28, ఫిబ్రవరి 2013, గురువారం

నీకు నాకు నడుమ దూరము

నీకు నాకు నడుమ దూరము 
పరాత్పరా
నీ మహిమా గరిమయా
నా యవిద్య బలిమియా

జగమంతయు నిండి యున్న
జగదీశుని నిను గానగ
జాల నైతి నీ మాయా
జాలమా ప్రకృతి యింద్ర
జాలమా నేను తెలియ
జాలనురా చిక్కు విప్ప
జాలుదురే నీవు దక్క
జగమున వే రెవ్వరైన 

తరచుగ నా కలలోనికి
తరలి వచ్చుచున్న నీదు
రమాదర మెంచి యెంచి
పరమపురుష పరంధామ
పరమయోగి సులభ నీవు
కరుణించితి వని మురిసెదు
మరల చెప్ప పెట్ట కుండ 
మరువుపడుచు నేడ్పింతువు

ఎంతెంతగ నూరించెద
వెంతకైన తగువాడవు
చింత యేల మన యిర్వుర  
కంతరమే లేదందువు
పంతగించి మాయమౌదు
వంతలోనె పలుకాడక
వింతవింత లీలలతో
నెంత వినోదించెదవు

 

తరచుగ నల్ప దుఃఖముల

చం. తరచుగ నల్ప దుఃఖముల తాకిడికే తలక్రిందులై సదా
పరమ దయాబ్ధి మీ‌చరణపంకజయుగ్మము నంటి యుండి స
త్వరమె విముక్తి గాంచి కడు ధన్యుల మౌదుము మీకు గాక నె
వ్వరి కెరుకౌను దుఃఖబడబానలతీవ్రత జానకీపతీ


(వ్రాసిన తేదీ:2013-1-18)

27, ఫిబ్రవరి 2013, బుధవారం

అరెరే రాముని నమ్మక

కం. అరెరే రాముని నమ్మక
మరి యెవ్వరి నమ్మ వచ్చు మానవులారా
పరమపదంబును గోరుచు
పరమాత్ముని వేడ కున్న ఫలితము గలదే

(వ్రాసిన తేదీ :2013-1-17)

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

మనుజ జన్మ మిచ్చి

ఆ.వె. మనుజ జన్మ మిచ్చి యినవంశతిలక నీ
చరణకమలభక్తిపరత నిచ్చి
ప్రోచినావు నాకు పుట్టువు మరి లేదు
కమలనయన నీదు కరుణ వలన


(వ్రాసిన తేదీ: 2013-1-17)

25, ఫిబ్రవరి 2013, సోమవారం

నీ వాడ నైతిని నేను నా వాడ వైతివి నీవు


నీ వాడ నైతిని నేను నా వాడ వైతివి నీవు
నీ వాడ చేర రమ్మని నీ వేల పిలువవు నన్ను

వేచి వేచి నాకు చాల విసువు పుట్టు దాక నీవు
కాచుకొని యున్నా వంత కాని వాడ నెట్టు లైతి
చూచి చూచి రామ నిన్ను సుంత నిలదీయుదు
పూచిక పుల్ల కన్న పోపో కడు పలుచ నైతి

పిలచిన తడవుగ తరచుగ కలల లోన  కనిపింతువు
అలక లన్ని నిన్ను జూచి నంత లోనె యణగారును
కలక దేరి తగవు తలపు గడచి మనసు చాల మురియు నయా
చిలిపివాడ నేడైనను చెప్పు మెపుడు పిలిచెదవో

విచ్చిపోవు తిత్తుల దూరు పిచ్చిపనికి విసువాయెను
గుచ్చి హింసపెట్టు ప్రకృతి గొడవలతో విసువాయెను
మెచ్చి స్వస్వరూపజ్ఞాన మిచ్చితి విది మేలాయెని
వచ్చి ముచ్చట దీర్చమంటె పలక విది వింతాయెను



నిను ధ్యానించు తలంపు

మ. నిను ధ్యానించు తలంపు గల్గు నెడలన్ నేనెప్పుడున్ శౌచమున్ 
గణియింపన్ రఘురామ శౌచమని సంకల్పించి కాలంబు పు
చ్చను నా మానసమొల్లకుండు ఖగరాట్సంచార శౌచాదికం
బునకుం పిమ్మట నుండ నోడుదునొ దుర్బుధ్ధుల్ ప్రతారించునో 


(వ్రాసిన తేదీ: 2013-1-17)


23, ఫిబ్రవరి 2013, శనివారం

శర మొక్కింట

మ. శర మొక్కింట సుబాహునిం  దునిమి యాశ్చర్యంబుగా నప్పుడే
శరమన్యంబును వేసి చంపుటకునై సంకల్పముం జేయ వో
నర నాధోత్తమ నీవు మారిచుని దానం జేసి వైదేహినిం
చెరబట్టం గొను రావణుం దునుమగా చింతించితో రాఘవా


(వ్రాసిన తేదీ :2013-1-17)

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

వరముల నిచ్చె బ్రహ్మ

చం. వరముల నిచ్చె బ్రహ్మ సమవర్తి దశాస్యున కోడ నయ్యె  కా
వరమున నీదు భామినిని బట్టిన యట్టి కులఘ్ను గొట్టి సం
గరమున సూర్యసూతి కధింకంబగు మోదము కూర్చి నట్టి నీ
చరణము లంటి నారకపు సంకట మీగితి  జానకీ‌పతీ


(వ్రాసిన తేదీ: 2013-1-17)

20, ఫిబ్రవరి 2013, బుధవారం

ఆ విల్లెందుకు ద్రుంచగా వలసె


శా. ఆ విల్లెందుకు ద్రుంచగా వలసె నయ్యా రామచంద్రప్రభో
నీ వద్దానిని యెత్తి యెక్కిడుటయే నీమంబు గానుండగా
ఠీవిం దోర్బల మొప్ప వంచగనె తా డిల్లాయె కాబోలు నం
తే వీరాగ్రణి వేరు కారణము లేనే లేదు సీతాపతీ


(వ్రాసిన తేదీ: 2013-1-17)

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

తప్పులు పట్ట వచ్చు నెడ

ఉ. తప్పులు పట్ట వచ్చు నెడ తప్పక దేవత లందు గూడ నే
తప్పులు లేని వాడొకొని దాశరధీ గమనించ వచ్చునే
తప్పన నీ చరిత్రమున దానవ మానవ దేవతోత్తముల్
జెప్పగ నొక్క సంఘటన జిక్కునె మ్రొక్కెద నీకవశ్యమున్


(వ్రాసిన తేదీ: 2013-1-17)


18, ఫిబ్రవరి 2013, సోమవారం

శ్రీరఘురామపాదసరసీ


ఉ. శ్రీరఘురామపాదసరసీరుహ సేవన మాచరించి సీ
తారమణీలలామపదతామరసంబుల నంటి మ్రొక్కి సా
మీరి విభీషణుల్ జలజమిత్రసుతాదులు రామసోదరుల్
స్వామి యనుగ్రహంబున నవశ్యము దాటిరి జన్మచక్రమున్


(వ్రాసిన తేదీ: 2013-1-16)


17, ఫిబ్రవరి 2013, ఆదివారం

రామస్వామి పదారవిందముల


శా. రామస్వామి పదారవిందముల నారాధించుటే వృత్తిగా
భూమిన్ కొందరు కొంద రుందురు మహా పుణ్యాత్ము  లవ్వారికిన్
సేమంబున్ శుభమున్ సమస్త దురితఛ్ఛేదంబు శ్రీరాముడే
ప్రేమం జేయుచునుండు నట్లగుట సేవింతున్ సదా రాఘవున్


(వ్రాసిన తేదీ: 2013-1-16)

16, ఫిబ్రవరి 2013, శనివారం

పాదము లంటి నీ దయకు


ఉ. పాదము లంటి నీ దయకు పాత్రత నొందిన యట్టి శాత్రవుల్
పాదము లంటి నీ‌దయకు పాత్రత నొందిన యట్టి భక్తులున్
మేదిని నెందరో‌ గలరు మిత్రకులాన్వయదీప రామ నీ
పాదము లాశ్రయించితి నవశ్యము నన్నును బ్రోవవే ప్రభూ


(వ్రాసిన తేదీ: 3013-1-16)


15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

నీ వున్నావు నిజముగను నే నున్నాను ఋజువుగను

నీ వున్నావు నిజముగను నే నున్నాను ఋజువుగను
దేవా నీవు కాపురుషులకు తెలియరావని యెఱుగుదును

తాపత్రయమున చిక్కిన వారు తల్లడిల్లుట నెఱుగుదును
నీ పదపద్మములందే రామా నిత్యసుఖంబని యెఱుగుదును
నాపై నీకు గల ప్రేముడియు నిక్కముగా‌ నే నెఱుగుదును
పాపము పుణ్యము రెండును వదలుట పద్ధతి యని నే నెఱుగుదును

మధ్యమధ్యలో జగములు పుట్టి మాయమైనవని యెఱుగుదును
అధ్యక్షుడ వీ సృష్టికి నీవని యాత్మలోన నే నెఱుగుదును
మిధ్యాప్రకృతి మాయకు లొంగి మిడికే వారల నెఱుగుదును
అధ్యాత్మము నేమంత యెఱుంగని యాచార్యుల నే‌ నెఱుగుదును

ద్యావాపృధ్వుల వ్యాపించిన నీ‌ తత్వము చక్కగ నెఱుగుదును
భావింపగ భువి నీదగు క్రీడాప్రాంగణమని నే నెఱుగుదును
నీవే క్రీడార్థముగా నన్నిట నియమించితివని యెఱుగుదును
నీవని నేనని వేరుగ లేమని నిక్కముగా నే నెఱుగుదును


వనజాసన వాసవులే


కం. వనజాసన వాసవులే
నిను పొగడగ నేర రన్న నే నెంతటి వా
డను నా రామయ తండ్రీ
మనుజుడ నజ్ఞానపూర్ణమతి నల్పుండన్


(వ్రాసిన తేదీ: 2013-1-16)

14, ఫిబ్రవరి 2013, గురువారం

నీవె యిన్ని తనువుల జేసి నీవె యన్నిటి లోన దూరి

నీవె యిన్ని తనువుల జేసి నీవె యిన్నిటిలో దూరి
నీవె  జేసి నట్టి సృష్టి నెంతగ క్రీడించే వయ్య
 
త్రోవ చేసి నడిపే దెవరు త్రోవ కడ్డు తగిలే దెవరు
కావుమని యడిగే దెవరు కావవచ్చి నిలచే దెవరు
నీవు రెండు పక్షము లందు నిలచి యాడు చున్న యాట
జీవుల నాడించే యాట దేవుడా బాగున్నదయా 

అలుపు సొలుపు నీకు లేదు ఆడు చుండే వంతము లేక
అలుపు సొలుపు తీరదు మాకు నాట గడిచే మాటే లే
కులుకుచు నాడేవు నీవు కుదురుగా మమ్ముండ నీక 
బలగము నీ వాడించే తీరు బాగు బాగు పరమేశ్వరుడా

ఒకటి రెండు పావులు పండి యెడ్డు చేరే విధము నెఱిగు
నొకటి దారి తెలిసి పరుగిడు నొకటి నీ దయ బడయు టెఱుగు
సకలసృష్టిక్రీడను నడిపే స్వామి నీ సేవకుడనని తెలిసె
కిత జీవుల మధ్యన రామా స్వస్వరూపజ్ఞానము కలిగె

నిలకడ లేక నా మనము


చం. నిలకడ లేక నా మనము నిత్యము వానర మట్లు గంతులన్
కులుకుచు లోకమెల్ల చెడ గ్రుమ్మరు చుండియు రామ నిన్ను తా
గొలుచుట మాన దెప్పుడును కూరిమి మున్నొక నాడు నేను నీ
బలగము నందొకండ నను భావము నిశ్చయమై రహింపగన్ 


(వ్రాసిన తేదీ: 2013-1-16)


13, ఫిబ్రవరి 2013, బుధవారం

గడచిన యట్టి పుట్టువుల


చం. గడచిన యట్టి పుట్టువుల కల్గెనొ లేదొ యొకప్పుడేనియున్
సడలని రామభక్తి యను సంశయ మన్నది పుట్టు చుండె నె
ప్పుడు నిజమైన భక్తి గల పుట్టువు గల్గునొ జన్మచక్రమున్
గడచుట యప్పుడే గలుగు గావున శ్రీరఘురామభూవరా



(వ్రాసిన తేదీ: 2013-1-15)

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

అలసితి వింక


చం. అలసితి వింక రేపకడ నాజికి వత్తువు గాని నేటికిన్
పొలికలనిం ద్యజించి వెస పొమ్మని కారుణికత్వ మొప్పగా
లికి నృశంసు రావణుని పంపుట యన్నది నీక జెల్లె నో

లలిత గుణాకరా భువనరంజన శ్రీరఘురామ భూవరా

(వ్రాసిన తేదీ: 2013-1-15)


11, ఫిబ్రవరి 2013, సోమవారం

శ్రీరామచంద్ర నీకై


కం. శ్రీరామచంద్ర నీకై
యారాటము పడుటె గాని యాత్మేశ్వర ని
న్నారాధించు టెఱుంగని
వీరిడి నై యుంటి బ్రోవవే నన్ను ప్రభూ


(వ్రాసిన తేదీ: 2013-1-15)

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

రాతిని నాతి జేసితివి రామ


ఉ. రాతిని నాతి జేసితివి రామ పదాంగుళి తాకినంతనే
కోతిని బ్రహ్మ జేసితివి కొల్చి పదంబులు పట్టినంతనే
ప్రీతిని మోక్షమిచ్చితివి వీగక నీకయి పక్షి పోరినన్
భూతలనాధ మ్రొక్కెదను బ్రోవవె నన్నును దైవరాయుడా


(వ్రాసిన తేదీ: 2013-1-15)


9, ఫిబ్రవరి 2013, శనివారం

ప్రోచెడు వాడు రాముడని


ఉ. ప్రోచెడు వాడు రాముడని బుధ్ధి నెఱింగిన వారి నెప్పుడున్
కాచెడు వాడు రాముడని గట్టిగ నమ్మితి నింక నన్ను నీ
తోచిన రీతి గావనగు తొల్లిటి నుండియు దోషచింతనుం
డై చరియించె వీడనుచు నాగ్రహ ముంచక జానకీ పతీ


(వ్రాసిన తేదీ: 2013-1-15)


8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

శ్రీరఘురామ బ్రోవుమని


ఉ. శ్రీరఘురామ బ్రోవుమని చింతన చేయుట మాని మానవుల్
మారని బుధ్ధి దుర్విషయమత్తత నుండుట చేత  ఘోర సం
సారసముద్రమందు బడి చయ్యన నొడ్డుకు చేరరామి లో
నారసి మిమ్ము జేరితి మహాత్మ ముముక్షువు నైతి మీదయన్


(వ్రాసిన తేదీ: 2013-1-15)


7, ఫిబ్రవరి 2013, గురువారం

శ్రీరఘురాము పాద


ఉ. శ్రీరఘురాము పాద సరసీరుహయుగ్మము నాశ్రయించి సీ
తారమణీలలామ జగదంబగ  మిక్కిలి వాసిగాంచె సా
మీరి చిరాయువై నెగడి మీదటి బ్రహ్మపదంబు నొందె సొం
పారవిభీషణుండు నొడయండుగ నాయెను శాశ్వతంబుగన్


(వ్రాసిన తేదీ: 2013-1-14)


6, ఫిబ్రవరి 2013, బుధవారం

సురవైరుల్ పదునాల్గు వేవుర


మ.  సురవైరుల్ పదునాల్గు వేవుర ధరన్ శోషించు హస్తంబులన్
ధరణీపుత్రిని కష్టపెట్టు దనుజున్ దండించు హస్తంబులన్
స్మరణాన్ముక్తిదమైన హస్తముల రామబ్రహ్మ హస్తంబులన్

హరకోదండము చెండు హస్తముల సంధానింతు చిత్తంబునన్

(వ్రాసిన తేదీ: 2013-1-14)

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

మా కులదైవము రాముడు


కం. మా కులదైవము రాముడు
మా కనియే కాదు సర్వమానవులకు తా
నే కద కులదైవంబన
శ్రీకరుడగు రామవిభుని సేవింపుడయా


(వ్రాసిన తేదీ: 2013-1-14)

4, ఫిబ్రవరి 2013, సోమవారం

రాముని కాలు సోకగనె


ఉ. రాముని కాలు సోకగనె రాయి యహల్యగ మారిపోయె మా
రాముని ఢాక సోకగనె రంకెలు మానెను జామదగ్ని మా
రాముని పేరు చెప్పగనె రాళ్ళు సముద్రము మీద తేలె మా
రాముని తూపు సోకగనె రావణు డీల్గె ధరాతలంబునన్


(వ్రాసిన తేదీ: 2013-1-12)


3, ఫిబ్రవరి 2013, ఆదివారం

పరమవిరోధి పైన దయ


చం. పరమవిరోధి  పైన దయ వచ్చునె రాజున కాహవంబునన్
కరమరు దైన యిట్టి ఘన కార్యము రాము డొకండె సేసె సా
గరముల కైన హద్దు లనగా గల వుర్విని హద్దు లేని దై
పరగును కేవలంబు రఘు వల్లభు దివ్యకృపామృతాబ్ధియే.


(వ్రాసిన తేదీ: 2013-1-12)


2, ఫిబ్రవరి 2013, శనివారం

కుదురుగ పట్టెదేని


చం. కుదురుగ పట్టెదేని బహుకోమల రామపదాబ్జయుగ్మమున్
చదువగ నేర్తువేని మనసా రఘురాముని దివ్యగాధ నిం
పొదవగ పాడెదేని రఘుభూవరు దివ్యయశోవిలాసమున్
సదమల మోక్షలక్ష్మి మరి చక్కగ రాము డనుగ్రహించెడున్.


(వ్రాసిన తేదీ: 2013-1-12)


1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

సర్వము రాముడే యనుచు


ఉ. సర్వము రాముడే యనుచు చక్కగ లోన నెరింగి నట్టి వా
డుర్విని శాంత చిత్తు డగుచుండుట తథ్యము వేరు బుధ్ధియై
పర్వుచు నన్యదేవతల భావన చేసిన స్వల్పలబ్ధికే
గర్వితుడై నశించు నటు గాన రఘూద్వహు నాశ్రయించెదన్



(వ్రాసిన తేదీ: 2013-1-12)