీవుండు చోటు

మేముండు చోటైన చాలు


లెక్కలన్ని మారిపోయెను

 

లెక్కలన్ని మారిపోయెను నేటితో

చిక్కులన్ని తీరిపోయెను


చక్కనయ్య శ్రీరాముడు

చక్కగ దయ చూడగనే

మిక్కిలి యగు పాపరాశి

యక్కజముగ బుగ్గాయెను


శ్రీరాముని దయచేతను

కోరికలే యణగారెను

ఘోరమైన సంసారము

తీరే దారి తోచినది


ఒక్కని శ్రీరామచంద్రు

చక్కనైన భక్తి తోడ

మిక్కిలి ధ్యానించగనే

ముక్కలాయె భవశృంఖల



27, ఫిబ్రవరి 2024, మంగళవారం

చాలునమ్మ సింగారము


చాలునమ్మ సింగారము స్వామి వచ్చు వేళాయె

బాలికా వరము లిచ్చి భక్తకోటికి


చాలదమ్మ సమయము పూలజడ వేయుటకు

నీలాలక మల్లెపూల మాల ముడువవే


తిలకము దిద్దినది చాలు కలికి సుమగాత్రమున

నలద నిమ్ము మేలైన హరిచందనము


వాలుగంటి శ్రీరాముల వారి కిష్టమైన ము

త్యాలమాలికలు మెడను దాల్చవే సఖీ


జనకులు కడు దయామయులు స్వామి వారైతేను

జనని వీవు లోకములకు జానకీసతీ


ఏమేమి యడిగిరో యీనాడు నిజభక్తులు

తామేమి దాశరథులు దయచేసిరో


చాల విశేషములు చెప్ప స్వామి వచ్చినారిదే

లోలాక్షి పడకటింటి లోనికి పోవే



26, ఫిబ్రవరి 2024, సోమవారం

శ్రీరామనామము చేయని మనసు


శ్రీరామనామము చేయని మనసొక చీకటికొట్టని తెలియండీ

ఘోరమైన కామాదిపిశాచాల గుహ యను మాటను తెలియండీ


లేని సుఖము సంసారము నందున మానక వెదకుట తప్పండీ

మానవులారా రాముని నామము మాత్రమె సుఖముల గనియండీ


మరువక రాముని నామము తలచే మనుజుడు సుఖి యని తెలియండీ

నరకబాధ లవి వానికి రావను పరమసత్యమును తెలియండీ


పరమసత్యమైన హరినామంబును మరచుట మిక్కిలి తప్పండీ

మరువక శ్రీహరి నామము చేసిన మనకు మోక్షమని తెలియండీ


కడుగడు శ్రధ్ధను  రామనామమును కర్తవ్యంబని చేయండీ

అడుగకయే హరి మోక్షము నిచ్చుట అక్షరసత్యము తెలియండీ



లోకమెల్ల చక్కగ నిదురించు వేళ


జగదీశ్వర లోకమెల్ల చక్కగ నిదురించు వేళ

తగినమంచి సమయమురా ధ్యానంచుకొనగ నిన్ను


యుగములుగా యత్నించుచు నున్నను నాకొకనాటికి

పగటిపూట జనుల దుష్టభావతరంగముల మధ్య

తగుననుచును ఘడియయేని జగము మరచి ధ్యానించగ

భగవంతుడ యెన్నటికిని వశము కాక యున్నదిరా


ఆపనియని యీపనియని యటునిటు తిరుగుచును కొంత

తేపకు నీ ధనములనుచు తిరుగుటలో నొక కొంత

ఆపసోపములకు కొంత కోపతాపములకు కొంత 

లోపించగ చిత్తశాంతి లోకేశ్వర ధ్యానమెటుల


అందులకే యర్ధరాత్రి హాయిగ లోకమును మరచి

కందువగు సమయమది కావున నిను నాహృదయ

మందిరమున దరిసించుచు మరిమరి పులకించుచు

నుందునురా రామచంద్ర యుత్సహించి ధ్యానంబున



నా యింటి పనులు ముగియించుకొని


వినవయ్య నా యింటి పనులు ముగియించుకొని

కనులార నినుజూడ గబగబ వచ్చితిని


ఆలోన నయ్యయ్యొ నయ్యవారును దే

వాలయపు తలుపులను హరిహరి మూసిరే

నీలమేఘశ్యామ నిన్ను దరిసించుటకు

వీలు లేదని తెలిసి చాల క్రుంగితిని


ఏమి చేయుదు నయ్య నెవరి నేమందును

నామనో వేదనకు నయమగు దారేది

రామచంద్రప్రభో యేమిజన్మము నాది

నీమోము చూచుటకు నేను నోచనైతి


యింటిపనులు పగలు యింటిపనులు రాత్రి

యింటిపనులు తెమలు టెన్నడును లేదాయె

యింటిగుమ్ము దాటి యెపుడైన వత్తునో

గంటలు ముగిసెనని గడియపడును గుడికి




24, ఫిబ్రవరి 2024, శనివారం

మోక్షనగరిలో

మోక్షనగరి నొకమూల కుటీరం

దాక్షిణ్యముతో దయచేయరా


ఆమూల కుటీరమున

రామా రామా యనుచు

నామజపము చేయుదును

స్వామీ వేడుకతోడ


ఆమూల కుటీరమున

కామితము లేమి లేక

ప్రేమతో తలచుచుందు

నీమహిమాతిశయమును


ఆమూల కుటీరమున

నీమహాత్మ్యము వలన

ఏమాత్రమును లేవు

స్వామీ త్రికాలము లవి




23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

జయజయ శ్రీరామ జగన్మోహన

జయజయ శ్రీరామ జగన్మోహన భవ

భయహర శ్రీరామ పరమపావన


జయజయ రఘుకులనాయక జనకజావర

జయజయ హరి సకలలోక శాంతిదాయక

జయజయజయ సకలమౌనిజనప్రశంసిత

జయజయ హరి వరదాయక జ్ఞానదాయక


జయజయ సర్వార్తినాశ శరధిబంధన

జయజయ హరి నీలగగనశ్యామ రాఘవ

జయజయజయ భక్తవరద సర్వమోహన

జయజయ హరి కరుణాకర సర్వమంగళ


జయజయ సకలాఘనాశ శాపమోచన

జయజయ హరి ఖలవిదార జలజలోచన

జయజయజయ ఖగవిహర సవనరక్షక

జయజయ హరి పరమపురుష సత్యసుందర



భావించర శ్రీరాముని


భావించర శ్రీరాముని
జీవుడ నీవు చిత్తమున

వరదాయకుడని భావించెదవో
పరమాప్తుండని భావించెదవో
పరమేశ్వరుడని భావించెదవో
పరిపరివిధముల భావించెదవో

సేవనీయుడని భావించెదవో
శ్రీవల్లభుడని భావించెదవో
దేవదేవుడని భావించెదవో
నీవాడే నని భావించెదవో


22, ఫిబ్రవరి 2024, గురువారం

వీరభక్తుడను రామ


వీరభక్తుడను రామ వీరభక్తుడ నీకు
కూరిమితో రక్షించుము వీరభక్తుడ 

విశ్వవందిత నీకు నేను వీరభక్తుడ రామ
విశ్వసన్నుత నీకు నేను వీరభక్తుడ

విశ్వకారణ నీకు నేను వీరభక్తుడ రామ
విశ్వనాయక నీకు నేను వీరభక్తుడ

విశ్వమోహన నీకు నేను వీరభక్తుడ రామ
విశ్వపోషక నీకు నేను వీరభక్తుడ

విశ్వరక్షక నీకు నేను వీరభక్తుడ రామ
విశ్వదక్షిణ నీకు నేను వీరభక్తుడ

విశ్వబాహో నీకు నేను వీరభక్తుడ రామ
విశ్వరూపక నీకు నేను వీరభక్తుడ


మాయవేసిన వేషముచే


మాయవేసిన వేషముచే మనిషినైతి నేను

మాయవేషము వేసి నీవు మనిషి వైనావు


నీమాయావిలాసమిటు నిగిడించిన సృష్టిలో

ఈమానవుడొకడు పొడమె స్వామి నీ యాటకై

ఏమో ఈయాట యెపుడు భూమిని మొదలాయె

నీమాయ కే యెఱుక నీకే యెఱుక


ఆటను నడిపించువాడ మేటి యాటగాడ

ఆట దారితప్పువేళ ఆటలోన నీవే

సూటిగాను ప్రవేశించి చొక్కమైన తీరు

నాటించియె పోవుదువో నారాయణా


భవతారకరాముడవై ప్రభవించిన నిన్ను

పవలురేలు కొలుచుకొనుచు పాడెదనిట నేను

వివిధమైన తనువులెత్తి వేడుకతో నిటుల

భువిని నీదు నాటకమున పొలుపుగా నటింతు




హరేరామ యనవలెను



హరేరామ యనవలెను మీరు హరేకృష్ణ యనవలెను

పరాత్పరా యనవలెను మీరు శరణము హరి యనవలెను


నిరంతరముగా హరినామమునే నిష్ఠగ పలుకగ వలెను

కరుణామయుడగు హరినెప్పుడును మరువకుండ వలెను

సిరిసంపదలును చిరాయువులతో హరిని కొలువవలెను

హరిపదమునకే సంతోషముతో మరలిపోవ వలెను


పరమానందము కలిగించెడు హరి భజన చేయవలెను

తరచుగ శ్రీహరి కథలను చదువుచు ధన్యులు కావలెను

హరి నిజతత్త్వవిచారము చేయుచు నబ్బురపడ వలెను

హరిమందిరములుగా మీహృదయము లమరి యుండ వలెను


హరి మీకనిశము కామితవరములు కురియుచుండ వలెను

హరి మీయోగక్షేమము లెప్పుడు నరయుచుండ వలెను

హరికృపచే మీమిత్ర బాంధవులు పరవశింప వలెను

హరిభక్తులుగా మీరందరు నిల నతిశయించ వలెను




ఏమిటయా సాధనం


రామకటాక్షమును బడయ నేమిటయా సాధనం
రామకటాక్షమును బడసి రామపదము చేరెద

రామచంద్రనామరూపరమ్యసుగుణకీర్తనం
స్వామి కటాక్షమును బడయ చక్కనైన సాధనం

రామచంద్రదివ్యకథారసామృతసేవనం
స్వామి కటాక్షమును బడయ చక్కనైన సాధనం

రామచంద్రదివ్యకీర్తిప్రభాపటలవర్ణనం
స్వామి కటాక్షమును బడయ చక్కనైన సాధనం

రామచంద్రభవతారకనామసంకీర్తనం
స్వామి కటాక్షమును బడయ చక్కనైన సాధనం

రామచంద్రవిభుని మిగుల ప్రేమతో స్మరించటం
స్వామి కటాక్షమును బడయ చక్కనైన సాధనం

రామచంద్రవిభుని సేవ నేమరక చేయటం
స్వామి కటాక్షమును బడయ చక్కనైన సాధనం

21, ఫిబ్రవరి 2024, బుధవారం

శ్రీరామ జయరామ రామా


శ్రీరామ జయరామ రామా దాసుడను ప్రీతితో రక్షించు రామా

హరి వీవు శ్రీరామ రామా నీకు కింకరుడను శ్రీరామ రామా
కరుణాలవాల శ్రీరామా రామ నీకరుణయే చాలు శ్రీరామా

రఘురామ శ్రీరామ రామా భానుకులరాజన్యమణి రామ రామా
అఘునాశ శ్రీరామ రామా నీదయనందిమ్ము నాకు శ్రీరామా

దైత్యారి శ్రీరామ రామా పరమాత్మ దశరథనందన రామా
నిత్యమ్ము శ్రీరామ రామా మదిలోన నిన్నెంచి మ్రొక్కుదును రామా

జానకీపతి రామ రామా నీకు నే సద్భక్తుడను రామ రామా
నీనామమును రామ రామా నాజిహ్వ నిత్యమ్ము పలుకును రామా

గుణశాలి శ్రీరామ రామా నిను తగులుకొన్నది నామనసు రామా
రణభీమ శ్రీరామ రామా శివుడైన ప్రస్తుతించును నిన్ను రామా

క్షణమైన శ్రీరామ రామా నిను విడువజాలదు నామనసు రామా
ప్రణుతింతు శ్రీరామ రామా నిను పొగడి పరవశింతును రామ రామా


మరువక రామనామము

 
మరువక రామనామము చేయవలయు
    హరినామ మిట్టిట్టి దన వశముకాదు

హరినామమున గాని యన్యంబు వలన 
    తరచుగా సద్భుధ్ధి తగులుటే లేదు

హరినామమున గాని యన్యంబు వలన
    నరునకు యోగ్యత పెరుగుటే లేదు

హరినామమున గాని యన్యంబు వలన
    అరిషట్కమన్నది యణుగుటే లేదు

హరినామమున గాని యన్యంబు వలన
    నరునకు బాధలు తరుగుటే లేదు

హరినామమున గాని యన్యంబు వలన
    దురితంబు లేవియు తొలగుటే లేదు

హరినామమున గాని యన్యంబు వలన
    నరుని చిత్తమున నానందమే లేదు

హరినామమున గాని యన్యంబు వలన
    నరుని తేజము వృధ్ధి నెఱుగుటే లేదు

హరినామమున గాని యన్యంబు వలన 
    నరుని యహంకృతి కరుగుటే లేదు

హరినామమున గాని యన్యంబు వలన
    నరుని యవిద్యకు నాశంబు లేదు

హరినామమున గాని యన్యంబు వలన
    పరమార్థమున బుధ్ధి పరగుటే లేదు

హరినామమున గాని యన్యంబు వలన 
    హరితత్త్వ మవగతం బగుటయే లేదు

హరినామమున గాని యన్యంబు వలన
    నరునకు బంధవినాశంబు లేదు

20, ఫిబ్రవరి 2024, మంగళవారం

శివశివ యనవలె శ్రీరామ యనవలె

శివశివ యనవలె శ్రీరామ యనవలె

చివరకు బంధవిఛ్ఛేదమ్ము కావలె


హరిహరి యనవలె యపరాధి ననవలె

పరమార్థతత్త్వమ్ము భావించుకొనవలె

తరచుగా తనలోన తాను రమించవలె

మరి జగమంతయును హరిమయ మనవలె


పులకించి హరికీర్తి పొగడుచుండగవలె

కలనైన హరికీర్తనలె పాడుకొనవలె

కలిమాయలను తాను గణియించ ననవలె

తిలకించ హరివిభూతియె సృష్టి యనవలె


హరియంశలే జీవు లందరు ననవలె

హరిహరు లొక్కరే నరులార యనవలె

హరికృప యొక్కటే యాశింతు ననవలె

తిరిగిరాని పదము హరియిచ్చు ననవలె




హరిహరి కలియుగ మన్యాయము


హరిహరి కలియుగ మన్యాయము
హరియన్న శ్రధ్ధలే దన్యాయము

హరికీర్తనలు పాడునంత తీరికలేదు
హరిపూజనము చేయునంత తీరికలేదు
హరికథల నాలించునంత తీరికలేదు
పరమాత్మ శ్రీరామ నరుల కిపుడు

హరినామమును పలుకునంత తీరికలేదు
హరిని మనసున తలచు నంత తీరికలేదు
హరిభజన కేగెడునంత తీరికలేదు
పరమాత్మ శ్రీరామ నరుల కిపుడు

హరితీర్ధములు తిరుగునంత తీరికలేదు
హరికోవెలకు పోవునంత తీరికలేదు
హరిభక్తులను చేరునంత తీరికలేదు
పరమాత్మ శ్రీరామ నరుల కిపుడు


విరులివిగో చేయరే హరిపూజలు


విరులివిగో చేయరే హరిపూజలు
విరులు వాడును సుమా వేళదాటిన

గుడి తలుపులు తెరచినారు కోమలులార
వడివడిగా రండు చేయవలయు పూజలు
మడి పళ్ళెరముల పూల మంచిపూజలు
పడతులార హరికి చేయవలయు పూజలు

పరమాత్ముని సన్నిధికి బిరబిర చేరి
పరమభక్తి తోడ చేయవలయు పూజలు
హరికి యిష్టమైన పూవు లమరించి పూజలు
తరుణులార చేయవలయు తగినపూజలు

చిరునగవుల జగములేలు శ్రీపతియైన
ధరాసుతాపతికి చేయదగును పూజలు
హరేరామ యనుచు పూవు లమరించి పూజలు
వరారోహలార చేయవలయు పూజలు


పూవులండీ పూలు బోలెడన్ని పూలు


పూవులండీ పూలు బోలెడన్ని పూలు
దేవుని మాలలకు దివ్యమైన పూలు

మంచిమంచి పూలు మాతోటలో పూలు
ఎంచి తెచ్చిన పూవు లింపైన పూలు
పెంచిన లతలు విరియించిన పూలు
కొంచువచ్చితి మండి కొమరారు పూలు

పాలకన్నను ధవళవర్ణముండిన పూలు
చాల రంగులపూలు చక్కన్ని పూలు
మేలిజాతుల పూలు మృదువైన పూలు
చాల తాజాపూలు సరియైన పూలు

రామపూజకు మంచి రమణీయమగు పూలు
భూమిపుత్రికి నచ్చు పొలుపైన పూలు
ఏమాట కామాట  యింతమంచి పూలు
మీమంచి పూజలకు మేలైన పూలు


పూలు తెచ్చినామండి


పూలు తెచ్చినామండి పూలు తెచ్చినాము
పూలు తెచ్చినాము హరిపూజకై మేము

రామయ్య కిష్టమైన రంగురంగుల పూలు
మేము కొసి తెచ్చినాము మేలైనపూలు

సీతమ్మ కిష్టమైన చిన్నిచిన్ని పూలు
సేకరించి తెచ్చినాము చిత్రమైన పూలు

లచ్చుమయ్య మెచ్చగా లక్షణమైన పూలు
ముచ్చటగ తెచ్చినాము బుట్టలతొ పూలు

హనుమన్న మెచ్చునట్టి యందమైన పూలు
కొనితెచ్చినాము సువాసనలున్న పూలు

సంతసించ నందరును చక్కనైన పూలు
సంతరించి తెచ్చినాము చాలమంచి పూలు


ఎవ రల్లినారమ్మ యీపూలమాలిక

ఎవ రల్లినారమ్మ యీపూలమాలిక

భువనమోహనుకంఠమున నింత శోభించె


ఏతోటలో పూల నెంచి తెచ్చినారో

సీతమ్మమగని గళసీమలో మాలకు

చేతులారా యెవరు చేసిరో యీమాల

ప్రీతితో శ్రీరామవిభున కర్పించగ


శ్రీపతిమెడలోన చేరి సేవించిన

యీపూలసౌభాగ్య మింత యనగరాదు

యేపుణ్యపురుషుని హృదయపూర్వకసేవ

రూపుగట్టిన మాల లోకేశు మెడ నిండె


ఈమాలికాసేవ యిచ్చు మంగళములు

ఆమహాత్ముని కబ్బు నఖిలసౌఖ్యములును

రామయ్యకృప వలన రావింక భవములు

స్వామి సన్నిథి నుండ జాలు నిక స్థిరముగ




17, ఫిబ్రవరి 2024, శనివారం

ఉన్నాడు నారాముడు

అన్నలారా నమ్ము డున్నాడు శ్రీరాము
   డామాట నిజమని విన్నవింతు

ఉన్నాడు నారాము డున్నాడు వానికై
   యున్నాను నేనని విన్నవింతు
ఉన్నాడు నాప్రక్క నున్నాడు నారాము
   డన్నివేళల నని విన్నవింతు
ఉన్నాడు నీవందు వున్నచో చూపించు
   మన్న నశక్తత విన్నవింతు
ఉన్నచో మాకేల నెన్నడు కనుపించ
   డన్నచో నేమందు మిన్నకుందు

అన్నవేళల యోగిబృందంబునకు చాల
   సన్నిహితుండని విన్నవింతు
అన్నివేళల భక్తకోటుల కత్యంత
   సన్నిహితుండని.విన్నవింతు
అన్నివేళల శరణమన్నవారికి చాల
   సన్నిహితుండని విన్నవింతు
అన్నిజన్మము లందు హరి నాకు మిక్కిలి
   సన్నిహితుండని విన్నవింతు



ఇడిగో శ్రీరాముడు


ఇడిగో శ్రీరాముడు - ఇందీవరశ్యాముడు
కడుపావననాముడు - కారుణ్యధాముడు

ధరాసుతాసమేతుడై ధరనేలెడు వాడు
పురవైరి వలన నెపుడు పొగడబడెడు వాడు
శరణన్నవారి నెల్ల కరుణించెడు వాడు
హరియే ఈరాముడు  పరమపురుషుడు

ధర్మావతారుడగుచు ధరనుండిన వాడు
కర్మబంధములు బాపి కటాక్షించు వాడు
దుర్మదులగు దనుజులను దునిమినట్టి వాడు
నిర్మోహుడు రాముడు నిరుపమానుడు

మునివరుల హృదయపద్మముల నుండెడువాడు
మునులు నెంతే మోహించిన రూపము వాడు
మునుల తపంబులు మెచ్చి మోక్షమిచ్చు వాడు
వనజనయను డీరాముడు పరమపురుషుడు


14, ఫిబ్రవరి 2024, బుధవారం

బాలుని మృదుకరముల

 
బాలుని మృదుకరముల నిడ బంగారు వింటిని
చాల మంచియమ్మ యనెను బాలుడును వెంటనె

ఇంతకును బాణాలేవి యేవి యనెను నరపతి
అంత తొందరేల ననుచు హాస్యమాడె నాసతి
అంతలోన పూగుత్తుల నమరించిన పుడకలు
వింతవింత బాణాలుగ వెలయించిరి సకియలు

పూలగుత్తులబాణాలను దాలిచి శ్రీరాముడు
మేలు మేలు మన్మథుని వోలె శోభించెను
లీలగ నవి వెదజల్లుచు నీలమేఘశ్యాముడు
నాలావు చూడు డనుచు చాల యల్లరి చేసెను

విల్లిచ్చిన చేతులతో విద్య నేర్పు మనెను పతి
ఎల్లలోకముల నేలు బల్లిదుడౌ ననె సతి
చల్లగా లోకములను శాశించు ననెను పతి
కల్లగాదు స్థిరయశము కలుగు రేపనెను సతి